28, సెప్టెంబర్ 2011, బుధవారం

సోఁవులప్పకి జేజేలు.. ఎవురీ సోఁవులప్ప? .




ఆ మధ్యని ఏదో పెళ్ళికని విశాఖ పట్నం వెళ్లి అంత  దూరం ఎలాగూ వెళ్లేను కనుక  చిన్నప్పుడు పుట్టి పెరిగిన మా వురు ఎలాగుందో ఒక సారి చూసి వద్దామని పార్వతీ పురం వెళ్లేను. అక్కడ మేం పుట్టి పెరిగిన పెద్ద ఇల్లూ అవీ ఉండేవి. (ఇప్పుడూ ఉన్నాయి కాని ఇప్పుడవి మావి కావు). మా వాళ్లు కూడా ఎవ్వరూ లేరు.   మేనత్త కొడుకు ఒక్కడు మాత్రం ఆ ఊరు విడవకుండా వాళ్ల సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ల ఇంటికే వెళ్లాను. ఎప్పటి నుంచో రమ్మని పిలుస్తున్నాడేమో చాలా ఆనందించేడు. ఊరంతా ఒకసారి చూసి  రావాలనే నా కోరికని చెప్పగానే తప్పకుండా చూపిస్తానని అన్నాడు. 
              ఆ సాయంత్రం వాడి స్కూటరు మీదే బయల్దేరి ముందుగా టౌన్ స్టేషన్  వైపు వెళ్లేము. మా వూరు  చిన్న వూరయినా మాచిన్నప్పటినుండి రెండు రైల్వే స్టేషన్లున్నాయి. టౌన్ స్టేషను చాలా చిన్నది. ఇప్పుడంటే బుకింగాఫీసు , ప్లాటుఫారమ్మీద షెడ్డులాంటివి ఉన్నాయి గాని మాచిన్నప్పుడు ఉట్టి ప్లాటుఫారము మాత్రమే ఉండేది.  టిక్కట్లమ్మే బుకింగ్ క్లర్కు పాపారావు గారు ట్రెయినొచ్చే గంట ముందర వచ్చి దగ్గర లోని సీతా రామస్వామి కోవిల్లో కూర్చుని టిక్కట్లమ్మి వెళ్లిపోయే వాడు. మా చిన్నప్పుడు మా వూళ్లో అందరికీ సాయంత్రం విహార స్థలం ఆ ఓపెన్ ప్లాట్ ఫారమే. ( ఆ మధ్య  నవ్య నీరాజనం శీర్షికలో రచయితల పరిచయాల లో  ఇప్పటి ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పరిచయంలో ఎడిటర్ జగన్నాథ శర్మ తానూ వంశీ ఆరోజుల్లో ఆ ప్లాట్ ఫారమ్మీద సిమెంటు బెంచీల మీద కూర్చుని కన్న కలలూ కథల డిస్కషన్లగురించి రాసేడు. ) అదిగో ఆ ప్లాట్ఫారమ్మీద కొచ్చేసరికి ఒకబ్బాయి మాకెదురై నమస్కారం చేస్తూ పలకరించేడు. మా బావ అతణ్ణి ఏఁవోయ్ రాఁవి నాయుడూ బాగున్నావా ఏఁవిటిలా వచ్చేవని ఆడిగేడు. మా అమ్మమ్మకి కళ్లు కొంచం మసకేసాయండి కళ్లడాక్టరుకి ఓపాలి సూపిద్దాఁవని వొయిజాగ్ తీసిగెల్తన్నానండి...  ఇయ్యేల బండి గంట లేటట. బండికోసం సూస్తన్నాఁవండి అన్నాడు.. ఆవిడేదీ అంటే అదో ఆ బల్లమీద కూకునుంది అన్నాడు. మా బావ వెంటనే బావా నువ్వు వెతకబోతున్న తీగ కాలికి తగిలింది. సోఁవులప్పని చూడాలనీ ఆమెతో మాట్లాడాలనీ ఉందని ఆన్నావుకదా?.  నువ్వు సోఁవులప్పతో మాట్లాడుతూ ఉండు. నేనిప్పుడే చిన్న రాచకార్యం చక్కబెట్టుకుని అరగంటలో వచ్చేస్తానని వెళ్లేడు. నేను రామి నాయుడుతో సోఁవులప్ప కూర్చున్న సిమెంటు బెంచీ వేపు నడిచేను.
                              ( బ్రాహ్మలలో యజ్ఞం చేసిన వారిని సోమయాజులనీ ఆయన భార్యని సోమిదేవమ్మ అనీ ఆంటారు, వారి పేరున వారి పరంపరలో సోమమ్మలూ సోమిదేవమ్మలూ రావడం ఉంది. మరీ నాయురాలికీ పేరెట్లా వచ్చి ఉంటుందనుకుంటే అప్పుడు తట్టింది. మా ఊరికి దగ్గరలో గుంప అనే ఊళ్లో రెండు నదుల సంగమంలో(అవి నాగావళి జంఝావతి అనుకుంటాను. నాకు సరిగా తెలీదు) సోమేశ్వరాలయం ఉంది. అక్కడ శివరాత్రికి పెద్ద తిరుణాల జరుగుతుంది. ఆ సోమేశ్వరుడి పేరిట ఇక్కడి వాళ్లు సోమేశ్వర రావులూ సోమనాథాలూ సోమమ్మలూ చాలామంది ఉన్నారు. అలాగే ఈవిడ  తల్లిదండ్రులు ఈవిడపేరు సోమమ్మ అని  పెట్టుకుని ఉంటారు. ఈ ప్రాంతంలో అక్కని అప్ప అని గౌరవంగా పిల్చుకుంటారు కనుక ఈవిడ అందరికీ సోఁవప్ప అయిఉంటుంది.)

