22, ఆగస్టు 2012, బుధవారం

మోసం గురూ... కుడి యెడమల దగా..దగా..




కన్యాశుల్కంలో తాను అగ్నిహోత్రావధాన్లు కూతుర్ని లుబ్ధావధాన్లు కిచ్చి వివాహం చేయించడానికి చేస్తున్న ప్రయత్నం అంతా మోసం అని అన్న మధురవాణితో రామప్ప పంతులు,అది మోసం కాదనీ లౌక్యం అనీ దానిని లౌక్యం అని అనమంటాడు. రెండిటికీ ఏమిటో తేడా అని అడిగిన మధురవాణికి నమ్మిన చోట చేస్తే అది మోసమనీ నమ్మని చోట చేస్తే అదిలౌక్యమనీ అంటాడు.దానికి మధురవాణి తాను చేస్తే లౌక్యం మరోడు చేస్తే మోసం అనరాదా? అబధ్ధానికి అర్థమేమిటి?”. అంటుంది. తాను చేసే తప్పుడు పనులకి రామప్ప పంతులు లౌక్యం అనే ముద్దు పేరు పెట్టుకున్నా అది మోసం కాకుండా పోదు. రామప్ప పంతులు పనుపున ఢబ్బుకు కక్కుర్తి పడి,సిధ్ధాంతి లుబ్దావధాన్లుతో పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసి వస్తుంది లేకపోతే మారకం ( చావు) వస్తుందని చెప్పడమూ,దానికి పండా గారు వంత పాడడమూ కూడా మోసం క్రిందకే వస్తాయి.
మనని బాగా తెలిసిన వారిని,మనమీద నమ్మకం ఉన్న వారిని లేదా పూర్తిగా తెలివి తక్కువ వారినీ అవలీలగా మోసం చేయవచ్చు. ఒక షాహుకారు గారిని ఇవాళ లాభాలు ఎలా ఉన్నాయయ్యా అని అడిగితే ఏం పెద్దగా లేవండి.ఇవాళ తెలిసినవారూ తెలివి తక్కువ వాళ్లూ ఎవరూ రాలేదండి అన్నాడుట. తెలివి తక్కువ వాళ్ళని సరే, మనని నమ్మిన వాళ్ళని మోసం చేయడం అంత తేలికన్నమాట.
ఈ విధంగా మోసం చేయడం ఇవాళ్టిదో నిన్నటిదో కాదు. మన భారత యుధ్ధకాలం లోనే ధర్మ రాజు గారు అశ్వథ్థామ హతః కుంజరహః అని పలికి తాను అబధ్ధమాడని సత్య హరిశ్చంద్రుడని నమ్మిన వారిని మోసం చెయ్యలేదా? కుంజరహః అన్నమాట మెల్లగా పలికి తాను అబధ్ధమాడలేదని తనది లౌక్యమేనని తనను తాను రామప్ప పంతులు లాగా సరిపెట్టుకున్నా ధర్మ రాజు చేసింది మోసం కాకుండా పోదు. ధర్మ రాజే కాదు కురు పితామహుడైన భీష్మాచార్యుల వారు కూడా ఇలాంటి లౌక్యానికే (లేక మోసానికే) పాల్పడ్డారు.అదెలాగో కొంచెం వివరిస్తాను.
.దక్షిణ గోగ్రహణం నాటికి 13 సంవత్సరాలు ( 12 ఏళ్లు అరణ్య వాసము+ 1 సంవత్సరం అజ్ఞాత వాసము) పూర్తి కాలేదని దుర్యోధనుని నమ్మకం. నీతి వేత్త యిన భీష్ముని ఈ విషయమయి అడిగితే ఆయన చెప్పిన సమాధానం చూడండి:
రెండవ యేట నొక్కండధిమాసమి
ట్లేతక్కిన యన్నెల లెల్ల గూర్చి
కొనం బదమూఁడు హాయసములు దప్పక
నిన్నఁటి తోడనె నిండెనంత…”
అన్నాడట. సూర్యుని చుట్టూ భూమి (365 రోజుల ఆరు గంటలలో) ఒక ప్రదక్షిణం పూర్తి చేస్తేనే ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. అలా లెక్క చూస్తే అప్పటికి 13 సంవత్సరాలూ పూర్తి కాదు. కాని అధిక మాసాల్ని లెక్కలోకి తీసుకుంటే 13 సంవత్సరాలూ ముందురోజుకే పూర్తయ్యాయిట. చాంద్రమానంలో ఈ అధిక మాసాలనేవి ఈ లెక్కను సరిచేయడానికి ఏర్పడ్డవే గాని వేరు కాదు.అందుచేత అవి లెక్కలోకి రావు కదా? మరి ఈ ఆచార్యుల వారి లెక్క ఏమిటి? పాండవ పక్షపాతంతో పలికిన లౌక్యపు (మోసపు) మాటలే కదా?
ఈ లౌక్యం అనబడే మోసం అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ అన్నిజాతులలోనూ అన్ని వృత్తుల వారిలోనూ ఉంది.అమాయకులైన రోగులు తమను నమ్మి తమ వద్దకు వస్తే వారికి అనవసరమైన పరీక్షలు చేసి శస్త్ర చికిత్సలకు పాల్పడే వైద్యులు ఎందరో కదా? ఇది కొత్తేమీ కాదని మనకు బెర్నాడ్ షా వ్రాసిన The Doctor’s Dilemma అనే ఇంగ్లీషు నాటకం కాని దాని పీఠిక గాని చదివితే అవగతమౌతుంది. న్యాయవాదుల్లో సగం మందికి తాము అన్యాయం పక్షాన వాదిస్తున్నామని తెలిసే ఉంటుంది.అయినా ఆ విషయం వారు తమ కక్షిదార్లకి చెప్పరు కదా? ఒక వృత్తి అని కాదు. మోసం చేయడానికి అవకాశం ఉన్న చోటల్లా అమాయకుల్ని మోసం చేసే పెద్ద మనుషులు ఉండనే ఉంటారు. పుర జనుల హితాన్ని కోరి వారికి సరైన దిశానిర్దేశం చేయవలసిన పురోహితులకి సంబంధించిన రెండు ముచ్చట్లు నేను చదివినవి మీకు మనవి చేస్తాను.
చాలా కాలం క్రితం ఆంధ్ర దేశం లో ఒక జమీందారు గారు ఒక సారి దేవీనవరాత్ర పూజకు సంకల్పించారట. వారి యెస్టేటు లోనే ఉంటూ శ్రౌత స్మార్తాలలో చాలా గట్టివాడయిన ఒక పండితుడిని పిలిచి పూజా విధి విధానాల గురించి అడిగితే ఆయన పూజా కార్యక్రమం జరిగినన్నాళ్లూ మధుమాంసాదులున్నూ స్త్రీ సంబంధమున్నూ విడిచి పెట్టాల్సిఉంటుందని చెబుతూ మహా భోగులయిన రాజా వారికి ఈ చివరి విషయం కష్ట సాధ్యం కనుక జనానా వారితో అయితే దోషం కాని రాజ దాసీ దేవ దాసీలతో సంగమమయితే తప్పులేదని వారికి మార్గాంతరం కూడా చెప్పాడట.( ఏ శాస్త్రాలలో అయినా ఇలాటిది ఉంటుందా?) ఆ విధంగా పూజాదికాలు రాజావారు నిర్వహిస్తున్న రోజుల్లోనే తిరుపతి వేంకట కవులు ఆ ఆస్థానానికి రావడం జరిగింది. అప్పుడా పండితుడు వారిని సమీపించిఅయ్యా నేను తెలిసో తెలియకో రాజుగారితో ఈ విధంగా చెప్పి ఉన్నాను.వారు మిమ్ములను ఈ విషయమయి ప్రశ్నిస్తే నా మర్యాద కాపాడవలసిందని ప్రార్థించాడట. రాజా వారు ఆ విషయమయి వీరిని అడగడము జరుగలేదనుకోండి.అయినా తెలిసి కూడా పండితుడు రాజు గారితో అలా చెప్పడం మోసమే కదా? ఇంత కంటె తమాషా అయిన మరో ముచ్చట మనవి చేస్తాను వినండి:
ఒకప్పుడు ఒక పల్లెటూళ్లో మహా ధనికుడైన పెధ్దమనిషి ఉండేవాడట.ఆయనకు యజ్ఞం చేసి ఆ పుణ్యం కాస్త దక్కించుకోవాలనే ఉద్దేశం కలిగింది.యజ్ఞం చేస్తే గోవులను దానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అతని దగ్గర గోవులు లేవట.అందు చేత ఒక వైదికుని పిలిచి నూరు గేదెలిస్తానని తనచేత యజ్ఞం చేయించవలసిందని అడిగాడట. ఆ వైదికుడు దానికి ఒప్పుకుని ఇద్దరు ముగ్గురు సహాయకులకు హోమకుండంలో సమిధలు ఆజ్యం వేసే పధ్ధతులు నేర్పించి తనతో తెచ్చుకుని యజమానిని హోమగుండం ముందు కూర్చో పెట్టుకుని యజ్ఞం చేయనారంభించాడట. కర్రాయ స్వాహా కంపాయ స్వాహా అని ఈ వైదికుడు ( ఆధ్వర్యునిగా) మంత్రాలు చదువుతుంటే హోతలు చితుకులు వేస్తూ యజ్ఞం చేస్తున్నారట.అంతలో అక్కడికి వచ్చిన పండితుడొకడు అది చూసి ముక్కున వేలేసుకుంటుంటే అప్పుడా పురోహితుడుమహా మూర్ఖస్య యాగోయాం మహిషీ శతదక్షిణాం తవాప్యర్థం మమావ్యిర్థం తూష్ణీం తిష్టస్వ పండితోం స్వాహా అని హోమకుండం లో సమిధ వేసి ఆజ్యం పోసాడుట.ఆ వచ్చిన పండితుడు తాను కూడా ఇంత ఆజ్యం పోసి అషైతే మాభాగా ఇదం న మమ అని అన్నాడట. ఆ విధంగా యజ్ఞం పూర్తి చేసి ఆ బ్రాహ్మలిద్దరూ చెరి యాభై గేదెలనూ పంచుకుని చక్కా పోయారట. ఈ కథ మన ఆంధ్ర దేశం లోనే కాకుండా యావద్భారత దేశం లోనూ ప్రచారం లో ఉందంటారు ఇది మనకు చెప్పిన శ్రీ రాంభట్ల కృష్ణ మూర్తి గారు.
అయ్యా ఇదీ సంగతి.అమాయకంగా కనిపిస్తూ మనం అందరినీ నమ్మేస్తే వారు వారి లౌక్యంతో మనల్ని ముంచేయడం ఖాయం. అందుకే అన్నాడు మహా కవి కుడి యెడమల దగా దగా..అని. తస్మాత్ జాగ్రత..

