28, అక్టోబర్ 2011, శుక్రవారం

సోఁవులప్ప చెప్పిన సామెతలు


సామెత  లేని మాట ఆమెత లేని ఇల్లు అన్నారు.  ఆమెత అంటే విందు. సామెత లేని మాట చారూ అన్నం అయితే సామెత తో కూడిన మాటలు విందు భోజనం లాంటిదన్నమాట. ఏ భాషకయినా ఆ భాషలోని సామెతలే అలంకారాలు. ఒకొక్కప్పుడు పది మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క సామెత అవలీలగా విశదీకరిస్తుంది. నా చిన్నతనంలో సామెతలు  అందరినోటా తరచూ వినిపిస్తుండేవి. ఇప్పుడవి అపురూపాలయిపోయేయి.  పుస్తకాలకే పరిమితమైపోయేయి.
  
                        మొన్నామధ్య సోఁవులప్ప కథ చెప్తూ ( సోఁవులప్పకి జేజే పోస్ట్   ఇక్కడ నొక్కి చూడండి )  ఆమెకి కడుపునిండా సామెతలే. సామెత లేకుండా  ఒక్క ముక్కయినా మాట్లాడదని చెప్పేను. అయితే ఆవిడ సామెతల్ని వేరుగా పరిచయం చేద్దామనే సంకల్పంతో అప్పుడు ఒక్క సామెత కూడా మీకు నేను పరిచయం చేయలేదు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మా ప్రాంతపు సామెతల్ని  మీకు రుచి చూపిస్తాను. మా ప్రాంతపువి అన్నంత మాత్రాన  ఇతర ప్రాంతాలలో ఇవో ఇలాంటివో ఉండవని కాదు. ఒకే భావాన్ని వెలిబుచ్చే సామెతలు వివిధ ప్రాంతాల్లో ఆయా ప్రాంతపు నుడికారాన్ని  సంతరించుకుని వింత పరిమళాలతో గుబాళిస్తాయి. చాలామట్టుకు అందరికీ అర్థమయ్యేటట్లే ఉంటాయి. అవసరమనుకున్న చోట వివరణలు ఇస్తున్నాను.
సోలెడు బియ్యం కూలికెళ్తే కుంచెడు బియ్యం కుక్క తినీసిందట.

పాత రోజుల్లో కొన్ని ప్రదేశాల్లో శేర్లు అనే కొలమానం ఉన్నట్టుగానే ఉత్తరాంధ్రలో  గిద్దలు సోలలు తవ్వలు అడ్డలు కుంచాలూ అనే కొలపాత్రలుండేవి. గిద్దలు అన్నిటికంటే చిన్నవి.  అంతకంటే పెద్దవి  సోలలూ,తవ్వలూ..  ఆ తరువాత అడ్డలూ కుంచాలూ..  ఈ సామెత కర్థం చిన్నదానికాశపడి పెద్దది పోగొట్టుకోవడం.
(pennywise pound foolish  అన్నమాట.)
కుంచాల సంగతి వచ్చింది కనుక  మరో సామెత..కుంచమంత కూతురుంటే అన్నీ మంచంమీదనే.--- కుంచమంటే పెద్దది కదాఅంటే ఎదిగిన కూతురింట్లో ఉంటే తల్లిని మంచం దిగనివ్వకుండా సేవ చేస్తుందని…( నమ్మకమేనా?)
కుంచాల గురించే మరో సంగతి. మా వేపు షావుకార్లు  వారే మైనా అమ్మిన ప్పుడు చిన్నమ్మీ కుంచంతే అంటారట. వారే ఏదైనా కొనుక్కునేటప్పుడు పెద్దమ్మీ కుంచంతే అంటారుట. అమ్మినప్పుడు చిన్నకుంచం కొన్నప్పుడు పెద్దకుంచం అన్నమాట చూడండి వారి గడుసుదనం.

అప్పబతుకు అడగక్కర్లేదు.. సెల్లి బతుకు సెప్పక్కర్లేదు.
ఒక దాని కంటే మరొకటి ఇంకా అధ్వాన్నమని చెప్పడం.

ఒంతునొచ్చింది గెంతితే తప్పుతుందా 
కర్మ వశాన జరగాల్సింది జరిగే తీరుతుంది కాని తప్పించుకోలేమని.        

ఎద్దెప్పుడూ ఒక పక్కనే తొంగోని ఉండిపోద్దా?
తొంగోవడమంటే పడుక్కోవడం.కాలమెప్పుడూ ఒకేలాగ ఉండదని చెప్పడం

లోపల ఊష్టం... పైకి నేస్తం..
ఊష్టమంటే ఉష్ణము. లోపల ఉడికి పోతూ పైకి స్నేహం నటించడమన్నమాట

సుడొక దెగ్గిర... సురకొక దెగ్గిర
సురకంటే చుట్టకాల్చి వాత పెట్టడం.  కొన్ని వ్యాధులకి  చురక పెట్టడమే మందు అని భావిస్తారు. వ్యాధి ఒకటైతే మందు మరోదానికి వేసినట్టు.
జరిగినమ్మ జల్లిడితోని నీళ్లు మోసిందట
జల్లిడి అంటే జల్లెడ ( seive)  కన్నాలుంటాయి కనుక నీళ్లు నిలవ్వు. కొందరేంచేసినా చెల్లుతుంది. అడిగే వాళ్లుండరు. అలాంటి అమ్మే జరిగినమ్మ.
ఈ సందర్భంలోనే మరో సామెతజరిగితే జొరమంత సుఖం లేదు.--  చేసే వాళ్లుంటే వెచ్చగా కప్పుకుని పడుక్కోవచ్చు కదా ?
పెసరగుడ్డిల పారీసి ఉప్పు దాకల ఎతకడం.
గుడ్డి అంటే పొలం. దాక అంటే  వెడల్పు మూతి కుండ.. ఒకచోట పారేసి మరోచోట వెతుక్కోవడమన్నమాట, వృథా ప్రయాస అని అర్థం.

గడియ తీరదు... గవ్వరాదు
క్షణం తీరిక లేకుండా పని చేసినా రాబడి లేక పోవడం.. గవ్వలు మరీ పాతకాలంలో చిన్న డబ్బుకింద చెలామణీ అయేవి.

కరువుకి దాసర్లైతే పాట కుదరొద్దా?
కరువు వచ్చి భుక్తి గడవక  దాసరి వేషం వేసుకున్నాడట. ఎవరైనా ఇన్ని గింజలు వేయక పోతారా అని. వేషమైతే వేయొచ్చు కాని దాసరి పాడే పాట పాడడం రావొద్దా?  దాసర్లు పాడుకుంటూ వెళ్తుంటే అడక్కుండానే ఆయన జోలి నింపుతారు ఊరివాళ్లు.
నాలిక మీదే బూరెలు వండడం.
లేని ఆశలు కల్పించడం. నాలిక మీదే బూరెలు వండితే తినడమే తరువాయి అన్నట్టు. ఆది జరిగే పని కాదు కదా?
ఈక పండితే అందరూ ఇల్లాళ్లే
వృద్ధ నారీ పతివ్రతా అన్నది ఆర్యోక్తి. ఈక పండడం అంటే తల నెరియడం. వయసు మీరడం. Compulsive chastity అన్న మాట.
సరసుడ్ని నమ్మి పురుసుడ్ని పొయిలో పెట్టేసినట్టు
పురుషుడంటే మగడు.. సరసుడి మాయలో పడి మొగుణ్ణి వదిలించుకున్నట్టు
ముల్లుకి మొనలెవరు దిద్దుతారు.
ముల్లు మొనదీరి ఉండడం దాని సహజగుణం. కొన్ని విషయాలు సహజంగానే అబ్బాలనీ నేర్పిస్తే వచ్చేవి కావనీ చెప్పే సందర్భంలోనిది.
కొకిలమ్మకెవడు పాట నేర్పెనూ.. చేప పిల్లకెవడు ఈత నేర్పెనూ అని కదా సినీ కవిగారన్నారు?
దండుక్కి ఒప్పుకుంతారు గానీ దరమానికి ఒప్పుకోరు.
దండుగ అంటే పన్ను.(Tax-levy)  ధర్మం చేయడానికి చేతులు రాక పోయినా పన్ను కట్టక తప్పదు కదా?
ఇంటి మునోకట సూత్తే ఇల్లాల్ని సూడక్కర్లేదు.
 మునోకట అంటే ముని వాకిటఇంటిముందరి వాకిలిలో. అక్కడ చక్కగా అలికి ముగ్గు పెట్టి ఉంటే ఇల్లాలు పనిమంతురాలని తెలిసి పోతుంది.
కూటిల పాలు పోయనోడు కాటిల గేదని కట్టేసినాడట.
బ్రతికుండగా ఏమీ చేయని వాడు చచ్చేక ఏంచేస్తాడని ఎగతాళి.
కనపడిందానికి గట్టెక్కి సూడ్డమేల?
ముంజేతి కంకణానికి అద్దమేల అని అనడం. ఎదురుగా కనిపిస్తుంటే ఇంకా ఎత్తుకి పోయి చూడాల్సిన పనేముంది?
బతికి సెడినోల్లకి బాదలు లావు. సెడి బతికినోల్లకి సేస్టలు లావు.
ఉత్తరాంధ్రలో లావు అంటే ఎక్కువ అని అర్థం.  బాగా బ్రతికి చెడిన వారికి బ్రతుకు దుర్భరమేకదా?    సెడి బతికినోల్లకిఅంటే హీన స్థితి నుంచి పైకొచ్చిన వారికి నడమంత్రపు సిరితో షోకులు ఎక్కువే అవుతాయి.  ( అర్థ రాత్రి గొడుగు పట్టమన్నాడని సామెత కదా?)
ఇదంసెడి ఈటీవోడికిస్తే సచ్చీదాకా సాపలమోతే.
విధము చెడి అంటే గత్యంతరం లేక ఈటీ వోడికి అంటే వీటివిద్యలు చేసుకుని బ్రతికే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె బ్రతుకంతా చాపలు మోసుకుంటూ ఊళ్లు తిరగడమేనని భావం.

