22, అక్టోబర్ 2011, శనివారం

నేనూ..మా ఊరూ..

                    

                   1941.
ద్వితీయ ప్రపంచ మహా సంగ్రామం జరుగుతున్న సమయం.  అన్నిటికీ ప్రజలు చాలా ఇబ్బందులు  పడుతున్న రోజులు.  అదిగో అలాంటి క్లిష్ట సమయంలో నేను  ఆ సంవత్సరం సెప్టెబరు 12 వ తేదీన పుట్టాను. ( మా నాన్నగారు  మొదటి ప్రపంచ యుధ్ధం  సమయం ( 1915 ) లో పుట్టారట. జనం అదృష్టం బాగుండబట్టి నాకు కొడుకులు పుట్టలేదు. ఆ విధంగా మూడవ ప్రపంచ యుద్ధం జరుగ కుండా ఆగిందేమో? )

నేను పుట్టింది పార్వతీపురంలో. ( పార్వతీపురం మా తాతల నాటి నుండి మా స్వగ్రామం. నేను మా నాన్నగారికి ప్రథమ సంతానం. ఆనవాయితీ ప్రకారం  నా జననం మా మాతా మహుల ఇంట్లో జరగాలి. అప్పట్లో మా మాతామహులైన లక్ష్మణ మూర్తి గారు గవర్నమెంటు  సర్వీసులో డాక్టరుగా ఉంటూ బదిలీల మీద ఊళ్లు తిరుగుతూ కర్నూలు జిల్లాలోనో అనంతపురంజిల్లా లోనో ఉండేవారు. సరిగా తెలియదు గాని, యుధ్ధ సమయం కావడం వల్ల దూరాభారం ప్రయాణం కష్టమని భావించడం వల్లనో ఏమో నా ప్రసవానికి మా అమ్మ పుట్టింటికి పోలేదు. మరొక కారణం నేను  విన్నది--. గర్భిణీ  స్త్రీలు చుక్క కెదురుగా ప్రయాణం చేయ కూడదనే ఆచారం ఒకటి ఉండడం. దీనిని చుక్కెదురు అని వ్యవహరించే వారు. చుక్క అంటే శుక్రుడు. శుక్ర గ్రహం పడమటి దిక్కున కనిపిస్తుంది కనుక ఆ దిక్కు గా పయనించ రాదని నియమం. మా ఉత్తరాంధ్రకి  ఆ జిల్లాలు పడమట దిక్కున ఉన్నట్టే భావించే వారు. అసలు జిల్లాలు దాటి సంబంధాలు చేసుకోవడానికే ఇష్టపడేవారు కాదు. అందువల్ల మాతా మహుల ఇంట్లో ఎక్కడో పుట్టాల్సిన నేను  మా పార్వతీ పురంలోనే  పుట్టాను..)

 నేను పుట్టినప్పటికి మనకి స్వాతంత్ర్యం రాలేదు. మరో ఆరేళ్ల తర్వాత 1947 ఆగష్టులో వచ్చింది.. నేను పుట్టింది అప్పటి బ్రిటిష్ ఇండియా లో ఉన్న మద్రాసు ప్రోవిన్సులో గంజాం జిల్లాలో.  మా పార్వతీపురం ఆ జిల్లాలో ఒక తాలూకా కేంద్రం.
అంచేత నేను ఒక బ్రిటిష్ కోలనీ లో పుట్టి తర్వాత స్వతంత్ర  భారతావనిలో పెరిగానన్న మాట. మనకి స్వాతంత్ర్యం వచ్చేక  ఒరిస్సా రాష్ట్రం  ఆవిర్భవించినప్పుడు మా వూరు గంజాం జిల్లానుంచి  విశాఖ జిల్లాలోకి వచ్చింది. అది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేది.  1953 లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత 1956లో  హైదరాబాదు రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాయి. విశాఖ  జిల్లా చాలా పెద్దది కావడం తో దాన్ని  విశాఖ శ్రీకాకుళం జిల్లాలుగా విడదీసారు. అప్పుడు మా వూరు శ్రికాకుళం జిల్లాలో ఉండేది.  తరువాత మళ్ళీ ఈ రెండు జిల్లాలనూ పున వ్యవస్థీకరిస్తూ ( 1979లో )  విజయనగరం జిల్లాను ఏర్పరిచారు. ఈ  విజయనగరం జిల్లాలోనే ప్రస్తుతం మా పార్వతీ పురం ఒక తాలూకా (మండల) కేంద్రంగా విరాజిల్లుతోంది. దాదాపు 1962 వరకూ మేజర్ పంచాయితీగా ఉన్న మాగ్రామం మునిసిపాలిటీయై ఇప్పుడు గ్రేడు 1 మునిసిపాలిటీగా చెలామణీ అవుతోంది.