18, ఆగస్టు 2012, శనివారం

నాసికోపాఖ్యానం..లేక నాసికా సాముద్రికం..అనబడే..ముక్కు జోస్యం కథ..




ముక్కుమీది కోపం నీ ముఖానికే అందం అంటాడో సినీ కవి. కోపం ముక్కుమీద ఉండడమేమిటి? అక్కడేమీ కనిపించదు కదా? కోపం మన కళ్ళల్లో కదా కనిపించేది? అంటే నిజమే. కోపం మన చూపుల్లోనే కనిపిస్తుంది. ఎంతటి శాంతమూర్తులకైనా ఏదో సమయంలో కోపం రాకా తప్పదు. అది వారి కళ్ళల్లో కనిపించకా తప్పదు. కాని ముక్కుమీది కోపం అనే నానుడికి అర్థం వేరు. అతి తొందర గానూ అనవసరంగానూ కోపం తెచ్చుకునే వారి విషయంలోనే ఇలా అంటారు. ఎందుకనంటే ఎవరికైనా తమ శరీర భాగాల్లో అన్నిటి కంటే ముందుకు ఉండేది తమ ముక్కే
.( బొజ్జలు బాగా పెంచుకున్నవారు మాత్రమే దీనికి అపవాదం). అందుచేత ముక్కుమీద కోపం అంటే కోపిష్టులకు వారికంటే ముందే వారికోపం ఉంటుందన్నమాట. ముక్కు మూసుకుని ఘోరమైన తపస్సు చేసి ఎన్నో శక్తులను పొందిన ముని వర్యులలో కూడా తమ కోపాన్ని అణచు కోలేక ఎవరెవరికో శాపాలనిచ్చి తమ తపఃఫలాన్ని వృథా చేసుకున్నవారూ ఉన్నారు. అందులో దూర్వాస మహర్షి అగ్రగణ్యుడు.ఆయనకు కోపం ఆయన ముక్కుమీదే ఉండేది. అయిన దానికీ కాని దానికీ శాపాలిస్తూ ఉండేవాడు. అందుకే మన వాళ్లు కోపిష్టి వాడిని చూస్తే వాడో దూర్వాసుడు రా అంటారు.
మన పెద్ద వాళ్లు ఏ పిల్ల అయినా అందంగా ఉందని చెప్పేటప్పుడు కన్ను ముక్కు తీరుగా ఉన్నాయని చెబుతారు. అంటే మిగతా అవయవాలకి ఇవ్వని ప్రాముఖ్యత ఈ రెండిటికి ఇచ్చినట్లే కదా? ( కొంతమందికి మాత్రం ఆ పిల్ల వెనకాల ఉండే ఆస్థి మాత్రమే అందంగా కనిపిస్తుంది ).  సర్వేంద్రియాణాం నయనం ప్రధానం కనుక కళ్ళు,వాటి తర్వాత ముక్కు తీరునే చూస్తారన్నమాట. మనిషి సౌందర్యంలో ముక్కుకు ఉన్న ప్రాధాన్యం అటువంటిది. పంచేంద్రియాలలో ముక్కు స్థానం పదిలం. అందుకే లక్ష్మణస్వామి వారు శూర్పణఖకి ముక్కు చెవులు మాత్రం కోసి పంపించి వేసారు. అదే పెద్ద శిక్ష. 
రోజుల వయసులో ఉన్నలేలేత పిల్లలలో కొందరికి ఒళ్లంతా పచ్చగా ఉంటుంది. ముక్కు మీద చెవుల వెనకా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి పిల్లలకు వచ్చే పచ్చకామెర్లే కారణమట.వారిని
రోజూ ఉదయ కాలపు నీరెండలో కాసేపు ఉంచితే అదే తగ్గి పోతుంది. ఇలా చంటి పిల్లల ముక్కులు పచ్చగా ఉండడం చేతనే మన వారు వారిని ముక్కు పచ్చలారని ముద్దుబిడ్డలన్నారు. ( దీనినే ఇంగ్లీషు వారు కొంచెం వెనక్కివెళ్లి still green behind the ears అన్నారు). ఇక్కడా మన వారు మాత్రం ముక్కునే తలచుకున్నారు.
ముక్కుకు ముక్కెర అందం అన్నాడు మరో సినీ కవి. అందమైన ముక్కుకు ఆభరణం ముక్కు పుడక. మంచిరోజు చూసి ఆడ పిల్లకు ముక్కు కుట్టించడం కూడా ఒక పండుగే. ఇప్పుడంటే నవనాగరీకమైపోయారు గానీ,ఆంధ్ర దేశంలో ముక్కుకు ముక్కు పుడక లేని స్త్రీలు ఉండేవారు కాదు. (ముద్దుకు అది ప్రతిబంధం అయినా సరే.) మన మగువల సౌందర్యాభిలాష అటువంటిది మరి. వజ్రమో మెరిసే రాళ్లో పొదిగిన ముక్కెర ముదితల ముఖారవిందాలను ముచ్చటగొలిపేలా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  స్త్రీలే కాదు రాధారమణుడూ రాసలీలాలోలుడూ అయిన మన శ్రీ కృష్ణుడు కూడా తన నాసికాగ్రాన నవ మౌక్తికాన్ని ధరించే వాడు. (ఎందుకో మరి మన సినీ కృష్ణుడు మాత్రం ఇది ధరించినట్లు దాఖలాలు లేవు)
నఖశిఖ పర్యంతం స్త్రీల సౌందర్యాన్ని వర్ణించిన మన ప్రబంధ కవులు ఇంత ముఖ్యమైన అంగాన్ని వర్ణించకుండా వదలి పెడతారా? “నువ్వు పువ్వన నవ్వు జవ్వని నాసిక అని నువ్వు పువ్వుతో సరిపోలుస్తాడు నాయిక ముక్కును చేమకూర వేంకట కవి. మరి నంది తిమ్మన గారైతే ముక్కు మీద పద్యం వ్రాసి ప్రసిధ్ధి చెంది దానినే తన ఇంటి పేరుగా చేసుకున్నాడు. అందమైన ముక్కు మీది అందమైన పద్యాన్ని అడిగినంత ధర ఇచ్చి కొనుక్కుని మరీ తన కావ్యంలో వాడుకున్నాడు వసుచరిత్ర కారుడైన రామ రాజ భూషణుడు. ఆ పద్యాన్నొకసారి ఆస్వాదిద్దాం:
నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లానన్నొల్లదటంచు గంధఫలి బల్కాకం తపం బంది యో
షా నాసాకృతి దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పొందెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్
(అన్ని రకాల పూవుల వాసనను గ్రోలుచు ఆనందించే తుమ్మెద తనంటే ఎందు కిష్ట పడదని సంపెంగ పూవు ఘోరమైన తపస్సు చేసి నాయిక నాసిక రూపును ధరించి ఆమె చూపులనే తుమ్మెదల బారునే పొందినదని కవి ఉత్ప్రేక్షించాడు. అంటే నాయికయైన గిరికా దేవి ముక్కు సంపెంగ పూవంత అందంగా ఉందని భావం.)
ముక్కు లు అందరివీ ఒకేలా ఉండవు. కొందరివి సన్నగా పొడుగ్గానూ కొసదేరి ఉంటాయి. చివర కొంచెం వంగి ఉండి నాగలిలా ఉండే వాటిని కోటేరేసిన ముక్కులంటారు. (కోటేరంటే నాగలి). చిలక ముక్కు లాఉంటాయి కొందరివి. మరికొంత మందివి పొట్టిగానూ లావు గానూ నొక్కి వేసినట్లుంటాయి. వీటిని చప్పిడి ముక్కులంటారు. అసలే ముక్కు లేని వానిని ముక్కిడి అంటారు. మా చిన్నప్పుడు మా మాష్టరు గారొకాయనకు చాలా లావుగానూ పెద్దగానూ కొట్టొచ్చినట్లు కనిపించే ముక్కు ఉండేది. ఊళ్లో చిన్నా పెద్దా అందరూ ఆయనను ముక్కు మేష్టరుగారనే వ్యవహరించేవారు. ముక్కంటూ ఉన్నాక పడిశం రాకుండా ఉంటుందా? అన్నది సామెత. పడిశం సంగతి ఏమోగాని ఆయన ముక్కు ఆయనకు పెద్ద పేరు తెచ్చిపెట్టింది
మన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గారి ముక్కు చూడ ముచ్చటగా ఉండేది. ఆవిడ ఇందిరా ప్రియదర్శిని కదా? ముక్కు చక్కగా ఉంటే మేలు కలుగుతుందంటుంది మన సాముద్రిక శాస్త్రం.(ఆమె భారత ప్రధాని కావడంలో ఆమె ముక్కు పాత్ర ఎంతో నాకు తెలియదు మరి). జన్మతః సహజంగా ఉన్నది కాకుండా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందంగా తీర్చి దిద్దుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి రాదట. కానీ అలా ముక్కుకు సర్జరీ చేయించుకుని సినీరంగంలో ధృవతారగా వెలుగు వెలిగిన ఓ శ్రీమంతురాలి కథ మనకు తెలిసినదే.
ముక్కును గురించి సాముద్రిక శాస్త్రం ఏం చెబుతుందో తెలిపే పద్యం చూడండి:
సీ. నాసిక దీర్ఘమై భాసిల్లుచుండిన
మగువ తా గోరిన మగని బొందు,
నాసిక వట్రువై భాసిల్లు చుండిన
సతి యాధికారిక ప్రతిభ గొఱలు,
నాసిక శుకరీతి భాసిల్లు చుండిన
భామిని సుఖరీతి బరిఢవిల్లు,
నాసిక చప్పిడై భాసిల్లుచుండిన
వికటస్వభావయై సకియ బొగులు,
ప్రాగుపార్జిత పుణ్య సౌభాగ్య యైన
లేమ నాసిక గంధపలి వలె వెలయు,
నని చికిత్సదీర్చికొనిన యంతమాత్ర
జక్కదనమబ్బునేమొ ప్రశస్తి రాదు.
( ఈ ముక్కు సాముద్రికాన్ని తన శతావధానం లో చెప్పిన వారు శతావధాని శ్రీ సి.వి. సుబ్బన్న గారు)
మరెందుకాలస్యం? అద్దంలో మీ ముక్కు తీరు చూసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
సెలవు.


 

15, ఆగస్టు 2012, బుధవారం

జై తెలుగు పద్యం.. జై జై తెలుగు పద్యం...



