27, సెప్టెంబర్ 2012, గురువారం

చరిత్ర చెప్పని కథలు...థగ్గుల కథ..


       
నేను 1957 లో కాలేజీలో ప్రీ యూనివర్శిటీ కోర్సు లో చేరాను.(అదే మొదటి బాచ్). మా అదృష్టమో దురదృష్టమో గాని (మమ్మల్ని సర్వ జ్ఞాన సంపన్నులని చేయాలనే సదుద్దేశం తోనే కావచ్చు)మా సైన్సు విద్యార్థులకు కూడా ఆర్ట్స్ పాఠాలు చెప్పడం ప్రారంభించారు.ఆ విధంగా మేము హిస్టరీ కూడా చదువుకోవలసి వచ్చింది.అప్పుటి మా హిస్టరీ లెక్చరర్ గారు గంటకొడుతూనే వచ్చి కుర్చీలో కూర్చొని కదలకుండా చూపులైనా అటూ ఇటూ మరల్చకుండా( ప్రముఖ గాయని జానకి గారు ఏ మాత్రం కదలకుండా నిల్చుని పాట పాడినట్లు) ఏకబిగిని మళ్లా గంట కొట్టే పరకూ లెక్చర్ దంచి లేచి వెళ్లి పోయేవారు.మేం వింటున్నామో లేదో కూడా ఆయన పట్టించుకునే వారు కాదు.అప్పటికే చరిత్ర పాఠాలంటే సదభిప్రాయం లేని నాకు ఆయన పాఠం చెప్పే తీరుతో విసుగు కూడా కలిగేది.ఇదిగో అలాంటి తరుణం లోనే నేను శ్రీశ్రీ గారి మహాప్రస్థానం చదవడం,దానిలోని దేశ చరిత్రలు గేయం నన్ను విశేషంగా ఆకర్షించడం జరిగాయి.ఏ రాజులు ఎప్పుడు ఏలారో, వారి వంశావళి,ఏ యుధ్ధం ఎప్పుడు జరిగిందో తారీఖులు దస్తావేజులు--ఇవన్నీ అసలైన చరిత్ర కాదు. క్రోమాన్యాన్ గుహా ముఖాల్లో మానవ కథ వికాసమెట్టిది అంటూ నిజమైన చరిత్రకర్థం చెప్పాడు శ్రీశ్రీ. గతంలో జన సామాన్యం ఎట్లా బ్రతికేరు?వాళ్ల కష్ట సుఖాలేమిటి?వారి రక్షణ కోసం ప్రభువులేం చేసారు?ఇలాంటి వన్నీ తెలుసు కోవాలనీ అదే నిజమైన చరిత్ర అనీ అప్పుడు నాకనిపించింది.అందుకే జీవిత చరిత్రలు చదువుతాను. వాటిలో ఏ మాత్రమైనా ఆనాటి సంఘ స్వరూపం కన్పించక పోతుందా అని..అందుకే నాకు చరిత్ర కన్నా చరిత్ర చెప్పని కథలే ఇష్టం.( చరిత్ర చెప్పని కధలెలా ఉంటాయో మీరే చూడండి.)
                                                            ***
దేశ చరిత్రలు గేయం లోనే ఒక చోట పిండారులు థగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెన అంటాడు శ్రీశ్రీ. ఆ రోజుల్లో ఈ పిండారులు,థగ్గులు ఎవరో నాకు తెలియక పోయినా వారెవరో దోపిడీ దారులై ఉంటారని Context ని బట్టి అర్థం చేసుకుని ఊరుకున్నాను.ఈ మధ్య వరకూ కూడా పిండారులంటే ఆయుధ పాణులై గుంపులు గుంపులుగా ఊళ్ల మీద పడి దోచుకునే దండులని తెలుసుకాని ధగ్గుల గురించే సరిగా తెలియదు.వారు కూడా పిండారుల వంటి వారే అనుకుంటూ ఉండే వాడిని. కాని ధగ్గుల కథ చాలా విచిత్రమైనది.వారి కథ వింటే మనలో ఒకే సారి ఆశ్చర్యమూ అసహ్యమూ క్రోథమూ ముప్పిరి గొంటాయి. వారి కథ వినండి:
                                                               ***
థగ్గులనే వారు మనదేశంలో ఎప్పటినుంచి ఉన్నారో సరిగా తెలియదు గాని,19వ శతాబ్దం నాటికి వారు అనేక వేల సంఖ్యలో ఉన్నట్లు,ఆశేతు హిమాచలం వ్యాపించినట్లు తెలుస్తోంది.అందువల్ల వారు కనీసం అంతకుముందు రెండు మూడు వందల ఏళ్లనుంచయినా మన దేశంలో చాలా చోట్ల ఉండి ఉంటారనిపిస్తోంది. ధగ్గులనే వారు ఒక మతానికో ఒక కులానికో చెందిన వారు కాదు.వారిలో అన్ని మతాల వారూ అన్నికులాల వారూ ఉన్నారు.అయితే వీరి మూల పురుషులెవరో కాని వారు హిందూమతావలంబులైనట్టు తోస్తోంది. కారణం వారు ఏ మతంవారైనా వారి  వారి మతాచారాలను పాటిస్తున్నా,వారందరూ కూడా దుర్గా మాత లేక భవానీ మాత భక్తులు.ఆ మాత యెడల అచంచలమైన విశ్వాసం కలవారు.ఆమెను ప్రార్థించనిదే వారు ఏ పనీ మొదలు పెట్టరు.వారు దోపిడీలతో పాటు హత్యలకు పాల్పడడానికి వారు చెప్పే కారణం చిత్రంగా ఉంటుంది.
