19, ఏప్రిల్ 2012, గురువారం

నరశింవ్వ..నీ దివ్వె..నామ మంతరము సేత..


               నరసింవ్వ..నీ దివ్వె.. నామ మంతరము శేత...
కన్యాశుల్కం నాటకాన్ని ఇష్టంగా చదువుకున్న సాహితీ ప్రియులందరికీ  పై మాటలు నాటకం లోని పేకాట సీనులో పోలిశెట్టి పదే పదే వల్లించే మాటలని తెలిసే ఉంటుంది. పోలిశెట్టి యాసని తొలగిస్తే- అది నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత అనే సీస పద్య పాదమనీ ఇట్టే గుర్తు పట్టేస్తారు. అయితే ఈ పద్యం ఎక్కడిదో వ్రాసిన  కవి ఎవరో  చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు. నాకు కూడా ఈ మధ్యవరకూ   తెలియలేదు.  నరసింహ దేవుని మీద పద్యం కనుక సింహాద్రి నారసింహ శతకం లోనిది అయి ఉంటుందనుకున్నాను  కానీ కాదు. ఇది ఇప్పటి కరీంనగర్ జిల్లా లోని ధర్మపురి లోని నరసింహ స్వామి మీద ధర్మపురి శేషయ్య అనే కవి  వ్రాసిన శతకం లోనిది. ప్రక్కనే ఉన్న సింహాద్రి అప్పన్న ( నరసింహ స్వామి) ని కాకుండా  ఏడెనిమిది వందల మైళ్ళ దూరంలో ఉన్న ధర్మ పురి నారసింహుని పోలిశెట్టి ప్రార్ధించుకోవడం చిత్రంగానే కనిపిస్తుంది. దీనికి కారణం  ఆ శతకానికి  అప్పట్లో ఉన్న ప్రజాదరణే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.   ఆ శతకం గురించి ఆ కవిగారి గురించి తెలుసుకునే ముందు పై పద్యపాదం ఉన్న పద్యం పూర్తి గా చదవండి:
నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలము లన్ని ద్రోలవచ్చు
నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు
నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు
నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల దఱుమ వచ్చు
భళిర నేనీ మహా మంత్ర బలము చేత
దివ్య వైకుంఠ పదవి సాధింప వచ్చు
భూషణ వికాస శ్రీ దర్మ పుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూర

ఏ టీకా తాత్పర్యాలూ అక్కర లేకుండా అందరికీ సుబోధకమయ్యే సరళమైన రచన ఇది..ఈ కవి ఎప్పటి వాడో ఎక్కడివాడో  అని తరచి చూస్తే కరీంనగర్ జిల్లా ధర్మ పురి ప్రాంతం వాడేనని, పదిహేడవ శతాబ్దం ఉత్తరార్థంలోనో పధ్దెనిమిదో శతాబ్ధం పూర్వార్థం లోనో జీవించి ఉంటాడని తెలుస్తోంది. ఇతమిథ్థంగా ఇతని జీవితకాలం తెలియక పోయినా ఆరుద్ర గారు ఇతనిని తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కడపటి రాజుల యుగం (1670-1750) లో చేర్చడం  ఈ ఊహకి కారణం. ఆరుద్ర గారు ఈ కవిని గురించి వ్రాస్తూ  ఈ యుగంలోని శతకాలలో పది పన్నెండు చక్కని పద్యాలు కనబడితేనే ప్రాణం లేచి వస్తుంది. అంతకన్న ఎక్కువ పద్యాలే బాగున్న శతకం దొరికితే కడుపు నిండుతుందంటూ  ఈ శతకం లోని పద్యాల్లోని భావాలూ వాటితో పాటు భాషా కూడా చాలా హాయిగా ఉంటాయి. పద్యం ఎక్కడా కుంటదు.అని మెచ్చుకున్నారు. ( చూ. సమగ్ర ఆంధ్ర సాహిత్యం-సంపుటి 12- పేజీలు 316-17). ఈ కవి తాను పంచ కావ్యాలూ అమరం శాస్త్ర గ్రంధాలూ అవీ చదవ లేదని ఛెప్పుకున్నాడు. అందు చేతనే ఏమో పద్యాలన్నీ  దురవగాహం కాకుండా సరళమై సామాన్యుల ఆదరణకి సైతం నోచుకున్నాయి. సుదూర ప్రాంతాల జనం నోళ్లలో కూడా నానేయంటే వాటి ప్రాచుర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.  ఈయన చెప్పిన పద్యాల్లోని భావాలు కొత్తవి కాకపోయినా తనదైన శైలిలో చెప్పాడు. బురదలో తిరిగే పంది పన్నీరు మెచ్చునా? అని వేమన అడిగినట్లే ఈయన  అల్పజీవులూ దుర్జనులూ  నారసింహ నామ మహాత్మ్యమెరుగలేరని    గార్దభంబున కేల కస్తూరి తిలకంబు మర్కటంబున కేల మలయజంబుశార్దూలమున కేల శర్కరాపూపంబు సూకరంబున కేల చూత ఫలము .. మార్జాలమున కేల మల్లెపువ్వుల బంతి గుడ్లగూబ కేల కుండలములుమహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్ బకసంతతికినేల పంజరంబు...ద్రోహ చింతన జేసేడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేల.. భూషణ వికాస శ్రీ ధర్మ వుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర..” అంటాడు.  మరో మంచి పద్యం చూడండి:
మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు  మాన్యముల్ జెరుప సమర్థులంతఎండిన యూళ్ల గోడెరిగింపడెవ్వడు పండిన యూళ్ల ప్రభువులంత..అతడు పేదయటంచు నెరిగింపడెవ్వడు కలవారి సిరులెన్న గలరు చాల..తనయాలి చేష్టల తప్పెన్నడెవ్వడు పెరకాంత ఱంకెన్న పెద్దలంత..ఇట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి ప్రభుని తప్పటంచును పలుక వలెను.. భూషణ వికాస శ్రీ ధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ”.
 ఇలాంటివే మరికొన్ని మంచి పద్యాలున్నాయి .కొన్ని పద్యాలు చదువుతుంటే దాశరథీ శతక కర్త కంచర్ల గోపన్నని గుర్తుకి తెస్తాయి వాటి ముచ్చట మరోసారి చెప్పుకుందాం. సెలవు.


