8, సెప్టెంబర్ 2011, గురువారం

వెచ్చని పచ్చడం లేకపోతే పితలాటకమే



                                                         ఈ మధ్య  కళింగాంధ్ర మాండలికం..1 అనే పుస్తకం మరోసారి చదివేను. ఈ పుస్తకం 2006 జనవరిలో శ్రీకాకుళ సాహితి వారు ప్రచురించేరు, ఉపాధ్యాయ వృత్తిలో ఉండే శ్రీ జి.ఎస్.చలం గారు దీనిని వ్రాసేరు. ఏ యూనివర్శిటీయో, అకాడమీయో చేయాల్సిన పనిని  ఒక్కరూ నెత్తికెత్తుకుని చేసారు. ఆయన కృషి చాలా అభినందనీయం, భాషాభిమానులందరూ తప్పక చదవాల్సిన పుస్తకం. అయితే ఆయన వ్యవహర్తలనుంచీ,ఆ ప్రాంతపు రచయితల పుస్తకాలనుంచీ  పదాలు సేకరించి పుస్తకాలలోని మాటలకు తాననుకున్నవీ, ఆయావ్యవహర్తలు చెప్పినవీ అర్థాలు వ్రాసుకోవడంవల్ల  కొన్ని పొరపాట్లూ,తప్పుడు అర్థాలూ దొర్లేయనుకుంటాను. వాటిగురించి మరోసారి ముచ్చటిస్తాను గానీ ఇప్పుడు చెప్పబోయేది కళింగాంధ్ర మాండలికాలనడానికి వీల్లేని పదాలు  లెక్కకు మిక్కిలిగాఉన్నాయనే. ఒక మంచి కృషిని శ్లాఘించాలి కాని లోటుపాట్లు ఎత్తి చూపకూడదనే  సంస్కారంతోనేమో పుస్తకానికి ముందుమాట వ్రాసిన బూదరాజు రాధాకృష్ణ గారు కూడా ఈ విషయాలు విస్మరించారని అనుకుంటాను. ఆ ప్రాంతపు మాండలికాలనడానికి వీలు లేని పదాలకుదాహరణగా రెండు ముక్కలు మనవి చేస్తాను. చూడండి:

 పచ్చడం  --దుప్పటి  (పేజీ 90 )   అర్థం గురించి ఏ తగువూ లేదు కాని ఇది అన్ని నిఘంటువుల కెక్కిన,  ఆంధ్ర దేశం అంతా వాడుకలో ఉన్న,  కావ్యాలలో కూడా కనుపించే పదం.. సందర్భం వచ్చింది కనుక చక్కటి పద్యమొకటి
ఉటంకిస్తాను. ఇది శ్రీ వినుకొండ వల్లభరాయడు (లేక ఆయన పేరుతో శ్రీనాధమహాకవి ) వ్రాసినది అయిన క్రీడాభిరామము లోనిదని రసజ్ఞులందరికీ తెలుసు కానీ యువతరం వారికోసం:
                                  మాఘమాసంబు పులివలెమలయుచుండ
                                  పచ్చడమ్మమ్ముకొన్నాడు పణములకును
                                  పడతిచన్నులు పొగలేని ముర్మురములు
                                  చలికినొరగే.కేలుండు సైరికుండు. 
                           (భావం తెలిసినవారు తెలియనివారికి తెలియజేయగలరు)

పితలాటకం:  (పేజీ 94) దీనికి రచయిత ఇచ్చిన అర్థంఎంతకీ తెగకపోవడంఅని .దీన్ని చూస్తేనే తెలుస్తుంది రచయిత ఎవరేంచెప్తే అది వ్రాసుకున్నారని.  ధీనికి సరైన అర్థం మోసం అని ఏనిఘంటువైనా చెప్తుంది.అసలిది పిత్తల+హాటకం . పిత్తల అంటే ఇత్తడిని హాటకం అంటే బంగారం అని మోసం చేసి చూపించడం. నిఘంటువులు ఇది అరవ పదమని చెప్తాయి. ప్రముఖ భాషావేత్త వరిశోధకుడూ అయిన ఢా. చల్లా రాధాకృష్ణశర్మ గారు తన మద్రాసు తెలుగు అనే వ్యాసంలో దీనిని పేర్కొన్నారు.
   