                               1796 లో బెలగాం పేరుతో వెలసిన మన్య సంస్థానానికి మావూరు ముఖ్య పట్టణం. జయపురం సంస్థానాధీశులు మా ఊరి చుట్టు పక్కల నున్న పధ్నాలుగు గ్రామాలతో కలిపి ఈ మన్య సంస్థానాన్ని ఏర్పరిచేరట. ఈ ఊరికి ఆ జమీందారీ కుటుంబం లోని ఒక ప్రముఖ వ్యక్తి అయిన పార్వతమ్మ పేరు పెట్టుకున్నారట. (ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఒక చోట ఈ ఊరు గజపతుల వంశానికి చెందిన పార్వతీ దేవి  పేరిట వెలిసిందని రాసేడని చదివినట్టు గుర్తు.) ఏది నిజమో తెలియదు. 

 నేను పుట్టినప్పటికి మా ఊరు పెద్ద గ్రామమే. కానీ ఆరోజుల్లో  ఊరు అధ్వాన్నంగానే ఉండేదనే చెప్పాలి.  . మెయిన్ బజారులో కానీ మరెక్కడ కానీ తారు రోడ్లు లేవు. విద్యుద్దీపాలు లేవు. మంచి నీటి సరఫరా లేదు. మెటల్ రోడ్లు ఉండేవి. వాటిని మెట్లంగి రోడ్లనే వారు. రోడ్లకిరువైపులా కుళ్లు కాలువలుండేవి.(ఇప్పుడూ ఉన్నాయి. కానీ ఇప్పుడు సిమెంటు రోడ్లు వచ్చేయి). అయితే ఆరోజుల్లో ఊళ్లన్నీ అలాగే ఉండేవి. నేను బాగా చిన్నప్పుడు కరంటు లేదని చెప్పాను కదా. వీధిలో మా ఇంటికెదురుగా ఒక దీపస్థంభం ఉండేది. దాని మీద చిమ్నీ దీపం దాని చుట్టూ నలుపలకల అద్దాలు మీద నగిషీ  మూతా ఉండేవి,  రోజూ సాయంత్రం పంచాయతీ వారి మనిషి ఒకరు వచ్చి దీపం చిమ్నీని శుభ్రంగా కచ్చికతో తుడిచి కిరసనాయిలు పోసి దీపాన్ని వెలిగించే వాడు. అది వెలిగినంత సేపే మా వీధికి వెలుగు. ఇళ్లల్లో కూడా కిరసనాయిలు దీపాలే గతి. మేం కాస్త ఉన్న వాళ్లమే కనుక ఓ అరడజను చిమ్నీ లాంతర్లు,బుడ్డీ దీపాలు వెలుగుతూ ఉండేవి, మా చదువులన్నీ ఆ దీపాల వెలుగులోనే . అయితే 1948 నాటికి ఊళ్లోనూ  1951 నాటికి మాయింట్లోనూ విద్యుద్దీపాలు వచ్చేసాయి.
 మా యింటికి రెండు ఫర్లాంగుల దూరంలో పాత్రుడు కోనేరనే చెరువు ఒకటుండేది. ఇది కాక రాయఘడ పోయే రోడ్డులో అగ్రహారం కోనేరనే మరో  చెరువు ఉండేది. వీటి నుంచే అందరూ తాగడానికి కావల్సిన నీళ్ళన్నీ తెచ్చుకునే వారు. వేరే చెరువులు కూడా ఉన్నా ఆ నీళ్లు తాగడానికి వాడే వారు కారు. ( ఇప్పుడైతే ఆ చెరువుల నీళ్ళు తాగి ఎలా బతికి బట్ట కట్టేమో అనిపిస్తుంది ).  బ్రాహ్మణ స్త్రీలు స్నానం చేసి ఆ తడి బట్టలతోనే మడిగా శుభ్రంగా తళతళలాడుతూ మెరుస్తున్నట్టు తోమిన ఇత్తడి బిందెలతో నీళ్లు మోసుకొచ్చేవారు. ఆ సమయంలో అస్పృశ్యులు ఎదురైతే ఆ నీళ్లు మడికి పనికి రావని భావించే వారు. ఆ నీళ్లు పారబోసి మళ్లా వెళ్లి తెచ్చుకునే వారు. 1964 నుంచి అరకొరగానైనా మంచినీటి సరఫరా జరుగుతోంది.