పైన ఉదాహరించిన పద్యాలకిఅవసరమైన వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో తాత్పర్యాలని ఇస్తున్నాను.
నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత అనే మొదటి పద్యానికి భావం:
శ్రీ నరసింహుని పేరే ఒక మహా మంత్రమనీ, దానిని ఉచ్చరించిన మాత్రాననే భక్తులు తమ పాపాలని తొలగ చేసుకోవచ్చనీ, రోగాలనుంచి కాపాడుకోవచ్చనీ, శత్రువులను సంహరించవచ్చుననీ, యముని బంట్లను కూడా తరిమి వేసి మోక్షమును కూడా సాధించవచ్చనీ కవి చెబుతున్నాడు. ( దండహస్తుడు=యముడు ).
రెండవ పద్యం- గార్దభంబునకేల..... భావం:
అల్పబుధ్ధులకీ దుష్టులకీ మధురమైన పవిత్రమైన నరసింహ నామం రుచించదు. అదెలాగంటే గాడిదకి కస్తూరి బొట్టూ, కోతికి గంధమూ, పులికి  తియ్యని అప్పాలూ, పందికి మామిడిపండూ, పిల్లికి మల్లె పూదండా, గుడ్లగూబకి చెవిపోగులూ, దున్నపోతుకు శుభ్రమైన వస్త్రాలూ, కొంగకి పంజరమూ ఇష్టముండవుకదా? (మలయజము= గంధము, శర్కరాపూపము=చక్కెరతో చేసిన తియ్యటి అప్పము, )
మూడవ పద్యం-మాన్యంబులీయ... భావం:
రాజుల దగ్గరుండే దుష్టులైన అధికార్లు పేదవారికి సహాయం చేయక పోగా అపకారంచేయడానికి  ఎప్పుడూ సిధ్ధమేనని కవిభావం. రాజు చేత భూదానం చేయించడానికి బదులు ఉన్న భూముల్ని లాక్కోవడాని తయారౌతారనీ, పంటలు పండక పోయినా శిస్తుల వసూలుకు తయారౌతారనీ, పేదల గోడుని పట్టించుకునే నాధుడే లేడనీ, ఇటువంటి దుష్టులైన వారికి అధికారమిచ్చిన ఆ రాజుదే తప్పంతా అనీ  కవి భావన.

                                                              ****





జు








14, ఏప్రిల్ 2012, శనివారం

డ.డ్డ..డ్డడ్డ..డబ్బంటే ముద్దా? ము.. మ్ము..మ్ము..మ్ముద్దంటే చేదా?


                     ఓ పాత సిన్మా లో కథా నాయిక కథా నాయకుణ్ణి కవ్విస్తూ ము..మ్ముమ్ముమ్ము.. ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? అంటూ రెచ్చగొడ్తుంది. కానీ కథా నాయకుడుమాత్రం రెచ్చిపోకుండా ముద్దంటే చేదే. నాకా ఉద్దేశం లేదే అంటూ సమాధానమిస్తాడు. ముద్దంటే ఇష్టమున్న వాళ్లకయినా స్థలకాల పరిస్థితులూ అవీ కుదరాలి కదా? అదేకాక ప్రేమానురాగాలు లేనిచోట ముద్దుకూడా చేదుగానే ఉంటుంది. ఆ మధ్య టీవీల్లో  ఏదో దేశంలో ముద్దుల పోటీలు పెడితే ఎంతో మంది జంటలు పాల్గొని గంటల తరబడి ముద్దులు పెట్టుకోవడాన్ని చూశాం. పోటీల్లో గెలవడంకోసం వారంత కష్టపడి అంతంత సేపు ముద్దులు పెట్టుకున్నా వారు కూడా ఎంతోకొంత సేపటికి ఆపక తప్పింది కాదు కదా?  తినగ తినగ వేము తియ్యనౌతుందేమో గానీ తినగ తినగ తీపి కనరెక్కడం అనుభవైకవేద్యమే కదా? భర్తగారికెంతో ఇష్టమని ఇంటి ఇల్లాలు వంకాయో మరోకూరో సంవత్సరంలో మూడు వందల అరవై రోజులూ అదే వండిపెట్టిందనుకోండి, ఎంత భార్యావిధేయుడైన భర్తైనా  ఏదో ఒక రోజు వడ్డించిన విస్తరిని ఆ భార్యామణి నెత్తిన వేసి రుద్దడం ఖాయమనే విషయంలో ఎవరికీ సందేహం ఉండాల్సిన పనిలేదు. మనకెంతో ఇష్టమైన పుల్లారెడ్డి స్వీటైనా ఒకటో రెండో తినగలం కాని అంతకు మించితే మొహం మొత్తడం ఖాయమే గదా? ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానయ్యా అంటే మనకెంత ప్రీతిపాత్రమైనదైనా ఒక హద్దుమీరితే ఇక చాలు బాబో అనిపించక తప్పదని. కానీ లోకంలో దీనికి ఒకే ఒక అపవాదు ఉన్నట్టు కనిపిస్తోంది. అదేమిటయ్యా అంటే డబ్బు.డబ్బు..డబ్బు మాత్రమే.
డబ్బంటే ఇష్టం లేనివాడు లోకంలో కనిపించడు. జీవిక కోసం ప్రతివాడికీ డబ్బు అవసరమే.అందుచేత డబ్బు సంపాదించడం ప్రతివాడికీ తప్పని సరి. మన ధర్మశాస్త్రాలు కూడా అధర్మ మార్గాలలో ధనం సంపాదించకూడదు కానీ ధన సంపాదన ప్రతివ్యక్తి ధర్మమే నని చెబుతున్నాయి. డబ్బు పరమ పాపిష్టిదనీ, ఆప్తులమధ్యనే వైరాలు సృష్టిస్తుందనీ ( మాతా పుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః) అనీ ధర్మ పన్నాలు వల్లిస్తూనే డబ్బు మీది ఆశని చంపుకోలేము. ధనంమూలమిదం జగత్ అంటూ.. ధనమేరా అన్నిటికీ మూలం ధనం విలువ తెలిసికొనుట మానవ ధర్మం అనీ పాడుకుంటాము. గృహస్తు అన్నాక దారా సుత పోషణార్థమైనా ధనం సంపాదించక తప్పదుకదా? గృహస్తులు లేకుండా సంఘమే ఉండదుకదా?గృహస్తులు లేకుంటే సిధ్ధులకైనా పస్తులు తప్పవుకదా?. అందుకే  ప్రవరుడి ఇంటికి వచ్చిన సిధ్ధుడు గృహస్తులు తమవంటివారికి  అంక స్థితార్థ పేటి ( ఒళ్లో పెట్టుకున్న Cash Box ) లాంటివారన్నాడు. కౌపీన సంరక్షణార్ధం ఇయంపటాటోపం అని గోచీ అంటూ పెట్టుకున్నాక సంసార జంఝాటం పెరక్కా తప్పదు. సంసార పోషణార్థం సంపాదనా తప్పదు. సంపాదనంటూ లేని మగాడు గుడ్డి గవ్వపాటి చెయ్యడుకదా?. సమాజమే కాదు పెళ్లాం కూడా లెక్కచేయదు.
గడన గల మగని చూచిన
అడుగులకు మడుగులిడుదురతివలు ధరలో
గడనుడుగు మగని చూచిన
నడపీనుగ వచ్చెనంచు నగుదురు సుమతీ..... అన్నాడు సుమతీ శతకకారుడు.