                                    మేం దగ్గరకి వెళ్లగానే రామి నాయుడు అమ్మమ్మా ఎవురొచ్చేరో సూడు అన్నాడు. కళ్ల మీద చెయ్యి అడ్డం పెట్టుకుని చూస్తూ ఏమో ఎవురో నాకేటేరుక నానెప్పుడూ సూసినట్టు నేదు. పొల్తి పట్నేక పోతన్నాను అంది. ఈన మన పంతులు మేష్ట్రుగారి పెద్దన్నయ్యగారి అబ్బాయి అని చెప్పేడు. ఎవురు నారానమూర్తిగోరి పెద్దబ్బాయా. అత్తలెక్కడో అయిద్రాబాదులోనో ఎక్కడో  ఉండాల గావాల అంది. ఎప్పుడొచ్చేవు బావూ?” అని అంది. మా ఆవిడా పిల్లలూ బావున్నారా అనీ అడిగింది. మా అమ్మనీ నాన్ననీ తల్చుకుంది. ఆ ఆప్యాయతకి నాకు కళ్లు చెమర్చేయి. ( నాకావిడ తెలీదు.  తెలీదంటే నా చిన్నప్పుడు యాభై యేళ్ల క్రిందట ఆవిడని  ఒక్కసారే చూసేను. అంతే. అంతకుమించి తెలీదు. నేనప్పుడు చాలా చిన్నవాణ్ణి. హైస్కూల్లో చదువుకుంటూ ఉండే వాణ్ణి. పొలం నూర్పులకని మా నాన్నగారు ఆ పల్లెకి వెళ్తుంటే  ఆయనతో వెళ్లాను. అప్పుడు మారైతు ఫలానా వారి కోడలని మా నాన్నగారికి పరిచయం చేస్తుంటే  చూడ్డమే. పసిడిరంగు ఛాయ  లేత ముఖం లేడికళ్లూ చాలా సిగ్గుతో అణకువగా నిల్చుంది. నానూ పట్టిడా వేసుకొని, చెవులకిఎత్తు గొలుసులు పెట్టుకొని,బుటాల కోక కట్టుకొని పసుపు రాసిన మొకాన రూపాయికాసంత బొట్టుపెట్టుకోని  నాయిరాళ్లందరిలాగే ఉంది.)   ఇదిగో మళ్లా ఇప్పుడు చూడ్డమే..  ఇప్పుడేమో బాగా ముసిల్దై పోయింది. పచ్చటి పసిమిరంగు ఒళ్లు కాంతివంతంగానే ఉన్నా ముఖమూ ఒళ్లూ అంతా ముడతలు పడి ఈనెలు తేరిన పండుటాకులా ఉంది. అయినా అనారోగ్యం  ఎక్కడా కనబడ్డంలేదు. కళ్లు మసగబారేయంటున్నాడు కనుక కాటరాక్టు వచ్చి ఉండొచ్చు. మీరు మాట్లాడుతూ ఉండండి. చల్లటి డ్రింక్స్ తీసుకొస్తానని చెప్పి నాయుడు బయల్దేరబోయేడు. నేనొద్దన్నా వినకుండా. ఎల్నీ బావు దగ బెట్తుంది గద. కాతంత  తాగితే సల్లబడతావు అంటూనే ఒరే నాయిన నువు తాగి పంతులుగారికి తే.. పో.. నాకొద్దు నేన్తాగను. నానీల్లు నాకున్నాయి గావా అంది.
    రామినాయుడటెళ్లగానే నేను తేరుకుని అంతా బాగున్నామమ్మా. నువ్వెట్లాగున్నావు అని అడిగేను. నాకేంటి నోపం బావూ..ఏ ఇబ్బందీ నేదు. బతుకు సుకంగా ఎల్లిపోతోంది అంది. ఎవర్నైనా పలకరిస్తే చాలు సవాలక్ష ఇబ్బందుల్నివర్ణించడం చూసిన నాకు సోఁవులప్పమాటలు ఆశ్చర్యం కలిగించేయి. సోఁవులప్ప ఈ వయసులో కూడా పల్లెటూళ్లో ఒక్కత్తీ ఉంటోంది. ఎలా రోజులు
గడుస్తున్నాయంటే నాకేటి కావాల బావూ..రెండు పూట్లకీ రెండు పిడికిళ్లముద్దలు. కట్టుకోనానికో గుడ్డముక్కుంతే సాల్దా అంది. రెండు గేదలున్నాయి. ఆట్ని సాక్కుంటూ పాలు పిండుకోని  సెంటరుకి తోల్తాను. ఆ వొచ్చే రాళ్లే నాకు శాన అంది.  అదీ గాక ఈ మనవడు ఒకట్రెండురోలు సెలవు దొరికినా ఒచ్చి సూసి ఎల్తుంటాడనీ ఒచ్చినప్పుడల్లా పదో పరకో ఒద్దన్నా ఇనకుండా ఇంట్లో పెట్టి పోతుంటాడనీ చెప్పింది. అప్పుడప్పుడూ సీరలూ అవీ ఇచ్చి ఎల్తుంటాడనీ తన కవేవీ అక్కర్లేదు కనక లేనోల్ల కెవులకేన ఇచ్చేస్తుంటాననీ చెప్పింది. ఒక్కత్తెవీ ఎందుకా పల్లెటూళ్లో ఉండడం అంటే రాఁవినాయుడెప్పుడూ ఒచ్చేసి తన్తోనె ఉండిపొమ్మంటాడనీ కానీ తానే రానని మెడ్డేస్తూ ఉంటాననీ అంది. ఎందుకు బావూ ఆ వొయిజాగ్లో ఏటుంది. ఈడేమో అగ్గి పెట్టెలాంటి ప్లాటో అదేదో అందల ఉంతన్నాడు. పొద్దుగూకులా వెలట్రీ దీపాలెలిగించుకుని కూకుంతారు. గాలా? పాడా? అని అంది. ఈడి గోస పడ్నేక ఓ పాలెల్లి నాల్రోలు ఉండొచ్చినా బావూ. ఇరుగా? పొరుగా? మాటా? మంతా?  సీ..అక్కడుంతేటి సుకం బావు, జైల్ల ఉన్నట్టుంటాది. నానుండ లేన్ర బావని చెప్పి తిరిగొచ్చీసిన. మరెప్పుడెల్లలే.. ఇదిగిప్పుడే ఒక్కత్తివీ ఊళ్లో ఉంతావు కల్లు కూడ సరిగ కా పడప్పోతే ఎలగుంతావని బైల్దేరదీసిండు. నాన్రాన్ర దేఁవుడా అని మొత్తుకున్న ఇన్లే. సర్లె పోనీ ఓ పాలి ఎల్లొచ్చెస్తే ఈడూ మనుసు కట్టపెట్టుకోడూ..ఆడి పిల్లల్నికూడ సూసొచ్చినట్టుగుంతాదని ఎల్తన్నాను బావు. నీనక్కడుండన్నే. తొందరగానే ఎలిపోయొచ్చెత్తాను. ఆడేటి సుకం. మనూర్లొ ఉంతె ఆల్లూ ఈల్లూ పలకరిత్తుంటారు. సోఁవులప్ప..సోఁవులప్ప అని గౌరవంగ సూసుకుంతారు. అయినా నా సంగతి నీకు తెల్సు కద బావు. కాల్నిలవదు ..నోరూర్కోదు...ఈదులన్నీ తిరుగుతుండాల..అడిగినోడికీ అడగనోడికీ సలాలు సెబ్తుండాల.. ఆల్లు ఇన్నీ ఇనకపోనీ..నాకుతోసిందేదో నాను సెబ్తుండాల. నాకు తెల్సుబావూ నా మాటెవ్వరిన్రని. నా పిల్లలే ఇన్రు. ఇదిగిదిగో ఈ మనవడు మాత్రం ఇంటాడు. నామీ ద  కసింత గౌరవం, బెమా. ఇంకెవుల్లిన్రు. కాని సిన్నప్పటి కాణ్ణించి   అలవాటైపోనాది  గదా. ఇప్పుడు గమ్మునుండమంటే  గమ్మున కూకోగల్నా? అయితొకటి బావు. అందరంతారు ఊలోల్ల సంగతులన్నీ నీకేల  కిష్టా రాఁవా అనుకుంత పల్లక తిని తొంగోరాదా అని. కల్లెదురుగ్గ అన్నేయం జరుగుతుంతె అది నీకు అన్నేయమనిపించినప్పుడు ఆ మాట సెప్పడానికి బయ్యిఁవేల.  ఓ పాలి మా యీదిల శివున్నాయుడు నేడా ఆడు పీకలమొయ్య తాగొచ్చి పెల్లాన్నిసితక బాదీసేడు బావు. అంతేన.. అవి బూతులు కావు బావు..  నానోటికి రావు... అసియ్యం అసియ్యం మాటలంటూ కొప్పట్టుకోని ఈదిలోకి తోస్సేడు బావు. ఆయమ్మి ఎసుమంటి మనిసో ఈదిలందరికి దెల్సు. అయ్నా అందరలాగ నిలబడిపోయి సినేమా జూసినట్టు సూస్తుండి పోనారు. ఒక్కల్లకి నోరు పెగల్లేదు. నాకు మాత్రం ఉండబట్టలేదు బావు. ఎల్లి జలగడిగీసేను. ఒక్కమాటంతె ఒక్కమాట మారు పలక్కుంత నాయుడు లోనికెల్లిపోయేడు బావు. ఆడకూతురికంత అన్నేయం జరూతుంతె పల్లకెలగుంతాము? నేన్సేసింది తప్పా? సెప్మి అంది.  నేను మాట్లాడే లోపే మళ్లాతనే..అయితింకోటుందిబావు.  దరమ్ము నీకాడుంతె నువ్వు  దెయిర్నంగ ముందు నిల్సుంతె నీ యెనకాలందరొస్తారు బావు.. మన సత్తిమే మన్ని కాస్ది. మొన్నీ మద్దిని అజారేవో ఎవురో గాని ఆ పెద్దమనిసి అయినీతి తుడిసి పెట్టాలని  ముందు నిల్సుని యుద్దానికి రడీ యంతే అందరాయన ఎనకాలె నిలబడ్డారు కారా?  దేనికైనా ముందు నిల్సునే మొగోల్లే కరువై పోయేరు బావు. మొగోల్లని నేనిలగంతన్ననని ఏఁవనుకోకు బావు. నేను సెప్పింది నిజిఁవా? అపద్దఁవా సెప్మి..సెప్మి..అంది.
నేనేమనగల్ను? ఊరికొక్కరైనా సోఁవులప్పలాంటివాళ్లుండాలని కోరుకోవడం తప్ప.
అయినా అన్నాను సోఁవులప్పా నీ మాటలెవరు వింటారని నువ్వు ఆనుకుంటున్నావుగానీ, నువ్వూ నీ కబుర్లూ నువ్వు చెప్పే తిత్తవలూ, సామెతలూ అన్నీ గౌర్నాయుడు పుస్తకం రాసి అచ్చేసిన సంగతి నీకు తెలుసా? ఎక్కడెక్కడున్నోళ్లో అవన్నీ చదివే ఉంటారు కదా అన్నాను. ఓ అదెప్పటిమాట. అవునో పుస్కరం అయి ఉంటది. గంటేడాల్ల బొట్టిడా పన్జేసి. నాకూ సెప్పినాడునే.
బొట్టిడంతన్నాననేటనుకోకు. సిన్నప్పటి కాణ్ణించి ఎరిగినోడుగదా. నాకంతె  సాల సిన్నోడు. మావూల్లో మేష్ట్రు పని జేసీవోడు గాద. ఇప్పుడేదొ పెనసనుదీసుకుంట  ఇదిగీ ఊల్లోనె ఉంతన్నాడని ఇన్నాను. నువుగాని కలిత్తె అడిగినానని సెప్మి.. అంది.. ఇంతలో రామినాయుడు డ్రింకులు తీసుకొని రావడంతో మా సంభాషణ అక్కడికాగింది. డ్రింకు తాగుతూ రామినాయుడడిగేడు. ఏంటి సార్..మాముసిల్దాయి మీకు బోరుకొట్టిందా.. వాక్కుండా ఒక్క సిటం ఉండలేదు. అందుకనే ఊళ్లో అంతా కళింగోర..కళింగోర..అంటూ ఉంటారు అన్నాడు. బోరేఁవిటి. అసలా కళింగోర మాటలు విందామనే ఇంత దూరమొచ్చింది. నాకోరిక నెరవేరింది. అదే చేప్పేను. ఇంతలో మాబావ వచ్చి వెళ్దామంటుంటే  వాళ్ల ట్రైన్ కూడా వచ్చే సంకేతం అందింది. మర్నేనుంతాను బావూ.. అందర్నీ అడిగేనని చెప్పు ముసిల్దాయిని మర్సిపోకండి అంది. ఎలా మరచి పోగలను?  
                                                       ***
ఈ సోఁవులప్ప ఎవరని కదూ ప్రశ్న?  ఈవిడ శ్రీ గంటేడ గౌరు నాయుడు రాసిన
కళింగోర పుస్తకం లోని కల్పిత పాత్ర. ఈ పుస్తకం డిశంబరు 1998 నుండి ఆగష్టు1999 మధ్యలో ఆంధ్ర ప్రభ దిన పత్రికలో యాసపీఠం శీర్షిక క్రింద వచ్చిన  64 ప్రాసంగిక వ్యాసాల సంపుటి. అక్షర జ్ఞానం లేని ఒక గ్రామీణ స్త్రీ పాత్రని సృష్టించి ఆమె నోటిద్వారా తాను చేయదల్చుకున్న సామాజిక వ్యాఖ్యల్ని  సమర్థవంతంగా చేసిన గౌరునాయుడు అభినందనీయుడు.
ఉత్తరాంధ్ర పలుకుబడిలోని జవం జీవం తెలుసుకోవాలంటే అక్కడి సామెతల సౌరు తిలకించాలంటే శ్రీ గంటేడ గౌరు నాయుడు రాసిన కళింగోర పుస్తకాన్ని భాషాభిమానులందరూ తప్పని సరిగా చదవాలి. ఈ వుస్తకం ప్రచురింపబడి పుష్కరం దాటింది. అయినా బ్లాగుల పుణ్యమా అని ఇప్పటికైనా నలుగురికీ దీన్నిగురించి చెప్పే అవకాశం దొరికింది. ఈ పుస్తకాన్ని స్నేహ కళాసమితి  నాయుడు వీధి కురుపాం..  535524  వారు  ప్రచురించేరు.
                   