వారు చెప్పేదేమిటంటే,భగవంతుడికి రెండు పార్శ్వాలున్నాయనీ ఒక పార్శ్వం సృష్టి కార్యానికి నిర్దేశించబడిందయితే,రెండవ పార్శ్వం సృష్టిని నాశనం చేయడానికి నిర్దేశించబడిందనీను. సృష్టి కార్యం త్వరత్వరగా జరుగుతూ ఉంటే వినాశనం మెల్లగా జరుగుతోందనీ,అందువల్లనే భగవంతుడు మానవులను సంహరించడానికే తమను సృష్టించాడనీ.ఆ విధంగా తాము భగవన్నిర్దేశం ప్రకారమే హత్యలు చేస్తున్నామని భావిస్తారు.అందుచేతనే వారు ఎన్ని హత్యలు చేసినా ఏ మాత్రం బాధ పడరు. పైగా భగవత్కార్యాన్ని నెరవేర్చామని సంతోషిస్తారు.కేవలం దోచుకోవడం వారి అభిమతం కాదు.హత్య చేయడం వారి ప్రధానోద్దేశం.హత్య చేసి దోచుకోవడం వారి లక్ష్యం. కొన్ని వందల సంవత్సరాల పాటు వారు ఈ వృత్తిని నిరాటంకంగా కొనసాగించినా జన సామాన్యానికో ప్రభుత్వాలకో వారి ఆనుపానులన్నీ తెలియకుండా ఉండడానికి వారి కట్టుబాట్లూ రహస్య వ్యవహార శైలీ కారణాలై ఉంటాయి. అక్బరు పాదుషా కాలంలో వీరిలో చాలా మంది పట్టుబడడం శిక్షింపబడడం జరిగిందట.ఈ విధంగా అడపా దడపా వారిలో కొందరు పట్టువడడం శిక్షింప బడడం జరిగినా వారి గురించిన పూర్తి సమాచారం కాని  వారి ఆచార వ్యవహారాలు కాని హత్యలు చేసే పధ్ధతుల గురించి కాని 1830 వరకూ లోకానికి తెలియలేదు. ఈ వ్యవస్థని రూపుమాపడానికి తగిన ప్రయత్నాలూ జరుగ లేదు.
వీరు మామూలు సమయాలలో వ్యాపారాలు చేసుకుంటూనో వారి వారి ఇతర వ్యాపకాలలోనో జనజీవనంలో కలిసి మెలిసే ఉంటారు.ఉన్నట్టుండి వారు నిర్దేశిత సమయాలలో వారి వారి గృహాలనుంచి మాయమై పోతూంటారు.ఎక్కడికి వెళ్లేదీ ఏ పని మీద వెళ్లేదీ తిరిగి ఎప్పుడు వచ్చేదీ ఎవ్వరికీ తెలియనివ్వరు. అలా మాయమైన వారందరూ నిర్దేశిత స్థలంలో కలుసుకుంటారు. ఇలా కొన్నికొన్నిగుంపులు ఒకచోట కలుసుకుంటారు.సాధారణంగా ఇది దసరాల సమయంలో ఉంటుంది.అప్పటికి వర్షాలు కట్టిపెట్టి వారి వృత్తికి అనుకూలంగా ఉంటుందని కాబోలు ఈ సమయాన్ని ఎంచుకుంటారు.వారి ఆరాధ్యదైవం అమ్మవారి పూజాసమయం అనికూడా కావచ్చు.ఆ విధంగా కలుసుకున్నవారందరూ ఏ ఏ గుంపులు ఎటువెళ్లాలో నిర్ణ యించుకుంటారు.ఆ విధంగా నిర్ణయించుకున్న తర్వాత అమ్మవారి పూజ చేసి శకునం కోసం ఎదురు చూస్తారు. వారు ఎదురు చూసిన శకునం కన్పించగానే భవానీ మాత ఆశీస్సులు తమకు లభించాయనే తృప్తి చెంది వేరు వేరు గుంపులుగా బయలు దేరుతారు.ఆతరువాత వీరు ఎవరిని హత్య చేసి దోచుకోవాలో ఎంచుకునే విధానమూ వారిని హత్య చేసే పధ్ధతీ చాలా చిత్రంగా ఉంటాయి, ఒకొక్క గుంపు వారు ఎన్నుకున్న మార్గాన పయనించి ఏదో ఒక ఊరి బయట డేరాలు వేసుకుని మకాం చేస్తారు. అప్పుడువారిలో ఒకరిద్దరు పెద్దమనుషుల్లాగా తయారై ఊళ్లోకి వెళ్తారు. వీళ్ల పని ఆ వూరినుంచి ఎవరైనా పనిమీద గాని వ్యాపారనిమిత్తంగాని ఎక్కడికైనా వెళ్ల బోతున్నారా?ఎప్పుడు బయలు దేరబోతున్నారు? వారిని చంపి దోచుకుంటే లాభసాటిగా ఉంటుందా?