29, అక్టోబర్ 2012, సోమవారం

శ్రీ రాముని వంశావళి..


శ్రీ రాముడు సూర్య వంశానికి చెందిన మహారాజని మనందరికీ తెలుసు.శ్రీ రాముని వంశానికి చెందిన అతని పూర్వీకుల గురించి కాని, అతడి తర్వాత అయోధ్యనేలిన ఆ వంశీకుల గురించి కాని ఏమైనా తెలుసా?
అయోధ్యనేలిన సూర్యవంశపు రాజులలో శ్రీ రాముడు 64వ వాడని అంతకు ముందు ఆ రాజవంశీకులు 63రు అయోధ్యనేలారని ఇప్పటికి దాదాపు 80 ఏళ్లక్రితం ప్రచురించిన తన రామాయణ్ కా ఇతిహాస్ అనే గ్రంథంలో శ్రీ రాజ్ బహదూర్ సీతారామ్ గారు తెలియజేసారు.వీరిలో చాలామంది గురించి వాల్మీకే తన రామాయణంలో వశిష్టమహర్షి ద్వారా జనక మహారాజుకు చెప్పించాడు.
అమెరికా లోని లూసియానా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ కాక్ తన అస్ట్రోనామికల్ కోడ్ ఆఫ్ ది రుగ్వేదా అనే గ్రంథంలో రామునికి ముందర అయోధ్యనేలిన ఆ వంశపు 63రు రాజుల పేర్లూ, శ్రీ రాముని తర్వాత అతని కొడుకు కుశునితో ప్రారంభించి మరొక 29 మంది రాజులనుగురించి ప్రస్తావించాడు.
ఆ పట్టిక ఈ దిగువన చూడండి.
శ్రీ రాముని వంశావళి.          
1.మనువు 2.ఇక్ష్వాకు .వికుక్షి4..కకుత్స5.అనినాశ6.పృథు7.విశ్టారశ్వ8.ఆర్ద్ర9.యవనాశ్వ(1)10.శ్రావత్స
11.బృహదాశ్వ12.కువలాశ్వ13.ధృడాశ్వ14.ప్రమోద15.హర్యాశ్వ(1)16.నికుంబ17.సంహతాశ్వ18.అక్రశాశ్వ19.ప్రసేనజిత్
20.యవనాశ్వ(2)21.మాంధాత22.పురుకుత్స23.త్రసద్స్యు24సంభూత25.అనారణ్య 26.త్రసద్స్వ27.హర్యాశ్వ(2)28.వసుమత29.త్రిధన్వ30.త్రయ్యారుణ
31.త్రిశంకు32.సత్యవ్రత33.హరిశ్చంద్ర34.రోహిత35.హరిత36.విజయ 37.రురుక38.వ్రక39.బాహు40.సగర
41.అసమంజస42.అంశుమంత 43.దిలీప(1)44.భగీరథ45.శ్రుత46.నభగ47.అంబరీష48.సింధుద్వీప49.అయుతాయు
50.ఋతుపర్ణ51.సర్వకామ52.సుదాస53.మిత్రసహ54.అస్మాక55.ములక56.శతరథ57.అయిదావిద58.విశ్వసాహ(1)
59.దిలీప(2)60.దీర్ఘబాహు61.రఘు62.అజ63.దశరథ64.శ్రీ రామ65.కుశ 66.అతిథి67.నిశాధ68.నల69.నభస
70.పుండరీక71.క్షేమధన్వ72.దేవానిక73.అభినాగు74.పరిపత్ర75.బల76.యుక్త77.వజ్రనాభ78.శంఖ79.వ్యుశిత్సవ
80.విశ్వసాహ(2)81.హిరణ్యభ82.పుష్య83.ధృవసంధి84.సుదర్శన85.అగ్నివర్ణ86.శీఘ్ర87.మరు88.ప్రసుశ్రృత89.సుసంధి90.అమర్ష
91.మహశ్వత92.విశ్రుతవంత93.బృహద్బల94.బృహత్క్సాయ.