అందుచేత సంపాదన పురుషుడి విధ్యుక్త ధర్మాలలో ఒకటి అని మనం ఒప్పుకు  తీరాలి.  కానీ అసలు సమస్య అల్లా ఎంత సంపాదించాలి ? ఎలా సంపాదిచాలి? ఎక్కడ ఆపాలీ అన్నదే.  ఈ విషయమై ఏ ఒక్క  నిర్ణయం  అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చుకానీ, ఎవరైనా తన పిల్లలు తమ కాళ్లమీద నిలబడే వరకూ పోషించడానికీ, తమ వృధ్దాప్యంలో ఒకరిపై ఆధారపడకుండా జీవించడానికీ సరిపడా ఆర్జించి పెట్టుకోవడం ధర్మమే అనిపిస్తుంది. కానీ కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరిగిపోని ఆస్తులు సంపాదించేక కూడా వేల కోట్ల సంపాదన కోసం అంగలార్చే వారిని ( వారిలో కొందరి ప్రస్తుత దుస్థితినీ) చూస్తూనే ఉన్నాము. ఇటువంటి సమాజంలో ఉంటూ కూడా  డబ్బంటే గడ్డిపోచతో సమానంగా చూసిన మహానుభావులున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ?.  అలాంటి వారు ఏ కొద్దిమందో మన ఆంధ్రదేశంలోనే ఉండేవారు ఇప్పుడూ ఉన్నారు. వారు ముక్కుమూసుకుని అడవిలో తపస్సుచేసుకునే ముని పుంగవులుకాదు. మనలానే గృహస్థ ధర్మం నిర్వహిస్తూ సంసారాన్ని పోషించుకున్న, కుంటున్నవారే. వారిగురించి తెలుసుకుందాం రండి:
ఒకప్పుడు పిఠాపురాధీశులకి ఒక ధర్మ సందేహం వచ్చింది. దానిని వారి ఆస్థానంలో ఉన్నవారెవ్వరూ తీర్చలేకపోయేరు. వారే కాదు వారి ఆస్థానానికి వచ్చిపోతుండే పండితులు కూడా ఎవ్వరూ వారికి తృప్తి కలిగించే తీర్పు నివ్వలేకపోయారు. అప్పుడు వారికి ఎవరో వింజరంలో ఉండే శాస్త్రిగారొకరు మాత్రమే వారి సందేహ నివృత్తి చేయగలరని విన్నవించారు. అప్పుడు రాజుగారు పల్లకీని పరివారాన్నీ పంపి వారిని సాదరంగా సభకు రప్పించుకున్నారు. సభలో ఆ శాస్త్రిగారు చెప్పిన తీర్పు రాజుగారికే కాకుండా అక్కడున్న యావన్మంది పండితుల ఆమోదం పొందింది. రాజుగారు సంతోషంతో శాస్త్రిగారికి  సత్కారం తలపెడితే శాస్త్రిగారు సున్నితంగా తిరస్కరించారు. రాజుగారు అనేక విధాల బలవంతం పెట్టిన మీదట శాస్త్రిగారు వాళ్ల వూళ్లో ఎప్పుడో పడిపోయి ఎండిపోయిన చింతచెట్టుని కొట్టించుకోవడానికి అనుమతి  మాత్రం ఇవ్వండి చాలని అన్నారు. అదికూడా రాజుగారిని సంతోషపెట్టడానికే.
ఇంకొక సంగతి:
కోటిపల్లిలో  భాగవతి హరిశాస్త్రిగారని సాటిలేని మహా పండితుడొకాయన ఉండేవారు.శిష్యులకు పాఠం చెప్పడం తపస్సు చేసుకోవడం తప్ప ఆవూరు వదలి ఎక్కడికీ వెళ్లి ఎరుగడాయన. ఇలా ఉంటుంటే వారి ప్రజ్ఞ  విని పిఠాపురం రాజుగారైన గంగాధర రామారావుగారికి వారిని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. కానీ ఎంత ప్రలోభపెట్టినా వారెక్కడికీ కదలి రారని తెలిసింది. వారిని ఎలాగైనా దర్శించుకోవాలన్న కోరిక మిక్కుటమై రాజుగారే బయల్దేరి కోటిపల్లి వెళ్లారు. కానీ శాస్త్రిగారు ఎవరికోసమూ దేనికోసమూ బయటకు రారనీ, ఒక్క  స్నానానికి మాత్రం తెల్లవారుఝామునే గోదావరికి వచ్చి వెళ్తుంటారని తెలుసుకుని  ఆసమయంలో  వారికి ఎదురు పడి సవినయంగా మహాత్మా నమస్కారాలు అన్నారు. శాస్త్రిగారు శుభం అంటూ ముందుకు సాగుతుంటే రాజుగారు తాను ఫలానా అని విన్నవించుకుని  తమ దర్శనార్థం వచ్చానని తెలిపారు. శాస్త్రిగారు అయిందిగా అంటూ కదలిపోతుంటే ఒక మనవి అంటూ వారితో తమ పాదపూజ చేసుకుంటానన్నారు రాజుగారు. దానికి శాస్త్రిగారు వద్దు వద్దు గ్రామదేవత గుడి శిధిలం అయిపోతోందని ఊరి ప్రజలు ఆందోళన పడుతున్నారు దానిని బాగుచేయించండి,.వెళ్లండి. వెళ్లండి. అన్నారు. తన కోసం ప్రభువులే కదలి వచ్చి దర్శనం చేసుకుని  కోరిక తీరుస్తానంటే అక్కరలేదనగలగడం అందరికీ చెల్లుతుందా?
పై రెండు వృత్తాంతాలూ శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తన అనుభవాలూ జ్ఞాపకాలూ లో పొందుపరిచేరు కనుక మనకు తెలిసాయి. ఇటువంటిదే నేను విన్నదొకటి చెప్పి ముగిస్తాను.
నా చిన్ననాటి స్నేహితుడొకరు బహుకాలం చాలా విదేశాల్లో వైద్యునిగా పనిచేసి తిరిగి మనదేశం వచ్చేసి విశాఖ పట్టణంలో నివాసముంటున్నారు ఆయనా ఆయన మిత్రులింకొకరూ కలిసి ఒకసారి తూర్పు గోదావరి జిల్లాలో ఒక పల్లెటూళ్లో నివాసముంటున్న ఒక వేద పండితుని దర్శనార్థమై వెళ్లారట. వారి ఇల్లు శిధిలావస్థలో ఉందట. అక్కడ పేదరికం తాండవిస్తోందట.  ఆపండితుని దర్శనం  పూర్తయేక  వారి ప్రక్కనే  3000 రూపాయలుంచి వారికి నమస్కరించేరట. వారు మా మిత్రులని ఆశీర్వదించి వారుంచిన సొమ్ము వైపు వేలు చూపిస్తూ అది తీసుకుపోవల్సిందిగా సైగ చేసారట. చేసేదిలేక మా మిత్రులు దాన్ని వెనక్కి తీసుకుని వచ్చేసారట.
మన సంస్కృతిలో నప్రతిగృహీతృత్వం అనేది ఒకటుంది. దాని అర్థం ఎవ్వరినుంచీ ఊరికినే ఏదీ స్వీకరించరాదని. పైన చెప్పిన ముగ్గురు పండితోత్తములూ అక్షరాలా దానిని పాటించారన్నమాట.
యథా కథం చపరీ పరిగ్రహస్తేనోహ భవతీతి కౌత్సహారీతౌ, కాణ్యపుష్కరసాదీఅనే  ఆపస్తంబ సూత్రానికి పుచ్చుకోవడం ఎలా జరిగినా, అది దొంగతనమే అవుతుందని అర్థమట. కనుక కట్నం పుచ్చుకున్నా లంచం పుచ్చకున్నా అది దొంగతనం కిందే లెక్కన్నమాట.
జీవితంలో ఈ విలువల్ని పాటించ గలిగితే మన సాంప్రదాయంకన్న లోకంలో గొప్పదేముంటుంది?