మొదలైన పూర్తి వివరాలు సేకరిస్తారు. ఆతరువాత వారితో మాటలు కలిపి తాము సైనికులమనీ తామూ అటే ప్రయాణిస్తున్నామనీ వారికి దారిలో దొంగల భయంలేకుండా రక్షణ కల్పించగలమనీ వారిని నమ్మించి వారిని తమతో ప్రయాణించేటట్లు చేస్తారు.ఈ పని వారు అత్యంత సమర్థవంతంగా చేయగలవారై ఉంటారు.థగ్గులు వీరిని సోథా లని పిలుస్తారు.ఆ విధంగా సోథాలు తీసుక వచ్చిన వారిని మిగిలిన వారు ఏ అనుమానం రాకుండా వారితో సన్నిహితంగా మెలుగుతూ ప్రయాణిస్తూ వారికి నమ్మకాన్ని పెంచుతారు.ఈ విధంగా కొంత దూరం ప్రయాణించాక వారిని ఎక్కడ మట్టు పెట్టాలో ముందే నిర్ణయించుకుని తమలో కొంత మందిని ముందుకు పంపుతారు.వీరి పని హత్య చేయబడిని వారిని పూడ్చడానికి అనువైన ప్రదేశం వెతికి అక్కడ అవసరమైన సైజుల్లో గోతులు తీసి తయారుగా ఉంచడమే. వీరు తీసే గోతులని భిల్లులనీ వీరిని లఘాలనీ అంటారు. ఈ విధమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాక నిర్దేశిత స్థలానికి చేరుకోగానే అక్కడ విడిది చేసి డేరాలు వేసి తమతో వచ్చిన ప్రయాణీకులను కూర్చోపెట్టుకుని పిచ్చాపాటీయో,గానా భజానానో ప్రారంభిస్తారు.తాము చంపదలచుకున్నవారి ప్రక్కనే ముఠాలోని సభ్యులు చేరి కూర్చొని ఉంటారు. వారిని భుట్టోటులంటారు. వీరి చేతుల్లో పొడుగాటి రుమాళ్లు ఒక చివర వెండి కాసు కట్టి ముడి వేసి ఉంటాయి. ఆ విధంగా వీరు సర్వ సిధ్ధంగా  తమ నాయకుడి సైగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.వారి నాయకుడైన జమేదారు వారికి తెలిసిన సంజ్ఞ తంబాకు లావో అనో పాన్ లావో అనో అనగానే భుట్టోటులు తమ చేతిలోని రుమాళ్ళను తమకు నిర్దేశించ బడిన వ్యక్తి మెడచుట్టూ బిగించి లిప్త కాలంలో హతమారుస్తారు.హతునికి నోరు తెరిచి అరిచే అవకాశం కూడా ఇవ్వరు.ఏ కొద్దిమందో కొంచెం సేపు గిలగిల కొట్టుకుని మరణిస్తారట.వారు మరణించగానే వారిబట్టలూడదీసి వారి సంపదనంతా దోచి మూటకట్టుకుంటారు. వారి శవాలను ముందుగా తీసి పెట్టిన గోతుల వద్దకు తీసుకు పోయి వాటిల్లో పూడ్చి పెడతారు.అలా పూడ్చి పెట్టేముందు శవాల పొట్టలను చీల్చుతారట.లేక పోతే పూడ్చిపెట్టిన శవాలు ఉబ్బి ఆ ప్రదేశంలో మట్టి పైకి ఉబ్బినట్లయి నక్కలకీ వాటికీ వాటి ఉనికి తెలిసిపోతుందని ఈ జాగ్రత్త తీసుకుంటారు.ఈ పనయిపోగానే అక్కడనుంచి వెంటనే బిచాణా ఎత్తివేసి మరో చోటికి తరలి పోతారు.తర్వాత తీరిగ్గా దోచుకున్నసోమ్ముని వారి వారి పధ్ధతుల్లో పంచుకుంటారు.అలా కొన్ని హత్యలూ దోపిడీలు చేసాక తిరిగి వారి వారి స్వస్థలాలు చేరుకుని ఎవరికీ ఏ అనుమానం రాకుండా మరలా వారి మామూలు జీవనం కొనసాగిస్తారు. కొన్ని చోట్ల వీళ్లతో ఆ యావూళ్ల జమీందారులూ పటేళ్లూ పెద్దపెద్ద భూస్వాములూ కొంతమంది మిలాఖత్ అయి ఉండేవారు.వారు ధగ్గులకి రక్షణ కల్పించేవారు.అటువంటివారికి ఈ ధగ్గుల దోపిడీల సంపాదనలో వాటా ఉండేది.