పై పట్టికలో మొదట పేర్కొన్నమనువు వైవస్వత మనువు.ఇతడి కొడుకైన ఇక్ష్వాకుడే అయోధ్యనేలిన మొదటి ఇనవంశపు రాజు.అందుకే అది ఇక్ష్వాకు వంశంగా పేరుగాంచింది.ఆ తరువాత ఈ వంశంలో20వ వాడైన, రెండవ యవనాశ్వుని కొడుకు మాంధాత చక్రవర్తి పేరు బడసిన మహారాజు.ఆతరువాత 31వ వాడైన త్రిశంకుడు, 33వ వాడైన హరిశ్చంద్రుని కథలు మనకు
పరిచయమైనవే.ఈ వంశంలో 40వ వాడైన సగరుడు అతనికొడుకు అసమంజసుడు,మనుమడు అంశుంతుడు,ముని మనుమడు దిలీపుడూ, అతనికొడుకు భగీరథుడూ మనకు గంగావతరణం గాథ ద్వారా సుపరిచితులే. ఆ తర్వాత 61వ రాజైన రఘువు వలననే  వంశానికి రఘువంశమని పేరువచ్చింది.ఈ రఘు మహారాజు మనుమడే శ్రీ రామచంద్రుని కన్నతండ్రియైన దశరథ మహారాజు.
శ్రీ రాముని తర్వాత అతనికొడుకు కుశుడు పట్టాభిషిక్తుడౌతాడు.ఆ తర్వాత రఘువంశంలోని రాజులెవరూ ప్రసిధ్ధులైనట్లు తోచదు.
స్థూలంగా శ్రీ రాముని ముందూ వెనుకా అయోద్య నేలిన సూర్య వంశపురాజుల కథ ఇది.
సరదాగా ఇక్కిడొక ముచ్చట చెప్పి ముగిస్తాను.
శ్రీ రాముని తరువాత అయోధ్య గద్దెనెక్కిన రాజుల్లో 21 వ వాడు అగ్ని వర్ణుడు.ఇతడు భోగ లాలసుడు, విషయలోలుడై రాజ్య పాలన ఏ మాత్రం పట్టించుకునే వాడు కాదట.అయినా అతనికి చాలా సమర్థవంతమైన మంత్రి వర్గం ఉండడంతో రాజ్య పరిపాలన సజావుగానే సాగుతూ ఉండేది.ప్రజలు ఎంత సుఖశాంతులతో వర్థిల్లుతున్నప్ప టికీ వారికి తీరని కోరిక ఒకటి మాత్రం ఉండిపోయిందట. వారికి ఏనాడూ రాజ దర్శనం అయ్యేదికాదట.ఎంతటి ముఖ్యమైన సందర్భమైనా రాజుగారు సభా భవనానికి రాక పోవడంతో జనంలో అనుమానాలు మొలకెత్తడం ప్రారంభించాయట. రాజుగారు మరణించినా ఆవిషయం ప్రజలకు తెలియనివ్వకుండా మంత్రులే తమని మోసగించి పరిపాలిస్తున్నారేమోనని గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారట.ఇది రాజ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని గ్రహించిన మంత్రులు, ఒక్కసారి ప్రజలకు దర్శనం దయచేయమని ప్రాధేయపడగా పడగా అందుకు రాజుగారు తాను సభకు రాననీ  తాను తన అతఃపుర గవాక్షంనుంచి కాళ్లు బయట పెడతానని ప్రజలు వాటిని దర్శించుకుని మ్రొక్కుకుని వెళ్లిపోవచ్చనీ సెలవిచ్చారట.చెరకుతుద వెన్ను పుట్టి చెరకులోని తీపినంతా చెరిచినట్లు ఇంత పేరుగాంచిన రఘువంశంలో ఇటువంటి వారు ఉద్భవించిన తర్వాత ఆ వంశం ఎన్నాళ్లు మనగలదు?  ఆతర్వాత పట్టుమని పది మంది రాజులు అయోధ్యనేలినట్లు లేదు.
( ఈ కథ రఘువంశంలో ఎక్కడైనా ఉందేమో? నాకు తెలియదు. ఈ కథ నేను పాతిక ముఫ్ఫై ఏళ్లక్రితం ఆంధ్రప్రభ వార పత్రికలో చదివాను.శ్రీరాముని గురించి నేను వ్రాసిన పోస్టులలో ఇది 5వదీ ఆఖరుదీను.మనకీ మంచి సమాచారాన్ని అందించిన  I-SERVE Delhi వారికి మరో సారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ- సెలవు. )








                                      


26, అక్టోబర్ 2012, శుక్రవారం

కన్యాశుల్కం--టీకా..టిప్పణీ...