 ఆ రోజుల్లో వర్షా కాలంలో రోడ్లమీద  అరడుగు మందాన బురద ఉండేది. ఎక్కడ జారి పడతామో అని భయపడుతుండే వాళ్ళం. ఇప్పుడు  సిమెంటు రోడ్లు తారు రోడ్లు వచ్చినా పారిశుధ్యం మెరుగు పడిందని అనలేము. ఇక్కడో చిన్న ముచ్చట చెప్తాను.
మా చిన్నప్పుడు   సాయంత్రం టౌన్ రైల్వే స్టేషను వైపు  షికారు వెళ్ళే వాళ్లం. ఆ  దారిలోనే  మా ఊరి పంచాయతీ ఆఫీసు ఉండేది. ఆ ఆఫీసు నేమ్ బోర్డు కూడా
గుమ్మం పక్కనే నేలమీదే నిలపెట్టి ఉండేది. దాని నిండా దుమ్ము పట్టి ఏ అక్షరాలూ కనిపించకుండా ఉండేది.  నేనప్పుడు హైస్కూల్లో  ఏదో చిన్న క్లాసే చదువుతూ ఉండే వాడిని. నాకో చిలిపి ఆలోచన వచ్చి  నా వేలితో ఆ పేరుకు పోయిన దుమ్ము మీద  బోర్డు తుడవలేని  పంచాయితీ రోడ్లేమి తుడుస్తుందని రాసేను. నేను రాసినది చాలా స్పష్టంగా  వచ్చింది.  ఆ మరునాడు ఆదారిలో వెళ్తూ చూస్తే బోర్డు, ఆ చుట్టు పక్కల రోడ్డూ శుభ్రంగా తుడిచి ఉన్నాయి.  ఆతర్వాత కథ మళ్ళా మామూలే ఆనుకోండి.

మా ఊరి మైన్ బజారు రాయఘడ ( ఒరిస్సా) పోయే రోడ్డు జంక్షను నుండి సుమారు అర కిలోమీటరు పొడుగున ఉత్తర దక్షిణంగా ఉండేది. అక్కడ పడమటినుంచి తూర్పుకు ప్రవహిస్తూ వస్తున్న గెడ్డ ఒకటి రోడ్డుకి అడ్డం రావడంతో రోడ్డుపై పెద్ద కల్వర్టు కట్టేరు. (వాగుల్ని మా ప్రాతంలో గెడ్డలంటారు). మాఊరు టౌను ఈ కల్వర్టు వరకే ఉండేది. ఈ కల్వర్టుని పెద్ద ఖానా అనే వారు. దాని దగ్గరనుంచి సుమారు రెండు పర్లాంగులు ఆగెడ్డ రోడ్డుకిరువైపులా ప్రవహిస్తూ అక్కడనుండి రెండు పాయలూ కలిసిపోయి తూర్పుదిక్కుగా ప్రవహించేది. దీని వల్ల అక్కడ ఊరు ఉండేది కాదు. మరికొంతదూరం పోయేక  మళ్లా ఊరు ఉండేది, దీన్ని బెలగాం అంటారు. మా టౌన్ లో వాణిజ్య సముదాయాలూ అవీ ఉంటే బెలగాంలో ఆఫీసులూ కోర్టులూ జైలు పెద్ద పోస్టాఫీసు హాస్పిటలూ పెద్ద రైల్వేస్టేషనూ హై స్కూలు అవీ ఉండేవి. ఆవిధంగా మా వూరు చిన్నసైజు జంట నగరాలని తలపింపజేస్తూ ఉండేది
టౌన్లో టౌన్ రైల్వే స్టేషను   చిన్న హాల్టు స్టేషనుగా ఉండేది. మా ఊరినుంచి అటు విశాఖ పట్నం వైపు  ఇటు ఒరిస్సాలోని రాయపూర్ వైపు  రోజుకు రెండు చొప్పున