ఇలా మరికొన్ని సామెత లున్నాయి గానీ ఓ రెండు కొత్త సామెతలు చెప్పి ఆపేస్తాను.
 ఆఫీసోల్లు పని చెయ్యడమంటే అసిరమ్మ పిల్లలు కాసినట్టే
రెండూ జరగని పనులే అని చెప్పడం. గవర్నంటు ఆఫీసుల పని తీరుపై చురక.
పోలీసు కేసు... కోడి పియ్య బంక
పియ్య అంటే మలం. కోడి పియ్య కోడి విసర్జించిన మలం.  బంక అంటే Gum. కోడి పియ్య Sticky గా Fevicol లాగుండి ఒకంతకి వదలదన్న మాట. పోలీసుల కేసులూ అంతే కదా. ఒక సారి ఇరుక్కుంటే బయట పడ్డం కష్టం
( పియ్య అనే పదం మా ఉత్తరాంధ్ర పదం అనుకోవద్దు.పియ్య తినెడి కాకి పితరుడెట్లాయెరా అంటాడు కడప జిల్లా వాసి యైన వేమన గారు.)
ఆఖరుగా ఓ చిన్న ముచ్చట చెబుతాను. మా చిన్నప్పుడు మేము ఎవరితో నైనా స్నేహం చేసినప్పుడు  “ నువ్వూ నేనూ జట్టు..కోడి పియ్యట్టు అనుకుంటూ ఉండేవాళ్లం.  చిన్నప్పుడనుకునే వాణ్ణి ఛీ కోడి పియ్యతో అట్టేమి టని, కాని దానర్థం  ఇప్పుడు  బోధ పడింది.   కోడి పియ్యతో అట్టు వేస్తే దాన్ని  ఎవరూ పెనం నుంచి వేరు చేయలేరు. ఆ విధంగా మా స్నేహం (జట్టు) విడదీయరాని బంధ మన్నమాట. చూసేరా ఒక్క సామెతతో ఎంత గట్టి బంధాన్ని ఏర్పరచుకున్నామో? అదీ సామెతల సొగసు.

మా ఉత్తరాంధ్ర పలుకుబళ్ల గురించి మరోసారి రాస్తాను. ఇప్పటికి సెలవు. 










 

  
                       



















 

22, అక్టోబర్ 2011, శనివారం

నేనూ..మా ఊరూ..

                    

                   1941.
ద్వితీయ ప్రపంచ మహా సంగ్రామం జరుగుతున్న సమయం.  అన్నిటికీ ప్రజలు చాలా ఇబ్బందులు  పడుతున్న రోజులు.  అదిగో అలాంటి క్లిష్ట సమయంలో నేను  ఆ సంవత్సరం సెప్టెబరు 12 వ తేదీన పుట్టాను. ( మా నాన్నగారు  మొదటి ప్రపంచ యుధ్ధం  సమయం ( 1915 ) లో పుట్టారట. జనం అదృష్టం బాగుండబట్టి నాకు కొడుకులు పుట్టలేదు. ఆ విధంగా మూడవ ప్రపంచ యుద్ధం జరుగ కుండా ఆగిందేమో? )

నేను పుట్టింది పార్వతీపురంలో. ( పార్వతీపురం మా తాతల నాటి నుండి మా స్వగ్రామం. నేను మా నాన్నగారికి ప్రథమ సంతానం. ఆనవాయితీ ప్రకారం  నా జననం మా మాతా మహుల ఇంట్లో జరగాలి. అప్పట్లో మా మాతామహులైన లక్ష్మణ మూర్తి గారు గవర్నమెంటు  సర్వీసులో డాక్టరుగా ఉంటూ బదిలీల మీద ఊళ్లు తిరుగుతూ కర్నూలు జిల్లాలోనో అనంతపురంజిల్లా లోనో ఉండేవారు. సరిగా తెలియదు గాని, యుధ్ధ సమయం కావడం వల్ల దూరాభారం ప్రయాణం కష్టమని భావించడం వల్లనో ఏమో నా ప్రసవానికి మా అమ్మ పుట్టింటికి పోలేదు. మరొక కారణం నేను  విన్నది--. గర్భిణీ  స్త్రీలు చుక్క కెదురుగా ప్రయాణం చేయ కూడదనే ఆచారం ఒకటి ఉండడం. దీనిని చుక్కెదురు అని వ్యవహరించే వారు. చుక్క అంటే శుక్రుడు. శుక్ర గ్రహం పడమటి దిక్కున కనిపిస్తుంది కనుక ఆ దిక్కు గా పయనించ రాదని నియమం. మా ఉత్తరాంధ్రకి  ఆ జిల్లాలు పడమట దిక్కున ఉన్నట్టే భావించే వారు. అసలు జిల్లాలు దాటి సంబంధాలు చేసుకోవడానికే ఇష్టపడేవారు కాదు. అందువల్ల మాతా మహుల ఇంట్లో ఎక్కడో పుట్టాల్సిన నేను  మా పార్వతీ పురంలోనే  పుట్టాను..)

 నేను పుట్టినప్పటికి మనకి స్వాతంత్ర్యం రాలేదు. మరో ఆరేళ్ల తర్వాత 1947 ఆగష్టులో వచ్చింది.. నేను పుట్టింది అప్పటి బ్రిటిష్ ఇండియా లో ఉన్న మద్రాసు ప్రోవిన్సులో గంజాం జిల్లాలో.  మా పార్వతీపురం ఆ జిల్లాలో ఒక తాలూకా కేంద్రం.
అంచేత నేను ఒక బ్రిటిష్ కోలనీ లో పుట్టి తర్వాత స్వతంత్ర  భారతావనిలో పెరిగానన్న మాట. మనకి స్వాతంత్ర్యం వచ్చేక  ఒరిస్సా రాష్ట్రం  ఆవిర్భవించినప్పుడు మా వూరు గంజాం జిల్లానుంచి  విశాఖ జిల్లాలోకి వచ్చింది. అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది.  1953 లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత 1956లో  హైదరాబాదు రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాయి. విశాఖ  జిల్లా చాలా పెద్దది కావడం తో దాన్ని  విశాఖ శ్రీకాకుళం జిల్లాలుగా విడదీసారు. అప్పుడు మా వూరు శ్రికాకుళం జిల్లాలో ఉండేది.  తరువాత మళ్ళీ ఈ రెండు జిల్లాలనూ పున వ్యవస్థీకరిస్తూ ( 1979లో )  విజయనగరం జిల్లాను ఏర్పరిచారు. ఈ  విజయనగరం జిల్లాలోనే ప్రస్తుతం మా పార్వతీ పురం ఒక తాలూకా (మండల) కేంద్రంగా విరాజిల్లుతోంది. దాదాపు 1962 వరకూ మేజర్ పంచాయితీగా ఉన్న మాగ్రామం మునిసిపాలిటీయై ఇప్పుడు గ్రేడు 1 మునిసిపాలిటీగా చెలామణీ అవుతోంది.