ఆశు కవితయొకటి..ఆవు పేడయునొకటి..అంటూ పండితులు ఆశుకవిత్వాన్ని ఈసడించే వారు. నిజమే. కుదురుగా కూర్చుని మేధను మధించి కష్టపడి పది కాలాల పాటు నిలిచి పోయే మంచి పద్యాన్నివ్రాయ వచ్చును. కానీ ఉన్న పాటున ఏదో విషయం పైన నిఘంటు నిరాపేక్షంగా చెప్పిన పద్యాలను వాటితో సరిపోల్చ కూడదు. ఆశు కవిత్వం కూడా అంత ఆషా మాషీ వ్యవహారం కాదు. ప్రధానంగా ఇవి ముక్తకాలై ఉంటాయి. అంటే కవి భావం అంతా ఒక్కపద్యంలోనే ఒదిగి పోవాలి. ఇవి ఒక్కసారి వినగానే శ్రోతలను ఆకట్టుకుని వారి మనసులను రంజింప జేయాలి. అందుకోసం ఇవి సులభ గ్రాహ్యంగా కూడా ఉండాలి. కావ్యాల్లో ఎన్నోపొల్లు పద్యాలున్నా పదింటి కొకటైనా మంచి పద్యం ఉంటే ఆ కావ్యం మన్నన పొందుతుంది. ఆశువుగా చెప్పిన పద్యాలు అలాగ కాదు. పస లేని పద్యాలు వెంటనే కాలగర్భంలో కలిసి పోతాయి. కాని తగిన పాండిత్యం సృజన ఉన్న మహాకవుల నోటివెంట అలవోకగా వెలువడిన పద్యాలు కొన్ని అనర్ఘరత్నాలుగా భాసిస్తూ చిరంజీవులుగా మిగిలిపోతాయి. వాటిలోని భావం పద్య శిల్పం మనల్ని అచ్చెరువొందిస్తాయి. ఇటువంటి పద్యాలలో తలమానిక మైన దాన్ని ఒకటి పరిచయం చేస్తాను. చిత్తగించండి:

లక్ష్మీ పార్వతుల అన్యోన్య పరిహాసం-
సీ. గంగా ధరుడు నీ మగండని నవ్వంగ
వేషధరుండు నీ పెన్మిటనియె,
నెద్దునెక్కును నీదు నెమ్మెకాడని నవ్వ
గ్రద్దనెక్కును నీ మగండటనియె
వల్లకాడిల్లు నీ వల్లభున కనంగ
నడిసంద్ర మిల్లు నీ నాధున కనె
నాట్యంబు సేయు నీ నాయకుండన నంగు
గావించు వెన్కనీ కాంతుడనియె
ముష్టి కెక్కడి కేగె నీ యిష్టుడనిన
బలి మఖంబున కేగె నో లలన యనియె
నిట్టులన్యోన్య మర్మంబు లెంచుకొనెడు
పర్వతాంబోధి కన్యల ప్రస్తుతింతు.

ఈ పద్యం తిరుపతి వేంకట కవుల శతావధాన సారం లోనిది. వారు ఒక శతావధానంలో చెప్పిన పద్యమిది. అర్థం సులభ గ్రాహ్యమే అయినా అవతారిక లేనందువల్ల కొంత మందికి పూర్వగాధలు తెలియక పోతే పద్యం లోని రసాస్వాదన అనుభవం లోనికి రాదు. కనుక కొంచెం వివరిస్తాను. లక్ష్మీ దేవి వేరే పనీ పాటూ లేని ఒక తీరిక సమయంలో వచ్చి పార్వతీ దేవితో ముచ్చట పెట్టుకుంది. సరదాగా పార్వతితో నీ మగడు ఆడదానిని (గంగను) నెత్తి మీద ధరించాడు కదా?” అంది. దానికి జవాబుగా పార్వతి విష్ణుమూర్తి మోహినీ అవతారంలో స్త్రీ రూపాన్ని ధరించడం గుర్తు చేస్తూ నీ మగడు పూర్తిగా ఆడ మేషమే ధరించాడు కదా?” అంది. అప్పుడు లక్ష్మీదేవి  నీ మగడు ఎద్దునెక్కి తిరుగుతాడు కదా?” యని యెద్దేవా చేయబోయింది. దానికి వెంటనే పార్వతీ దేవి నీమగడిలా గ్రద్ద నెక్కి తిరగడం కంటె అదేమి తక్కువ అని జవాబిచ్చింది.( ఎద్దు-నంది శివుని వాహనమైతే విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు- గ్రద్ద- కదా?). అప్పుడు లక్ష్మీ దేవి నీ మగని యిల్లు వల్లకాడు కదా?” అంటే పార్వతి వెంటనే నడి సముద్రం లో ఉండడం కంటె అదే నయం కదా?” అంది. ( పరమశివుని నివాసం వల్లకాడనీ విష్ణుమూర్తి పాలసంద్రపు నివాసి అనీ తెలుసు కదా?) .లక్ష్మీ దేవి నీ మగడు నాట్యం చేస్తాడు కదా?” అని ఎకసక్కెమాడబోతే పార్వతి అవును మీ ఆయన అటువంటి నాట్యానికి వెనక హంగు చేస్తాడు కదా?” అని జవాబిస్తుంది. శివుడు నటరాజు కనుక నాట్యం చేస్తాడు. ( అయితే దీనిలో హేళన ఏముంది? అని కొందరికి అనిపించవచ్చును. కాని ఆ పాత రోజుల్లో నట గాయకులంటే ఆంధ్ర దేశంలో చిన్న చూపే ఉండేది. నటులకీ,నాట్యకళాకారులకీ గాయకులకీ ఏమాత్రం గౌరవం ఉండేది కాదు. వారికి పిల్లనివ్వడానికి కూడా ఇష్టపడే వారు కాదు. సంఘంలో వారంటే చిన్న చూపే. సినిమాల రాకతో నటీనటుల సంపాదన పెరగడంతో సీను మారిందనుకోండి. అది విషయాంతరం). విష్ణుమూర్తి, గజాసుర సంహారంలో గజాసురుని కడుపులో ఉన్న మహాశివుని బయటకు రప్పించడానికి నందిని తీసుకు వెళ్లి అసురుని సభలో దాని చేత నృత్యం చేయిస్తూ ప్రక్కవాద్యం వాయిస్తాడు. నంది గజాసురుని తన కొమ్ములతో పొడిచి చంపి శివుణ్ణి బయటకు రప్పిస్తుంది. ఇదిగో ఇక్కడ విష్ణుమూర్తి  హంగు చేయడాన్నే లక్ష్మీ దేవికి గుర్తు చేస్తూ విష్ణుమూర్తి హంగుకాడని పార్వతీ దేవి దెప్పిపొడిచింది. అన్నిటికీ తిరుగు లేని సమాధానాలిస్తున్న పార్వతిని చూసి ఇక లాభం లేదనుకుని లక్ష్మీ దేవి ఆఖరు అస్త్రంగా నీ మగడు ముష్టి కెక్కడకు వెళ్లాడని అడుగుతుంది. దానికి పార్వతి బలి చక్రవర్తి చేసే యజ్ఞానికి వెళ్లి ఉంటాడనుకుంటానన్నది. (శివుని భిక్షాటనా,విష్ణువు వామనావతారంలో బలి దగ్గర దానం గ్రహించడం తెలిసినవే కదా?)
పై విధంగా లక్ష్మీ పార్వతులు ఒకరి నొకరు మేలమాడుకున్నారని చెబుతూ వారిద్దరినీ ప్రస్తుతించారు మన జంట కవులు. ఇంత భావాన్ని ఒక చిన్న పద్యంలో ఇమిడ్చి చెప్పడం మహాకవులకే చెల్లుతుంది. స్త్రీల సహజమైన చిత్త ప్రవృత్తిని అద్భుతంగా ఆవిష్కరించిన పద్యమిది. ముఖ్యంగా వారి భర్తలను ఎవరైనా అవమానిస్తూ మాట్లాడితే వారు సహించలేరు కదా? ఇంత వరకూ చాలా మందికి తెలిసే ఉంటుంది. కాని ఈ పద్యంలో సొగసైన విషయం మరొకటి ఉంది. అది మనవి చేస్తాను. సీస పద్యానికి అనుబంధంగా చెప్పిన తేట గీతిలో పార్వతి లక్ష్మీ దేవిని లలనా అని సంబోధిస్తుంది. లలన అనే పదానికి ధన గర్వాతిశయంతో ఉన్న స్త్రీ అనే అర్థం ఉంది. అందు వలన పార్వతి సిరుల కధిష్ఠాన దేవత అయిన లక్ష్మీ దేవిని నేను పేద రాలిని,నీవు ఐశ్వర్వవంతురాలవు కనుక ధన గర్వంతో నన్ను మేలమాడడానికి పనికట్టుకుని వచ్చా వని నిష్టూరమాడిందని కూడా మనకు అవగతమవుతుంది. ఒక చిన్న సంబోధనలో కూడా ఇంత ఆంతర్యం ఉండేటట్లు ఆశువుగా పద్యం చెప్పినవారు మహా కవులు కాకేమవుతారు?
మహాకవులెప్పుడో మరణించినా మంచిపద్యం మనకి మిగిల్చి పోయారు.
జై తెలుగు పద్యం....  జైజై తెలుగు పద్యం...                                      