                                                                             ***

7, ఏప్రిల్ 2012, శనివారం

మడీ..తడీ..గోదావరీ..భాషా...సంస్కృతీ...


మన తెలుగు భాష ఎప్పుడైనా మడి కట్టుకుని కూర్చుందా ?
మా చిన్నతనం లో ఎవరింట్లోనయినా శుభకార్యాలకి భోజనాలకి పిలిస్తే భోజనాల సమయానికి మళ్లా వచ్చి వడ్డన లవుతున్నాయి..మడి కట్టుకోండి అని మళ్లీ పిలిచే వారు. అంటే భోజనం చేయడానికి మడి కట్టుకోని వెళ్లాలన్నమాట. అలాంటి సమయాలలోనే కాదు నిత్యం మాయింట్లో మా తాతగారు స్నానంచేసి మడిపంచ కట్టుకోని మా నాయనమ్మ తీసిన గంధం రాసుకుని దాని మీద బొట్టు పెట్టుకున్నాక కాని భోజనానికి కూర్చునే వారు కాదు. మా నాన్నగారూ వారి అన్నదమ్ములూ వగైరా లందరూ పొత్తి పంచలు కట్టుకుంటే మేం పిల్లలందరం  పొత్తిలాగులు తొడుక్కుని భోజనాలకి కూర్చునే వారం. పెద్దవారు పీటలమీద కూర్చుని భోజనం చేస్తే పిల్లలందరం నేలమీదే కూర్చుని విస్తళ్లలో భోజనం చేసే వాళ్లం. భోజనాలయేక ఆకులు తీసి ఎంగిళ్లు ఎత్తి ఆవుపేడతో అలికి శుభ్రం చేసేవారు. అయితే ఈ ఆచారం మా తండ్రుల తరానికే ఆగిపోయింది. ఇంటికి వచ్చాక ఇంట్లో కట్టుకున్న బట్టలతోనే భోజనం చేయడం అలవాటయ్యింది. నేలమీద కూర్చుని బోజనం చేసే వారం కనుక భోజనానంతరం శుధ్ధి చేసే కార్యక్రమంలో మార్పు లేకుండా కొనసాగింది. మా తరం వచ్చే సరికి డైనింగ్ టేబిలు మీద తినడం ప్రారంభమైంది. బయటకు వెళ్లేటప్పుడు వేసుకునే డ్రస్సుతోనే కుర్చీలో కూర్చుని తినడం మొదలైంది. టేబిలు కూడా స్పాంజితో తుడిచి శుభ్రం చేయడమే. మరీ ఈ మధ్య కంచాల్లో అన్నం పెట్టుకుని టీవీ ముందు కూర్చుని తినడం, తిన్నకంచాలను సింకులో వేసేసి చెయ్యి కడిగేసుకోవడం తో సరిపోతోంది. ఈ రోజుల్లో ఎవరింటికి శుభకార్యాలకి వెళ్లినా  బయట తిరిగిన బట్టలతోనే బఫే పధ్ధతిలో ప్లేటుపుచ్చుకుని దానిలో కావలసినది మనమే వేసుకుని తినడం తప్పని సరైంది కదా? మడి కట్టుకుని భోజనం చేయడమన్న ప్రశ్నే లేకుండా పోయింది. మా నాయనమ్మ పొద్దున్నే మడికట్టుకుని వంట ప్రారంభిస్తే మళ్లీ అందరి బోజనాలయేక తాను కూడా మడిగా తినేంత వరకూ మడి పాటించేది. ఈ లోగా ఎప్పుడైనా కాలకృత్యాలకు వెళ్లవలసిన అవసరమొస్తే మళ్లా స్నానం చేసి మడికట్టుకునేది.