టీక అంటే ఒక పదానికి గల అర్థం. టిప్పణి అంటే టీక కు టీక. అంటే అర్థాన్ని మరింత వివరించి సుబోధకం చేయడమన్నమాట.  ఏదో ఉద్గ్రంధాల్లోనో కావ్యాల్లోనో ఉన్న పద్యాలకైతే సరేగాని, మామూలు వాడుక భాషలో వ్రాసిన కన్యాశుల్కం నాటకానికి టీకా టిప్పణీ ఎందుకు? ఎందుకంటే కన్యాశుల్కం నాటకం వందేళ్లక్రితం విశాఖ జిల్లా మాండలికంలో వ్రాయబడింది.అక్కడ ఆనాడు వాడుకలో ఉండిన మాటల్లో కొన్ని ఈనాడు వాడుకలో లేవు.ఆ నాడు జనం ధారాళంగా ఉపయోగించిన పార్శీ ఉర్దూ పదాలు ఎన్నో ఉన్నాయి.అదీ కాక ఈ నాటకంలో ఎన్నో ప్రాంతాల పేర్లూ (బొంకుల దిబ్బ, కస్పా బజారు లాంటివి) ఎందరో వ్యక్తుల పేర్లూ (సురేంద్రనాధ్ బెనర్జీ,టెన్నసన్ లాంటివి) వస్తాయి. ఎన్నో పద్యాలు పాత్రల నోటంట వస్తాయి.ఈనాడు జనానికి అర్థంకాని విశాఖ ప్రాంతపు ఆనాటి పలుకుబళ్ళూ ఉన్నాయి. వీటన్నిటినీఅర్థం చేసుకుంటూ కన్యాశుల్కం నాటకాన్ని చదివి దానిలోని స్వారస్యాన్ని గుర్తించాలంటే ఇప్పటి వారికి మరీ ముఖ్యంగా యువతకు టీకా..టిప్పణీ.. అవసరమే.మరి అలాంటిదేదైనా ఉందా  అంటే ఉంది.
1980లలో కన్యాశుల్కం మొదటికూర్పును సంపాదించి విశేషమైన శ్రమకోర్చి దానిలోని ఎన్నో పదాలకు వివరణాత్మకమైన ఫుట్ నోట్స్ వ్రాసి ప్రచురించారు కీ.శే. బండి గోపాల రెడ్డి( (బం.గో.రె.) గారు.(ఇది అప్పట్లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న మా అమ్మాయిలు అక్కడి లైబ్రరీనుండి తెచ్చిపెట్టగా చదివాను.ఇప్పుడది ఎక్కడైనా లభ్యమో కాదో నాకు తెలియదు).గురుజాడలు పేరుతో గురజాడ సమగ్ర రచనలు క్రిందటి నెలలో ప్రచురించిన మనసు ఫౌండేషన్ వారి పుస్తకంలో కన్యాశుల్కం మొదటి కూర్పు ఉంది కాని దానిలో ఎటువంటి పుట్ నోట్స్ లేవు.ఇప్పుడు మనకు సర్వత్రా లభ్యమయ్యే కన్యాశుల్కం రెండవకూర్పు మొదటి కూర్పుకన్నా చాలా పెంచి వ్రాయబడింది కనుక, దానిలో ఇంకా ఎక్కువ పదాలకు వివరణలు తెలుసుకోవలసి ఉంది.ఈ అవసరం తీర్చిన వారు శ్రీ గురజాడ సాహిత్యం మీద  మహోదయం వెలయించిన శ్రీ కె.వి.రమణారెడ్డిగారు.వీరు తయారు చేసిన కన్యాశుల్కం టీకా..టిప్పణీ”,  కన్యాశుల్కం నూరేళ్ళ పండుగ సందర్భంగా 1991లో ప్రచురించిన వారు శ్రీ వెలుగు రామినీడుగారు. రామినీడు గారు ఈ పుస్తక ప్రచురణోద్దేశ్యాన్ని తెలియజేస్తూ ఈ గొప్ప రచన(కన్యాశుల్కం) తనంత తానుగా బోధపడక పోవడానికి కారణం,నిర్దిష్టమైన మాండలిక భాషా ప్రయోగమే., ప్రజల వాడుక భాషను ఎంతో వైవిధ్యసంపన్నంగా పాత్రోచితభేదాలతో సహాగ్రంథస్థం చెయ్యడం మూలాన, రచనకు ఎంతటి శోభ సమకూరిందో, అర్థ వివరణ లేకుండా బోధ పరచుకోవడం అంత కష్టతరమైందిఅంటారు. ఈ పుస్తకం కన్యాశుల్కం చదివే నేటి పాఠకులకు
ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే శ్రీ రమణారెడ్డిగారు కొన్ని పదాలకు ఇచ్చిన వివరణ విషయంలో నాకు కొంచెం భేదాభిప్రాయం ఉంది. మరికొన్ని పదాలకు ఇంకా కొంత వివరణావశ్యకతా ఉంది.