మొత్తం నాలుగు  పాసింజరు రైళ్లు మాత్రం నడిచేవి.మా ఊరినుంచి విశాఖకి సుమారు 150 కిలోమీటర్ల దూరానికి 5 గంటలపైగా సమయం పట్టేది.  విశాఖ పట్నానికి 2 రూపాయల 13 అణాలు టిక్కట్టు ఉండేది. ఆ పాసింజరు రైళ్లు కూడా చాలా చిన్నవి. 6, 7 పెట్టెలు మాత్రం ఉండేవి. ఆ రైళ్లలో మూడు తరగతులుండేవి. మూడవ తరగతి పెట్టెలో సామాన్యులందరూ ప్రయాణం చేసేవారు. పొడుగ్గా నాలుగు వరుసల్లో చెక్కబెంచీలండేవి. రెండవ తరగతి పెట్టెల్లో అలాగే బెంచీ లే ఉన్నా కుషన్లు ఉండేవి.  వాటిని పరుపుల పెట్టె లనే వారు. కాస్త ఉన్నవారూ రైల్వే పాసులున్నవారూ వాటిల్లో ప్రయాణం చేసేవారు. ఫస్టు క్లాసు పెట్టెలు ఇప్పటివాటిలాగే ఉండేవి. రైళ్లకి ఆవిరి ఇంజన్లు ఉండేవి.  మాచిన్నప్పుడు చిన్న పిల్లలకి పాలు కలుపు కోవడానికి వేడినీళ్లు కావలసి వస్తే ఇంజను దగ్గరకి పోయి డ్రైవరుని అడిగితే మా మరచెంబులోకి కావలసినన్ని వేడి నీళ్లు వదిలేవాడు. రైలు కదులుతూ ఉంటే రైలు వెళ్తున్నప్పుడు బొగ్గు నలుసులు ప్రయాణీకుల కళ్లల్లో పడి కళ్లు మండిపోతుండేవి. మనిషిని చూస్తే రైలు ప్రయాణం చేసి వచ్చేడని ఇట్టే తెలిసి పోయేది. మా ఊరి మీదుగా వెళ్లే రైల్వే ని  బి.ఎన్. ఆర్ రైల్వే అనే వారు. దానర్థం బెంగాల్ నాగపూర్ రైల్వే అని. ఆ రైలుకూత కూడా భయంకరంగా ఉండేది. మా చిన్నప్పుడు ఎవరైనా బొంగురు గొంతుకతో గట్టిగా మాట్లాడే వారిని బీయన్నార్ గొట్టాం అనే వారు ఆ రైలు కూతతో పోలుస్తూ.
రైళ్లు తక్కువగా ఉండడంతో బస్సులమీదే ఆధార పడేవారు. ఆ బస్సులు కూడా అంతంత మాత్రమే. ఇప్పటిలా ఎక్స్ ప్రెస్ బస్సులూ లేవు. అవి ఎక్కువ దూరాలకి వెళ్లేవీ కావు. విశాఖ పట్నంవైపు బస్సులు విజయనగరం వరకు మాత్రమే వెళ్లేవి. శ్రికాకుళం సాలూరు రాయగడ రూట్లలో బస్సులు తిరిగేవి. అన్నీ ప్రయివేటు బస్సులే. ఆప్పటికి బస్సు రూట్ల జాతీయం జరుగలేదు. ( 1956 లో బస్సురూట్ల జాతీయం చేసిన నీలం సంజీవ రెడ్డిగారికి హైకోర్టు అక్షింతలు వేసిన సంగతి గుర్తు చేసుకోండి.)  