ఏది మడి అనే విషయంలో కూడా భిన్నాచారా లున్నాయనిపిస్తోంది. సదా చారపరులైన శ్రీ వైష్ణవుల ఇళ్లల్లో పూర్తి నగ్నంగా ఉండి వంట చేసుకుంటారని విన్నాను. మరి కొందరిళ్లలో తడిబట్టకట్టుకుంటేనే మడి.( మా ఇళ్లలో తద్దినాలు పెట్టినప్పుడు మాత్రం తడి బట్టలతోనే వంటలు చేసే వారు) మరికొందరు ఆచారపరులకి రంగు బట్ట మడికి పనికి రాదట..( ఈ విషయం దాశరధి రంగా చార్య గారి జీవన యానంలో చదివినట్టు గుర్తు. వారింట్లో ఆడవారెవరో  మడిగా ఆరేసిన రంగుచీర కట్టుకుని వడ్డిస్తుంటే వాళ్లఇంటికి  చుట్టంగా వచ్చిన పెద్దావిడ రంగుచీరతో మడేవిటని ఆనాచారమంటూ ఆడిపోసుకుంటుంది.). మరి ఈ నాడు ఏ బ్రాహ్మణుల ఇళ్లల్లో కూడా ఈ మడి ఆచారాలు కొనసాగుతున్నాయని నే ననుకోను.( ఎక్కడో వెయ్యిలో ఒక్కరు కొన్ని కొన్ని సమయాలలో వారికి వీలైన మడి పాటిస్తూ ఉండవచ్చు అది అపవాదమే అవుతుందిగాని సంఘం పాటిస్తున్న సాంప్రదాయం అనిచెప్పలేం.) ఛూసేరా ఎంతలో ఎంత మార్పు?
భోజనాదికాలలోనే కాదు వస్త్ర ధారణ లో కూడా ఎంతో మార్పు వచ్చింది. మా తాతగారు మా నాన్నగారు పంచలే కట్టుకుని మీద చొక్కాతొడుక్కుని ఉత్తరీయం వేసుకునే వారు. అసలు బ్రాహ్మడనేవాడు చొక్కా వేసుకోవడమే అనాచారమట. శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వారి నాన్నగారు తిడతారని చొక్కా తీసుకెళ్లి వీధి చివరకెళ్లాకనే వేసుకునే వారట. మా బాబాయిలూ మేమందరం పంచలేనాడూ కట్టి ఎరగం( ఏదో శాస్త్రవిధులు నిర్వహించినప్పుడు తప్ప). పంచలు కట్టుకోవడం కూడా నేడు చాలా మందికి రాదు. ఆంధ్రుల్లో చాలా కాలం క్రితం స్త్రీలు రవికలే వేసుకునే వారు కారట.ప్రతిష్ఠానపురం (నేటి పైఠాన్) ఆంధ్రుల రాజధాని అయిన తర్వాత తెలుగు వనితలు రవికలు వేసుకోవడం నేర్చుకున్నారట.( ఇప్పటికీ కొంచెంకొన్నాళ్లక్రితంవరకూ చాలా మంది నాయురాళ్లు ఉత్తరాంధ్రప్రాంతంలో రవికలేసుకోకుండా కనపడతారు. చీర కట్టులో కూడా తేడాఉంది. మామూలుగా కుచ్చిళ్లుపోసి కట్టుకుంటే మడికి పనికి రాదు. కాసెపోసి కొంగు వెనక్కిదోపికట్టుకోవాలట.( మావైవు దీనిని అడ్డకట్టుఅనేవారు. మడికావాలంటే ఇలా కట్టుకునే వారు.)
బ్రాహ్మడనేవాడికి క్రాఫింగు పనికిరాదు. ముందువైపు జుట్టు అసలే ఉండరాదు.వెనుకవైపుకొంతజుట్టు పిలకా ఉండితీరాలి. దాశరధి రంగాచార్యగారితండ్రి మరో శ్రీ వైష్ణవుణ్ణి ముందుజుట్టవాడు అంటూ ఆక్షేపిస్తాడు. ఈ రోజుల్లో ఎవరైనా పిలక పెట్టుకుని చొక్కాలేకుండా ఆఫీసులలో పనిచేయగలమా? మన పిల్లలను ఆవిధంగా బడికి పంపగలమా?.
ఇక్కడ ఒక్కవిషయం మననంచేసుకోవలసిఉంటుంది. ఆచారాలు ఏ కాలంలోనూ ఒక్కలాగాలేవు. అనేకానేక మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నీ కూడా మన సాంప్రదాయంలోని భాగంగానే గుర్తించాలి. తప్పదు. ఈ సాంప్రదాయంలో మార్పులు రావడమనేది మన ఆంధ్రులకే కాదు.అన్ని సమాజాలలోనూ జరిగింది. మారుమూలనుండే ఆటవిక సమాజాల్లోకూడా ఎంతో మార్పుకనిపిస్తోంది. ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు.