కన్యాశుల్కం ద్వితీయాంకం మొదటి స్థలంలో-చివర్లో- గిరీశం వెంకటేశంతో యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్ పూరా ప్రయోజకుడివే అంటాడు. దీనికి రెడ్డి గారు
ఇది శార్జ్ఞ దేవుడి సంగీత రత్నాకరంలోని ఒక అధ్యాయం పేరు. ఇక్కడ వ్యంగ్యార్థంలో దెబ్బల ప్రకరణం అనుకోవాలిఅని వివరణ ఇచ్చారు.ఇది సరికాదు.సంగీతకారులు తాళం వేసినా సున్నితంగా వేస్తారు.ఆ దెబ్బలకీ ఇక్కడి తాళాధ్యాయానికీ సంబంధం లేదు. పైన చెప్పిన గిరీశం సంభాషణకి కొంచెం సేపు ముందరే
వెంకటేశంఇవాళ మీరే రాకపోతే పరీక్ష ఫెయిలయినందుకు మానాన్న పెయ్యకట్టుతాడుతో చెమ్డాలెగ్గొట్టును అంటాడు. ఉత్తరాంధ్రలో దూడలను పెయ్యలంటారు. వాటిని కట్టే తాళ్లు తాటినారతో పేనినవై ఉంటాయి.(తాడు అనే పదమే అవి తాటినారతో తయారైనవని సూచిస్తుంది కదా?)అటువంటి  తాడును తీసుకుని చర్మం చిట్లేట్టు చావగొట్టడాన్నే గిరీశం వ్యంగ్యంగా తాళాధ్యాయం అని అన్నాడన్నమాట. ( నా తాటిచెట్టు కథ అన్న పోస్టులో అందుకే ఈ తాళాధ్యాయం గురించి సరదాగా ప్రస్తావించేను.)
తృతీయాకం రెండవ స్థలంలో రామప్పపంతులు నా దగ్గర పాత తాటాకులు అలేఖాలు అటకనిండా ఉన్నాయి. అంటాడు. దీనికి రెడ్డిగారు అలేఖాలు అంటే పత్రాలు అని వివరించారు.ఇది సరికాదు. అలేఖాలు అంటే ఏమీ లిఖించబడని,వ్రాయడానికి సిద్ధం చేసుకుని ఉంచుకున్న ఖాళీ తాళ పత్రాలు.గ్రంధాలు వ్రాసుకుందికి పనికి వచ్చే ఇలాంటి ఖాళీ తాళపత్రాలను దొంగ జాతకాలు బనాయించడానికి పనికి వస్తాయని రామప్పపంతులు జాగ్రత్త చేసుకుని ఉంచుకున్నాడన్నమాట.
చతుర్థాంకం ఒకటోస్థలంలో రామప్ప పంతులు నేను పిత్రార్జితం అంతా కరారావుఁడు చుట్టేశాను అంటాడు.దీనికి క్రావడి చుట్టి (సున్న చుట్టినట్టు) వేశాను.అంటే ఖర్చు పెట్టివేశానుఅని రెడ్డిగారు అర్థం చెప్పారు. కాని దీనికి సరైన అర్థం – క్రావడి చుట్టడం అంటే క్రయం చేయడం. తన పిత్రార్జితం అంతా అమ్మివేశాడని అర్థం.
తృతీయాంకంలో వచ్చిన దూబర అనే మాటకు దుబారా ఖర్చు అని చెప్పిన అర్థం సరైనదే.ఇంకొంచం వివరంగా చెప్పాలంటే- ఈ పదం పార్శీ ఉర్దూల ద్వారా తెలుగు లోకి వచ్చింది.దు+బారా అంటే రెండోసారి అని అర్థం.ఏ పనైనా రెండోసారి చెయ్యాల్సి రావడం వృథా శ్రమేకదా. దుబారా చెయ్యడమంటే వృథా (Wasteful)గా చేయడమనే అర్థం.
ఇదే అంకం మూడవ స్థలంలో వచ్చిన రొకాయించడం అనే మాటకి సాధింపు పెట్టకూడదు, నస పెట్టకూడదు అని అర్థం ఇచ్చారు. దీనికి సరైన అర్థం అడ్డుపెట్టకూడదని. అడ్డుకోవడం అనే అర్థానిచ్చే రుక్నాఅనే పార్శీ పదం నుంచి వచ్చినదిది. పార్శీపదాలకు ఇంచు అనే ప్రత్యయం చేర్చుకుని మన తెలుగులో చేర్చుకున్న అనేకమైన చలాయించు బనాయించు, జమాయించు డబాయించు లాంటిదే ఇదిన్నీ.