ఇంత మంచి పుస్తకాన్ని రాసినందుకూ, పది కాలాల పాటు తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే ఒక  సోఁవులప్పని సృష్టించినందుకూ శ్రీ గౌరునాయుణ్ణి అభినందించకుండా ఉండలేకపోతున్నాను. (ఇంతకూ కళింగోర అంటే ఆప్రాంతంలో ఎప్పుడూ అరుస్తూ తిరిగే పిట్టట.)
సోఁవులప్ప ఓ కల్పిత పాత్ర అని మీకు చెప్పేసాక నేను ఆవిణ్ణి కలవడం ముచ్చట్లాడడం అన్నీ కల్పితమేనని వేరే చెప్పక్కర లేదు కదా. 
  
తెలుగులో సాహిత్యంలోని ఒక పాత్ర (కన్యాశుల్కం లోని మధురవాణి) చేత తెలుగు నేలపై పుట్టి పెరిగి కవులై కీర్తిశేషులైన మహానుభావులని (విశ్వనాథ జాషువా మున్నగు  వారిని) స్వర్గంలోఇంటర్వ్యూలు చేయించిన ఘనుడు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు.  అదొక అద్భుతమైన ప్రయోగం. ఇదేమో సాహిత్యంలోని ఒక పాత్రతో రచయిత ముచ్చటించడం. ఇదీ ఒక ప్రయోగమే. నచ్చితే సంతోషం...సెలవు..

24, సెప్టెంబర్ 2011, శనివారం

శ్రీ విశ్వనాథ గిరీశం....హైదరాబాదీ గిరీశం...

( కన్యాశుల్కం నాటకాన్ని విశ్వనాథ వారు వ్రాసి ఉంటే ఎలాగుండేదో ఊహించి సరదాకి చేసిన ప్రయోగం. అలాగే గిరీశం హైద్రాబాదులో పుట్టి ఉంటే  ఆ హైద్రాబాదు  గిరీశం ఎలా మాట్లాడే వాడో అని  మరో చిన్నఊహ... )

ఒకరోజు సాయంత్రం  విశ్వనాథ వారి గిరీశం విజయనగరం బొంకులదిబ్బమీద నిల్చుని  ఇలా స్వగతం చెప్పుకుంటూ ఉంటాడు:

వి.గిరీశం:సాయం సమయమైనది. దీనినే కవులు గోధూళి వేళయని యందురు   అదియొక చమత్కారము. వారేదియును దిన్నగా జెప్పరు.కవులు నిరంకుశులని గదా లోకోక్తి. అయిననేమి? తిన్నగాజెప్పిన వారిసొమ్మేమి బోయియుండును? వారినట్లుండనిండు. వారిది కడుపునిండిన బేరమైయుండును. నాసంగతియే యేమియునుదోఁచకున్నది. నెల దినములక్రిందట విపణికి బోయి సరకులను గొనిదెత్తునన్ననెపమున పూటకూటియామెనుండి ఇరువది రూప్యములను బుచ్చుకొని వచ్చి నాట్యగత్తెకు నర్పించుకొనియుంటిని. ఈదినము ప్రత్యూషముననే నాకునూ ఆమెకునూ పెద్ద జగడమే జరిగినది. కపాల మోక్షము చేయుదమన్నంత కోపమావహించినదిగాని, ఓరిమి లేక ఎవడునూ లోకమును గెలువజాలడని రిచర్డు మహాశయుడు ఆంగ్లమున నుడివియుండుట జ్ఞప్తికి వచ్చుటచే  శమించియుంటిని. పూర్వమున నేనెన్ని పర్యాయములు ఇట్లు ధనము కాజేసినను ఏమియూ ననక యూరకుండెడిదిగాదా? ఇప్పుడీ నాట్యగత్తె విషయము  ఎవడైన తుంటరియొకండు ఆమె చెవిలోనూదియుండును. మన ప్రాభవమును జూచి ఓర్వలేక అతడీ పని చేసియుండును. ప్రొద్దుటి సంఘటన వలన మరి నేటినుండి మనకు నిచ్చట భోజనము లభించు తీరు మృగ్యము. ఇచటనందరకునూ ఋణగ్రస్తుడనైయుంటిని. శ్రీ పంతులుగారి కోడలుకి నేను వ్రాసియున్న ప్రేమలేఖ సంగతి బహిర్గతమైనచో నాకు దేహశుధ్ధి జరుగుట అనివార్యము. అతిశీఘ్రమే ఈయూరినుండి నిష్క్రమించుటత్యావశ్యకమని మదినిదోచెడిని....కాని మధుర వాణిని వీడి వెళ్లుటకు మనసు ఇచ్చగించదే? నేనేదైన నుద్యోగము జేసి యామెకు వైభవమును జేకూర్చగలనను ఆశతోడనున్నది. పాపమమాయకురాలు.

ఆఁ.. ఎవరా వచ్చుచున్నది.... నా ప్రియశిష్యుడగు వెంకటేశము వలె దోచుచున్నది. వీనికీ దినమునుండి  క్రిష్టమసు శలవులిచ్చి యుందురు. వీని ముఖమున విషాదఛాయ దృగ్గోచరమగుచున్నది.  పరీక్ష దప్పియుండును. మంచిది. వీనికి చదువుచెప్పుదునని వీనితోడ వీని యూరికి బోయినయెడల ప్రస్తుత సంకటము నివారించుకొనవచ్చును. తరువాత సంగతి యాతరువాత జూచుకొనవచ్చును. నందో రాజా భవిష్యతి యని గదా
(ఇట్లుకొనసాగును.)
                                               ****
                              
గిరీశం హైద్రాబాదులో పుట్టి ఉంటే......
హై.గిరీశం:   పొద్నూకింది...ఒక మయిన పయిల వొటేలమ్మతాన యిరువై రూపాలు దీస్కొని సామాన్దెస్తనన్జెప్పి చపాయించిన.  గాపైసల్గిట్ట డాన్సు గర్లుకి కరుసైపోయుండె. ఇయ్యాల పొద్దుగాల గామె లడాయి శురూజేసె..  నాకెంత గుస్సయ్యందంటే గామెను సంపేద్దామనుకున్నగాని గంత గుస్సపన్కిరాదని గా రిచర్డుగాడు జెప్పింది యాదికొచ్చి జర్రంత తమాయించిన. గామె గూడ మంచిదే. గిదేమి పైలిబారుగాదు,  గామెతాన పైసల్దీసుకున్నది. గప్పుడల్ల  సప్పుడు జైకుంట
 ఊకునేదిగాదె. గిప్పుడేమొ గామెకి డాన్సుగర్లు కత ఎవుడైన జెప్పిండో  ఏందోకత. గెట్లైన గిప్పటి సంది మనకీడ బువ్వబుట్టే కతలేదు. పంతుల్కోడల్కి చిట్టి రాసినంద్కు గాల్లకెవురికైన ఎరికైతె గెప్పుడైన మన సెమ్డాలెక్కదియ్యొచ్చు. గింక లేట్జెయ్యకుండ గీడనుంచి  బైలెల్లడమే దిమాకున్నోడు జేసేపని. గాని ఆ సాన్ది మదురవోణ్ణి ఇడిసిపెట్టెల్లాల్నంటె మనసైత లేదు. నేనేదైన కొలువు జేసి గామెను సుకబెట్తనని కలలుగంటన్నది. ఎర్రి మొకంది.

  ఆఁ...ఎవురది... గిట్నే ఉర్కొస్తండు? మన యెంకటేనా? గీడికిప్పుడు కిస్మిస్సెలవులిచ్చుంటరు. గీడు దప్పకుంట పరీచ్చ ఫెయిలయ్యుంటడు. గీడి మొగమే జెప్తందా ముచ్చట. గీణ్ణి జర్ర సమ్జాయించి గీడికి  సదువు సెప్తనని గీన్తో గీని ఊర్కి ఉడాయిస్తే గిప్పటికి మనం బచాయించినట్లయితది. పరేశాన్ ఖతమ్. గానక ముచ్చట గానక.....        (ఇలా నడుస్తుంది...)