                                                                                   ****
మన ఆదికవి నన్నయగారు రాజమహేంద్రవరతీరాన పవిత్రగోదావరిలో స్నాన మాచరించే భారతాంధ్రీకరణ మొదలెట్టారు. అదే ఏరు ఇప్పుడూ రాజమండ్రి ఒడ్డున పారుతూ ఉంది. దానిని గోదావరి అనే పిలుస్తునే ఉన్నాం.  అయితే అప్పటి నీరుఉందా? క్షణ క్షణం కొత్తనీరు పారుతూనే ఉంటుంది.శతాబ్దాల కాలంలో  గోదావరి ఎంతో కొంత తన ప్రవాహ దిశనీ మార్చుకునే ఉంటుంది. అయినా అది గోదావరే కదా? ఇంకో విషయం. గోదావరిలో అనేక ఉపనదులూ పిల్లకాలువలూ వాగులూ వంకలూ వచ్చిచేరాయి. వీటన్నిటి కలయిక వల్లా గోదావరి పరిపుష్టమై జీవనది అయింది.కానీ దానికి నష్టమేమీ కలుగలేదు.వాటివల్ల గోదావరి కలుషితమైపోయిందనీ మైల పడిపోయిందనీ భావించడం తగదు.మనకెప్పటికీ అది పవిత్రమైన దక్షిణగంగ. గోదావరి గోదావరియే.
                                                                                  ****