మరో చోట సప్త వెధవ అనే మాటకి-సప్త అనేదినిందార్థకమనీ,అన్నిందాలా వెధవ, పరమ వెధవ అనీ వివరించారు.పరమ వెధవ అనే అర్థం సరైనదే.కాని ఈ పదానికి ఇంకొంచెం వివరణ అవసరం. మనకి వ్యసనాలు ఏడు. సప్త వ్యసనాలు అంటారు.అంటే అంటే ఏ కొన్నో కాకుండా అన్ని దుర్గుణాలూ( సప్తవ్యసనాలూ) ఉన్న వ్యక్తిని సప్త వెధవ అనే వారని నా భావన.
ద్వితీయాంకంలోనే వచ్చిన బోగట్టా, ఓఘాయిత్యం అనే మాటలకు నాకు తోచిన వ్యుత్పత్తిని ఇంతకుముందే నా రెండు మాటలు –రెండు ఊహలూ అనే పోస్టులో వివరించాను.
తునితగవు అనే మాటకి-ఎవ్వరినీ నొప్పించకుండా చెప్పే తీర్పు అనీ, కృష్ణా జిల్లాలోదీనినే భట్టిప్రోలు పంచాయితీ అంటారని రెడ్డిగారు వ్రాసేరు.ఇది సరైనదే.కాని ఉత్తరాంధ్రలో చెప్పుకునే తుని తగవు కథ ఏమిటంటే-ఒకసారి అదృష్ట దేవతైన మహాలక్ష్మీదేవీ, దురదృష్టదేవతైన ఆమె అక్కగారు జ్యేష్టాదేవి ఆకాశంలో వస్తూ తమలో ఎవరు బాగుంటారోనని వాదు లాడుకున్నారుట.ఎవరినైనా కనుక్కుందామని వారు భూమిమీదకు దిగిన స్థలం మన ఆంధ్రదేశంలోని తుని.అక్కడి వర్తక ప్రముఖుడిని ఒకరిని తమలో ఎవరు బాగుంటారో తీర్పు చెప్పమని  వారు అడిగారట.అప్పుడా షావుకారు ఇద్దరినీ నొప్పించకుండా ఉండడానికి తన జాణతనం చూపిస్తూ లక్ష్మీదేవితో చిన్నమ్మా నీవు ఇంట్లోకి వస్తున్నప్పుడు బాగుంటావు, మీ అక్కగారు ఇంట్లోంచి వెళ్లిపోతున్నప్పుడు బాగుంటుందిఅన్నాడట.ఇది కథే అయినా ఎంతోచమత్కారంగా ఉంది కదా? మరి ఇలాంటికథలు తెలుసుకోకపోతే ఎలా?

ఈ సారి కన్యా శుల్కం చదివితే  రమణా రెడ్డిగారి టీకా టిప్పణీ దగ్గర పెట్టుకుని చదవండి. మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కె.వి. ఆర్. కృషి అభినందనీయం అని మీరే గుర్తిస్తారు.(ఈ టీకా టిప్పణీ ఖరీదు కేవలం అయిదు రూపాయలే.ప్రచురణమకర్త రామినాయుడుగారి అడ్రసు-రామినాయుడు, వెలుగు,Quarter No.ELC28,రైల్వే ఓల్డ్ కోలనీ, విజయనగరం-531203.)
సెలవు.     

19, అక్టోబర్ 2012, శుక్రవారం

శ్రీ రాముడు సేతువు కట్టేడా...?