ధగ్గులు ఏటా తమ పని మీద బయలు దేరే టప్పుడే కాదు,ఎవరినైనా హత్య చేసాక కూడా కృతజ్ఞతా సూచకంగా వెంటనే దేవిని పూజించడం బెల్లం ప్రసాదంగా పెట్టి దాన్ని స్వీకరించడం చేస్తారు.శకునాలు చూసి కాని బయలు దేరరు.మంచి శకునం కనిపిస్తే భవానీ మాత ఆశీర్వాదాలు లభించినట్లే భావిస్తారు.మంచి శకునం లేక పోతే అడుగు ముందుకు వేయరు. అలాగే బయలు దేరిన తర్వాత ఒక హత్యైనా చేయకుండా ఎవరూ గడ్డం కాని క్షవరం కాని చేసుకోరు. పాన్ వేసుకోరు. వరో విషయమేమిటంటే వీరు స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం గాని వారి మానహరణం చేయడం గాని ఎప్పుడూ చేయరు. ఎప్పుడైనా తప్పని సరి పరిస్థితుల్లో స్త్రీలనూ పిల్లలనూ చంపడం జరిగినా అది వీరి మతం కాదు.అలాగే సంఘంలో కొన్నిజాతులు కులాల వారిని (చాకళ్లు పూజారులు దర్జీలు,వడ్రంగులు,కంసాలులు తెలకులవారు, శిక్కులు,ఫకీర్లు మతప్రచారకులు,నటగాయకులు భంగీలు( Sweepers) మెదలైన వారిని) చంపడం వీరికి నిషిధ్ధమట. చిత్రంగా ఉంది కదా.
ఇంత ఘోరమైన హత్యలు చేసి బ్రతికే వారికి తాము తప్పు చేస్తున్నామని ఎన్నడూ అనిపించక పోవడమే కాకుండా తాము చేస్తున్నది పవిత్రమైన దైవకార్యమనే భావన ఉండడమే చిత్రం. ఒక ధగ్గు తాను 719 హత్యలు చేశాననీ, 12 ఏళ్లపాటు జైలు జీవితం గడపాల్సి రాకపోతే వెయ్యిమందిని సునాయాసంగా చంపగలిగి ఉండేవాడిననీ చెప్పుకున్నాడంటే,వారికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదని తెలుస్తుంది. ఈ ధగ్గుల సంగతి కనిపెట్టి బ్రిటిషువారు ప్రత్యేక పోలీసు దళాలతో వీరిని ఎదుర్కొని 1930-36 ప్రాంతంలో కొన్ని వేలమందిని పట్టుకుని మరణ శిక్షలో ఇతర శిక్షలో వేసారు. ఆ విధంగా క్రమేపీ ఈ దుర్మార్గాలకు భరతవాక్యం పలకడం జరిగింది.
                                                            ***
(మెడోస్ టైలర్ వ్రాసి 1839 లో ప్రచురించిన Confessions of A Thug అనేనవల ఆరోజుల్లో Best seller గా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగాచదువబడింది. Dy.Commissioner  గా పని చేసిన టైలర్ మహాశయుడు తమకు బందీలుగా దొరికిన ధగ్గుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వ్రాసిన గ్రంధమిది.దీనిలోని ధగ్గుల ఆచారవ్యవహారాలకు సంబంధించిన కొన్ని విశేషాలను మాత్రం మీముందు ఉంచాను.గతంలో మన తాతలు నిర్భీతిగా హాయిగా జీవించే వారనే అపోహతో ఆరోజులు మళ్లా రావని అనుకుంటారు చాలా మంది. గతమంతా తడిసె రక్తమున.. కాకుంటే కన్నీళులతోఅన్నాడు శ్రీశ్రీ. కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రజలను దుర్మార్గంగా చంపిన ఈకిరాతక ముఠాలనుగురించి గాని వీరినుంచి ప్రజలను రక్షించడానికి ప్రయత్నించని రాజులగురించి కాని ఏ  చరిత్రలు మనకు చెబుతాయి? అందుకే చరిత్ర చెప్పని కథలు అన్నీ ఎక్కడున్నా చదువుకోవాలని నా కోరిక. మిత్రులకీ చెప్పాలని ఆశ. సెలవు.)
                                                           ***

























  

26, సెప్టెంబర్ 2012, బుధవారం

కళా ప్రపూర్ణుడు, సాహితీ చక్రవర్తి శ్రీ చిలకమర్తి..