మన తెలుగు భాష కూడా జీవనది గోదావరి లాంటిదే. ఎన్నో కొండవాగుల్నీ ,పిల్లకాల్వల్నీ,ఉపనదుల్నీ కలుపుకుని తెలుగు నేలపై నదీమతల్లిగా భాసిస్తున్న గోదావరిలానే. మన తెలుగు కూడా శతాబ్దాలకాలంలో మార్పులూ చేర్పులూ పొందుతూ ఈ నాటి ఈ రూపాన్ని సంతరించుకుని ఉన్నాది. నన్నయ కాలంలోని నీళ్లు గోదావరిలో లేనట్లే ఆనాటి తెలుగు కూడా అదే రూపంలో మనకు లేదు. నన్నయనాటి వ్యావహారిక భాషా స్వరూపం ఎలా ఉండేదో మనకు తెలియదు కానీ నన్నయగారి భారతాంధ్రీకరణతో మొదలై మన గ్రాంధిక భాష మాత్రం తత్సమ తద్భవాలతో నిండి పోయి తెలుగు దనాన్ని కోల్పోతూ వచ్చింది.తర్వాత శతాబ్దాల తరబడి మన తెలుగు కవులు తమ ప్రబంధాలలో సుదీర్ఘమైన సంస్కృత సమాసాల్ని గుప్పించడమే గొప్పకవిత్వంగా భావించారు. తేలికైన,అందమైన తెలుగు పదాలు మన కావ్యాల్లో చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది ఇలా ఉంటే మన తెలుగు వ్యావహారిక భాషను కూడా సంస్కృతం ముంచెత్తింది. తెలుగు వారైన పండితులూ కవులూ చదువంటే సంస్కృతమే చదువనీ తెలుగు ఎందుకూ పనికి రాని భాష అనీ సభ్య భాష కాదనీ నిరాదరించేరు.తెలుగులో కవిత్వంచెయ్యడం పతనమనిన్నీ అప్రతిష్ఠాకరమనీ భావించేరు. తెలుగు కావ్యాలు చదవడం ఒక చదువు కాదనీ  భావించేవారు. అంతే కాదు తెలుగులో పండితులే కాదు సంస్కృతం రాని వారుకూడా సంస్కృతంలోనే త్వం శుంఠ అంటే త్వం శుంఠ అనో కష్టముష్టింపచా అనో తిట్టుకునేవారు. ఇంట్లో ఆడవారితో మాట్లాడి నప్పుడు కూడా వీలైనన్ని సంస్కృత పదాలు వాడేవారు. నెయ్యి అనేవారు కాదట ఆజ్యం అనే అనేవారు.న పెళ్లి అనకూడదట వివాహం అనే అనాలట. మంచినీళ్లు అంటే పామరుడికింద లెక్క. మంచితీర్థం అంటేనే గౌరవం. ఇలాంటి కొన్ని విషయాలు శ్రీపాదవారు తమ అనుభవాలూ జ్ఞాపకాలూ లో గ్రంధస్థం చేసారు.పండితుల్నీ పెద్దల్నీ చూసి పామర జనంకూడా తమదైన శైలిలో ఆ మాటల్ని వాడుకుంటూ ఉంటారనడానికి ఒకటి రెండు మాటలు మచ్చు చూపిస్తాను.
ఇప్పుడు ఎక్కువ మంది తెలుగువారు మజ్జిగ అని వ్యవహరిస్తున్న దానికి అచ్చతెలుగు పదం చల్ల అనేది ఉంది. ధీనిని మాండలికమని శ్రీ బూదరాజువారు అన్నారుకానీ ఆ భావన సరికాదని నేననుకుంటాను. ఎందుకంటే మా ఉత్తరాంధ్రలోనే కాకుండా సుదూర ప్రాంతాల్లో కూడా వినిపించిన మాట ఇది. మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణా అనే పాటలోనూ, శ్రీ నాథ కవి వీధిలో.. చల్లాయంబలి త్రావితిన్ అనే చోట్ల కనిపిస్తుంది. ఇదే కాదు ఖమ్మం జిల్లాలో పుట్టిపెరిగి హైదరాబాదులో నివాసం ఏర్పరచుకున్న దాశరథి రంగాచార్యగారూ తన జీవన యానంలో ఈ పదం వాడేరు. రంగుల కల సినిమా తీసిన బి.నరసింగరావు నిజామాబాదు జిల్లాలో తమకున్నగడీలో వారి అమ్మగారు అందరికీ చల్లపోస్తూ ఉండేవారని వ్రాసేరు.ఇంత వైశాల్యంలో వాడుకలో ఉన్న పదం కనుమరుగై దాని స్థానాన్ని మజ్జిగ అనే తద్భవ పదం ( సంస్కృతపదం మార్జిక) ఆక్రమించుకోడానికి కారణం మన తెలుగు వారికి సంస్కృతం పట్లగలదురభిమానమే. శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగారి తాతగారు వారి నాయనమ్మగారిని ఏ రోజైనా మజ్జిగ పల్చబడ్డదేం అని అడగడానికి తక్రం ఉదశ్విత్తు అయిందేం అని అడిగే వారట. ఛూడండి ఆ భాషా భేషజం.మన పూర్వులైన పండితులందరికీ తెలుగంటే చిన్న చూపు. సంస్కృతమంటే వల్లమాలిన గౌరవం. అది వారి దృష్టిలో దేవభాషే. ( కన్యాశుల్కంలో భోజనాల సమయంలో గిరీశం నోటంట రెండు ఇంగ్లీషు ముక్కలు వచ్చే సరికి అగ్నిహోత్రావధాన్లు అదేమన్నా దేవభాషా అను విసుక్కుంటాడు.సంస్కృతమైతే దేవభాష కనుక తప్పులేదని మనం ఇందాక చూశాం. సంస్కృతం దేవభాష. గీర్వాణం.  సరస్వతీదేవి గీర్వాణి. ఇప్పుడు ఇంగ్లీషు వస్తే ఎంత గొప్పో అప్పుడు సంస్కృతం వస్తే అంత గొప్ప అన్నమాట. మా చిన్నప్పుడు ఎవరైనా టెక్కుచూపిస్తే వాడికెంత గీర్వాణం అనే వారు. అంటే అది టెక్కుకు పర్యాయపదం అయిపోయిందన్నమాట. మా పిల్లలం కూడా తోటి కుర్రాడెవరైనా టెక్కు చూపిస్తే వాడికి మహా గీర అంటూ ఉండేవారం. ఈ గీర అనే పదం గీర్వాణం నుంచి పుట్టినదే.