                               1796 లో బెలగాం పేరుతో వెలసిన మన్య సంస్థానానికి మావూరు ముఖ్య పట్టణం. జయపురం సంస్థానాధీశులు మా ఊరి చుట్టు పక్కల నున్న పధ్నాలుగు గ్రామాలతో కలిపి ఈ మన్య సంస్థానాన్ని ఏర్పరిచేరట. ఈ ఊరికి ఆ జమీందారీ కుటుంబం లోని ఒక ప్రముఖ వ్యక్తి అయిన పార్వతమ్మ పేరు పెట్టుకున్నారట. (ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఒక చోట ఈ ఊరు గజపతుల వంశానికి చెందిన పార్వతీ దేవి  పేరిట వెలిసిందని రాసేడని చదివినట్టు గుర్తు.) ఏది నిజమో తెలియదు. 

 నేను పుట్టినప్పటికి మా ఊరు పెద్ద గ్రామమే. కానీ ఆరోజుల్లో  ఊరు అధ్వాన్నంగానే ఉండేదనే చెప్పాలి.  . మెయిన్ బజారులో కానీ మరెక్కడ కానీ తారు రోడ్లు లేవు. విద్యుద్దీపాలు లేవు. మంచి నీటి సరఫరా లేదు. మెటల్ రోడ్లు ఉండేవి. వాటిని మెట్లంగి రోడ్లనే వారు. రోడ్లకిరువైపులా కుళ్లు కాలువలుండేవి.(ఇప్పుడూ ఉన్నాయి. కానీ ఇప్పుడు సిమెంటు రోడ్లు వచ్చేయి). అయితే ఆరోజుల్లో ఊళ్లన్నీ అలాగే ఉండేవి. నేను బాగా చిన్నప్పుడు కరంటు లేదని చెప్పాను కదా. వీధిలో మా ఇంటికెదురుగా ఒక దీపస్థంభం ఉండేది. దాని మీద చిమ్నీ దీపం దాని చుట్టూ నలుపలకల అద్దాలు మీద నగిషీ  మూతా ఉండేవి,  రోజూ సాయంత్రం పంచాయతీ వారి మనిషి ఒకరు వచ్చి దీపం చిమ్నీని శుభ్రంగా కచ్చికతో తుడిచి కిరసనాయిలు పోసి దీపాన్ని వెలిగించే వాడు. అది వెలిగినంత సేపే మా వీధికి వెలుగు. ఇళ్లల్లో కూడా కిరసనాయిలు దీపాలే గతి. మేం కాస్త ఉన్న వాళ్లమే కనుక ఓ అరడజను చిమ్నీ లాంతర్లు,బుడ్డీ దీపాలు వెలుగుతూ ఉండేవి, మా చదువులన్నీ ఆ దీపాల వెలుగులోనే . అయితే 1948 నాటికి ఊళ్లోనూ  1951 నాటికి మాయింట్లోనూ విద్యుద్దీపాలు వచ్చేసాయి.
 మా యింటికి రెండు ఫర్లాంగుల దూరంలో పాత్రుడు కోనేరనే చెరువు ఒకటుండేది. ఇది కాక రాయఘడ పోయే రోడ్డులో అగ్రహారం కోనేరనే మరో  చెరువు ఉండేది. వీటి నుంచే అందరూ తాగడానికి కావల్సిన నీళ్ళన్నీ తెచ్చుకునే వారు. వేరే చెరువులు కూడా ఉన్నా ఆ నీళ్లు తాగడానికి వాడే వారు కారు. ( ఇప్పుడైతే ఆ చెరువుల నీళ్ళు తాగి ఎలా బతికి బట్ట కట్టేమో అనిపిస్తుంది ).  బ్రాహ్మణ స్త్రీలు స్నానం చేసి ఆ తడి బట్టలతోనే మడిగా శుభ్రంగా తళతళలాడుతూ మెరుస్తున్నట్టు తోమిన ఇత్తడి బిందెలతో నీళ్లు మోసుకొచ్చేవారు. ఆ సమయంలో అస్పృశ్యులు ఎదురైతే ఆ నీళ్లు మడికి పనికి రావని భావించే వారు. ఆ నీళ్లు పారబోసి మళ్లా వెళ్లి తెచ్చుకునే వారు. 1964 నుంచి అరకొరగానైనా మంచినీటి సరఫరా జరుగుతోంది.
 ఆ రోజుల్లో వర్షా కాలంలో రోడ్లమీద  అరడుగు మందాన బురద ఉండేది. ఎక్కడ జారి పడతామో అని భయపడుతుండే వాళ్ళం. ఇప్పుడు  సిమెంటు రోడ్లు తారు రోడ్లు వచ్చినా పారిశుధ్యం మెరుగు పడిందని అనలేము. ఇక్కడో చిన్న ముచ్చట చెప్తాను.
మా చిన్నప్పుడు   సాయంత్రం టౌన్ రైల్వే స్టేషను వైపు  షికారు వెళ్ళే వాళ్లం. ఆ  దారిలోనే  మా ఊరి పంచాయతీ ఆఫీసు ఉండేది. ఆ ఆఫీసు నేమ్ బోర్డు కూడా
గుమ్మం పక్కనే నేలమీదే నిలపెట్టి ఉండేది. దాని నిండా దుమ్ము పట్టి ఏ అక్షరాలూ కనిపించకుండా ఉండేది.  నేనప్పుడు హైస్కూల్లో  ఏదో చిన్న క్లాసే చదువుతూ ఉండే వాడిని. నాకో చిలిపి ఆలోచన వచ్చి  నా వేలితో ఆ పేరుకు పోయిన దుమ్ము మీద  బోర్డు తుడవలేని  పంచాయితీ రోడ్లేమి తుడుస్తుందని రాసేను. నేను రాసినది చాలా స్పష్టంగా  వచ్చింది.  ఆ మరునాడు ఆదారిలో వెళ్తూ చూస్తే బోర్డు, ఆ చుట్టు పక్కల రోడ్డూ శుభ్రంగా తుడిచి ఉన్నాయి.  ఆతర్వాత కథ మళ్ళా మామూలే ఆనుకోండి.