నాచిన్నతనంలో బొగ్గుతో నడిచే బస్సులు కూడా చూసేను. బస్సు వెనుకవైపు బొగ్గు మండుతూ యమ వేడిగా ఉండేది, కానీ అనతి కాలంలోనే అవి పోయి డీజిల్ బస్సులు వచ్చేయి. అవి ఇప్పటి మాదిరి పెద్ద బస్సులు కావు. కొంచెం చిన్నగా ఉండేవి. సెల్ఫు స్టార్టరు ఉండక పోవడంతో  Z ఆకారంలోని  Iron rod పెట్టి ఇంజను తిప్పి Start చేసేవారు. సీటింగ్ కూడా తమాషాగా ఉండేది. డ్రైవరు పక్కన ఒకరిద్దరు కూర్చోడానికి ఉండేది ఫ్రంటు సీటు. దాని తర్వాత సెపరేటు డోరుతో రెండు వరసల్లో ఎదురెదురు సీట్లు ఉండేవి. వీటిని సెకండు సీట్లు అనేవారు. ఆ వెనుక భాగ మంతా చుట్టూ సీట్లతో మధ్యలో సామాను పెట్టుకోవడానికి ఖాళీ స్థలం ఉండేది. ఇవి జనతా సీట్సన్నమాట. థర్డ్ సీట్లనే వారు. ఆడవారూ పిల్లలూ అతి సామాన్యులందరూ  ఈ థర్డ్ సీట్ల లోనే కూర్చోవాలి. సెకండు సీట్లలో కాస్తా నాజూకు మనుషులూ చదువు కున్న వారూ ఎక్కాలి. ఇక ప్రంటు సీటు వి.ఐ.పి సీటన్న మాట. పెద్ద ఉద్యోగస్తులకీ పోలీసు వారికీ రిజర్వు చేసి ఉంచేవారు. పెద్దలెవరూ లేకపోతే నాబోటి టీచర్లకి కూడా ఫ్రంటు సీట్లో కూర్చుని ప్రయాణం చేసే మహద్భాగ్యం కలుగుతూ ఉండేది. నేను టెంపరరీగా వేరే ఊళ్లో హైస్కూల్లో పని చేసిన ఒక్కసంవత్సరంలోనూ అలా ఫ్రంటు సీట్లో కూర్చుని ప్రయాణించే మహద్భాగ్యం చాలా సార్లే కలిగింది. దానికి కారణం  ఆ బస్సుకి పెద్దలెవ్వరూ రాకపోవడమేనని వేరే చెప్పనక్కర లేదు కదా.
 ప్రయివేటు బస్సులు కావడంతో వాటి మధ్య పోటీ ఎక్కువ గానే ఉండేది. ఈ పోటీ ఎలాఉండేదో చెబుతాను. మా ఊరినుండి శ్రికాకుళానికి పొద్దున్నే 4 బస్సులుండేవి ఫస్టు బస్సు 4గంటలకి సెకండు బస్సు నాలుగున్నరకి, మూడోది మరో అరగంట తర్వాత అలా. నాలుగూ బస్టాండులోనే ఉండేవి. ఫస్టు బస్సు సరిగా నాలుగ్గంటలకి బయల్దేరక పోతే రెండో బస్సు వాళ్లు నానా గొడవా చేసి బస్సులోనే వారిని ఊరి పొలిమేర వరకూ తరిమి కొట్టి తిరిగి వచ్చేవారు. ఈ తతంగం రోజూ జరిగేది. ఈ బస్సులు చాలా నింపాదిగా వెళ్తూండేవి. బస్సు డ్రైవరు అటూ ఇటూ చూసుకుంటూ పాసింజర్లకోసం వెతుకుతూ నడిపేవాడు. అల్లంత దూరాన పొలాల్లో ఒహోయ్ అని కేక వినిపిస్తే చాలు వారు వచ్చేవరకూ బస్సు ఆపి కూర్చునే వాడు. ఇది అలవాటైపోయిన ప్రజలు కూడా పెద్దగా విసుక్కునే వారు కాదు. దారిలో ఎక్కాల్సిన తోటి ప్రయాణీకుల  అవసరాల్ని కూడా గుర్తించే వారనుకుంటాను.ఇప్పుడు ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సులు రావడంతో ప్రయాణ సమయం సగానికి సగం తగ్గింది. బస్సుల సీట్లూ సుఖంగా ఉన్నాయి.