మద్రాసులో పలికే మాట కళింగాంధ్ర మాండలికం ఎలాగవుతుంది? అందుకే బూదరాజుగారు మొహమాటపడ్డారన్నాను. నా ఈ వ్యాసోద్దేశం  శ్రీ చలంగారి కృషిని తక్కువ చేయాలని  ఎంతమాత్రం లేదని మరోసారి మనవి చేసుకుంటూ బూదరాజు వారిని  క్షమాపణలుకోరుకుంటున్నాను.  గ్రంథాలలో తప్పులు అలా ఉండిపోకూడదనే సదుద్దేశం మాత్రమే నన్నీ పనికి పురికొల్పింది.

స్వస్తి





కవిగారూ..ఆటవెలదులూ...


కవిగారూ..ఆటవెలదులూ...

ఓ కవిగారికి ఆటవెలదులన్నా తేటగీతములన్నా చాలా ఇష్టమట. ఆయితే ఆటా..పాటా లేకపోయినా మిగిలినవి ఉంటే సర్దుకు పోతాను  ఫర్వాలేదు అన్నాడిలా:
ఆట లేక తేట పాటయులేకున్న
వెలదులున్నచాలు వేవరాలు.... 
            అదీ కవిగారి రసికత.. ఆయన పేరు సరిగా గుర్తులేదు కాని వావిలాల వాసుదేవ శాస్త్రి అనుకుంటాను. ఆయన పేరు కూడా తమాషాగా ఆటవెలది ఆఖరి పాదమై కూర్చుంది చూసేరా? (ఈయన గురించి శ్రీ ఆరుద్ర గారి  సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో  సుబాకవుల విభాగంలో చదువుకొన వచ్చు)

                                                        నాకైతే కంద పద్యాలే ఇష్టం కానీ సరదాకి కొన్ని ఆటవెలదులూ రాసేను. చిత్తగించండి:

       తాను తినక సొమ్ము తనవారికీకుండ
దానమీయకుండ దాచువాడు
గడ్డి వాము చెంత కాపుండు శునకము
నిజమె పలుకు చుంటి నీరజాక్ష   
   
కూటగురుని చేరి కొలువెంత చేసిన
కలుగబోదు ఎపుడు జ్ఞానసిధ్ధి
కుక్క తోక బట్టి గోదావరీదగా
జాలడెవడు వాని జన్మలోన       

కుక్కతోక జూడ కుటిలమై యుండును
దాని శీలమదియు దాచలేదు
తోలలేదు ఎపుడు దోమ ఈగలనైన
వ్యర్ధుడైన వాని వైనమింతె                          *    

మనము నిద్రపోవ మనతోనె నిద్రించు
మనము నడచుచుండ వెనుకె వచ్చు
పూర్వ జన్మ కర్మ పోదు ఫలమునీక
నిజమె పలుకుచుంటి నీరజాక్ష                          *

తరుణులందరెపుడు తలను దాల్తురుగదా
విరుల సరుల లోని దారమైన
మంచివారి పొందు మాన్యత చేకూర్చు
నిజమె పలుకు చుంటి నీరజాక్ష                     *    

మనసులోనిమాట మర్మమేలేకుండ
పలుక వలయునెపుడు, పలుకెగాదు
చేసిచూపవలయు  చేతలందునుగూడ
నీతిమార్గ మిదియె నీరజాక్ష                 

మట్టిలోన పుట్టి మట్టిలో కలిసేటి
మనుజులందరొకటె మాన్యులార
మతములందు లేదు భేద భావమెపుడు
మానవతనెచాటు మతములన్ని 
  