యాభై అరవై ఏళ్ల క్రితం తెలుగు దేశాన్ని సినిమా ముంచెత్తని రోజుల్లో పద్యనాటకాలు తెలుగు నాట ఓ వెలుగు వెలిగాయి. అంతవరకూ మరఠ్వాడా థార్వాడ్ నాటక సమాజాల నాటకాలు చూసి చూసి విసుగెత్తిన ప్రజలకు 19 వ శతాబ్దపు చివరి దశకంలో ఆవిర్భవించిన తెలుగు పద్యనాటకాలు వారిని విశేషంగా ఆకర్షించ నారంభించాయి. తెలుగు పౌరాణిక పద్య నాటకాల్లో అత్యంత ప్రజాదరణకి నోచుకున్న తెలుగు నాటకంగా గయోపాఖ్యానాన్ని పేర్కొనక తప్పదు. ఆ రోజుల్లోనే ఈ నాటకం లక్షా యాభై వేల ప్రతులు అమ్ముడు పోయిందంటే దాని ప్రాచుర్యాన్ని గురించి చెప్పవలసిందేముంది? .ఈ నాటక రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఆ కవిగారి జన్మదినం (26 September) సందర్భంగా వారినోసారి సంస్మరించుకోవడం మన విధిగా భావిస్తున్నాను.
1867వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా లోని ఖండవల్లి గ్రామంలో మేనమామ శ్రీ పురాణపండా మల్లయ్యశాస్త్రిగారింట్లో జన్మించారు శ్రీ లక్ష్మీనరసింహం గారు. వారి బడి చదువులు వీర వాసరంలోనూ,నరసాపురంలోనూ రాజమండ్రిలోనూ జరిగాయి. చిన్నప్పటినుంచి కనుచూపులో ఇబ్బంది ఉండేది. ఈ కారణంగానూ ఆర్థికమైన కారణాలవల్లనూ అతడి చదువు కుంటువడినా 1820లో మెట్రిక్యులేషన్ పరీక్ష ప్యాసయ్యారు.తన చిన్న వయసులోనే (21 సంవత్సరాలు) హిందూ నాటక సమాజం కోసం ఏడెనిమిది నాటకాలను వ్రాసి ఇచ్చారు. ఈయన వ్రాసిన తొలినాటకం కీచక వథలో ద్రౌపది వేషాన్నిశ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు ధరించడం విశేషం.తన 22వ యేటనే రచించిన గయోపాఖ్యానం నాటకం వీరికి చిరకీర్తిని సంపాదించిపెట్టింది. ఈ నాటకంలోనే శ్రీకృష్ణుని అథిక్షేపిస్తూ అర్జునుడు ఏమంటాడో చూడండి:
సీ.అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వ
  బంపు మామను బట్టి చంపగలమె
జలకేళి సవరించు జవరాండ్ర కోకల
నెత్తుక పోయి చెట్లెక్క గలమె
యిల్లిల్లు దిరిగి వ్రేపల్లెలో మ్రుచ్చిలి
మిసిమి ముద్దలు దెచ్చి మింగ గలమె
గొల్ల పొట్టెల గూడి కోల సేకొని యాల
కదుపుల నేర్పుతో కాయగలమె

తలిగదండ్రులు పరులకీదలచు కన్య
బలిమిమై దెచ్చి భార్యగా బడయగలమె
దుష్టులను వంక వీరుల ద్రుంప గలమె
అనపరాధుల దండింప నరుగ గలమె.
గయో పాఖ్యానమే కాక ప్రసన్న యాదవము, ప్రహ్లాద చరిత్రము, ద్రౌపదీ పరిణయము మొదలైనవే కాకుండా  అనేక అనువాద నాటకాలను కూడా రచించారు. ఇవే కాక అనేక చారిత్రక నవలలు,సాంఘిక నవలలూ వ్రాసారు. వీరి గణపతి నవల వీరికి హాస్య వాజ్ఞ్మయ నిర్మాతగా పేరుతెచ్చి ఇప్పటికీ ప్రచురణలు పొందుతూనే ఉంది. వీరు రచించిన ప్రహసనాల్లో సంఘంలోని దురాచారాలపై ఘాటైన విమర్శఉంది. కొన్ని కథలు,హాస్య రచనలు జీవిత చరిత్రలే కాక తన స్వీయ చరిత్ర కూడా వ్రాసుకున్నారు. దేశభక్తిపరుడైన ఈయన ఒక సభలో ఆశువుగా చెప్పిన పద్యం ఆంధ్ర దేశమంతా మార్మ్రోగింది. అది ఇధి :
తే. భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు మూతులు బిగియబట్టి.