12, ఆగస్టు 2012, ఆదివారం

తొలి పుట్టిన రోజు నాడే షష్ఠి పూర్తి


తొలి పుట్టిన రోజు నాడే షష్ఠి పూర్తి….
తొలి పుట్టిన రోజా? ఎవరిది? నీదా?”
నాది కాదు. నేను మరీ అంత చిన్నవాణ్ణా? ఈ పుట్టిన రోజు మా అమ్మాయిది.
ముసలి వాడిలా కనిపిస్తున్నావు. నీకు అంత చిన్నపాప ఉందా?”
అబ్బే! మా అమ్మాయిలు ముగ్గురూ నలభైలు దాటిన వారే
మరి ఇంత చిన్న ముద్దుల కూతురెవరు?”
ఇది నా గారాల కూచి. ముదిమి వయసులో నను వీడని నా గారాల పట్టి. నా మానస పుత్రిక. మేలుకుని ఉన్న సమయంలో ఎక్కువ కాలం తనతోనే గడపమంటుంది. రిటైరై ఇంట్లో కూర్చున్న వాడివి నీకు వేరే పనేమిటని ప్రశ్నిస్తుంది. ఏదైనా పనిమీద పొరుగూరికి వెళ్లినా మనసంతా దీనిమీదే ఉంటుంది. ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తానా ఎప్పుడు మళ్లా దీనిని చూస్తానా అని మనసు తపిస్తుంది. నేను రోజుకొకసారైనా పలకరించకపోతే దీనికి దిగులు. నాకూ తోచదు. దీనిని చూసిన మిత్రులు ప్రేమతో దీనిని పలకరిస్తుంటే నా మది పొంగి పోతుంది. దీని వల్లనే కదా ఇందరు మిత్రులు నాకు కూడా దొరికారని కించిత్తు గర్వం గానూ ఉంటుంది. మరి ఇదెవరో మీకిప్పటికే తెలిసి పోయి ఉంటుంది. ఇది నా మానస పుత్రిక. నా బ్లాగు. మా నాలుగో అమ్మాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ ముసలివయసు లో నాకు తోడుగా దొరికిందేమో మరి అపురూపం గానే చూసుకుంటున్నాను. అందుకే అపురూపం అనే పేరు కూడా పెట్టుకున్నాను. మరి ఇవాళ దాని పుట్టిన రోజని చెప్పేను కదా? అవును. సరిగ్గా ఏడాది క్రిందట 12th August 2011  నాడే ఇది ఈ బ్లాగ్లోకంలో కన్ను తెరిచింది. చూస్తూ చూస్తూ ఉండగానే ఏడాది పెరిగి పెద్దదయింది. అప్పుడే దీనికి ఏడాది వయసొచ్చిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. బాలారిష్టాలు లేకుండానే బ్రతికి బట్ట కట్టిందని సంతోషంగానూ ఉంది.
                                        ***
అది సరేనయ్యా,తొలి పుట్టిన రోజునాడే షష్ఠి పూర్తి అన్నావు. షష్ఠి పూర్తి నీకా?”
అబ్బే నాకిప్పుడు షష్ఠి పూర్తి ఏమిటి? అది దాటి పోయి పుష్కరం కావస్తోంది
మరి ఈ మతలబేమిటి?”
అదీ చెబ్తున్నా. మొన్న 8వ తారీఖు నాడు పోస్టు చేసిన జంట కవుల జయ కేతనం ఎగురుతూనే ఉంటుంది అన్న నాపోస్టు 60 వది. బ్లాగు అంటే పోస్టుల సమాహారమే కదా? (పోస్టులు లేక పోతే బ్లాగుల ఉనికే లేదు కదా?). అందు వల్ల అరవై పోస్టులూ అవడంతో తొలి పుట్టిన రోజు నాటికే నా బ్లాగుకి షష్ఠి పూర్తి కూడా అయిందన్న మాట. డబల్ ధమాకా!
                                                      ***
బ్లాగుల్లో పోస్టులు శతాధికంగా వస్తున్నాయే- యేడాదికి అరవై పోస్టులు ఒక లెక్కా
అంటే అదీ నిజమే.కాని నా ముచ్చట నాది. నాబ్లాగులో ఎక్కువగా సాహితీ పరమైనవీ భాషకి సంబంధించిన విషయాలూ వ్రాసేను. నేను వ్రాసిన పద్యాలూ ఉన్నాయి. సరదా కబుర్లూ లేకపోలేదు,కాని అవి వేళ్లమీద లెక్కపెట్టేటన్ని మాత్రమే ఉన్నాయి. ఈ సాహితీ పరమైన విషయాలనెవరు చదువుతారులే అనుకున్నాను గానీ ఈయేడాది లోనే దాదాపు 15000 వేలమంది వీటిని చూసినట్లు తెలుస్తోంది. చూసిన వారి స్పందనలు కూడా 300 వరకూ ఉన్నాయి. ఎంతో మంది ప్రత్యేకమైన అభిమానం చూపించారు. మరి కొందరు మిత్రులయారు. ఇది నేను ఊహించనిది. స్పందించిన వారికి వెంటవెంటనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను.కాని చదివినా తీరిక లేకనో మరో కారణం చేతనో స్పందించని వారు కూడా ఉంటారు కదా? వారితో సహా    బ్లాగ్మిమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవడానికే ఈ పోస్టు. సెలవు.
                                         ***








8, ఆగస్టు 2012, బుధవారం

జంట కవుల జయ కేతనం ఎగురుతూనే ఉంటుంది....