 మా ఊరి హైస్కూలు అప్పటికే చాలా పెద్దది. పురాతనమైనది. బెలగాం లోఉండేది.  ( గుర్తుందా?--   కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాని తమ పెద్దన్న దిబ్బావధాన్లు కొడుకుని  ఇంగ్లీషు చదువులకి పార్వతీపురం పంపించేరని చెబుతాడు. అది 1910. అంటే అప్పటికే ఈ హైస్కూలుండేదన్నమాట.)  ఉదయం మధ్యాన్నం రెండు పూటలా బడి నడిచేది. ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ తిరిగి మధ్యాన్నం రెండునుంచి నాలుగు వరకూ.  పిల్లలము ఎక్కువ మందిమి టౌన్లోనే ఉండే వారము కనుక సుమారు 2 కిలోమీటర్లూ రోజుకి నాలుగు సార్లు నడవాల్సి వచ్చేది. ఎంత ఎండైనా వానైనా చాలాకాలం ఎవరికీ కాళ్లకి చెప్పులు ఉండేవికాదు. ఎవరూ ఆ విషయం పట్టించుకునే వారూ కాదు బాధ పడే వారూ కాదు. అటువంటి సాదా సీదా జీవితం గడిపే వారు అందరూను.  మేము సెకండుఫారం ( 7 వ క్లాసు) లో ఉండగా టౌన్లో హైస్కూలు బ్రాంచి పెట్టారు.. ఈ బ్రాంచిస్కూలు మాపెరటి వెనుకనున్న వీధిలోనే ఉండేది. అందువల్ల నడక శ్రమ తగ్గిపోయింది.
ఇందాక మా ఊరి మైన్ బజారు రాయగడ రోడ్ జంక్షను నుండి ప్రారంభమయి ఉండేదని చెప్పాను కదా. రాయగడ వైపు వెళ్లే రోడ్డులో అప్పటికి ఎక్కువ ఇళ్లు ఉండేవి కావు. ఆజంక్షను నుండి తూర్పుగా ఓ వంద గజాల్లో అప్పటి మా ఊరి బస్టాండు ఉండేది.  పేరుకి బస్టాండే కాని బస్సులన్నీ పెద్ద రావి (లేక మర్రి) చెట్టు నీడనే ఆగేవి. అదే బస్టాండు. దానికెదురు గానే ఆంధ్రాబేంకు ఉండేది. మా ఊళ్లో మొట్ట మొదటి బేంకు అదే. ఆ బేంకు మా తాతగారు కట్టించిన ఇంట్లోనే అద్దెకుండేది. ముందు బాగంలో బేంకు. వెనుక బేంకు ఏజంటుగారి వసతి. మొదట్లో కొన్నాళ్లు మా చిన్నాన్నగారు ఆ బేంకులో పని చేసేవారు. అప్పట్లో బేంకుకు ట్రాన్స్ ఫర్ మీద వచ్చిన వారు వారి కుటుంబాలు వచ్చే వరకూ మాయింట్లోనే భోజనం చేసేవారు..
బస్టాండు దాటేక  కట్టెల దుకాణాలు,  సా మిల్లు అవి దాటేక సాని వీధి ఆ తరువాతసినిమా హాలు,  తరువాత టౌను రైల్వే స్టేషనూ ఉండేవి. ఆ సినిమా హాలే మాఊరిలో మొట్టమొదటి సినిమా హాలు, రేకుల షెడ్డులో ఉండేది. షెడ్డుకోసం వేసిన ఇనుప స్థంభాలు సినిమా చూడడానికి అడ్డం వస్తూ ఉండేవి. సింగిలు ప్రొజెక్టరుతో నడిచేది.  సినిమాల మీది వెర్రితో జనం ఆ అసౌకర్యాలని పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఈ హాలుని మొదట పూర్ణా ఫిలిమ్స్ మంగరాజుగారు కట్టించేరట. ఆ పూర్ణాటాకీసు యాజమాన్యం చేతులు మారుతూ పరమేశ్వరి, నవరత్నాగా మారాయి. ఈ సినిమా హాలు పూర్ణా వారి యాజమాన్యంలో ఉన్నప్పుడు ఆర్.నాగేశ్వర రావు మేనేజరుగా పనిచేసేవాడట. ఏవైనా గొడవలు వస్తే ఒక్కడే కర్రతిప్పుకుంటూ పది మందినైనా ఎదిరించే వాడట. ఆ తర్వాత రోజుల్లో అతడు సినిమాల్లో ప్రఖ్యాత విలన్ గా నటించిన సంగతి అందరికీ తెలుసు. ఈ ధియేటర్ లో నేలంటే నేలే., ఇసుక పరచి ఉండేది. తరువాత బెంచీ క్లాసు దాని వెనుక కుర్చీ క్లాసు ఉండేవి. కుర్చీ టిక్కట్టు ముప్పావలా. (అంటే 75 పైసలు). ఆ తరువాత 1955 ప్రాంతంలో రెండవదైన  వేణుగోపాల్ టాకీసు మా టౌనుకీ బెలగాంకీ మధ్యన పెద్దకానా దగ్గర వచ్చింది. దీనిలో బాల్కనీ  క్లాసు కూడా ఉండేది. నేల క్లాసులో బెంచీలుండేవి. టిక్కట్టు పావలా  (1/4 rupee).  బాల్కనీ క్లాసు టిక్కట్టు చాలాకాలం రూపాయి పావలా. చాలాకాలం  తరువాత  మరో నాలుగు సినిమా హాళ్లు వచ్చేయి.  