వీరు స్వంతంగా పాఠశాలలు నడిపారు. పిల్లలకు తెలుగు వాచకాలు వ్రాసేరు. పత్రికా సంపాదకత్వం వహించడమే కాకుండా స్వయంగా మనోరమ పత్రికను స్థాపించి నడిపించారు. ఆ విధంగా సమకాలీన సాహిత్య చైతన్యానికి దోహదం చేసారు. తమ రచనల ద్వారా,పత్రికల ద్వారా,దేశభక్తిని పెంపొందిచే కృషి చేసారు. వీరు మూడు శతకాలను కూడా వ్రాసేరు. అష్టావధానం చేసారు. బాల్యం నుండే చూపు మందగిండంతో పాటు తన 43 సంవత్సరాల వయసు నాటికే పూర్తి అంధత్వం సంప్రాప్తించినా,ఈ మహనీయుడు ఆ తర్వాత కూడా విశేషమైన సాహీతీ కృషి చేయడం చాలా అభినందనయం. వీరి శతకాలలో ఒకటైన కృపాంబోనిధీ శతకం 1933 లోనే అచ్చయినా ఇప్పుడు అలభ్యం కనుక దానిలోని ముచ్చటైన మూడు పద్యాలను పరిచయం చేస్తాను:
మ. జలమందుండుట తిండిమానుటయు నిస్సంగత్వముం బొందుటా
కలముల్ మెక్కుట మోక్ష సాధనములా? యట్లైననం జేపల్ దరి
ద్రులు షండుల్ మఱి వానరంబులును సద్యోమోక్షముంగాంచవే
తెలియం జాలని వారిత్రోవ లివియే దేవా! సత్కృపాంబోనిధీ!
(అదే పనిగా నదుల్లో మునకలిడడం,ఉపవాసాలుండడం ,స్త్రీ సాంగత్యాన్ని వదులుకోవడం, ఆకులు అ లములు తిని కాలం గడపడం—ఇవేవీ మోక్ష సాధనాలు కావు. నిజంగా వీటివలననే మోక్షం వచ్చేటట్లయితే చేపలకూ దరిద్రులకూ నపుంసకులకూ కోతులకూ సద్యోమోక్షం వచ్చి ఉండాలికదా? ఇవన్నీ తెలివి లేని వారి అజ్ఞానపు చేష్టలనీ ఇది నిజమైన భక్తిమార్గం కాదనీ అంటాడు కవి.)
శా. ఆకారంబులు లేని నీకు మనుజుండాకారమిచ్చున్,నినున్
లోకవ్యాపకు గోవెలన్ నిలిపి తల్పుల్ మూయు,నిస్సంగుడౌ
నీకుం బెండిలి జేయు,నాకలితృషానిద్రల్ ప్రకల్పించు,మో
హాకృష్టుండయి బేల యయ్యెనరుడన్నన్నా! కృపాంబోనిధీ!
(నిరాకారుడవైన నీకు అనేక రూపాల్ని కల్పించాడీ మానవుడు. అంతటితో ఊరుకోలేదు. సర్వ వ్యాపకుడవూ సర్వాంతర్యామివీ అయిన నిన్ను కోవెలకట్టి తలుపులు మూసి అందులో బంధించాడు. నిస్సంగుడవైన నీకు ప్రతియేటా పెళ్లిళ్ళు చేయడం మొదలు పెట్టాడు. తనలాగే నీకు కూడా ఆకలి దప్పులను నిద్రనూ కల్పించి ప్రసాదాలు పెట్టడం మేలుకొలుపులు పాడడం మొదలు పెట్టాడు. మాయలో పడి నరుడు అసహాయుడై ఈ వెఱ్ఱి పనులన్నీ చేస్తున్నాడు.)
మ. కలకండంబులకన్న నవ్య కదళీ ఖర్జూర ద్రాక్షా ఫలం
బులకన్నం బువుదేనె కన్న మధురాపూపాదులౌ పిండివం
టల కన్నన్ నవనీతపుంజములకన్నన్ జిహ్వకున్ నీదు ని
ర్మల నామంబు రుచించుచున్నది మహాత్మా! సత్కృపాంబోనిధీ
( దయామయుడవైన ఈశ్వరా!కలకండ,అరటిపండు,ఖర్జూరము ద్రాక్షపళ్లు,పువ్వుతేనె,తియ్యని పిండివంటలు,వె న్న ముద్దలు—వీటన్నిటి కంటె కూడా నీ నామామృతమే మధురాతిమధురమైనది కదా?)
చిలకమర్తి వారి కవితారసాన్ని గ్రోలాలంటే ఆయన శతకాలూ ఇతర రచనలూ చదివి తీరాల్సిందే.
ఈ మహనీయునికి కళా ప్రపూర్ణ బిరుదాన్ని,సాహిత్య చక్రవర్తి బిరుదాన్ని ఇచ్చి ఆంధ్ర జాతి తనను తాను గౌరవించుకుంది.
( వీరు 17.6.1946 న నిర్యాణం చెందారు.)
సెలవు.



18, సెప్టెంబర్ 2012, మంగళవారం

మళ్ళీ ఒక సారి వెళ్ళి రావాలి సురపురం...



సురపురమా? అదెక్కడుంది? మళ్ళీ వెళ్ళి రావడమేమిటి? ఇంతకు ముందెప్పుడైనా వెళ్లామాఇంతకీ అక్కడేముందని? ఏమిటా కథా కమామిషూ?