జెండా పై కపిరాజు అంటూ తెలుగు పద్యపు బావుటాని తెలుగు సాహితీ గగనంలో రెపరెపలాడిస్తూ ఎగుర వేసిన ఖ్యాతి సాహితీమూర్తులైన జంట కవులు శ్రీ తిరుపతి వేంకట కవులకే దక్కుతుంది. వీరికి చాలా ముందే తెలుగు సాహిత్యంలో జంట కవిత్వం చెప్పిన నంది మల్లయ ఘంట సింగన్నలూ,వీరికంటె కొంచెం వయసులో పెద్దవారైన దేవులపల్లి సోదరులూ,వీరికి సమ కాలికులైన రామకృష్ణకవులూ ఉన్నా జంటకవులుగా వీరికి వచ్చిన ఖ్యాతి మిగిలిన వారికి రాలేదు.ఆంధ్ర దేశంలోతిరుపతి అంటే శ్రీ వేంకటేశ్వరుడూ,వేంకటేశ్వరుడంటే తిరుపతీ గుర్తుకు వచ్చి తీరుతాయి కనుక ఆ పుణ్య స్థలమూ ఆ దేవుడూ అభేదంగా మనకు తోచినట్లే  తిరుపతి వేంకటకవులు కూడా విడదీయలేని జంటకవులుగా ప్రసిధ్ధి చెందారు.వీరిద్దరూ దాదాపు ఇరవై ఏళ్లు కలిసిసాహితీ వ్యవసాయం చేయడమే కాకుండా శ్రీతిరుపతిశాస్త్రి గారి మరణాననంతరం కూడా ( దాదాపు 30 ఏళ్లు బ్రతికి సాహిత్యోపాసన చేసిన) వేంకటశాస్త్రిగారి చే విరచితములైన రచనలన్నీకూడా ఆ జంటకవుల పేరుమీదే తిరుపతి వేంకటీయమై ప్రకటింపబడడం కూడా వీరి స్నేహబంధానికి నిలుపుటద్దమై నిలుస్తుంది.వీరిలో ఒకరైన శ్రీ చెళ్ళపిళ్ల వేంకట శాస్త్రిగారి జన్మ దినం నేడు (8th  Aug) కావడం వల్ల వారినో సారి స్మరించుకుని  మన ఋణం తీర్చుకుందాం.