మా ఊరి మైన్ బజారు రాయఘడ ( ఒరిస్సా) పోయే రోడ్డు జంక్షను నుండి సుమారు అర కిలోమీటరు పొడుగున ఉత్తర దక్షిణంగా ఉండేది. అక్కడ పడమటినుంచి తూర్పుకు ప్రవహిస్తూ వస్తున్న గెడ్డ ఒకటి రోడ్డుకి అడ్డం రావడంతో రోడ్డుపై పెద్ద కల్వర్టు కట్టేరు. (వాగుల్ని మా ప్రాతంలో గెడ్డలంటారు). మాఊరు టౌను ఈ కల్వర్టు వరకే ఉండేది. ఈ కల్వర్టుని పెద్ద ఖానా అనే వారు. దాని దగ్గరనుంచి సుమారు రెండు పర్లాంగులు ఆగెడ్డ రోడ్డుకిరువైపులా ప్రవహిస్తూ అక్కడనుండి రెండు పాయలూ కలిసిపోయి తూర్పుదిక్కుగా ప్రవహించేది. దీని వల్ల అక్కడ ఊరు ఉండేది కాదు. మరికొంతదూరం పోయేక  మళ్లా ఊరు ఉండేది, దీన్ని బెలగాం అంటారు. మా టౌన్ లో వాణిజ్య సముదాయాలూ అవీ ఉంటే బెలగాంలో ఆఫీసులూ కోర్టులూ జైలు పెద్ద పోస్టాఫీసు హాస్పిటలూ పెద్ద రైల్వేస్టేషనూ హై స్కూలు అవీ ఉండేవి. ఆవిధంగా మా వూరు చిన్నసైజు జంట నగరాలని తలపింపజేస్తూ ఉండేది
టౌన్లో టౌన్ రైల్వే స్టేషను   చిన్న హాల్టు స్టేషనుగా ఉండేది. మా ఊరినుంచి అటు విశాఖ పట్నం వైపు  ఇటు ఒరిస్సాలోని రాయపూర్ వైపు  రోజుకు రెండు చొప్పున
మొత్తం నాలుగు  పాసింజరు రైళ్లు మాత్రం నడిచేవి.మా ఊరినుంచి విశాఖకి సుమారు 150 కిలోమీటర్ల దూరానికి 5 గంటలపైగా సమయం పట్టేది.  విశాఖ పట్నానికి 2 రూపాయల 13 అణాలు టిక్కట్టు ఉండేది. ఆ పాసింజరు రైళ్లు కూడా చాలా చిన్నవి. 6, 7 పెట్టెలు మాత్రం ఉండేవి. ఆ రైళ్లలో మూడు తరగతులుండేవి. మూడవ తరగతి పెట్టెలో సామాన్యులందరూ ప్రయాణం చేసేవారు. పొడుగ్గా నాలుగు వరుసల్లో చెక్కబెంచీలండేవి. రెండవ తరగతి పెట్టెల్లో అలాగే బెంచీ లే ఉన్నా కుషన్లు ఉండేవి.  వాటిని పరుపుల పెట్టె లనే వారు. కాస్త ఉన్నవారూ రైల్వే పాసులున్నవారూ వాటిల్లో ప్రయాణం చేసేవారు. ఫస్టు క్లాసు పెట్టెలు ఇప్పటివాటిలాగే ఉండేవి. రైళ్లకి ఆవిరి ఇంజన్లు ఉండేవి.  మాచిన్నప్పుడు చిన్న పిల్లలకి పాలు కలుపు కోవడానికి వేడినీళ్లు కావలసి వస్తే ఇంజను దగ్గరకి పోయి డ్రైవరుని అడిగితే మా మరచెంబులోకి కావలసినన్ని వేడి నీళ్లు వదిలేవాడు. రైలు కదులుతూ ఉంటే రైలు వెళ్తున్నప్పుడు బొగ్గు నలుసులు ప్రయాణీకుల కళ్లల్లో పడి కళ్లు మండిపోతుండేవి. మనిషిని చూస్తే రైలు ప్రయాణం చేసి వచ్చేడని ఇట్టే తెలిసి పోయేది. మా ఊరి మీదుగా వెళ్లే రైల్వే ని  బి.ఎన్. ఆర్ రైల్వే అనే వారు. దానర్థం బెంగాల్ నాగపూర్ రైల్వే అని. ఆ రైలుకూత కూడా భయంకరంగా ఉండేది. మా చిన్నప్పుడు ఎవరైనా బొంగురు గొంతుకతో గట్టిగా మాట్లాడే వారిని బీయన్నార్ గొట్టాం అనే వారు ఆ రైలు కూతతో పోలుస్తూ.
రైళ్లు తక్కువగా ఉండడంతో బస్సులమీదే ఆధార పడేవారు. ఆ బస్సులు కూడా అంతంత మాత్రమే. ఇప్పటిలా ఎక్స్ ప్రెస్ బస్సులూ లేవు. అవి ఎక్కువ దూరాలకి వెళ్లేవీ కావు. విశాఖ పట్నంవైపు బస్సులు విజయనగరం వరకు మాత్రమే వెళ్లేవి. శ్రికాకుళం సాలూరు రాయగడ రూట్లలో బస్సులు తిరిగేవి. అన్నీ ప్రయివేటు బస్సులే. ఆప్పటికి బస్సు రూట్ల జాతీయం జరుగలేదు. ( 1956 లో బస్సురూట్ల జాతీయం చేసిన నీలం సంజీవ రెడ్డిగారికి హైకోర్టు అక్షింతలు వేసిన సంగతి గుర్తు చేసుకోండి.)  నాచిన్నతనంలో బొగ్గుతో నడిచే బస్సులు కూడా చూసేను. బస్సు వెనుకవైపు బొగ్గు మండుతూ యమ వేడిగా ఉండేది, కానీ అనతి కాలంలోనే అవి పోయి డీజిల్ బస్సులు వచ్చేయి. అవి ఇప్పటి మాదిరి పెద్ద బస్సులు కావు. కొంచెం చిన్నగా ఉండేవి. సెల్ఫు స్టార్టరు ఉండక పోవడంతో  Z ఆకారంలోని  Iron rod పెట్టి ఇంజను తిప్పి Start చేసేవారు. సీటింగ్ కూడా తమాషాగా ఉండేది. డ్రైవరు పక్కన ఒకరిద్దరు కూర్చోడానికి ఉండేది ఫ్రంటు సీటు. దాని తర్వాత సెపరేటు డోరుతో రెండు వరసల్లో ఎదురెదురు సీట్లు ఉండేవి. వీటిని సెకండు సీట్లు అనేవారు. ఆ వెనుక భాగ మంతా చుట్టూ సీట్లతో మధ్యలో సామాను పెట్టుకోవడానికి ఖాళీ స్థలం ఉండేది. ఇవి జనతా సీట్సన్నమాట. థర్డ్ సీట్లనే వారు. ఆడవారూ పిల్లలూ అతి సామాన్యులందరూ  ఈ థర్డ్ సీట్ల లోనే కూర్చోవాలి. సెకండు సీట్లలో కాస్తా నాజూకు మనుషులూ చదువు కున్న వారూ ఎక్కాలి. ఇక ప్రంటు సీటు వి.ఐ.పి సీటన్న మాట. పెద్ద ఉద్యోగస్తులకీ పోలీసు వారికీ రిజర్వు చేసి ఉంచేవారు. పెద్దలెవరూ లేకపోతే నాబోటి టీచర్లకి కూడా ఫ్రంటు సీట్లో కూర్చుని ప్రయాణం చేసే మహద్భాగ్యం కలుగుతూ ఉండేది. నేను టెంపరరీగా వేరే ఊళ్లో హైస్కూల్లో పని చేసిన ఒక్కసంవత్సరంలోనూ అలా ఫ్రంటు సీట్లో కూర్చుని ప్రయాణించే మహద్భాగ్యం చాలా సార్లే కలిగింది. దానికి కారణం  ఆ బస్సుకి పెద్దలెవ్వరూ రాకపోవడమేనని వేరే చెప్పనక్కర లేదు కదా.
 ప్రయివేటు బస్సులు కావడంతో వాటి మధ్య పోటీ ఎక్కువ గానే ఉండేది. ఈ పోటీ ఎలాఉండేదో చెబుతాను. మా ఊరినుండి శ్రికాకుళానికి పొద్దున్నే 4 బస్సులుండేవి ఫస్టు బస్సు 4గంటలకి సెకండు బస్సు నాలుగున్నరకి, మూడోది మరో అరగంట తర్వాత అలా. నాలుగూ బస్టాండులోనే ఉండేవి. ఫస్టు బస్సు సరిగా నాలుగ్గంటలకి బయల్దేరక పోతే రెండో బస్సు వాళ్లు నానా గొడవా చేసి బస్సులోనే వారిని ఊరి పొలిమేర వరకూ తరిమి కొట్టి తిరిగి వచ్చేవారు. ఈ తతంగం రోజూ జరిగేది. ఈ బస్సులు చాలా నింపాదిగా వెళ్తూండేవి. బస్సు డ్రైవరు అటూ ఇటూ చూసుకుంటూ పాసింజర్లకోసం వెతుకుతూ నడిపేవాడు. అల్లంత దూరాన పొలాల్లో ఒహోయ్ అని కేక వినిపిస్తే చాలు వారు వచ్చేవరకూ బస్సు ఆపి కూర్చునే వాడు. ఇది అలవాటైపోయిన ప్రజలు కూడా పెద్దగా విసుక్కునే వారు కాదు. దారిలో ఎక్కాల్సిన తోటి ప్రయాణీకుల  అవసరాల్ని కూడా గుర్తించే వారనుకుంటాను.ఇప్పుడు ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సులు రావడంతో ప్రయాణ సమయం సగానికి సగం తగ్గింది. బస్సుల సీట్లూ సుఖంగా ఉన్నాయి.