( ఇది శ్రీ గురజాడ 150వ జయంతోత్సవ సంవత్సరం అందుకే ఈ యత్నం...సెలవు)                        

21, సెప్టెంబర్ 2011, బుధవారం

యావత్ తైలం తావద్ వ్యాఖ్యానం

                                    దీని కథ ఏమిటయ్యా అంటే పూర్వం రోజుల్లో రాత్రి పూట పురాణ కాలక్షేపం చేసేవారు. ఏగుళ్లోనో పెద్దింటి వారి వాకిట్లోనో పౌరాణికులు  భారత రామాయణాలో లేక ఏ పురాణాలో చదువుతూ వాటికి తమ వ్యాఖ్యానం  జోడించి వినిపించేవారు.  ఆ రోజుల్లో విద్యుద్దీపాలు లేవు. అంచేత ఏ కాగడాలో వెలిగించి ఆ వెలుగులో పురాణ పఠనం జరిగేది. కొంతసేపటికి నూనె అయిపోయి కాగడాలు ఆరిపోవడం మొదలిడితే ఇంక ఆరోజుకి పురాణ పఠనం వ్యాఖ్యానం సమాప్తం. అందు చేతనే తైలం (నూనె) ఉన్నంత వరకే వ్యాఖ్యానం అనే ఈ సామెత పుట్టింది.
                                     తైలం అంటే తిలల నుండి వచ్చినది. తిలలు అంటే నువ్వులు. నువ్వులనూనె అన్నమాట.
మా చిన్నప్పుడు తెలకలి ఆయన గానుగ ఆడిన నువ్వులనూనె ఇంటికి తెచ్చి అమ్మే వాడు. ఆరోజుల్లో ఆ నూనె అడ్డలు, తవ్వలతో కొలిచే వారు. ఇప్పటిలా కిలోల లెక్క కాదు.  మాయింట్లో వంటలకి వేరుశనగ నూనే వాడినా చేతిమీదికి (అంటే అన్నం లో కూరలూ పచ్చళ్లూ కలుపు కున్నప్పుడు వేసుకునేది) ఈ నువ్వుల నూనెనే వాడే వారు. ఎక్కువ కొలెష్ట్రాల్ ఉండదనీ మంచిదనీ  ఈ మధ్యనే ఎక్కడో చదివాను. మా ఆవిడైతే ఆవకాయలు పెట్టినప్పుడు ప్రశస్తమైన  ( అంబటి సుబ్బయ్య సామర్లకోట) వారి ఏ. యస్. బ్రాండు నువ్వులనూనెనే వాడుతుంది. ఆవకాయరుచిగా ఉంటుందని.ఆవకాయ గుర్తొస్తే తెలుగువాళ్లం మై మరచి పోతాంగనుక  విషయాతరంలోకి పోకుండా  జాగ్రత్తపడదాం.
                             తైలం అనే పదం నువ్వుల నూనెనే సూచించినా క్ర మేపీ వాడుకలో ఏదైనా నూనె  అనే అర్థంలో స్థిరపడింది. తలకు రాసుకునే వాసన నూనెలు, కీళ్లనొప్పులకి వాడే నూనెలూ మొదలైన వాటన్నిటికీ తైలాలనే పదంవాడుకలోనికొచ్చింది. (కన్యాశుల్కం లో  కాపర్సుకి కరువొచ్చి కొన్నాళ్లు కాలక్షేపంకోసం వెంకటేశంతో పల్లెటూరికి వచ్చిన  గిరీశానికి అగ్నిహోత్రావధాన్లింట్లో ఓ బ్యూటిఫుల్ యంగ్ విడో కనిపిస్తే ఆమె ఎవరని అడిగినప్పుడు వెంకటేశం తన అక్క అనీ జుత్తుకి చముర్రాసుకోదనీ 
అంటాడు.  చమురంటే నూనె అది రాసుకోవడానికీ రాసుకోకపోవడానికీ సౌభాగ్యానికీ వై
ధవ్యానికీ ఉన్నంత తేడా ఉందన్నమాట ).
ఈతైలాలువృక్షసంబంధమైనవీ,జంతుసంబంధమైన వీ (వెజ్,నాన్ వెజ్) ...ఆహారంలో ఉపయోగించేవీ ఇతరత్రా వాడేవీ కూడా ఉన్నాయి. వీటి సంగతి అలాఉంచి అసలు విషయానికి వస్తున్నాను.
                                       మీరు మిస్సమ్మ సినిమా చూసేరోలేదో.. అందులో రేలంగి డబ్బుని తైలం..తైలం..అంటూ ఉంటాడు. మాచిన్నప్పుడు ఈ పదం చాలా వాడుకలో ఉండేది. అలాడబ్బుని తైలం అని ఎందుకన్నారోగానీ తైలంమాత్రం డబ్బే.. డబ్బేమిటి బంగారం.. అదెలాగో మనవి చేస్తాను. నాచిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొస్తోంది....
తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు
తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు
తిరిగి కుందేటికొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపలేము.
అసాధ్యాల్ని సుసాధ్యాలు చేయవచ్చు కాని మూర్ఖుల మనసుల్ని మార్చలేమంటూ చెప్పిన పద్యమిది. ఇక్కడ కవి ఇసుకలో తైలం తీయవచ్చని చెప్పాడు కదా? నాకు చిన్నప్పుడు ఇసుకలోంచి తైలమెలాతీస్తారని చాలా సందేహంగా ఉండేది. ఒకప్పుడు  నివాసయోగ్యంకాకుండా ఉండే ఎడారులైన అరబ్బు దేశాల పంటపండిఇసుకలో తైలంతీయబట్టే కదా ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించ గలిగే స్థితి కవి ఎదిగాయి. పెట్రోలంటే శిలాతైలమే కదా? ద్రవరూపంలో ఉన్న బంగారంకదా?(Liquid gold). అందుచేతనే శిలాతైలం ఉన్న దేశాలే సంపన్నదేశాలు. ప్రపంచం అంతా డబ్బుచుట్టే తిరుగుతోంది.డబ్బుంటేనే ఏదయినా. అంటే తైలం ఉండాలి.
తైలం ఉంటేనే పనిజరుగుతుంది.....
యావత్తైలం తావద్వ్యాఖ్యానం....
సెలవు.

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

గురజాడను నే నుతింతు గురుభావముతో...


        

                 1862 సెప్టెంబరు 21వ తేదీ. తెలుగు సాహితీ గగనంలో వేగుచుక్కపొడిచింది. మన సాహితీ ప్రాంగణంలో అలుముకున్న చీకట్లను తొలగించి ఒక నూతన  శకావిర్భావానికి  నాంది పలుకబోయే  యుగకర్త విశాఖజిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో పుట్టాడు. జననం మాతామహుల ఇంట్లో రాయవరం గ్రామంలోనే అయినా పెరిగిందీ కళలు నేర్చిందీ ఉద్యోగించిందీ కళలకు కాణాచి అయిన విజయనగరంలోనే. అతడు తన హైస్కూలు చదువుల రోజులలోనే శ్లోకాలు వ్రాసేవాడట. కాలేజీ లో అడుగు పెట్టిన కొత్తల్లోనే (21వ ఏట) సారంగధర అన్న ఇంగ్లీషు పద్యకావ్యాన్ని ప్రచురించిన ధీశాలి.అప్పట్లోనే చంద్రహాస అన్న మరో ఇంగ్లీషు కావ్యాన్నికూడా వ్రాసేడు. సారంగధర కావ్యం ఎంత పేరుపొందిందంటే ఆ ప్రచురిత కావ్యాన్ని  ప్రముఖ కలకత్తా పత్రిక తిరిగి తమ పత్రికలో ప్రచురించేటంత. అయితే వీటినీ, ఆతరువాత కొన్ని సంస్కృత నాటకాలకి ఆంగ్లంలో వ్రాసిన పీఠికలనుగానీ ఆ కవిశేఖరుని ఆంగ్ల భాషా వైదుష్యానికి  మచ్చుతునకలనవచ్చునేమో గానీ ఆయనకి చిరకీర్తిని తెచ్చి పెట్టినది మాత్రం తెలుగు లో మాగ్నమ్ ఆపస్ ( Magnum opus  )అనదగ్గ  కన్యాశుల్క నాటక రచన మాత్రమే.
          ఈనాటకం మొదటి ప్రదర్శన 1892 లో జరిగి విశేష జనాదరణకి నోచుకుంది. దానికి కారణం అంతవరకూ తమకు అర్థంకాని మరఠ్వాడా సంస్థల వారి  హిందీ నాటకాలు చూసిమొహం మొత్తిన తెలుగు వారికి వారి నిత్యజీవితంలోకనిపించే పాత్రలు వారి జీవద్భాషలో మాట్లాడుతూ కనిపించడమే.  కన్యాశుల్క రచనోద్దేశం  ప్రధానంగా  సంఘసంస్కరణ అయినా అది ప్రజల హృదయాలలో నాటుకునేట్టు చేయగల బలమైన సాధనం వారి జీవ భాషలో రచింపబడే నాటకమే అని కవి నమ్మడమే. ఆనమ్మకం నిజమని రుజువు చేస్తూ ఆనాటకం పొందిన  బహుళ జనాదరణ, పత్రికల ప్రశంసలూ కవిని ముగ్ధుణ్ణి చేశాయి. ఆనాటివరకూ తెలుగు దేశం కనీవినీ ఎరుగని ..నాటి సాహిత్యంలో ఎటికెదురీతలాంటి తన ప్రయోగం విజయవంతమవడంతోనూ మొదటి కూర్పు  (1897)  ప్రచురించిన నాటినుండి గడచిన పుష్కర కాలంలో వ్యావహారిక భాషకి లభించిన సమాజ, సాహితీపరుల ఆమోదపు ప్రోత్సాహంతోనూ కన్యా శుల్కం నాటకాన్నితిరగ రాసి 1909 లో ప్రచురించారు. ఈ ప్రచురణ మొదటి కూర్పులో ఉండిపోయిన గ్రాంధిక పదజాలపు వాసనలు పూర్తిగా తొలగించుకొని అసలైన తెలుగు నుడికారపు సొబగులతో గుబాళించింది. గత నూరేళ్లుగా తెలుగు సాహితీ పిపాసులు మరీ మరీ చదువుకుంటూ మురిసిపోతున్న  ప్రచురణ యిదే.