శ్రీ వేంకట శాస్త్రిగారి జన్మ స్థలం రాజమండ్రి సమీప గ్రామమైన కడియం. 1870లో జన్మించిన ఆయన తనకు సుమారు 10 సంవత్సరముల వయసు వచ్చేవరకూ అక్కడే ఉన్నాఆ తరువాత వారి మకాం అప్పట్లో ఫ్రెంచి ప్రభుత్వాధీనంలో ఉన్నయానాంకు మారింది. కడియం లోనూ యానాం లోనూ అక్షరాలూ బడిచదువూ ఫ్రెంచి భాషా కొద్దిపాటి సంగీతమూ నేర్చుకున్నారు. యానాంలో ఉన్నప్పుడే అక్కడి వేంకటేశ్వర స్వామి మీద శతకం వ్రాసేరు. దానిలో కొన్ని వ్యాకరణ దోషాలు పెద్దలు చూపించడంతో కడియెద్ద గ్రామంలో ఉంటున్న శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగారి వద్ద వ్యాకరణం నేర్చుకుందికి వెళ్లారు.అప్పటికి ఆయనకు 18 ఏళ్లు. అక్కడ అప్పటికే కొద్ది మాసాల క్రితం నుంచీ వ్యాకరణం నేర్చుకుంటున్న శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు ఆ విధంగా వీరికి సతీర్థులయ్యేరు.  బ్రహ్మయ్య శాస్త్రుల వారి శిష్యరికం చేస్తున్నా చెళ్లపిళ్ల వారికి కాశీ వెళ్లి అక్కడ ఉండి వ్యాకరణం నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. దీనికి ఆ రోజుల్లో వ్యాకరణానికి కాశీ,తర్కానికి నవద్వీపమూ,మీమాంసకు దక్షిణ దేశమూ,వేదానికి మన కృష్ణా గోదావరీ తీరమూ ప్రఖ్యాతి పొంది ఉండడము ఒక కారణం.ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రాల్లో చదువులకి విదేశాలకి వెళ్లిరావడం ఎలాగ గొప్పో అలాగ ఆ రోజుల్లో కాశీలో చదువుకుని వచ్చి మనదగ్గర ఉన్న పండితుల దగ్గర వ్యాకరణం నేర్చుకునే అవకాశం ఉన్నా,కాశీ వెళ్లి అక్కడ చదువుకుని రావడం చాలా గొప్ప. అక్కడ నేర్చుకున్నదాని కన్నా అక్కడ ఎన్నాళ్లు ఉండివచ్చేరన్న దానికే ప్రాముఖ్యత నిచ్చే వారట. కానీ తాను కాశీ వెళ్లడానికి ఇంతకంటె చిత్రమైన కారణం ఒకటి శాస్త్రిగారు చెప్పారు. యానాం లోఉంటూ ఉండగా పట్న వాసం వల్ల తాంబూల చర్వణం అలవాటయిందనీ కడియెద్దలో గురువు గారి సమక్షంలో ఈ అభ్యాసానికి వీలు కుదరక కాశీ వెళ్లడానికి నిర్ణయించుకున్నాననీ వ్రాసేరు. అలా కాశీ వెళ్లడానికి ముహూర్తం పెట్టుకుంటే దైవం వేరొకలా తలచి చిత్రంగా ఆ ముహూర్తానికే శాస్త్రిగారికి వివాహమవడం తటస్థించింది. శాస్త్రిగారు ఆ వివాహానికి అంగీకరించడానికి కారణం అప్పటికా పెళ్లి కూతురికి 5 సంవత్సరాల వయసే ఉండడం. అందువలన వివాహం చేసుకుని తాను కాశీలో పది పన్నెండేళ్లు విద్యాభ్యాసం చేసి వచ్చినా ఇబ్బంది ఉండదనుకున్నారు.అలాగే వివాహానంతరం కొద్దిరోజులకే కాశీ ప్రయాణ సన్నాహం మొదలెట్టారు. కానీ ఆరోజుల్లో బెజవాడనుంచి కాశీకి రైలు ఉన్నాటికట్టుకు కావలసిన రూ.18 కూడా శాస్త్రిగారి వద్ద లేవు. అందుకోసం తొలిసారిగా నిడమర్రు గ్రామంలో అష్టావధానం చేసి తనకీ తనతో కాశీ వస్తున్న తన మిత్రునికీ కావలసిన పైకం సమకూర్చుకున్నారు. ఈ తొలి అష్టావధాన మంటే ఎనిమిది మందినీ ఒకరి తర్వాత ఒకరిని కూర్చో పెట్టుకుని వారికి కావలసిన పద్యాలు చెప్పడమే. ఆ రోజుల్లో అక్కడ అష్టావధాన ప్రక్రియగురించి ఇంకా ఎవరికీ తెలియని రోజులు గనుక  అలా చెల్లిపోయిందంటారు శాస్త్రిగారు. అలా ధనం సమకూర్చుకుని కాశీ వెళ్లి నోరి సుబ్రహ్మణ్య శాస్త్రులవారి వద్ద వ్యాకరణం నేర్చుకుందికి చేరారు. అయితే కాశీలో విద్యాభ్యాసం సరిగా సాగదనీ అనభ్యాసాలే ఎక్కువనీ అంటారు. కాకపోతే శాస్త్రిగారి తాంబూలాధ్యయనానికి కొదవ లేకుండా సాగిందట. అక్కడ తాంబూలమంటే సున్నం పొగాకుతో కలిసి నూరినదే. అది కాక అక్కడ వారూ వీరూ అనకుండా అందరూ భంగు సేవించేవారు కనుక శాస్త్రిగారుకూడా సేవించడం దానివల్ల తిప్పలు పడడం జరిగిందట. ఆ రోజుల్లో కాశీలో స్థిరనివాసమేర్పరచుకున్నవారిలో శ్రీ గంగాధర శాస్త్రుల వారు,శివకుమార పండిట్జీ,కల్లాట సీతారామ శాస్త్రులు,దామోదర శాస్త్రులు ద్రావిడ సుబ్రహ్మణ్య శాస్త్రులు,దండిభొట్ల విశ్వనాధం గారు మున్నగు ప్రముఖులు ఉండేవారు.( వీరిలో దండి భొట్ల విశ్వనాధం గారి గురించిన ముచ్చట్లు దండి భొట్ల వారి దర్జా అనే నా పోస్టులో చూడగలరు). కాశీలో కొన్నాళ్లున్నా,తల్లిదండ్రుల కోరికపై శాస్త్రిగారికి కాశీని విడిచి పెట్టిరాక తప్పలేదు.తిరిగి వచ్చేక మళ్లా బ్రహ్మయ్య శాస్త్రుల వారి వద్దనే వ్యాకరణం నేర్చుకోవడం,అప్పుడే శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రిగారు వారికి సహాధ్యాయులవడం,వారి మధ్య మైత్రి చేకూరడం జరిగాయి.