అదేనండి.అదే చెప్పబోతున్నాను.ఇంతకు ముందు నా బ్లాగులో నేను చదివిన ఓ మంచిపుస్తకం. ఒక పరిచయం అన్న పోస్టు చదివిన వారికి మెడోస్ టైలర్ బ్రిటిష్ ఆడ్మినిష్ట్రేటర్ గా సురపురం సంస్థానంలో పని చేసాడనీ ఆ సంస్థానం మన తెలంగాణా ప్రాంతానికి చెందినదనీ తెలిసే ఉంటుంది. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు గుల్బర్గా ప్రాంతం కర్ణాటక రాష్ట్రం లో చేరిందనీ గుల్బర్గా మండలానికి చెందిన సురపురం కూడా దానితోపాటే కర్ణాటక లో చేరిపోయిందనీ తెలుసు. టైలర్ జీవిత చరిత్ర చదివిన దగ్గరనుంచీ నాకు ఈ సురపురం ఎక్కడుందో తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరిగింది. గుల్బర్గా ప్రాంతంలో ఉంటుందని గూగుల్ మేప్ లో సురపురం కోసం వెతికాను కానీ దొరక లేదు. ఆ మధ్య కొన్నాళ్లక్రితం హైదరాబాదునుంచి షిరిడీ వెళ్తున్న మన వోల్వో బస్సు షోలాపూర్ కి పాతిక మైళ్లు ముందరగా ఉన్న నల్ దుర్గ్ వద్ద అర్థ రాత్రి ప్రమాదానికి లోనై చాలా మంది చని పోయిన వార్త చదివినప్పుడు మళ్లా టైలర్ మహాశయుడు గుర్తుకు వచ్చేడు. ఎందుచేతనంటే సురపురం తర్వాత బ్రిటిష్ పాలనలో ఈ నల్ దుర్గ్ జిల్లా కే టైలర్ డిప్యూటీ కమిషనర్ గా పని చేసాడు. ఇది గుర్తుకు రాగానే మళ్ళా నా మనసు సురపురం మీదికి పోయింది. చిన్న పాటి పరిశోధన తో ఎలాగైతేనేం సురపురాన్ని పట్టుగో గలిగాను.
ఆనాటి సురపురం సంస్థానం రాజులు నివసించిన కోట,ఊరు ఉన్న ప్రదేశాన్ని ఇప్పుడు షోరాపూర్ అనే వ్యవహరిస్తున్నారు. ఈ పేరు ఇంతకు ముందు కూడా ఉంది. సూరా పూర్ షోలాపూర్ షోరాపూర్ అని కూడా పిలిచే వారట. సురపురం అన్న పేరు మాత్రం కనుమరుగై షోరాపూర్ అన్న పేరు మాత్రమే ఇప్పుడు వాడుకలో ఉంది. 2011 లో ఈ ఊరి జనాభా 45000 ట. ఒకప్పుడు గుల్బర్గా జిల్లాలో ఉన్నసురపురం ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ యాద్గిర్ జిల్లా లో ఒక తాలూకా కేంద్రంగా ఉంది.
టైలర్ మహాశయుడు బ్రిటిష్ ప్రతినిధిగా సురపురం సంస్థానానికి వచ్చే సరికి అక్కడి పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంది. రాజు కృష్ణప్ప నాయక్ చనిపోయాడు.అప్పటికి అతడికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. రాణి ఈశ్వరమ్మ బ్రిటిష్ ప్రతినిధిని కాదని 10000 మంది సాయుధుల్ని సమకూర్చుకుని రాజ్యం దక్కించుకుందికి ప్రయత్నిస్తోంది. కృష్ణప్ప తమ్ముడు పెద్ది నాయక్ యువరాజుకు యుక్త వయసు వచ్చే వరకూ రాజప్రతినిధిగా వ్యవహరించాడానికి గవర్నర్ జనరల్ కు అర్జీ పెట్టుకున్నాడు. సైనిక చర్యతో తప్ప పరిస్థితిని అదుపు చేయలేమన్నాడు అప్పటి బ్రిటిష్ ప్రతినిధి. దానికి గవర్నర్ జనరల్ సుముఖంగా లేక పోవడంతో ఆ ప్రతినిధి రాజీనామా చేయడం. అతడి స్థానంలో టైలర్ రావడం జరిగాయి. టైలర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించి పెద్దినాయక్ ని రాజప్రతినిధిని చేసి రాజకుమారుడికి చదువు సంధ్యలు నేర్పి పెద్దవాడిని చేసే బాధ్యతలు స్వీకరించి కాలక్రమంలో అతడిని పట్టాబిషిక్తుడ్ని చేసాడు. టైలర్ వ్యక్తిత్వాన్నిగురించి,ఆవూరి బాగోగులకి ప్రజలకి అతడు చేసిన సేవలగురించి చెప్పుకో వలసింది చాలానే ఉంది కాని అది ఎప్పుడైనా మరోసారి. ముందు ఈ సురపురం సంస్థానం గురించి కొంచెం తెలుసుకుందాం.