ఈ సంస్కృత పదాల వాడుక శిష్టులనుంచి గ్రామీణులలోకి ఎలా వ్యాపించిందో చూపిస్తాను చూడండి:
శ్రీ గంటేడగౌరునాయుడు ఉత్తరాంధ్ర పలుకు బళ్లకి పట్టం కడుతూ వ్రాసిన కళింగోర లో నాయురాలు సోములమ్మఒక కష్టమొచ్చినప్పుడు తనకి అరనశరనాలు ఆడలేదంటుంది. ఇవి అరనశరనాలు కావు. కరచరణాలకొచ్చిన తిప్పలు. సంస్కృతంలోంచి దిగుమతిచేసుకుని  శిష్టులెవరో వాడితే వారినుంచి నేర్చుకున్నది. కాళ్లూ చేతులూ ఆడడం లేదన్నది చక్కని తెలుగు నుడికారం.క్లిష్టసమయాల్లో ఏచేయాలో తోచకపోతే కాళ్లూ చేతులూ ఆడవు. సంస్కృతం తెలుగుని ఎంతలా ముంచెత్తిందో చెప్పడానికి పై విషయాలు చెప్పాను. ఇలా ఎన్నైనా చెప్పవచ్చు.కానీ ఈ వ్యాస ప్రయోజనం అదికాదు. మన తెలుగువారు సంస్కృతాన్ని అవసరానికి మించి దిగుమతిచేసుకుని తెలుగుని సంస్కృ త పదభూయిష్టం చేసారని చెప్పడమే. మన తెలుగు నిఘంటువుల్లో ఎనభై శాతం పైనే సంస్కృత పదాలు అతి తక్కువ తెలుగు పదాలు కనిపిస్తాయి. మన నిఘంటువుల పేర్లే సంస్కృతంలో ఉంటాయి.
సంస్కృతం తర్వాత పార్శీ అరబిక్ ఉర్దూ పదాలు మన భాషలో చాలా చేరాయి.ఈ చేరడం 14వ శతాబ్ది నాటికే జరిగింది. తిక్కన భారతంలోనే త్రాసు (తరాజునుంచి వచ్చినది) కనిపిస్తుంటే అప్పటికి మన వాడుక భాషలో ఎన్ని పదాలు చేరిపోయాయో. ఆ తర్వాత శ్రీ నాథ మహాకవి కూడా యదేఛ్చగా ఈ భాషల పదాల్ని వాడేడు.అంటే అప్పటికే అవి జనసామాన్యం మాట్లాడే భాషలో అంతర్భాగమై పోయాయని మనం గుర్తించాలి. తరువాత ఎందరో తెలుగు కవులు ఉర్దూ పార్శీ పదాల్ని తమ కవిత్వంలో వాడేరు.ఈ భాషల పదాలు కూడా మన తెలుగులో ఎంతలా కలిసి పోయాయంటే అవి తెలుగు పదాలు కావని చాలా మందికి తెలీదు.( ఈ పదాలగురించి మరో సారి వ్రాస్తాను). ఈ భాషల తర్వాత ఆంగ్ల భాషా ప్రభావం ఇతర  భారతీయ భాషల్లాగే మన తెలుగు మీద కూడా పడ్డది. మన ముత్తాతలు సంస్కృతాన్ని కావిలించుకున్నట్టే మన తాతలు తండ్రులు  ఇంగ్లీషుని కావిలించుకుని అక్కర లేని ఆంగ్ల వదాల్ని కూడా దిగుమతి చేసుకున్నారు. వాటికి సమానార్థకాలైన తెలుగు పదాల్ని మరచి పోయేలా చేసారు. ఇదంతా గతం. ఇప్పుడు దానినేమీ చేయలేం. ప్రపంచంలోని ఏ భాషకైనా ఈ స్థితి తప్పదు.
మనం ఇప్పుడు మన భాషని కాపాడుకోవాలంటే మనం మనకు తెలిసిన తెలుగు పదాల్నే వాడుతూ మాట్లాడాలి. పిల్లలచేత మాట్లాడించాలి.
ఎక్కడో మారుమూలనున్న తెలుగు పదాల్ని వెలికితీసి వాటిని వాడుకలోకి తెద్దామనేది సంతోషదాయకమైనదే అయినా వృధా ప్రయాస. అవి జనంలోకి వెళ్లవు.కొత్తగా వచ్చిన పనిముట్లకీ పరికరాలకీ వాటికి వాడుకలో నున్న ఇంగ్లీషు పేర్లనే అజంతం చేసి తెలుగు పేర్లు అని అనుకోవాలి. మనం ఇప్పుడేవో కొత్తపేర్లు సృష్టిస్తే అవి జనంలోకి వెళ్లవు. మొన్న ఉగాది రోజున కవి శ్రీ జొన్న విత్తుల రామలింగేశ్వరరావుగారు సాక్షి ఛానెల్లో తెలుగు కార్యక్రమమేదో నిర్వహిస్తూ కంప్యుటర్ కి తాను అన్నీఅని నామ కరణం చేస్తున్నానన్నారు. ఈ పదం వచ్చే ఉగాదినాటికయినా పదిమందైనా వాడుతారని నాకు నమ్మకం లేదు. కంప్యుటరు అని తెలుగు చేసుకుంటే వచ్చిన నష్టమేమీ లేదు.వందల ఏళ్లుగా మన తాతలుఅంగీకరించి అన్యదేశ్యాలకి కావ్యగౌరవం కూడా కల్పించి ఉండడం చూసికూడా మనం ఇవాళ మడి కట్టుక్కూర్చుంటామంటే అది జరిగే పని కాదని నా నిశ్చితాభిప్రాయం. ఈ పదాలు మన భాషలో చేరడంతో మన భాష ఏమీ మైల పడదు.కొంతమంది ఛాందసంగా మనం సంస్కృతం నుంచి తెచ్చుకోవచ్చుకాని ఇతర మ్లేఛ్చభాషలనుంచి తెచ్చుకోకూడదనే భావన వ్యక్తం చేస్తూ ఉంటారు. వారికి తెలుసునో తెలియదో కానీ మన పండితుల దృష్టిలో  సంస్కృతం వినా మిగిలిన భాష లన్నీ (తెలుగుతో సహా) మ్లేఛ్చ భాషలే.. వీరి ద్విభాషా పరిశుధ్దవాదం (Bilingual Puritanism)  ఏనాడూ ఏ దేశంలోనూ నిలబడలేదు. అందు చేత కొత్తగా వచ్చి చేరుతున్న పరికరాలకి మనం కృత్రిమంగా పేర్లు పెట్టి ఏదో సాధిద్దామనుకోకుండా వాటినలాగే స్వీకరిస్తూనే,మన భాప మౌలిక స్వరూపం చెడిపోకుండా కాపాడుకుంటూ భాషా వ్యాప్తికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.
చెప్పవలసినవీ చెప్పదల్చుకున్నవీ చాలా విషయాలే ఉన్నాఇప్పటికింతటితో ముగిస్తున్నాను. సెలవు.