( ఇక్కడ గురువు గారే వీరికి వేంకట శాస్త్రి అని నామకరణం చేశారట.అంతకు ముందు ఆయన అసలు పేరు వెంకటాచలం.యానాంలో ఫ్రెంచి మాస్టరు అతనిని యెంకతాసెలం అనిపిలిచేవారట )
వీరు శ్రీ తిరుపతి శాస్త్రి గారితో కలిసి చేసిన తొలి సంపూర్ణ శతావధానం కాకినాడలో దిగ్విజయంగా జరిగింది.అప్పటికి వారికి 25 ఏళ్ల లోపే.ఆ తరువాత శ్రీ తిరుపతి శాస్త్రిగారు కాకినాడలో పోలవరపు జమీందారు గారి ఆశ్రయంలో ఉండడం వల్ల వీరిద్దిరీకీ కలిసి అవధానాలు చేసే వీలు చిక్కకపోవడం కారణంగా శ్రీ చెళ్లపిళ్లవారు ఒక్కరే ఎన్నో చోట్ల దిగ్విజయంగా అవధానాలు చేస్తూ వచ్చారు. అలా మూడేళ్లు గడిచాక శ్రీ శాస్త్రిగారు కూడా బందరు పాఠ శాల ఉద్యోగంలో చేరడంతో మరో మూడేళ్లపాటు ఇద్దరూ కలిసి అవధానాలు చేసే అవకాశాలు కలిసి రాలేదు. అలా ఆరేళ్ల పాటు ఉన్నారు. ఈ సమయం లో కలిసి అవధానాలు చేయక పోయినా,వేరు వేరు ఊళ్లలో ఉంటున్నా, వారి రచనలు మాత్రం ఎవరు చేసినా తమ జంట పేరుతోనే ప్రచురిస్తూ వచ్చేరు. బాల రామాయణం,ముద్రా రాక్షస, మృఛ్ఛకటిక విక్రమాంకదేవ చరిత్ర,చంద్ర ప్రభ చరిత్రల ఆంధ్రానువాదాలు తిరుపతి శాస్త్రి గారు తన ఒంటి చేతిమీదే చేసినా,అవి తిరుపతి వేంకట కవుల పేరిటనే ప్రచురింప బడ్డాయి.
వీరి రచనా విధానాన్ని గూర్చి వీరే ఇలా చెప్పుకున్నారు:
ఇరువురు గూడియే రచన యెప్పుడు చేయుదు రొక్కవేళ నొ
క్కరొకటి యొక్కరింకొకటి కై కొని చేయుదురందు హెచ్చు త
గ్గొరులకు గానరాక, యది యొక్కరు చేసిన భంగినుండు,నొ
క్కరు రచియించిరేనియును కాదగు తిర్పతి వేంకటీయమై
వీరిద్దిరూ కలిసి చేసిన సాహిత్యకృషి అపారం. పోయినవి పోగా వీరు ప్రచురించిన నాటకాలు ప్రహసనాలూ అనువాదాలు పద్యకావ్యాలూ ప్రబంధాలూ కావ్యఖండికలూ వచన రచనలూ శతకాలూ స్తోత్రాలూ మరెన్నో సంస్కృత గ్రంధాలూ లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీరి రచనల్లో శ్రవణానందం వీరికి అనుకోని పేరు తెచ్చిపెట్టిందంటారు శ్రీ శాస్త్రి గారు.
ఇది సహృదయుల చేత-
క. ఒక శ్రవణానందమ్మున
నొక పద్యమునందుఁ గలుగు నొక పాదమునం
దొక యక్కరమున కిచ్చిన
 సకలంబగు రత్న గర్భ చాలునె తూఁపన్.అన్నంత పొగడికను పొందిందట.
అయితే వారికి మాత్రం వారి పాణిగ్రహీత దానికంటె బాగుంటుందనే అబిప్రాయం ఉండేది.
వీరి కావ్యరచన ఒక ఎత్తయితే వీరు నాడు ఆంధ్రదేశ సంచారం చేసి ఎందరో సంస్థానాధీశులను దర్శించి వారి మెప్పువడసే లాగున కవిత్వం చెప్పడం అనేక సన్మానాలు పొందడం ఇంకొక ఎత్తు. వీరి నానా రాజ సందర్శనం గ్రంధంలో ఈ వివరాలూ వారు చెప్పిన పద్యాలూ చూడవచ్చు. తెలుగు సంస్కృత భాషలలో కవిత్వంలో తమకెదురు లేదన్నధీమాతో వారు చెప్పిన పద్యాలలో
ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము అనేదీ..దోసమటంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమీ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మటంచు దెల్పగా అనేదీ చాలా సుప్రసిధ్ధమైనవి.
అవధానాలకు వీరే ఆద్యులు కాకపోయినా,మన తెలుగు భాషకే ప్రత్యేకమైన శతావధాన అష్టావధానాలను అతి నైపుణ్యంతో నిర్వహించి వాటికి తెలుగునాట విశేష ప్రాచుర్యాన్నికలిగించి తమలాగ ఎందరో అవధానులు తయారవడానికి దోహద పడ్డారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఇద్దరూ కలసి రచనలు చేసినట్లే అవధానాలనుకూడా ఇద్దరూ కలిసి నిర్వహించేవారు. తమ అవధాన రచన గురించి
  ఒక చరణంబతండు మఱియొక్కటినేను మఱొక్కడాతడున్
 సకల కవీంద్ర సంతతులు సమ్మతిచే దలలూచి మెచ్చగా
బ్రకటత రాశుధార దనరన్ రచియింపగ నేర్తుమయ్య