ఇంతకు ముందు పోస్టు(శ్రీ రాముడు నడచిన దారుల్లో..) లో సీతాన్వేషణ చేస్తున్న రాముడు ఆమెనపహరించుకు పోయిన రావణునిపై దండెత్తడానికి సైన్య సమేతంగా లంకాపురికి వెళ్ళడానికి  రామేశ్వరం చేరుకోవడాన్నిగురించి చెప్పుకున్నాం. రామేశ్వరం ఒక ద్వీపంలో ఉందని మనకు తెలుసు.ఈ ద్వీపం చేరుకోగానే మొదట శ్రీ రాముడు కొద్దికరై అనే ప్రదేశంలో విడిసి సముద్రం మీద వారధి కట్టడానికి ఆ ప్రదేశం అనువైనది కాదని నిర్ణయించుకుని తన సైన్య సమేతంగా రామేశ్వరం చేరుకున్నాడు. (వారధి కట్టడానికి అనువైన ప్రదేశాన్ని వెతకడం గురించి రామాయణం లోని యుధ్ధకాండలో వాల్మీకి వివరంగా వ్రాసేడు)  సరైన స్థల నిర్ణయం చేసుకున్నాక వారధి నిర్మాణానికి అనుభవజ్ఞుడైన శిల్పకారుణ్ణి తీసుకు రమ్మని సుగ్రీవుణ్ణి కోరేడు.దీనికి సమర్థుడైన వాడు విశ్వకర్మ అంతటి అనుభవజ్ఞుడైన నలుడే అని సుగ్రీవుడు చెప్పగా శ్రీ రాముడతడిని రావించాడు.నలుడు కూడా శ్రీ రాముడు ఎంపిక చేసిన స్థలమే సేతునిర్మాణానికి తగినదని అభిప్రాయపడి నిర్మాణ బాధ్యతను స్వీకరించాడు. నలుడి పర్యవేక్షణ లో సేతు నిర్మాణం 5 రోజులలో పూర్తయ్యిందని వాల్మీకి వ్రాసేడు.నూరు యోజనాల పొడవున్న ఈ సేతువుని మొదటి రోజు 14, రెండవరోజు 20, మూడవ రోజు21, నాల్గవ రోజు22, ఐదవ రోజు 23 యోజనాల మేరకు నిర్మించారట. దీని వెడల్పు పదియోజనాలట.
ఈ సంగతి వింటే నా లాంటి వాడికెవడికైనా నమ్మశక్యంకాదు. ఎందుచేతనంటే లంకకీ రామేశ్వరం దీవికీ మధ్యన సేతువున్న చోట దూరం 30 కి.మీ. మానవ మాత్రులైవరికైనా తమకి ఎంతమంది సైన్యం సహకరించినా సముద్రంలో వారధి అనేది 5 రోజుల్లో కట్టడం అనేది అసాధ్యం. ప్రస్తుతం సముద్రంలో ములిగి పోయి ఉన్నా రామసేతువనేది ఇప్పటికీ ఉంది. ఇంత కాలం (అంటే కనీసం 7 వేల సంవత్సరాలు) సముద్రపు తాకిడిని తట్టుకుంటూ నిలిచి ఉండే నిర్మాణం ఏదయినా ఏ కాలంలో నయినా మానవులకు అసాధ్యమే.అయితే శ్రీ రాముడు మానవుడు కాడు భగవత్స్వరూపుడు కనుక సాధ్యమయిందనుకుందామంటే శ్రీ రామావతారంలో అటువంటి మానవాతీత శక్తుల ప్రదర్శన ఏదీ జరుగలేదు.ఈ అవతారంలో శ్రీ రాముడు తన జీవితమంతా మానవుని లాగే జీవించాడు.మన లాగే కష్టసుఖాలను అనుభవించాడు.ఎటువంటి అద్భుతాలనూ ప్రదర్శించలేదు.అయితే మరి రామసేతు నిర్మాణ రహస్యం ఏమిటి? రామసేతువనేది మానవ నిర్మాణం కాదా? ప్రకృతి సహజమైన నిర్మాణం అయి ఉంటుందా? ఈ విషయంలో ఇప్పటికీ జనంలో సందిగ్ధత నెలకొనే ఉంది. ఈ ప్రశ్నలకు  హేతుబధ్ధమైన సమాధానం కోసం శాస్త్రీయ పరిశోధనల సారాంశాన్ని పరిశీలిద్దాం.
గడచిన 15000 సంవత్సరాల్లో పెరిగిన/తరిగిన సముద్రపు నీటి మట్టాలు—తీర ప్రాంతపు ఆవాసాల పై వాటి ప్రభావం గురించి విస్త్రుత పరిశోధన చేసిన డా.రాజీవ్ నిగమ్ గారు చెప్పిన దాన్నిబట్టి  క్రీ. పూ.7500 సంవత్సరాలనుండి తీర ప్రాంతంలోని అనేకమైన ఆవాసాలు సముద్ర గర్భంలో కలసి పోవడమో భూ స్ధాపితమై పోవడమో జరిగింది.మారుతూ వస్తున్న ఈ సముద్రపు నీటి మట్టాల్ని విశ్లేషించి ఆయన చెప్పినదాని ప్రకారం ఇప్పటికి  పూర్వం 7000-7200 ఏళ్ళ మధ్య కాలంలో సముద్ర మట్టం ఇప్పటికంటె 3 మీటర్లు(9-10 అడుగులు) తక్కువగా ఉండేదని.ఇప్పుడు సముద్రంలో(9-10 అడుగుల లోతులో) ములిగి ఉన్న రామసేతువు  అప్పటిలో సముద్ర మట్టానికంటె ఎత్తుగా ఉండేదన్నమాట.శ్రీ రాముడు ఇప్పటికి 7126 ఏళ్ళక్రితం జన్మించాడని మనం చెప్పుకున్నాం కనుక అతడి జీవిత కాలంలో సముద్ర మట్టం ఇప్పటికంటె 9-10 అడుగుల లోతులో ఉండేదన్నమాట. అంటేరామ సేతువనేది అది సహజమైన దయినా మానవనిర్మితమైనదైనా అప్పటి సముద్ర మట్టానికి ఎగువనే ఉండేదన్నమాట. (ఇది సమంజసం గానే తోస్తోంది. లేకపోతే రామసేతువు రామదండు సముద్రాన్ని దాటడానికి పనికివచ్చేదే కాదు కదా?)