                                   తెలుగు సాహిత్యంలోమణిపూస అనదగ్గ కన్యాశుల్కం నాటకమే కాకుండా ఆయన రాసిన దేశ భక్తి గేయం ముత్యాలసరాలూ ఆయనని అజరామరుణ్ణిచేశాయి.
 దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్
వట్టిమాటలు కట్టి పెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయ్
పూని యేదైనాను ఒక కార్యం
చేసి జనులకు చూపవోయ్..  
 అంటూ దేశజనుల్ని ఉద్బోధిస్తూ ఆయన రాసిన గేయం  ఏదేశప్రజలైనా పాడుకో దగ్గది. ఇటువంటి దేశభక్తి గేయం మరో బాషలో ఉండి ఉంటుందని నేననుకోను.
ఆయన సమాజంలో ఉన్న మూఢవిశ్వాసాల్ని డంబాచారాల్ని కడిగివేశాడు.  తోకచుక్క అనే గేయంలో
అరుదుగా మిను చప్పరంబున
చొప్పుతెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుధ్ధులు
బెదరి యెంచిరి కీడుగా...      అంటూ
తలతునేనిది సంఘసంస్కరణ ప్రయాణ పతాకగాన్ అనీ అన్నాడు.
మన సమాజానికి పెద్ద చీడయైనటువంటి కుల వ్యవస్థని అసహ్యించుకుంటూ
లోకమందున యెంచి చూడగ
మంచి చెడ్డలు రెండె కులములు
మంచియన్నది మాలయైతే
మాలనే యగుదున్     అనగలిగిన సంస్కరణాబిలాషిఅతడు.
వాడుక భాషని ఈసడించే శుధ్ధ గ్రాంధికవాదులకు
కొయ్య బొమ్మలె మెచ్చు కనులకు
కోమలుల సౌరెక్కునా అంటూ చురక పెట్టేడు.
ఈ మహాకవిని గురించి చెప్పుకోవడానికి  ఎంతైనా ఉందిగానీ  ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. మన మహాకవి శ్రీశ్రీ చెప్పిన విషయాన్నిక్కడ గుర్తు చేసుకోవాలి. ఆయన మనకి ముగ్గురే యుగకవులనీ వారు ఆది కవులలో తిక్కన మధ్యయుగంలో వేమన ఆధునికులలో గురజాడ అని నిష్కర్షగా చెప్పాడు. 
అనారోగ్యంతో బాధ పడుతూ చాలాతక్కువ కాలం (53 సంవత్సరాలు) మాత్రమే జీవించినా ఆధునికాంధ్ర సాహిత్యానికి దిశా నిర్దేశం చేస్తూ
దీపధారియై ముందు నడుస్తూ  అడుగు జాడ గురజాడది--  ది భావికి బాట ”    అనిపించుకున్న గురజాడ సాహితీపరులందరికీ
చిరస్మరణీయుడు.
                         నేటికి గురజాడ జన్మించి నూట నలభై తొమ్మిది సంవత్సరాలు గడిచి 150 వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో   నా నివాళి నీవిధంగా సమర్పిస్తున్నాను

సరసుల మనసులదోచియు
కరమగు ఖ్యాతిని బడసిన కన్యాశుల్కం
విరచించె మన మహాకవి
గురజాడను నే నుతింతు గురుభావముతో...

(మరికొన్ని విషయాలు మరోసారి ---సెలవు.
























19, సెప్టెంబర్ 2011, సోమవారం

నా నోటికి తాళం లేదు...

దూరతరశ్శోభతే మూర్ఖో లంబశాట పటావృత
తావఛ్ఛ శోభతే మూర్ఖో యావత్కించిన్న భాషతే

ఈ సంస్కృత శ్లోకానికి అర్థం--  మంచి దుస్తులు ధరించి ఉన్న మూర్ఖుడు దూరంనుంచి చూసి నప్పుడు చాలా మర్యాదస్తుడిలాగే కన పడినా  వాడు నోరు విప్పితే వాని బండారం బయట పడుతుందని. ఇదే  అర్థం వచ్చే ఇటాలియన్ స్పానిష్  జాతీయాలు కూడా ఉన్నాయట.  మిగిలిన దేశాల్లో కూడా ఉండి ఉంటాయి. అవును ఏ దేశం లోనయినా మూర్ఖుడు నోరు విప్పితే  అంతే కదా?  దీన్నే నేను  ఇంగ్లీషు మాత్రమే అర్థమయ్యే మా మనుమళ్ళకోసం ఇలా చెప్పేను

A well dressed idiot
Gets his due respect
When he keeps his mouth shut.

తెలివి తక్కువ మూర్ఖుల విషయంలోనే కాదు  తెలివైన వాళ్లమైనా అనాలోచితంగా మాట్లాడితే లేని పోని ఇబ్బందులొస్తాయి. కాలుజారితే తీసుకోవచ్చుకాని నోరుజారితే తీసుకోలేమంటారు కదా?  మనం బ్రతకడానికి కావల్సిన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి వీలుగా తయారుచేసి లోపలకి పంపిస్తూ, మన బ్రతుక్కి అత్యవసరమైన ఈ నోరు.....మన  భావాల్ని ఇతరులకి మాటల ద్వారా  తెలియజేయడానికి ..  మధురంగా పాడుకోవడానికీ ఎంతగానో పనికి వచ్చే ఈనోరు  ... దీనిని అదుపులో పెట్టుకోక పోతే వచ్చే చిక్కులెన్నో కదా ?. ఈ నోటికి సంబంధించిన కొన్ని పదబంధాల్ని చూడండి:

నోరుజారడం---- ఫొరపాటునో ఆవేశంలోనో అనకూడని మాటలనడం
నోరు కలపడంమరోకరి మాటల్లో తానూ పాలుపంచుకోవడం
నోరు పారేసుకోవడంకావాలని  అనకూడని మాటలనడం
నోరు  మూసుకోవడం-- మాట్లాడకుండా ఉండడం. వాగ్యుద్ధానికి తెరదించడం
నోట్లో నాలిక లేకపోవడం తాననుకున్నది చెప్పలేకపోవడం
నోట్లో నోరు పెట్టడంఎవరితోనైనా వాగ్విదానికి దిగడం

నోటికి సంబంధించిన కొన్ని సామెతలనిచూడండి:

నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది--.   ఎవ్వరితోనూ విరోధం రాదని అర్థం
నోరా వీపుకు తేకే---   అనకూడని మాటలంటే దెబ్బలు తినాల్సి వస్తుందని అర్థం
నోటిముత్యాలు రాలి పోతాయా?  -- ఏదడిగినా బదులివ్వని వాని ననేది.
నోట్లో ఆవగింజ దాగదు ఏ రహస్యం దాచుకోలేడని అర్థం
నోట్లో నువ్వుగింజనానదు--     --డిటో
నోరు కలిగితే బ్రతుకుతాడు--  మాట తీరు గా ఉంటే బ్రతుకు తెరువు దొరుకుతుంది.
చేతికందింది నోటికందదుదగ్గరకి వచ్చి చెయ్యి జారిన అదృష్టం
ఇలాంటివింకెన్నో కదా?.  ( ఎక్కువ మాట్లాడితే వీడికి నోటి దురద ఎక్కువంటారేమో అందుకని .......
సెలవు

17, సెప్టెంబర్ 2011, శనివారం

మా ఆవిడ నోట్లో నువ్వుగింజ నానదు...