 మా ఊరి హైస్కూలు అప్పటికే చాలా పెద్దది. పురాతనమైనది. బెలగాం లోఉండేది.  ( గుర్తుందా?--   కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాని తమ పెద్దన్న దిబ్బావధాన్లు కొడుకుని  ఇంగ్లీషు చదువులకి పార్వతీపురం పంపించేరని చెబుతాడు. అది 1910. అంటే అప్పటికే ఈ హైస్కూలుండేదన్నమాట.)  ఉదయం మధ్యాన్నం రెండు పూటలా బడి నడిచేది. ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ తిరిగి మధ్యాన్నం రెండునుంచి నాలుగు వరకూ.  పిల్లలము ఎక్కువ మందిమి టౌన్లోనే ఉండే వారము కనుక సుమారు 2 కిలోమీటర్లూ రోజుకి నాలుగు సార్లు నడవాల్సి వచ్చేది. ఎంత ఎండైనా వానైనా చాలాకాలం ఎవరికీ కాళ్లకి చెప్పులు ఉండేవికాదు. ఎవరూ ఆ విషయం పట్టించుకునే వారూ కాదు బాధ పడే వారూ కాదు. అటువంటి సాదా సీదా జీవితం గడిపే వారు అందరూను.  మేము సెకండుఫారం ( 7 వ క్లాసు) లో ఉండగా టౌన్లో హైస్కూలు బ్రాంచి పెట్టారు.. ఈ బ్రాంచిస్కూలు మాపెరటి వెనుకనున్న వీధిలోనే ఉండేది. అందువల్ల నడక శ్రమ తగ్గిపోయింది.
ఇందాక మా ఊరి మైన్ బజారు రాయగడ రోడ్ జంక్షను నుండి ప్రారంభమయి ఉండేదని చెప్పాను కదా. రాయగడ వైపు వెళ్లే రోడ్డులో అప్పటికి ఎక్కువ ఇళ్లు ఉండేవి కావు. ఆజంక్షను నుండి తూర్పుగా ఓ వంద గజాల్లో అప్పటి మా ఊరి బస్టాండు ఉండేది.  పేరుకి బస్టాండే కాని బస్సులన్నీ పెద్ద రావి (లేక మర్రి) చెట్టు నీడనే ఆగేవి. అదే బస్టాండు. దానికెదురు గానే ఆంధ్రాబేంకు ఉండేది. మా ఊళ్లో మొట్ట మొదటి బేంకు అదే. ఆ బేంకు మా తాతగారు కట్టించిన ఇంట్లోనే అద్దెకుండేది. ముందు బాగంలో బేంకు. వెనుక బేంకు ఏజంటుగారి వసతి. మొదట్లో కొన్నాళ్లు మా చిన్నాన్నగారు ఆ బేంకులో పని చేసేవారు. అప్పట్లో బేంకుకు ట్రాన్స్ ఫర్ మీద వచ్చిన వారు వారి కుటుంబాలు వచ్చే వరకూ మాయింట్లోనే భోజనం చేసేవారు..
బస్టాండు దాటేక  కట్టెల దుకాణాలు,  సా మిల్లు అవి దాటేక సాని వీధి ఆ తరువాతసినిమా హాలు,  తరువాత టౌను రైల్వే స్టేషనూ ఉండేవి. ఆ సినిమా హాలే మాఊరిలో మొట్టమొదటి సినిమా హాలు, రేకుల షెడ్డులో ఉండేది. షెడ్డుకోసం వేసిన ఇనుప స్థంభాలు సినిమా చూడడానికి అడ్డం వస్తూ ఉండేవి. సింగిలు ప్రొజెక్టరుతో నడిచేది.  సినిమాల మీది వెర్రితో జనం ఆ అసౌకర్యాలని పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఈ హాలుని మొదట పూర్ణా ఫిలిమ్స్ మంగరాజుగారు కట్టించేరట. ఆ పూర్ణాటాకీసు యాజమాన్యం చేతులు మారుతూ పరమేశ్వరి, నవరత్నాగా మారాయి. ఈ సినిమా హాలు పూర్ణా వారి యాజమాన్యంలో ఉన్నప్పుడు ఆర్.నాగేశ్వర రావు మేనేజరుగా పనిచేసేవాడట. ఏవైనా గొడవలు వస్తే ఒక్కడే కర్రతిప్పుకుంటూ పది మందినైనా ఎదిరించే వాడట. ఆ తర్వాత రోజుల్లో అతడు సినిమాల్లో ప్రఖ్యాత విలన్ గా నటించిన సంగతి అందరికీ తెలుసు. ఈ ధియేటర్ లో నేలంటే నేలే., ఇసుక పరచి ఉండేది. తరువాత బెంచీ క్లాసు దాని వెనుక కుర్చీ క్లాసు ఉండేవి. కుర్చీ టిక్కట్టు ముప్పావలా. (అంటే 75 పైసలు). ఆ తరువాత 1955 ప్రాంతంలో రెండవదైన  వేణుగోపాల్ టాకీసు మా టౌనుకీ బెలగాంకీ మధ్యన పెద్దకానా దగ్గర వచ్చింది. దీనిలో బాల్కనీ  క్లాసు కూడా ఉండేది. నేల క్లాసులో బెంచీలుండేవి. టిక్కట్టు పావలా  (1/4 rupee).  బాల్కనీ క్లాసు టిక్కట్టు చాలాకాలం రూపాయి పావలా. చాలాకాలం  తరువాత  మరో నాలుగు సినిమా హాళ్లు వచ్చేయి.  
మా బజారు వీధి ఒక బస్సు పోయే వెడల్పు తో ఉండేది. ఇప్పుడు ఒరిస్సానుంచి వచ్చే నేషనల్ హైవే కావడంతో central meridian తో two way road  వేసారు. బజారు బాగా పెరిగింది. టౌను బెలగాములు కలిసి పోయేయి. ఈ రెండిటి మధ్యా గెడ్డ పారుతూ ఉండేదని చెప్పాను కదా. దాని మీద సిమెంటు స్లాబులు వేసుకుని షాపులూ  ఇళ్లూ కట్టేసారు. అందుకే నేమో మా చిన్నప్పుడు ఎప్పుడూ మాకు తెలియని వరదలు పార్వతీ పురాన్ని ముంచెత్తుతున్నాయని టీవీల్లో పేపర్లలో చూస్తున్నాము.
 ఎవరికీ కార్లుండేవి కావు. మొదట్లో రెండెడ్ల బళ్లేగతి. కొద్ది రోజులకే జట్కాలొచ్చేయి. మా ఫామిలీ డాక్టరు గారు జట్కా బండిలో వచ్చి ఇళ్ల దగ్గర కూడా పేషంట్లని చూసేవారు. అలా వచ్చినప్పుడు జట్కావానికో అర్థరూపాయి ఇచ్చే వాళ్లం. తరువాత కొద్ది రోజులకే సైకిలు రిక్షాలు వచ్చేయి. మనుషులు లాగే రిక్షాలు అంతకు ముందు రోజుల్లో విశాఖ పట్నంలో చూసేను కానీ  అవి మా ఊరికి రాలేదు.( వాటిని నిషేధించేరు). ఈసైకిలు రిక్షాల్లో మొదట్లో చాలా కాలం టౌన్లో ఈ చివరి సెంటరు నుండి బెలగాం వరకు గాని అట్నించిటుగాని మనిషికి  బేడ (  అంటే రూపాయిలో 8 వ వంతు-రెండణాలు) తీసుకునే వారు. ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగినా సరే. బేరాలుండేవి కావు.
ఊరిప్పుడు బాగాపెరిగింది. సౌకర్యాలు కూడా బాగా పెరిగాయి. బెలగాంలో ఆర్టీసీ  బస్టాండు కట్టేరు. సుదూర ప్రాంతాలకి కూడా ఎక్స్ ప్రెస్ బస్సులు రాత్రనక పగలనక తిరుగు తున్నాయి. ఎన్నో ఎక్స్ ప్రెస్  రైళ్లు కూడా తిరుగు తున్నాయి. ఊరి నిండా ప్రయివేటు కార్లు వచ్చేయి. మా చిన్నప్పుడు ఓ పది ఇరవై లోపే టెలిఫోన్లు ఉండేవి. ఫోన్ చేయాలంటే పోస్టాఫీసుకు వెళ్లి p.p కాల్ బుక్ చేయాల్సి వచ్చేది. అది ఎంతకీ కలిసేది కాదు. ఇప్పుడు కూర్చున్న చోటినుండి అమెరికా లో ఉన్న వాళ్లతో కూడా మాట్లాడుకుంటున్నారు.టూకీగా మా చిన్నప్పటి మా ఊరి గురించి చెప్పాను. ఇప్పటికిక్కడ ఆపి నా బాల్యం ఎలా గడిచింది, అప్పటి జనజీవనం ఎలా ఉండేది, ఆచార వ్యవహారాలు మొదలైన వాటిగురించి నాకు గుర్తుంన్నంత వరకూ మరోసారి చెప్తాను.  

సెలవు.

12, అక్టోబర్ 2011, బుధవారం

హలో..బాగున్నారా?ఏఁవిటి భోగట్టాలు? అసలీ" భోగట్టాల" కథేఁవిటి?


 అసలేఁవిటీ భోగట్టాల కథ ?