ప్రేమ ప్రేమ యనుచు ప్రేమిస్తి ననుచును
అందమొకటె జూచి ఆశ పడుచు
పిల్లదాని మనసు పిసరంత తెలియక
వెంటబడెడివాడు వెఱ్ఱి వాడు                

ఆలు మగల మధ్య అనురాగముండియు
ఒకరినొకరు యెపుడు గౌరవింప
కాపురములు సాగు కలతలు లేకుండ
నీతి వాక్య మిదియె నీరజాక్ష               

 కష్టమొచ్చినపుడు కలగిపోకుండుడు
కష్టసుఖములవియు కలిసె వచ్చు
పగలు రాత్రి గడువ పగలు రాకుండునా
నిత్య సత్య మిదియె  నీరజాక్ష                

ఏమిలేని నాడు ఎంగిలికాశించు
కుడువ కూడులేక కుములుచుండు
అన్ని యున్ననాడు అన్నమే తినలేడు
నిత్య సత్య మిదియె నీరజాక్ష                  

ఏరినైన నీవు గౌరవింపదలప
మంచిగుణము,  విద్యలెంచవలయు
కలిమి కులములెపుడు కారాదు కొలబద్ద
నీతి వాక్యమిదియె నీరజాక్ష                  

నమ్మడెవరిమాట నమ్మబోడుసతిని
నమ్మడెపుడు వాని అమ్మనైన
బెమ్మ ఎదుట నిలిచి  నమ్మబల్కిన గూడ
సణుగుచుండు నిత్య శంకితుండు    

చుట్టరికముతోడ చూడనింటికి బోవ
ధనము నడుగ వచ్చిరనుచు తలచి
ఇంటనున్న లోభి లేడని చెప్పించు
నిజమె పలుకుచుంటి నీరజాక్ష                

ఎవరిసొమ్ము వారికిచ్చుటేమి ఘనము
నిలువుదోపిడిచ్చి నీల్గుచుంద్రు
సకల సంపదలును శర్వునివేకావ
నిజము పలుకుచుంటి నీరజాక్ష                 

జాతకములు వ్రాసి చక్రాలు సరిజూసి
మంచిమూర్త మొకటి యుంచుగాని
పిల్ల లేచి పోయి  పెండ్లి రద్దయి పోవ
పంతులేమి జేయు పద్మనాభ                 

ఆశ పెరుగుచుండు ఆస్తులతో పాటు
ఆశకంతులేదు అవనియందు
ఆశలేని వాడు అదృష్టవంతుడు
నీతి వాక్య మిదియె నీరజాక్ష            

ఫిల్ల కనుటయొకటి  పెండ్లి చేయుటొకటి
ఆడపిల్ల తల్లి తండ్రులకును
కష్ట సాధ్యమైన కార్యమే యెపుడైన
నిజమె పలుకుచుంటి నీరజాక్ష                 

పాల సంద్రమందు పవ్వళించెడువేళ
పాదసేవ చేసెనాది లక్ష్మి
ద్వాపరమున నీకు దారయై అలుకతో
సత్యభామ కాలు సాచి తన్నె                    

కవియెకాని వాడు కావ్యమ్ము వ్రాయంగ
చదువె రాని వాడు చదువుచుండ
చెవిటివాడొకడు చెవియొగ్గి వినుచుండ
కాశి పారిపోయె  కావ్య రసము             
   
( * ఈగుర్తు గల పద్యాలకు సంస్కృత మూలాలున్నాయి)   

ఇప్పటికి సెలవు...                   


              
           



  










పెండ్లి వారి యింట పేకాట లేకుండ
పెండ్లి యెట్లు జరుగు పెద్ద లార
పెండ్లి వారి కిపుడు పేకల కొని దెచ్చి
పెండ్లి జరుపు కొనుము పెండ్లి పెద్ద