ఒకణ్ణి తలలో నాలిక లాంటి వాడంటారు. అంటే అతడు అందరితో కలసిపోయి మంచిగా ఉండే వాడన్న మాట. మరొకడికి నో'టిలో నాలిక లేదంటారు. నోట్లో నాలిక లేకపోవడ మేమిటి ?. ఉండేఉంటుంది. ఉండడమే కాదు మాటలు రాని మూగ వాడై కూడా ఉండడు. కాని చాలా బిడియస్తుడై ఉండి తన మనసులోని మాట నలుగురిలో ధైర్యంగా నోరువిప్పి చెప్పలేని వాడై ఉంటాడు. ఇంకోడి నాలిక్కి నరంలేదంటారు. అంటే వాడు నోటికేదొస్తే అది జంకూగొంకూ సిగ్గూ శరమూ లేకుండా వాగుతాడన్నమాట. చిత్రమైన నోరూ.చిత్రమైన మనుషులున్నూ.. ఇలాంటివిషయాలు చాలా ఉన్నాయి గానీ వాటన్నిటినీ ప్రక్కని పెట్టి అసలు విషయానికి వస్తున్నాను.నా చిన్నప్పుడు మా వూళ్ళో మాపని మనిషి కూతురి నోటంట ఓ మాట విన్నాను. ఒక విషయం (చిన్నపాటిరహస్యం) మీ అమ్మతో చెప్పావా అని అడిగితే " సీ.. దాన్నోట్లో నువ్వుగింజ నానదు" అని అంది. అంటే అప్పటికి నాకర్థమైన విషయం వాళ్ళమ్మ ఆవిషయం ఎవరికైనా చేప్పేస్తుందని. అయితే ఇవాళ ఆలోచిస్తే నాకో విషయం తడుతోంది. కొంత మంది నిర్వరామంగా అలా మాట్లాడుతూనే ఉంటారు కదా. చాలా సభల్లో వక్తలు రెండు ముక్కలు చెబుతామంటూ రెండు గంటలకి కూడా ఇంటర్వెల్ తీసుకోరు. గొంతు తడారిపోతున్నా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ల అదృష్టం (మన దురదృష్టం) కొద్దీ ఈ రోజుల్లో ప్రతీ వక్తకీ ప్రక్కనే ఒక మినరల్ వాటర్ బాటిలు పెడుతున్నారు సభానిర్వాహకులు. రెండు గుక్కలు త్రాగి మహానుభావుడు మళ్ళీ మొదలెడతాడు. ఇలాంటి వాళ్లనే నేడు ముద్దుగా మనం మైకాసురులని పిలుచుకుంటున్నాము. ఇదిగో ఇక్కడే నాకు సామెత బోధ పడింది. ఆమైకాసురుడికి మనం మంచి నీళ్లే ఇవ్వలేదనుకోండి. ఏమౌతుంది?. కొంతసేపటికి నోరు ఆర్చుకు పోయి మాట బైటికి పెగలదు. తప్పక చప్పున కూర్చుంటాడు . మరి ఆనోట్లో ఏం వేసినా నానదు కదా. నువ్వు గింజ చాలా చిన్నదిగా ఉంటుంది. అది నానడానికి కావల్సిన తడి కూడా ఉండదన్న మాట. నువ్వుగింజ నానడానికి కావల్సినంత తడి కూడా నోట్లో మిగలనీకుండా మాట్లాడేవారు ఏ విషయమైనా బయటకి కక్కకుండా ఉండలేరన్నమాట. ఏ రహస్యమూ వారినోటదాగదని తాత్పర్యం. సామెతలోని సౌందర్యం గమనించండి మాయింటి టెలిఫోనుకి ఒక సౌకర్యం ఉంది. నెలకి నాలుగువందలు కడితే ఊళ్లో ఏ బి.యస్.ఎల్.ఎన్. లేండ్ లైన్ కైనా ఫోన్ చేసి ఎంత సేపయినా మాట్లాడుకోవచ్చు. మా ఆవిడ తరఫు వాళ్లంతా ఈవూళ్లోనే ఉండడంతో మొదట్లో ఇది మంచి సదుపాయమనే అనుకున్నానుగాని తర్వాత్తర్వాత దాని సాధక బాధకాలు తెలిసాయి. రోజూ ఇంట్లో రేడియో స్టేషన్ ఉందన్నట్లుగా తెల్లవారిందగ్గరనుంచీ రాత్రి పదకొండు గంటలవరకూ నిర్విరామంగా ప్రసారాలు సాగుతూనే ఉంటాయి. అవతలి వారు కూడా ఆడవాళ్లే (చెల్లెళ్లో మరదళ్లో) కావడంతో ఫోన్ పెట్టేసే ప్రసక్తే ఉండదు. అవి నా చెవులకి ఉద్దేశించిన ప్రసారాలు కావు కనుక నాకు సుఖంగానేఉంది. కానీ ఎవరైనా మాయింటికి అర్జంటుగా ఫోన్ చేయాలనుకుంటే కుదరదుగదా అదొక్కటే బాధ .రిటైరై కూర్చున్న వాణ్ణి కనక నాకే ఫోన్లూ రావు. ఎవరైనా చేయాలనుకున్నా మా లేండ్ లైన్ ఎప్పుడూ ఎం గేజ్డ్ గానే ఉంటుంది. తప్పని సరై నాతో మాట్లాడాల్సి వస్తే నా సెల్ కి చేయండి. గుర్తుంచుకోండి. ఇంతకీ మా ఆవిడ నోట్లో నువ్వుగింజ నానుతుందో లేదో చూద్దామనే ఉంది గాని ఆవిడ పోన్ పెట్టేసి నప్పటి సంగతి కదా?...ఇప్పటికి సెలవు.+

15, సెప్టెంబర్ 2011, గురువారం

శ్రీవిశ్వనాథ రామప్పంతులు


లౌక్యం అనే పదానికి మన నిఘంటువులిచ్చే అర్థం ప్రపంచ సంబంధమైనది..మనుష్య సంబంధమైనది.. సర్వ సామాన్యమైనది.. వాడుకలోనున్నది..  అని.. .. కానీ మనం ఈనాడు ఏదైనా ఇబ్బందికరమైన సందర్భంలో ప్రదర్శించే దాటవేత  వైఖరిని లౌక్యం అంటున్నాము  పూర్వం కన్యాశుల్కం రచనాకాలానికి  సామాన్య లౌకిక జీవితం గడిపేవారిని  లౌక్యులనే  వ్యవహరించినా లౌక్యం అనే  పదాన్ని దాదాపు ఇప్పుడున్న అర్థంలోనే  వాడేవారనిపిస్తుంది..
 కన్యాశుల్కం  ( చతుర్థాంకం..1 వ స్థలం) లో లుబ్దావధాన్లు పెళ్లి కుదిర్చాక    పెద్దిపాలెం  వెళ్లి లౌక్యుల్ని ఎవరు పిలవడం? ” అంటాడు రామప్పపంతులు. ఇక్కడ మనకు నైఘంటికార్థమే కన పడుతుంది. కానీ కన్యాశుల్కం  (ద్వితీయాకం  1వ స్థలం)  లోని మధురవాణి.రామప్పపంతుళ్ల సంభాషణ లో ఆనాటికే  ఈ పదం సంతరించుకున్న ప్రత్యేకార్థం  గోచరిస్తుంది. మధురవాణి సుబ్బిజాతకం కూడా రామప్పపంతులు బనాయింపేనా అని అడిగినప్పుడు అది అగ్నిహోత్రావధాన్లే బనాయించేడనీ ఆనాటి బ్రాహ్మలలో అది మామూలేననీ అంటాడు..మధురవాణి దాన్ని పచ్చిమోసంగా పేర్కొంటే రామప్పపంతులు కాదు దాన్ని లౌక్యం.. లౌక్యం..అనమంటాడు. రెండిటికీ భేదమేమిటని ప్రశ్నిస్తే నమ్మించోట చేస్తే మోసమనీ.. నమ్మంచోటచేస్తే లౌక్యమనీ విశదీకరిస్తాడు. ఈ సంభాషణకి చక్కని  ముక్తాయింపునిస్తూ తాను         చేస్తే లౌక్యం. మరోడు చేస్తే మోసం అనరాదా అంటుంది.   ఆ సీనులోనే మరోచోట లౌక్యమంటే మరేవిటనుకున్నావు ? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్యడమనీ చెప్తూ తాను మోసపు  మాటలతో లుబ్దావధాన్లని పెళ్లికిఎలా ఒప్పించిందీ వివరిస్తాడు.
 దానా దీనా మనకు తేలేదేమిటంటే .. లౌక్యం అనే దాంట్లో  కించిత్తు మోసం కూడా అప్పుడప్పుడూ ఉండొచ్చుననీ కనీసం నిజాయితీ లోపించవచ్చుననీ. కన్యాశుల్కం సంగతి కాసేపు ప్రక్కని పెట్టి ఉపనిషత్కారుడేమన్నాడో చూద్దాం.    సత్యం బ్రూయాత్.. ప్రియంబ్రూయత్.. సత్య.మప్రియం నబ్రూయాత్ అనికదూ?”.ఏమీ?తెలిసినా నిజం చెప్పకూడదా?.. ఎందుచేత? అవతల వాళ్లని నొప్పిస్తామేమోనని ఎందుకొచ్చిన గొడవ అనేకదా?  ఇది లౌక్యానికి నిర్వచనంకాదా?.  ఇదీ వదిలేయండి. సుమతీ శతక కర్త ఏమన్నాడో చూడండి:
ఎప్పటికెయ్యది ప్రస్తుత 
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపక తానొవ్వక
తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ ! 
అని. ఇది పక్కా లౌక్యం కాదా ?  పద్యంలో యతిని కాసేపు మరచిపోతే ధన్యుడు అనేచోట  లౌక్యుడు అనేది ఎం త చక్కగా సరిపోతుందో  ? అయితే ఎలాంటి వారికయినా చాలా సందర్భాల్లో   గోడమీది పిల్లి ”  ఆదర్శవంతమౌతుంటుంది.   Play it safe ..అన్నది  cat on the wall philosophy.

  సరదాగా ఇక్కడ ఓ ముచ్చట చెప్పబుధ్ధౌతోంది.   196667 ప్రాంతంలో నేను ఏజీ ఏఆఫీసులో పని చేసే రోజుల్లో  చాలా సాహితీ సభలు జరుగుతూ ఉండేవి. ఒకసారి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారూ.. మరో ప్రసిధ్ధ కవి పండితుడూ  సాయంత్రం సభజేస్తారని తెలిసింది.  ఎక్కువ మంది రారేమో ననే జంకుతో మీటింగ్ క్లబ్బు హాలులోనే ఏర్పాటు చేసారు.మామూ లుగా అయితే లాకాయి లూకాయి సభలకి  విశ్వనాధ వారు రారు.. అయితే అప్పట్సో ఆయన గవర్నమెటు సర్వీసులో ఉండేవారు. గజెటెడ్ ఆఫీసరు కావడంతో వారి జీతా లన్నీ ఏ జీ ఆపీసు వారు ఆధరైజ్      చేస్తే గానీ వారికి ముట్టేవి కావు.   ఆ కారణం చేతో ఏమో ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చే వారు. ఆ రోజు మరీ అధ్వాన్నం.  సాహితీ సమితి  కార్యవర్గ సభ్యులతో కలిపినా పది పదిహేనుమందికంటే లేము.  మొదటగా ఆయనతో పాటుగా వచ్చిన కవిగారు కొంచంసేపు మాట్లాడి కూర్చు న్నారు. తర్వాత విశ్వనాధ వారు ఏం చెబుతారో నని అందరం ఆశగా ఎదురు చూసేము. ఆయన కూర్చున్న కుర్చీలోంచి లేవకుండానే ఇంగ్లీషులో ఓ కథ చెప్పి ముగించారు. తెలుగులో ఒక్కముక్క మాట్లాడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆకథ నాకు గుర్తు లేదుగానీ సారాంశం మాత్రం బాగా గుర్తుండిపోయింది.  ఆకథ  చెప్పిన వాడూ విన్నవాడూ ఫూల్స్ అని.  ఆ కథ చెప్పడంలో ఆయన ఉద్దేశం మీరెంతమంది వస్తారో నని నేను ఎదురు చూసేను. నేనేంచెప్తానో నని మీరు ఎదురు చూసి ఉంటారు. కాని ఉభయులమూ ఫూల్స్ గా మిగిలామని కావచ్చు. చూసేరా కవి  సామ్రాట్టు గారి  సమయస్ఫూర్తిన్నీ లౌక్యమున్నూ.   అన్నట్టు ఆయన వయసులో ఉండగా కన్యాశుల్కంలో రామప్పపంతులు వేషం వేసేవారట.  మరింక ఆపాటి లౌక్యం అబ్బకుండా పోతుందా?    అందరం  ఎంతోకొంత లౌక్యులమే కాదా ?