                                       మనం  తెలుగు వారం ఒకర్నొకరు కలుసుకున్నప్పుడు ఏమండీ బాగున్నారా ఏమిటి విశేషాలు అని అడగడం పరిపాటి.  ఈ కుశల ప్రశ్నలు అయ్యాక  ఇంకేమిటి సంగతులు  అంటూ సంభాషణ కొనసాగిస్తాం .శ్రీ కృష్ణుడు కూడా పడక సీనులో దొంగనిద్ర నటిస్తూ పడుకుని ఉన్నప్పుడు సహాయం కోరడానికి దుర్యోధనుడూ, అర్జునుడూ వచ్చినప్పుడు లేచి వారిని చూస్తూనే  బావా యెప్పుడు వచ్చితీవు, ఎల్లరునున్ సుఖులేకదా అంటూ వారి వారందరి కుశలమూ పేరు పేరునా కనుక్కుంటాడు.  ఇదే కాదు పాత కాలంలో ఉత్తరాలు రాసుకునే టప్పుడు కూడా మేము క్షేమం, మీరు క్షేమమని తలుస్తాను. ఉభయకుశలోపరి.. అంటూ రాసిన తర్వాతే మిగిలిన విషయాలలోకి వెళ్ళేవారం.బాగున్నారా అని అడిగిన తరవాత ఇంకేమిటి సంగతులు అని అడగడానికి మా చిన్నప్పుడు ఉత్తరాంధ్ర లో  ఇంకేమిటి భోగట్టాలు.. అని అడుగుతూ ఉండేవారం. ఇదేకాదు, ఎవరి దగ్గరనుంచైనా ఉత్తరం వచ్చిందంటే ఏమిటి భోగట్టాలు రాసేడు అని అడిగే వారు.  భోగట్టాలంటే ఏమిటి?    ఇది మా ఉత్తరాంధ్రలో వినిపించే మాండలికమా లేక వేరే భాషనుంచి మన తెలుగులో చేరిన పదమా అని నాకు సంశయం ఉండేది. మొన్న నీ మధ్య ఈ బ్లాగు లోనే నేను రాసిన  వెచ్చని పచ్చడం లేక పోతే పితలాటకమే అనే పోస్టుకు స్పందిస్తూ  కమనీయం బ్లాగరు తనకు మాండలికాల విషయంలో కొంత గందరగోళం ఉందని చెప్తూ ఒక విషయం రాసేరు. మా ఉత్తరాంధ్రలో వినిపించే భోగట్టాలాంటి మాటలు వారి అనంతపురం జిల్లాలో కూడా వినిపిస్తున్నాయని శ్రీ తూమాటి దొణప్పగారు అన్నారని తెలిపారు. ( కమనీయం బ్లాగు నిర్వహించే డాక్టర్ శ్రీ ముద్దు రమణా రావు గారూ శ్రీ తూమాటి దొణప్పగారూ చిన్నప్పటి సహాధ్యాయులే కాకుండా చిరకాల  మిత్రులు. శ్రీ రమణారావు గారు ప్రసిధ్ధ విశ్రాంత నేత్రవైద్యులు కవీ రచయితానూ, నాకు స్వయానా మేనమామగారు. తూమాటి దొణప్పగారిని ఈ మేనమామ గారింట్లోనే 1963లో ఒకసారి కలిసేను. అప్పట్లో ఆయన ఆంధ్రా యూనివర్శిటీలో తెలుగు వ్యుత్పత్తి పదకోశం తయారు చేయడం పని లోనే ఉండేవారని నాకు గుర్తు.  ఈ భాషా శాస్త్రవేత్త తర్వాత నాగార్జున యూనివర్శిటీ కులపతిగా కూడా పనిచేసి  కీర్తిశేషులైన సంగతి సాహిత్యకారులందరికీ తెలిసే ఉంటుంది).   దీని వల్ల తేలిందేమిటంటే ఈ పదం ఉత్తరాంధ్ర మాండలికం కాదని.  మరి ఇది తెలుగు లోకి వచ్చి చేరిన పార్శీ లేక ఉర్దూ పదమేమైనా అయి ఉంటుందేమో ననుకున్నాను గానీ అదీ కాదని తేలింది.  ( తెలుగు పై ఉర్దూ పారశీకముల ప్రభావము అనే  డా.శ్రీ కే. గోపాలకృష్ణ రావు గారి పరిశోధనా గ్రంథం తరచి చూసేను. నా వద్దనున్న సూర్యరాయాంధ్ర నిఘంటువు లోనూ శబ్దరత్నాకరంలోనూ ఈ పదం కన్పించ లేదు. ( నా వద్ద ఏ వ్యుత్పత్తి పదకోశమూ లేదు. అందుచేత  ఈ పదం వాటిల్లో ఉందో లేదో ఉంటే ఏ వ్యుత్పత్తి ఇచ్చారో తెలీదు). అయినా నాకు ఇప్పుడు తోచిన విషయం రాస్తున్నాను.  చిత్తగించండి:
భోగః  అనే సంస్కృత పదం తెలుగులో భోగము ఆనే తత్సమ పదంగానూ బోగము అనే వికృతి పదంగానూ కనిపిస్తుంది. దీనికి వేరే అర్థాలున్నా విశేష ప్రాచుర్యం గల అర్థం సుఖము అని.
                           సుఖాలంటే ఈ రోజుల్లో ఎన్నో కార్లు బంగ్లాలు బేంకు ఖాతాలు లాంటివని సామాన్యుల భావన. మరి కొంతమంది  ఇంకొంచెం తెలివైన వారు స్విస్ బేంకు ఖాతాలు సొంత విమానాలూ బంగారపు భోజనపు బల్లలూ కుర్చీలూ
ఉంటేనే సుఖమని పొరబడి ఏవో ఊచలు లెక్కపెడుతున్న సంగతి మనకు తెలిసినదే. అయితే మన సంప్రదాయం ప్రకారం మనకి సుఖాలంటే ఎనిమిది మాత్రమే.  అవి-
గృహము, శయ్య, వస్త్రము, ఆభరణము, స్త్రీ, పుష్పము, గంధము, తాంబూలము.---
ఇంతకుమించిన సుఖాలు లేవు.  ( మనకి కష్టాలు కూడా ఎనిమిదే నండోయ్. అష్ట కష్టాలనే కద అన్నారు)
సరే. భోగట్టాలో భోగమంటే సుఖమని తేలిందికదా. అష్ట   అట్ట అయ్యింది. భోగట్టమంటే ఎనిమిదిసుఖాలూ లేక అష్టసౌఖ్యాలూ అన్నమాట. మీ భోగట్టాలు ఏమిటని అడగడమంటే మీకు ఏ లోటూ లేకుండా అన్ని సుఖాలూ అమిరి ఉన్నాయికదా అని అడగడమే. క్షేమ సమాచారాలు కనుక్కోవడమే. దీని అసలు అర్థం తెలియని వారి వాడుకలో ఇదే రాను రానూ మిగిలిన విషయాలమాటేమిటి అనేఅర్థంలో వాడబడుతూ విస్తృతార్థాన్ని సంతరించుకుంది..
 ( ఇది కేవలం నా ఊహ.బాగుందా? సరైనది కాదని  ఎవరైనా చెబితే దిద్దుకోవడానికి సిధ్ధంగా ఉన్నాను.. సెలవు.

5, అక్టోబర్ 2011, బుధవారం

ఆరుద్ర చెప్పిన డబ్బింగ్ పితామహుడు శ్రీశ్రీ ముచ్చట

                                  

            ఆరుద్ర                                                                            శ్రీశ్రీ                       