ఈ సంస్థానం కృష్ణా భీమా నదుల మధ్య ప్రదేశంలో కృష్ణా నది కుత్తరాన బిజాపురానికి నైరుతి దిశలోఉండేది.ఈ సంస్థానము నేలిన రాజ వంశీయులు రామ భక్తుడైన నిషద రాజు గుహుని సంతతి వారని,వీరు వేటగాళ్లని తెలుగు కైఫీయతు చెబుతోందట. ముదుగల్లు సీమ     (ఇప్పటిMudgal)లోని కోసల పేట ఒకప్పటి వీరి రాజధాని అనీ అందుచేత వీరిది కోసల వంశమంటారనీ కొందరంటారు. వీరేలిన కోసల దేశమే కోసల్నాడు లేక కాసల్నాడు అనీ ఒక వాదన కూడా ఉందట. వేట జీవనోపాధిగా బ్రతికే వీరిని స్థానికంగా బేడరులంటారు. ఈ సీమలో వీరే అధిక సంఖ్యాకులు. వీరిలో ముఖ్యులకు నాయకులని వ్యవహారమట. పామి నాయక్ అనే వాడు క్రీ.శ.1713 లో ఈ సురపురాన్ని నిర్మించి రాజధాని చేసుకున్నాడట.ఈ పామి నాయకుడు వైష్ణవ మతావలంబి. ఈ పరంపరలో సురపురాన్నేలిన చివరివాడే మన టైలర్ మహాశయుడు పెంచి పెద్ద చేసిన వెంకటప్పనాయక్. ఇతడు బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి చేయూతనివ్వడం ఆ సందర్భంగా బ్రిటిష్ వారు ఇతడిని బందీని చేయడం,టైలర్ కృషి వలన ఇతనికి ఉరిశిక్ష తప్పి నాలుగేళ్లు కారాగార శిక్ష పడడం,అది అమలు కాకుండానే అతడే తనను తాను కాల్చుకుని మరణించడం మనకు తెలిసిందే.
ఈ సంస్థానాధీశుల ఆశ్రయంలో దిగ్దంతుల వంటి పండితులుండేవారట. వారు సంస్కృత భాషాభివృధ్ధికి విశిష్టాద్వైత సిధ్ధాంత ప్రచారానికీ సాగించిన రచనలు కొల్లలుగా ఉన్నాయట.ఈ రాజ వంశంలో 1752 నుంచి 1773 వరకూ పాలించిన రాజా బహిరీ పామ నాయక్  కేవలం కృతి భర్తయే కాక స్వయంగా కవియట.ఇతడు తాను రచించిన భార్గవ పురాణాన్ని వారి కులదైవం సురపురం వేణుగోపాలునికి అంకితమిచ్చాడట.ఈయన కొడుకైన వేంకటనాయకుడు కూడా సాహిత్య పోషకుడే. అభినవ పెద్దన అని బిరుదు పొందిన కాణాదము పెద్దన సోమయాజి కవి,ముమ్మడి వెంకటాచార్యుడు మొదలైన కవులీ ఆస్థానానికి చెందిన వారే. 700 గ్రామాలు కలిగి,ఉత్సవ సమయాల్లో కవి పండిత నర్తక గాయకాదులకు భూరి సంభావనలిచ్చి ఆర్షధర్మాన్ని కళాసంస్కృతులను వికసింపజేసి విశిష్ట ప్రతిపత్తిని గడించిన సంస్థానంగా దీనిని శ్రీ తూమాటి దొణప్ప గారు పేర్కొన్నారు. కర్ణాటక సరిహద్దుల్లో నాగరికతకు నోచుకోని ప్రాంతంలో తెలుగు సాహిత్య పోషణకి నోచుకున్నదీ సంస్థానం. అందుకే ఇదెక్కడుందో తెలుసుకోవాలనీ ఒకసారి చూడాలనీ అనుకున్నాను. నాటి సురపురం కాదు గానీ-- ఈనాటి షోరాపూర్ నీ, అక్కడ శిధిలమైన కోటనీ, టైలర్ మహాశయుడు 1844 లో నిర్మించుకుని నివసించిన అతడి ఇంటినీ చూడగలిగాను. దాని పేరు టైలర్ మంజిల్. ఇప్పటికీ అది నివాస యోగ్యంగానే ఉండి కర్ణాటక ప్రభుత్వ Circuit house గా విరాజిల్లుతోంది.ఈ పని నేను నా కంప్యూటర్ ముందు కూర్చునే చేయగలిగాను. మీకూ ఆసక్తి ఉంటే Shorapur- u tube అని నెట్లో చూడండి.
( ఈ వీడియోని నెట్ లో పెట్టిన వారు CFSI-Azim premji Foundation వారు. సురపురం సంస్థానం వారి సాహిత్య పోషణ గురించి వివరంగా కావాలంటే శ్రీ దొణప్ప గారి ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణము అనే గ్రంథం చదవండి.)
ఇప్పటికి సెలవు.