NASA వారు, GSI వారు, Archaelogical survey వారు చెప్పిన దానిని బట్టిచూస్తే సింహళం లోని తలై మన్నార్ కీ, మన ధనుష్కోటికీ మధ్య సహజమైన చిన్న చిన్న దీవులూ  ఇసుకదిబ్బలూ సున్నపు రాళ్లగుట్టలూ పగడాల దీవులూ వరుసగా  ఉన్నాయనీ వీటి మీద మానవ నిర్మాణంలా కనిపించే సేతువు ఉందనీ తెలుస్తోంది.ఈ విధంగా ప్రకృతి సహజమైన నిర్మాణం ఒకటి ఉంటే దానిని ప్రయాణ యోగ్యంగా తీర్చి దిద్దుకోవడం సుసాధ్యమే కదా? అదే జరిగి ఉంటుంది.వాల్మీకి వర్ణించిన దాని ప్రకారం వానరసైన్యం రకరకాలవృక్షాలను లతలనూ, పెద్ద పెద్ద రాళ్లనూ యంత్రాల సాయంతో పెకిలించుకు వచ్చి వీటన్నిటినీ  ఉపయోగించి నలుని పర్యవేక్షణలో సేతునిర్మాణం చేసారు. అప్పటికే ఉన్న సహజమైన దారిలో లోతులనూ గోతులనూ పూడుస్తూ వానరులు తెచ్చిన సామగ్రితో పటిష్టమైన  సేతునిర్మాణాన్ని గావించారనడం చాలా హేతుబధ్ధంగా కనిపిస్తుంది. మన సినిమాలలోచూపించినట్లో పిట్టకథల్లో చెప్పినట్లో ఉడతలుతీసుకవచ్చిన ఇసుక రేణువుల్తోనో, లేక నలుడు చేత్తో వేస్తే నీటిమీద తేలే రాళ్ళతోనో సేతునిర్మాణం జరిగిందనుకోవడం గాని, పూర్తిగా  సేతువంతా మానవ నిర్మాణమేనని భావించడం కంటె నాకు ఇదే నమ్మశక్యంగా ఉంది.
శ్రీ లంక లోనూ రామాయణానికి సంబంధించిన అనేక అవశేషాలూ గుర్తులూ నేటికీ మిగిలి ఉన్నాయి కనుక శ్రీ రాముడు తాను ఈ విధంగా నిర్మించుకున్న సేతువు మీదుగా సైన్య సమేతంగా  లంకకి వెళ్లి రావణ సంహారం చేసిఉంటాడనడంలో ఎటువంటి విప్రతిపత్తి ఉండదనే నేను భావిస్తున్నాను.
(I-SERVE Delhi Chapter  వారికి కృతజ్ఞతలతో.... సెలవు.)                                                

15, అక్టోబర్ 2012, సోమవారం

శ్రీరాముడు నడచిన దారుల్లో...


.
గడచిన రెండు పోస్టుల్లో  శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడో, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు కొన్నిఎప్పుడెప్పుడు జరిగాయో తేదీలతో సహా తెలుసు కున్నాం. శ్రీ రామ చరిత్రలో అతిముఖ్యమైనదీ సుదీర్ఘమైనదీ ఆయన చేసిన వనవాసం. పితృవాక్య పరిపాలనా కర్తవ్యదీక్షా కంకణధారుడై ఆయన తన 25వ ఏట ప్రారంభించి తనకు 39 ఏళ్లు వచ్చే వరకూ వనసీమలలోనే సంచరించాడు.శ్రీ రాముడు మనదేశంలో ఎంతోమందికి ఆరాధ్యదైవం కావడానికి ఆయన శూరత్వమే కాకుండా ఈ ధర్మ దీక్షయే ప్రధాన కారణం. 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన అయోధ్యలో ప్రారంభించి దక్షిణాదిన రామేశ్వరం వరకూ ప్రయాణం చేశాడు.ఆతరువాత సేతు నిర్మాణం గావించి లంకలో రావణ సంహారం చేసాడు.ఇంత కాలం పాటు ఆయన ఏయే చోట్ల తిరిగాడో తెలుసు కోవాలంటే మనం కూడా ఆయన నడచిన దారుల్లోనే ప్రయాణించి ఆయన అడుగు జాడలేమైనా గుర్తించగలమేమో చూడాలి. నాతో రండి. ఆయన నడచిన దారుల్లోనే మనమూ ప్రయాణించి వద్దాము.