ఈ ముచ్చట ఓ యాభై ఏళ్ల కిందటిది. ఆప్పుడు నేను విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీలో చదువుకుంటున్నాను. ఆ కాలేజీకి నేను చదువుకుంటున్నరోజుల లోనే సెంటినరీ ఉత్సవాలు జరిగాయి. క్రితం సంవత్సరం 150 సంవత్సరాల వేడుక కూడా జరిగిందట. ఆఖరి నిమిషంలో తెలియడంతో నేను వెళ్లి పాల్గొన లేక పోయాను. అంతటి ఘన చరిత్ర గల కాలేజీలో చాలా చాలా మంది పెద్దలు చదువుకున్నారట. నోబుల్ బహుమతి పొందిన సర్. సివిరామన్ లాంటి మహామహులు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మనకి కావలసింది మహాకవి శ్రీశ్రీ కూడా అక్కడి కాలేజీ హైస్కూలు లోనే చదువుకున్నాడన్నది. ఆరుద్ర కూడా ఆవూరి వాడే. చిన్నప్పుడు ఆస్కూల్లో చదువుకున్నాడనుకుంటాను. ఏమయితేనేం వారిద్దరికీ ఆ కాలేజీ స్కూళ్లతో మంచి  సంబంధం ఉంది. ఆ కారణంచేతనే కావచ్చు నేను చదువుకుంటున్నరోజుల్లో ఒకసారి (బహుశ 58లేక59 లో అనుకుంటాను) ఆరుద్రని పిలిచి సభ పెట్టేరు. అప్పటికే ఆ యిద్దరూ ( వారిద్దరూ మేనమామ మేనల్లుళ్ళవుతారు) తెలుగు సినీరంగంలో లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు. సభానిర్వాహకులు సినిమాలగురించో శ్రీశ్రీ గురించో మాట్లాడ మన్నట్లున్నారు.
ఆరోజు ఆరుద్ర శ్రీశ్రీ గురించి మాట్లాడేడు.  మిగిలిన విషయాలు నాకు గుర్తులేవు కానీ ఆరుద్ర శ్రీశ్రీని డబ్బింగ్ పితామహుడనడమూ,  అప్పట్లో డబ్బింగ్ చేయడంలోని కష్టాలన్నీ వివరంగా విశదపరచడమూ గుర్తుంది. అప్పటికే ఆరుద్ర రాజ్ కపూర్ ప్రేమలేఖలుకి డబ్బింగ్  రచన చేసాడు.
                                    హిందీలోని నీర్ ఔర్ నందా తెలుగులోకి   ఆహుతి పేరుతో డబ్ చేయబడ్డ తొలితెలుగు సినిమా. దీనికి  తెలుగులో మాటలూ పాటలూ రాసింది శ్రీశ్రీ. ఆరోజుల్లో ఇప్పటిలా డబ్బింగ్ ధియేటర్లు లేవట. మూల భాష లోని సినిమాని చూస్తూ  పాత్రధారుల హావభావాలనూ పెదవుల కదలికలను చూస్తూ డబ్బింగ్ చెప్పే సదుపాయంకూడా లేదంటే ఎంతకష్టపడే వారో ఊహించుకోవచ్చు. ఈకష్టాల్నీ తన అనుభవాలనీ ఆచిత్రంలో ఒక పాత్రకి డబ్బింగ్ చెప్పిన, తరువాతి కాలపు కేరక్టర్ యాక్టర్, శ్రీ వల్లం నరసింహా రావుగారు               డబ్బింగూ దాని పుట్టపూర్వోత్తరాలూ అనే వ్యాసంలో రాసేరట.  టెక్నికల్ సాధక బాధకాలటుంచి రచనలో వచ్చే ఇబ్బందులగురించి ఆరుద్ర ఓ ముచ్చట చెప్పేరు. అదీఇది :
                                     ఢబ్బింగ్ రచనలో  చాలాముఖ్యమైన ఇబ్బంది.
మూలభాషలో కాని అనువదిస్తున్న భాషలో కాని ఔష్ఠ్యాలు వచ్చినప్పుడు వస్తుంది. ప ఫ బ భ మ లు పలికి నప్పుడు పెదవులు కలిసి నోరు మూసుకున్నట్లవడం మిగిలినప్పుడు నోరు తెరిచే ఉచ్చరించడం. మరీ ముఖ్యంగా క్లోజప్  షాట్లలో వస్తుందీ ఇబ్బంది. ఇటువంటి ఇబ్బందే ఒకసారి వచ్చిందట. ఓ హిందీ సినిమాలో హీరోయిన్ హీరోతో తాను గర్భవతి నయ్యానని తెలియజేస్తూ మై మా హూఁ   అంటుందట. ఖర్మంకొద్దీ అది హీరోయిన్ ముఖంమీద క్లోజప్ షాట్లో తీయబడింది.  ఈ చిన్ని డైలాగ్ కి తెలుగులో నేను గర్బవతిని అని ఎలా చెప్పించాలని రచయిత తలపట్టుక్కూర్చున్నాడట. అప్పుడు  శ్రీశ్రీ గారిని ఆశ్రయిస్తే ఆయన ఆగండం గట్టెక్కే ఉపాయం చెప్పాడట. మై మాహూఁ అనే చోట పాపాయి అని రాసుకోమన్నాడట. తరవాత హీరో హీరోయిన్ల  డైలాగుల్లో తనకడుపులో ఆతని పాపాయి పెరుగుతోందని  హీరోయిన్ చేత అనిపించేరట. అలా ఆ గండం గడిచిందట. అదీ కథ.  ఎంతైనా ఆయన డబ్బింగ్ పితామహుడుకదా?
( పైన ఉదాహరించిన వల్లంనరసింహారావు వ్యాసం గురించీ మరికొన్ని కబుర్లూ చెప్పిన మిత్రుడు శ్రీ వోలేటి శ్రీనివాసభానుకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను....)
సెలవు....

1, అక్టోబర్ 2011, శనివారం

రెండు గొప్ప కథలు...




కథలెక్కడనుంచి వస్తాయి?  ఆకాశం నుంచి ఊడి పడవు కదా?  ఈ నేల మీద పుట్టి పెరిగిన మనుషుల్లోంచి వస్తాయి. వాటిని రాసే వాడూ మనిషే. వాటిల్లోని పాత్రలూ మనుషులే.. జరిగిన ఏదో ఒక సంఘటనను చూసో లేక ఇలా కూడా జరిగి ఉండొచ్చునని ఊహించో రచయితలు కథలు రాస్తారు. ఆ కథలు చెప్పడానికి కూడా  నిజ జీవితంలోంచే పాత్రల్ని ఎన్నుకుంటారు. కాకపోతే తాము చెప్పదల్చుకున్న విషయానికి అవసరమైన కల్పనల్ని జోడిస్తారు. ఒక్కోసారి ఏ కల్పనలూ అక్కర లేకుండా జరిగిన సంఘటనలే అద్భుతమైన కథా రూపాన్ని సంతరించుకుంటాయి. వాటిల్లో రచయిత పైత్యం జొప్పించకుండా జరిగింది జరిగి నట్లు చెబితే చాలు మనకో గొప్ప కథ చదివిన అనుభూతి కలుగుతుంది. అదిగో అలాంటి అనుభూతిని నాకు కలిగించిన ఓ రెండు గొప్ప కథల్ని గురించి మీకు చెప్పబోతున్నాను.

( ఈ రెండు కథలూ కళలకి కాణాచియైన విజయనగరంలోనే జరిగాయి. మన మొట్టమొదటి తెలుగు కథ  దిద్దుబాటు కూడా ఇక్కడే పుట్టింది కదా?)

1919 లో విజయనగరం రాజు విజయరామ గజపతి సంగీత కళాశాలను స్థాపించేరు.( ఇది ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తున్న సంస్థ.) దీని మొదటి ప్రిన్సిపాలు హరికథా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు. వారితో పాటు ద్వారం వెంకట స్వామి నాయుడుగారు వాసా వారు మొదలైన హేమా హేమీలుండేవారు.  ఇదిగో ఇటువంటి  సంగీత కళాశాలలో దాసుగారికి సేవ చెయ్యడానికి  రామస్వామి అనే వ్యక్తిని  రాజుగారు నియమించేరు. ఈ రామస్వామి మరీ సామాన్యుడు కాడు. అతడు అంత వరకూ శ్రీ విజయరామ గజపతికి ఆంతరంగిక సేవకుడుగా ఉన్నవాడు.అతని ఉద్యోగం రాజు గారికి  వారి అభిరుచిమేరకు రకరకాల వైన్స్ కలిపి ఇవ్వడం. ఈ సేవలో రాజు గారితో పాటు అతడు అనేక ఉత్తరాది సంస్థానాలకి కూడా వెళ్లి వచ్చిన వాడు. ఇటువంటి ఆంతరంగిక సేవకుడ్ని సంగీత కళాశాలలో ముఖ్యంగా దాసుగారి సేవలకి రాజుగారు ఎందుకు నియమించేరో తెలీదు. బహుశః  రాజుగారితో తనకున్న చనువు మేరకు రామస్వామి అడిగితే నియమించేరేమో?. ఈ రామస్వామి మాత్రం సంగీత కళాశాలకూ అక్కడి విద్వాంసులైన వారికీ సేవలు చేసుకుంటూ ఉండే వాడు.
 రామస్వామి పరమ రామ భక్తుడు. తను దాచుకున్న కొద్దిపాటి సొమ్ముతోనూ ఆ ఊళ్లో ఒక రామ మందిరం కట్టించేడు.రోజూ తెల్లారకనే లేచి స్నానపానాదులయ్యేక గుడికి వెళ్లి పూజ చేసుకుని ప్రసాదం పంచుతూ కాలేజీకి వచ్చేవాడు.
 రామస్వామికి ఫిడేలునాయుడుగారంటే పంచప్రాణాలు. ఆయన సంగీతం కాలేజీ ప్రిన్సిపాలై రిటైరయ్యే వరకూ ఆయనదగ్గరే పనిచేసాడు.
ఈ ఫిడేలు నాయుడుగారింట్లో గురుకుల వాసం చేసుకుంటూ చాలామంది విద్యార్థులు ఉండేవారు. రోజూ శిష్యుల్లో ఒకరు బజారుకెళ్లి  నాయుడుగారింటికి కావల్సిన కూరగాయలు తెచ్చేవారు. వారు తెచ్చిచ్చిన చిల్లర సరిగా ఉందో లేదో సరి జూసుకొని కాని మరీ వాళ్లను వెళ్లమనేవారు కారు నాయుడుగారు. అయితే ఎప్పుడైనా రామస్వామిని పంపి కూరలు తెప్పించుకున్నప్పుడు మాత్రం  అతడిచ్చిన చిల్లర లెక్కజూసుకోకుండానే జేబులో వేసుకునే వారు. తమ మీద లేని విశ్వాసం రామస్వామి మీద నాయుడుగారికెందుకుందో తెలియక విద్యార్థులు ఈర్ష్య పడుతూ ఉండే వారు. ఉండబట్టలేక ఓ రోజు నాయుడుగార్నే ఈ సంగతి అడిగేసారు. అయితే వినండి అంటూ నాయుడుగారు వారికి చెప్పిన జవాబు ఇది:
ఎంత బాగా వాయించినా ఎంత పేరొచ్చినా (తగిన పారితోషికం లేక) బాధ పడుతుంటే రామస్వామి నన్నూరడించేవాడోయ్బాధ పడకండయ్యగారూ! మీకు స్వర్ణాభిషేకాలు జరిగే రోజులొస్తాయండీ అనేవాడోయ్--ఒక రోజున వచ్చి నన్ను అడిగాడుకదా-అయ్యగారూ-నేను చిన్నరాములోరి గుడి కట్టించానండి. రేపటి ఉదయం విగ్రహాలు పెడుతున్నారు. మధ్యాహ్నం సంతర్పణ జరుగుతుంది.. సాయంత్రం తమరు కచేరీ చేస్తే ధన్యుణ్ణవుతానన్నాడోయ్-- పరమానందంతో నేను కచేరీ చేసేను కచేరీ అయిన తర్వాత రామస్వామి నాకు నూట పదహార్లు తాంబూలం పెట్టి నమస్కరించేడుఅంత గొప్ప సన్మానం మొదటిసారిగా చేసిన వాడిని చిల్లర లెఖ్ఖ అడగమంటారోయ్? ” 
ఈ రామస్వామి 80 ఏళ్లు పైగా  ఆరోగ్యంగా జీవించి ఒక సాయంత్రం రాముల వారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి పాయసం సేవించి సుఖనిద్రలో రాముని సన్నిధి చేరుకున్నాడు. అతడు మాన్యుడా ? సామాన్యుడా?  అతని సంస్కారం ఈ నేల లోంచి వచ్చిందా? నెనరులోంచి వచ్చిందాఆతని నిమ్మళం మనకుందా?
                                          ***