(ఇది సరదాగా వ్రాసినది.శ్రీ విశ్వనాథ వారంటే నాకెంతో గౌరవం)

సెలవు.





8, సెప్టెంబర్ 2011, గురువారం

వెచ్చని పచ్చడం లేకపోతే పితలాటకమే



                                                         ఈ మధ్య  కళింగాంధ్ర మాండలికం..1 అనే పుస్తకం మరోసారి చదివేను. ఈ పుస్తకం 2006 జనవరిలో శ్రీకాకుళ సాహితి వారు ప్రచురించేరు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండే శ్రీ జి.ఎస్.చలం గారు దీనిని వ్రాసేరు. ఏ యూనివర్శిటీయో, అకాడమీయో చేయాల్సిన పనిని  ఒక్కరూ నెత్తికెత్తుకుని చేసారు. ఆయన కృషి చాలా అభినందనీయం, భాషాభిమానులందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. అయితే ఆయన వ్యవహర్తలనుంచీ,ఆ ప్రాంతపు రచయితల పుస్తకాలనుంచీ  పదాలు సేకరించి పుస్తకాలలోని మాటలకు తాననుకున్నవీ, ఆయావ్యవహర్తలు చెప్పినవీ అర్థాలు వ్రాసుకోవడంవల్ల  కొన్ని పొరపాట్లూ,తప్పుడు అర్థాలూ దొర్లేయనుకుంటాను. వాటిగురించి మరోసారి ముచ్చటిస్తాను గానీ ఇప్పుడు చెప్పబోయేది కళింగాంధ్ర మాండలికాలనడానికి వీల్లేని పదాలు  లెక్కకు మిక్కిలిగాఉన్నాయనే. ఒక మంచి కృషిని శ్లాఘించాలి కాని లోటుపాట్లు ఎత్తి చూపకూడదనే  సంస్కారంతోనేమో పుస్తకానికి ముందుమాట వ్రాసిన బూదరాజు రాధాకృష్ణ గారు కూడా ఈ విషయాలు విస్మరించారని అనుకుంటాను. ఆ ప్రాంతపు మాండలికాలనడానికి వీలు లేని పదాలకుదాహరణగా రెండు ముక్కలు మనవి చేస్తాను. చూడండి:

 పచ్చడం  --దుప్పటి  (పేజీ 90 )   అర్థం గురించి ఏ తగువూ లేదు కాని ఇది అన్ని నిఘంటువుల కెక్కిన,  ఆంధ్ర దేశం అంతా వాడుకలో ఉన్న,  కావ్యాలలో కూడా కనుపించే పదం.. సందర్భం వచ్చింది కనుక చక్కటి పద్యమొకటి
ఉటంకిస్తాను. ఇది శ్రీ వినుకొండ వల్లభరాయడు (లేక ఆయన పేరుతో శ్రీనాధమహాకవి ) వ్రాసినది అయిన క్రీడాభిరామము లోనిదని రసజ్ఞులందరికీ తెలుసు కానీ యువతరం వారికోసం:
                                  మాఘమాసంబు పులివలెమలయుచుండ
                                  పచ్చడమ్మమ్ముకొన్నాడు పణములకును
                                  పడతిచన్నులు పొగలేని ముర్మురములు
                                  చలికినొరగే.కేలుండు సైరికుండు. 
                           (భావం తెలిసినవారు తెలియనివారికి తెలియజేయగలరు)

పితలాటకం:  (పేజీ 94) దీనికి రచయిత ఇచ్చిన అర్థంఎంతకీ తెగకపోవడంఅని .దీన్ని చూస్తేనే తెలుస్తుంది రచయిత ఎవరేంచెప్తే అది వ్రాసుకున్నారని.  ధీనికి సరైన అర్థం మోసం అని ఏనిఘంటువైనా చెప్తుంది.అసలిది పిత్తల+హాటకం . పిత్తల అంటే ఇత్తడిని హాటకం అంటే బంగారం అని మోసం చేసి చూపించడం. నిఘంటువులు ఇది అరవ పదమని చెప్తాయి. ప్రముఖ భాషావేత్త వరిశోధకుడూ అయిన ఢా. చల్లా రాధాకృష్ణశర్మ గారు తన మద్రాసు తెలుగు అనే వ్యాసంలో దీనిని పేర్కొన్నారు.
   
మద్రాసులో పలికే మాట కళింగాంధ్ర మాండలికం ఎలాగవుతుంది? అందుకే బూదరాజుగారు మొహమాటపడ్డారన్నాను. నా ఈ వ్యాసోద్దేశం  శ్రీ చలంగారి కృషిని తక్కువ చేయాలని  ఎంతమాత్రం లేదని మరోసారి మనవి చేసుకుంటూ బూదరాజు వారిని  క్షమాపణలుకోరుకుంటున్నాను.  గ్రంథాలలో తప్పులు అలా ఉండిపోకూడదనే సదుద్దేశం మాత్రమే నన్నీ పనికి పురికొల్పింది.

స్వస్తి





కవిగారూ..ఆటవెలదులూ...


కవిగారూ..ఆటవెలదులూ...

ఓ కవిగారికి ఆటవెలదులన్నా తేటగీతములన్నా చాలా ఇష్టమట. ఆయితే ఆటా..పాటా లేకపోయినా మిగిలినవి ఉంటే సర్దుకు పోతాను  ఫర్వాలేదు అన్నాడిలా:
ఆట లేక తేట పాటయులేకున్న
వెలదులున్నచాలు వేవరాలు.... 
            అదీ కవిగారి రసికత.. ఆయన పేరు సరిగా గుర్తులేదు కాని వావిలాల వాసుదేవ శాస్త్రి అనుకుంటాను. ఆయన పేరు కూడా తమాషాగా ఆటవెలది ఆఖరి పాదమై కూర్చుంది చూసేరా? (ఈయన గురించి శ్రీ ఆరుద్ర గారి  సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో  సుబాకవుల విభాగంలో చదువుకొన వచ్చు)

                                                        నాకైతే కంద పద్యాలే ఇష్టం కానీ సరదాకి కొన్ని ఆటవెలదులూ రాసేను. చిత్తగించండి:

       తాను తినక సొమ్ము తనవారికీకుండ
దానమీయకుండ దాచువాడు
గడ్డి వాము చెంత కాపుండు శునకము
నిజమె పలుకు చుంటి నీరజాక్ష   
   
కూటగురుని చేరి కొలువెంత చేసిన
కలుగబోదు ఎపుడు జ్ఞానసిధ్ధి
కుక్క తోక బట్టి గోదావరీదగా
జాలడెవడు వాని జన్మలోన       

కుక్కతోక జూడ కుటిలమై యుండును
దాని శీలమదియు దాచలేదు
తోలలేదు ఎపుడు దోమ ఈగలనైన
వ్యర్ధుడైన వాని వైనమింతె                          *    

మనము నిద్రపోవ మనతోనె నిద్రించు
మనము నడచుచుండ వెనుకె వచ్చు
పూర్వ జన్మ కర్మ పోదు ఫలమునీక
నిజమె పలుకుచుంటి నీరజాక్ష                          *

తరుణులందరెపుడు తలను దాల్తురుగదా
విరుల సరుల లోని దారమైన
మంచివారి పొందు మాన్యత చేకూర్చు
నిజమె పలుకు చుంటి నీరజాక్ష                     *    

మనసులోనిమాట మర్మమేలేకుండ
పలుక వలయునెపుడు, పలుకెగాదు
చేసిచూపవలయు  చేతలందునుగూడ
నీతిమార్గ మిదియె నీరజాక్ష                 

మట్టిలోన పుట్టి మట్టిలో కలిసేటి
మనుజులందరొకటె మాన్యులార
మతములందు లేదు భేద భావమెపుడు
మానవతనెచాటు మతములన్ని 
  
ప్రేమ ప్రేమ యనుచు ప్రేమిస్తి ననుచును
అందమొకటె జూచి ఆశ పడుచు
పిల్లదాని మనసు పిసరంత తెలియక
వెంటబడెడివాడు వెఱ్ఱి వాడు                

ఆలు మగల మధ్య అనురాగముండియు
ఒకరినొకరు యెపుడు గౌరవింప
కాపురములు సాగు కలతలు లేకుండ
నీతి వాక్య మిదియె నీరజాక్ష               

 కష్టమొచ్చినపుడు కలగిపోకుండుడు
కష్టసుఖములవియు కలిసె వచ్చు
పగలు రాత్రి గడువ పగలు రాకుండునా
నిత్య సత్య మిదియె  నీరజాక్ష                

ఏమిలేని నాడు ఎంగిలికాశించు
కుడువ కూడులేక కుములుచుండు
అన్ని యున్ననాడు అన్నమే తినలేడు
నిత్య సత్య మిదియె నీరజాక్ష                  

ఏరినైన నీవు గౌరవింపదలప
మంచిగుణము,  విద్యలెంచవలయు
కలిమి కులములెపుడు కారాదు కొలబద్ద
నీతి వాక్యమిదియె నీరజాక్ష                  

నమ్మడెవరిమాట నమ్మబోడుసతిని
నమ్మడెపుడు వాని అమ్మనైన
బెమ్మ ఎదుట నిలిచి  నమ్మబల్కిన గూడ
సణుగుచుండు నిత్య శంకితుండు    