మా బజారు వీధి ఒక బస్సు పోయే వెడల్పు తో ఉండేది. ఇప్పుడు ఒరిస్సానుంచి వచ్చే నేషనల్ హైవే కావడంతో central meridian తో two way road  వేసారు. బజారు బాగా పెరిగింది. టౌను బెలగాములు కలిసి పోయేయి. ఈ రెండిటి మధ్యా గెడ్డ పారుతూ ఉండేదని చెప్పాను కదా. దాని మీద సిమెంటు స్లాబులు వేసుకుని షాపులూ  ఇళ్లూ కట్టేసారు. అందుకే నేమో మా చిన్నప్పుడు ఎప్పుడూ మాకు తెలియని వరదలు పార్వతీ పురాన్ని ముంచెత్తుతున్నాయని టీవీల్లో పేపర్లలో చూస్తున్నాము.
 ఎవరికీ కార్లుండేవి కావు. మొదట్లో రెండెడ్ల బళ్లేగతి. కొద్ది రోజులకే జట్కాలొచ్చేయి. మా ఫామిలీ డాక్టరు గారు జట్కా బండిలో వచ్చి ఇళ్ల దగ్గర కూడా పేషంట్లని చూసేవారు. అలా వచ్చినప్పుడు జట్కావానికో అర్థరూపాయి ఇచ్చే వాళ్లం. తరువాత కొద్ది రోజులకే సైకిలు రిక్షాలు వచ్చేయి. మనుషులు లాగే రిక్షాలు అంతకు ముందు రోజుల్లో విశాఖ పట్నంలో చూసేను కానీ  అవి మా ఊరికి రాలేదు.( వాటిని నిషేధించేరు). ఈసైకిలు రిక్షాల్లో మొదట్లో చాలా కాలం టౌన్లో ఈ చివరి సెంటరు నుండి బెలగాం వరకు గాని అట్నించిటుగాని మనిషికి  బేడ (  అంటే రూపాయిలో 8 వ వంతు-రెండణాలు) తీసుకునే వారు. ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగినా సరే. బేరాలుండేవి కావు.
ఊరిప్పుడు బాగాపెరిగింది. సౌకర్యాలు కూడా బాగా పెరిగాయి. బెలగాంలో ఆర్టీసీ  బస్టాండు కట్టేరు. సుదూర ప్రాంతాలకి కూడా ఎక్స్ ప్రెస్ బస్సులు రాత్రనక పగలనక తిరుగు తున్నాయి. ఎన్నో ఎక్స్ ప్రెస్  రైళ్లు కూడా తిరుగు తున్నాయి. ఊరి నిండా ప్రయివేటు కార్లు వచ్చేయి. మా చిన్నప్పుడు ఓ పది ఇరవై లోపే టెలిఫోన్లు ఉండేవి. ఫోన్ చేయాలంటే పోస్టాఫీసుకు వెళ్లి p.p కాల్ బుక్ చేయాల్సి వచ్చేది. అది ఎంతకీ కలిసేది కాదు. ఇప్పుడు కూర్చున్న చోటినుండి అమెరికా లో ఉన్న వాళ్లతో కూడా మాట్లాడుకుంటున్నారు.టూకీగా మా చిన్నప్పటి మా ఊరి గురించి చెప్పాను. ఇప్పటికిక్కడ ఆపి నా బాల్యం ఎలా గడిచింది, అప్పటి జనజీవనం ఎలా ఉండేది, ఆచార వ్యవహారాలు మొదలైన వాటిగురించి నాకు గుర్తుంన్నంత వరకూ మరోసారి చెప్తాను.  

సెలవు.