    ఇక రెండో కథ చూడండి: ఇదీ విజయనగరంలోనే జరిగింది. కాకపోతే పైన చెప్పిన కథ జరిగిన చాలా ఏళ్ల తర్వాత
ఓ రోజు రాత్రి  ద్వారం దుర్గా ప్రసాద రావుగారూ కవిరాయని జోగారావుగారూ, కాట్రావులపల్లి వీరభద్రరావు గారూ కాలేజీ నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. రోడ్డు చీకటిగా ఉంది- ఏదో మంచి కచేరీయే జరిగింది. దాని గురించి కచేరీ బాగుందని మాట్లాడుకుంటూ వస్తున్నారు- అంతలో వెనుక నుండి ఇలా విన పడ్డది:
 మా గొప్ప కచేరీయే లెండి. మీరు యినడం- బాగుందనడఁవున్నూ-మేఁవూ ఇన్నాం కచేరీలు-సంగీతవఁటే అలాగుండాలి ఆ రోజులు పోనాయి.
ఈ మాటలు విని ఆ ముగ్గురూ నిర్ఘాంత పోయి-వెనక్కి తిరిగి చూస్తే- అతడో బికారిలాగున్నాడు. కొంచెం పట్టు మీద తూల్తున్నాడు. అతడిని పోలిక పట్టేరు. ఊళ్లో రోజూ గొడుగులు బాగు చేస్తూ తిరుగుతుంటాడు. సాయంత్రం వచ్చిన డబ్బుల్తో పూటుగా తాగి రాత్రికి మాదాకబళం తల్లీ అంటూ ఆడుక్కుంటూ ఉంటాడు. నువ్వు విన్న కచేరీ ఏదోయ్ అని వారడిగితే- కాకినాడ సరస్వతీ గాన సభలోనండీ- తిరుచ్చి గోవింద స్వామి పిళ్ళె ఫిడేలు వాయిస్తేనండీ ఆ నాదమండి జడివోనలో తడిసినట్టుండేదండి. పల్లడం సంజీవ రావు ఫ్లూటు ఇన్నారా తమరు- గొప్ప తీపండి
 వోయిద్యం. కాని ఒకటే స్పీడండి, నాయుడుగోరి వోయిద్యం సరేనండి-ఆరి ఇంట్లో రోజూ యినేవోడినండి. రోజూ అమృతమేగదండీ అయండీ సంగీతాలంటే  అంటూ గొణుక్కుంటూ వెళ్లి పోయేడు.
మళ్లా కొన్ని నెలల తర్వాత ఒక రాత్రి ప్రసాదరావు గారూ వారి మేనత్త ద్వారం మంగ తాయారు గారూ వారింట్లో కూర్చుని ఈమని శంకర శాస్త్రి గారి వీణ టేపు వింటున్నారు. శంకర శాస్త్రిగారికి ప్రక్కవాద్యంగా కోలంక వెంకటరాజుగారు మృదంగం వాయిస్తున్నారు. వారు తన్మయంగా వింటుంటే అదండీ మృదంగం అంటేఅని వీధరుగు మీంచి వినిపించింది. తలుపు తీసి చూస్తే ఆగొడుగుల బికారే.
మంగ తాయారుగారు అన్నం పెట్టి అతని పేరేమిటని అడిగితే సన్యాసండి అని చెప్పి అతడు వెళ్లి పోయేడు.
ఆ తర్వాత కొంత కాలానికి  ఆవిడ మద్రాసు వెళ్లినప్పుడు వాళ్ల అమ్మగారిని ఎవరీ సన్యాసి అని అడిగితే అయ్యో తల్లీ వాడు మాదాకవళం చేసుకుంటున్నాడా వాడికి బట్టలిచ్చి రోజూ భోజనం పెట్టండి తల్లీ అంటూ సన్యా సి కథ చెప్పిందావిడ.

విజయనగరం రాజు విజయరామ గజపతి వారు వారి ఆంతరంగ కార్యదర్శి గారి పుత్రుడు అంధుడైన చాగంటి గంగ బాబు కోసమే 1919లో విజయనగరంలో సంగీత కళాశాల ప్రారంభించేరు. గంగబాబుని గుర్రబ్బండిలో కాలేజీకి తీసుకు వెళ్లి తీసుకు రావడానికిగాను అతడికి ఎస్కార్టుగా ఉండడానికి సన్యాసిని నియమించేరు.
గంగబాబుని 15 సంవత్సరాలు కాలేజీకి, ద్వారం నాయుడు గారింటికీ, కచేరీలకీ సన్యాసే తీసుకు వెళ్లేవాడు. నాయుడు గారి కచేరీలలో గంగబాబు ప్రక్కవాద్యం వాయించేవారు. సన్యాసి నిరంతరం వారితోనే ఉంటూ సంగీత కచేరీలు వింటూ ఉండేవాడు. కొన్నాళ్లకి  గంగబాబు గారు పెద్ద విద్వాంసులయ్యేసరికి వారి ఆస్తులన్నీ హరించుకు పోయేయి. గుర్రబ్బళ్లు పోవడం, తోడుగా శిష్యులుండడం చేత ఎస్కార్టు అవసరం లేక సన్యాసి ఉద్యోగం ఊడింది. తర్వాత ఏమేం పనులు చేసే వాడో కానీ గొడుగులు బాగు చెయ్యడంలో స్థిర పడ్డాడన్నమాట”.

ఉండడానికి తగిన నీడ నిచ్చే గొడుగు కరువైనా, జీవిక గురించి పట్టించుకోకుండా నిత్యం నాదామృతంలో తడిసి ముద్దైన వానికి  సన్యాసి సార్థక నామధేయమే కదా?
                                                       ***

 ఈ కథల్లోని రామస్వామి, సన్యాసి పాత్రలు సృష్టించింది వారి జీవిత కథలకు కర్తా ఆ విధాతే అయినా ఈ అపురూపమైన వ్యక్తుల కథలు కాలగర్భంలో కలిసిపోకుండా రికార్డు చేసి మనకి అందించిన, ఈ రెండో కథలో ఒక పాత్ర అయిన శ్రీ ద్వారం దుర్గా ప్రసాద రావుగారు ధన్యులు.
                            ఈ జీవిత గాథలు నా హృదయాన్ని తాకిన గొప్ప కథలు. మరి మీ సంగతి?
                                           ****