అని వారే చెప్పుకున్నారు.
వీరిద్దరూ కవిత్వంలోనూ పాండిత్యంలోనూ ఒకరికొకరు తీసిపోని వారైనా,చెళ్లపిళ్లవారు మహా గడుసువారు. మహాలౌకిక ప్రజ్ఞాదురంధరులు. సభారంజకత్వం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన పద్యాలను చదివే తీరు జనాన్ని విశేషంగా ఆకట్టుకునేది.శ్రీ వేంకట శాస్త్రి గారు పద్యము చదువుట యనగా శ్రోతలను ముగ్ధులను జేయుట. ఆ రాగము ఆ విఱుపు,ఆ ఉదాత్తానుదాత్తములు,వారి కంఠ మాధుర్యము,వారి మహా వ్యక్తిత్వము-ఇవి యన్నియు కలిసి శ్రోతలను తలక్రిందులు చేయుచుండెడివి అంటారు వారి శిష్యులు శ్రీ విశ్వనాథ వారు.
అవధానాల్లో వారు తెలుగు పద్యాలనే కాక ఎన్నో లెక్కలేనన్ని సంస్కృత శ్లోకాలనూ చెప్పారు. అటువంటి అవధానాల్లోనే వారు ఆశువుగా చెప్పిన ఎన్నో పద్యాలు రసికులను మురిపించాయి. అవధానాలను వారు నల్లేరు పై బండి నడకలా నడిపించారు.
వీరి నాటకాలు మరీ ముఖ్యంగా పాండవ ఉద్యోగము పాండవ విజయము పేరిట వ్రాసినవి పాండవోద్యోగవిజయాలనే పేరుతో తెలుగు నాట ప్రదర్శింపబడని ఊరే లేదని ఘంటాపథమ్ముగా చెప్పవచ్చును. అదిగో ద్వారక.. బావా ఎప్పుడు వచ్చితీవు..ఆలము సేయనేనని యదార్థమె బల్కితిజుమ్మి.. జెండాపై కపిరాజు..చెల్లియె చెల్లకో తమకు సేసిన యెగ్గులు సైచిరందరున్.. చచ్చిరి సోదరుల్సుతులు చచ్చిరి..ఇలాంటివెన్నని చెప్పను.ఈ పద్యాలలో ఏ కొన్నైనా నోటికి రాని సాహితీ పిపాసులు ఓ యాభై ఏళ్లక్రితం వరకూ ఉండేవారు కారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
( సకృత్తుగానైనా ఈ నాడూ ఉన్నారు ).
చెళ్లపిళ్ల వారి శిష్యులూ కవిసామ్రాట్టూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతా ఐన శ్రీ విశ్వనాథ వారు వానలో తడియని వాడూ..తమ గురువుగారి సాహిత్యంతో తనియని వాడూ ఉండడని అన్నారు.
( అందుకే నేను నా పూర్వకవుల స్తుతిలో-
తిరుపతి వేంకట కవులును
కురిపించిరి తెలుగువారి గుండెలనిండా
సరసపు కవితా వర్షం
మురిపెముతో తడిసి వారు ముద్దై పోవన్--అని వ్రాసుకున్నాను.)
ఇంత చిన్న వ్యాసం లో ఆ మహానుభావుల సమగ్ర సాహితీ స్వరూపాన్ని రేఖా మాత్రంగానైనా దర్శింప జేయడం సాధ్యం కాదు. నాబోటివాడికి ఆ శక్తీ సమర్థతా కూడా లేవు. చెళ్లపిళ్లవారి జన్మదినాన వారినోసారి తలచుకోవడానికి చేసిన చిన్నిప్రయత్నం మాత్రమే ఇది. అయితే ముగించే ముందు ఒకటి రెండు మాటలు మాత్రం చెప్పదలచుకున్నాను.వీరిద్దరూ మహాపండితులై ఉండి కూడా వారి పాండిత్యప్రకర్షా ప్రకటన కోసం కాక సాహిత్యాన్నిజనంలోకి తీసుకెళ్లాలన్నతపనతో రచనలు చేసిన మహానుభావులు. కవికర్ణ రసాయనం లో సంకుసాల నృసింహ కవి చెప్పిన-
... లోకుల రసనలే
ఆకులుగా నుండునట్టియవి వో కవితల్ అనీ
ఆ నీరసపుఁగావ్యశవముల
దూరమునన పరిహరింపుదురు నీతిజ్ఞుల్అన్నదాన్నీ బలంగా నమ్మిన వారు.కనుకనే తాటాకు కట్టలమధ్య నలిగి కృశించి పోవలసిన పద్యాన్ని రసికుల రసనల మీద నాట్యం చేయించారు.
జన సామాన్యానికి అందుబాటులో ఉండేటట్టు వ్రాయాలనే సంకల్పంతో అవసరమనుకున్నచోట ఔచిత్యాన్నిబట్టి అన్యదేశ్యాలైన ఆంగ్ల పదాలను వాడడానికి కూడా వారు సంకోచించలేదు. వారు సాహితీ వ్యవసాయం ప్రారంభించిన తొలి నాళ్లలోనే చెప్పిన పద్యం చూడండి.
ఉ. కాలముబట్టి దేశమునుగాంచి ప్రభుత్వమునెంచి దేశభా
షా లలితాంగి మాఱుటది సత్కవి సమ్మతమౌట నన్య దే
శ్యాలును దేశభాష కలవౌటను నౌచితిబట్టి మేము క
బ్బాలను వాడుచుంటి మిది పండితులేగతి నొప్పకుందురో
కాలంతో మారని వారు కాలగర్భాన కలసిపోక తప్పదు. కావ్యాలైనా అంతే.తిరుపతి వేంకట కవులు ఛాందస పథాన్ని వీడి,పండితుల గాఢపరిష్వంగంలో బందీ అయిన తెలుగు పద్యాన్ని విడిపించి పల్లెటూరి పసుల కాపరి నోటంట కూడా పలికింపజేసారు. (They democratized the telugu poem). అందుచేతనే-                                                            
తెలుగునాట పద్యం బ్రతికి ఉన్నన్నాళ్లూ ఈ జంటకవుల జయకేతనం ఎగురుతూనే ఉంటుంది. స్వస్తి.