చుట్టరికముతోడ చూడనింటికి బోవ
ధనము నడుగ వచ్చిరనుచు తలచి
ఇంటనున్న లోభి లేడని చెప్పించు
నిజమె పలుకుచుంటి నీరజాక్ష                

ఎవరిసొమ్ము వారికిచ్చుటేమి ఘనము
నిలువుదోపిడిచ్చి నీల్గుచుంద్రు
సకల సంపదలును శర్వునివేకావ
నిజము పలుకుచుంటి నీరజాక్ష                 

జాతకములు వ్రాసి చక్రాలు సరిజూసి
మంచిమూర్త మొకటి యుంచుగాని
పిల్ల లేచి పోయి  పెండ్లి రద్దయి పోవ
పంతులేమి జేయు పద్మనాభ                 

ఆశ పెరుగుచుండు ఆస్తులతో పాటు
ఆశకంతులేదు అవనియందు
ఆశలేని వాడు అదృష్టవంతుడు
నీతి వాక్య మిదియె నీరజాక్ష            

ఫిల్ల కనుటయొకటి  పెండ్లి చేయుటొకటి
ఆడపిల్ల తల్లి తండ్రులకును
కష్ట సాధ్యమైన కార్యమే యెపుడైన
నిజమె పలుకుచుంటి నీరజాక్ష                 

పాల సంద్రమందు పవ్వళించెడువేళ
పాదసేవ చేసెనాది లక్ష్మి
ద్వాపరమున నీకు దారయై అలుకతో
సత్యభామ కాలు సాచి తన్నె                    

కవియెకాని వాడు కావ్యమ్ము వ్రాయంగ
చదువె రాని వాడు చదువుచుండ
చెవిటివాడొకడు చెవియొగ్గి వినుచుండ
కాశి పారిపోయె  కావ్య రసము             
   
( * ఈగుర్తు గల పద్యాలకు సంస్కృత మూలాలున్నాయి)   

ఇప్పటికి సెలవు...                   


              
           



  










పెండ్లి వారి యింట పేకాట లేకుండ
పెండ్లి యెట్లు జరుగు పెద్ద లార
పెండ్లి వారి కిపుడు పేకల కొని దెచ్చి
పెండ్లి జరుపు కొనుము పెండ్లి పెద్ద           





7, సెప్టెంబర్ 2011, బుధవారం

కక్కూసు కథ హి..లేక..షి...


నేను 1997 లో రిటైర్ అవకముందు హైదరాబాదు  ఏజీ ఆఫీసులో  34 సంవత్సరాలు పని చేసాను.  అప్పట్లో...(.ఇప్పటికీ కూడా) ... మా ఆఫీసు లో సాహితీ పరిమళం గుబాళిస్తూ ఉండేది/ ఉంటోంది. ఎందరో కవులూ సాహిత్యాభిలాషులూ  మరీ ముఖ్యంగా  కథా నాటక రచయితలు  ఎక్కువగా ఉండేవారు. బి.కె.ఎల్.ఎన్ ఆచార్య, ఇసుకపల్లి దక్షిణా మూర్తి, పరుచూరి వెంకటేశ్వర రావు, ఢి.ప్రభాకర్, పమ్మి వీరభద్రరావు గుమ్మా ప్రసన్నకుమార్ కె.కె.మీనన్  శంకరమంచి పార్థసారధి ..ఇలా ఎందరో..  నేను రచయితను కాకపోయినా వాళ్ళలో కొంతమందితో  స్నేహమూ,మిగిలినవారితో ముఖపరిచయమూ ఉండేది. రంజని అనే పత్రిక నేను ఆఫీసులో చేరిన రోజుల్నుంచీ  సాహితీ సేవ  చేస్తూ ఈనాటికీ నడుస్తోంది.మహాకవుల్నీ గొప్ప రచయితల్నీ ( దివాకర్ల వెంకటావధాని , విశ్వనాథ సత్య.నారాయణ ఉత్పల  మొదలైన కవులూ.. రావి శాస్త్రి కాళీపట్నం మొదలైన రచయితల్నీ)  పిలిపించి సభలు చేయడం మంచి పుస్తకాలు ప్రచురించడం వచన కవితా పోటీలు నిర్వహించడం వంటి ఉత్కృష్ట సాహితీ సేవ నేటికీ కొన సాగుతోంది.(తొలినాళ్లలో రంజనిలో నేనూ చిన్న చిన్న గేయాలు వ్రాసిన వాడినే)
ఈ విధంగా  సాహితీ సౌరభాలు విరజిమ్మే  చోటికి  మిత్రులను కలుసుకుందికి అనేకమంది రచయితలు వస్తూండేవారు. వారిలో నేటి నవ్య వార పత్రిక సంపాదకుడు జగన్నాథ శర్మ ఒకరు. శర్మది మా ఊరే కావడం.. మా వీధిలోనే పుట్టి పెరిగిన వాడవటం మాతమ్ములందరితోనూ స్నేహంగా ఉండడంతో  నాకంటే బాగా చిన్నవాడయినా నాకు  బాగా తెలుసు. ఒకసారి అతను సాహితీ మిత్రులను కలుసుకోవడానికి మా ఆపీసుకి వచ్చినప్పుడు అందరం కలసి గేటు దగ్గర ఖాన్ సాబ్ టీ కొట్లో టీ తాగుతున్నాము. ఇంతలో  ఒకాయన  పలానా రచయిత్రి తన కథలో కక్కూస్”  అనే పదం వాడిందనీ దాని అర్థమేమిటో తెలియదనీ అలాటి పదాలు ఎందుకు రాస్తారో అర్థం కాదనీ అన్నాడు. అక్కడున్న మిగిలిన వారికి కూడా ఆ పదం అర్థం తెలిసినట్టులేదు. తెలియక పోవడంలో విశేషం లేదు. ఎందుచేతంటే వారందరూ చిన్నవారు. బహుశా వారు పుట్టినప్పటికే ఆపదం  వాడుకలో కనుమరుగయిందనుకుంటాను.
నాకు ఆపదం అర్థం తెలుసు కనుక వారికి చెప్పాను. కక్కూస్ అంటే లెట్రిన్ అని.  ఆ పదం తమాషా ఏమిటంటే అది పోర్చుగీసు పదం. వాళ్లు మనదేశానికి  వర్తకానికి వచ్చి స్థావరాలు ఏర్పరచు కున్నప్పుడు. మన భాషలో చేరింది. అసలు ఆపదం  Kak+ House= kakhouse  “ కేక్ హవుస్ జనం పలుకుబడిలో కక్కూస్ గా మారింది.   నేను బాగా చిన్నవాడిగా ఉన్నప్పుడు  కొన్ని రైల్వే స్టేషన్లలో  లెట్రిన్ల నీద కక్కూస్ అని వ్రాసి ఉండడం చూసి ఉన్నాను.ఇప్పుడయితే ఈ పదం ఎక్కడా వినపడడం లేదుగాని ఇప్పటికీ మా ఇళ్లల్లో చిన్న పిల్లలు మల విసర్జన చేస్తే కేక్ వెళ్లాడంటూ ఉంటారు..  శుచి శుభ్రతల్ని పాటించే సంస్కారవంతుల ఇళ్లల్లో  కొన్ని పదాల్ని పలకడం    తప్పుగా భావిస్తారు. అసహ్యమని భావించే పదాలకి బదులుగా వేరే పదాల్ని వాడడం సర్వత్రా ఉన్నదే. అందుకనే  ఒకటికనీ,రెంటికనీ బహిర్భూమికనీ దొడ్డిలోనికనీ వ్యవహరిస్తూ ఉంటారు. (కన్యాశుల్కంలో కోమటాయన గుడ్డి మీద బాహ్యానికి వెళ్లాననడం గుర్తుందా?)  . మా ఇంట్లో మా చిన్నప్పుడు మేము పెట్టుకున్న ముద్దు పేరు
లండన్అని.... బాగుంది కదూ?   ( మేము తెలియకుండా పెట్టుకున్న పేరయినా దానికో సార్థకత  ఉన్నట్టుంది. సుమారు రెండు వందల ఏళ్లక్రితం లండన్ లో ఎవరింట్లోనూ లెట్రిన్లు ఉండేవి కావట.  అప్పుడప్పుడూ మనుషులు తోపుడు బళ్లతో వచ్చి  మల మూత్రాల్ని తీసుకు పోయేవారట. అంటే ఆరోజుల్లో లండన్ నగరమే ఓ పెద్ద కక్కూస్ లా ఉండి ఉంటుదనడం  -- తప్పేమి ఒప్పేయగున్
                                                                ఈ రోజుల్లో  టాయ్ లెట్లమీద  ఏమీ వ్రాసి ఉండదు. హి..ఆర్ షి..అతడు లేక ఆమె అని మాత్రం వ్రాసి ఉంటుంది. అర్థంచేసుకోగలరు. అసలు మన రైల్వే బస్టాండులలో  టాయ్ లెట్ల గురించి ఎక్కడా వ్రాసి ఉండక్కరలేదు.  చాలాదూరం వ్యాపించే వాటి దుర్గంధమే వాటి ఉనికిని చాటుతూ ఉంటుంది.
 (  ఇక్కడో రహస్యం చెప్పాలి. నేను  195760 ప్రాంతాలలో  భారతిలో ప్రచురించ బడిన శ్రీ తూమాటి దొణప్ప గారి వ్యాసం తెలుగులో బుడతకీచు నుడులు అనే దాన్ని చదివి ఉన్నాను. కక్కూస్ గురించి ఆయన వ్రాసిందే .  బుడతకీచు అనేది తెలుగు వారు పోర్చ్ గీ సు వారికి పెట్టుకున్న పేరు.ఇందులో నా ప్రజ్ఞ ఏమీ లేదు).........
  ఇదీ కక్కూస్ ల కథ...
. మళ్లీ కలుద్దాం....సెలవు....