శ్రీ రాముడు తన వన వాస సమయంలో ఏఏ ప్రాంతాలలో తిరిగాడో తెలుసుకోవడానికి Dr.రామావతార్ గారు మొదలైన పరిశోధకులు చాలామంది రామాయణంలో శ్రీ వాల్మీకి వర్ణనలు ఆధారంగా అయోధ్య నుంచి రామేశ్వరం వరకూ విస్త్రృతంగా పర్యటించారు.ఆయాప్రాంతాలలో ప్రజలలో ఉండే ఐతిహ్యాలనూ ఇతర ఆధారాలనుబట్టి వారు మొదట 189 ప్రాంతాలనూ తరువాత మరోక 60 ప్రదేశాలనూ కనుగొన్నారట.ఈ వివరాలన్నీ శ్రీ రామావతార్ గారి  “శ్రీ రాముని అడుగు జాడల్లో  (In the foot steps of Shri Ram)
అనే పుస్తకంలో వివరించారు. 
శ్రీ రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయోధ్యనుంచి బయలుదేరి మొదట అక్కడికి 20 కిలో మీటర్లు దూరం లోని తమసానదీ తటాన ఉన్న మాండా (Mandah) అనే ప్రాతాన్ని చేరుకున్నారు.ఆ తరువాత గోమతీ నదిని దాటి సరయూ తీరాన్ని చేరుకున్నారు. ఆతరువాత తమ కోసల దేశపు సరిహద్దులుదాటుతూ నిషాద రాజైన గుహుని సహాయంతో గంగను దాటి ప్రస్తుత అలహాబాదుకు 20 కిలో మీటర్ల దూరంలోని నిషాద రాజ్యం లోని శ్రింగవేరపురం (Srigraur) చేరుకున్నారు.ఆ తర్వాత అక్కడనుండి బయలు దేరి త్రివేణీ సంగమ ప్రాంతంలో యమునా నదిని దాటి ఉత్తర-మధ్యప్రదేశ్ ల సరిహద్దుల్లోని చిత్రకూటాన్ని చేరుకున్నారు.ఈ ప్రాంతంలో వాల్మీకి ఆశ్రమం,మాండవ్య ఆశ్రమం,భరత్ కూప్ అనేవి ఇప్పటికీ ఉన్నాయి. శ్రీ రామ పాదుకల్ని తీసుకు వెళ్లడానికి భరతుడు వచ్చివెళ్లాక వారు చిత్రకూటాన్ని వదలి మధ్యప్రదేశ్ లోని సతానా ప్రాంతంలో ఉన్నఅత్రి ఆశ్రమాన్ని చేరుకున్నారు.ఇక్కడనుండి శ్రీ రాముడు ఇప్పటిమధ్యప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న దండకారణ్యాన్ని చేరుకున్నారు.
దండకారణ్యంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై దాదాపు పది సంవత్సరాలు విహరించాడు.ఈ అరణ్యంలోని నదీనద తటాకాలు ఫలవృక్షసంపద వారినంతగా ఆకర్షించాయేమో? సత్నా ప్రాంతంలోని శర్భంగ, సుతీక్షణ మున్యాశ్రమాలను దర్శించుకుని నర్మదా మహానదీ తీరాల వెంబడి ప్రయాణిస్తూ అనేక మైన ఇతర మున్యాశ్రమాలను దర్శించుకుని వారు తిరిగి సుతీక్షణ ముని ఆశ్రమానికి చేరుకున్నారు.ఇప్పటికీ పన్నా, రాయపూర్,బస్తర్, జగదల్ పూర్ ప్రాంతాలలో మాండవ్య ఆశ్రమం, శ్రింగి ఆశ్రమం, రామలక్ష్మణ మందిరం కోటిమాహేశ్వర దేవాలయం వంటివి ఆ స్మృతి చిహ్నాలుగా మిగిలి ఉన్నాయి. ఆ తరువాత అనేకమైనచిన్న చిన్న నదులూ వాగులూ సరస్సులూ కొండలూ దాటుకుంటూ శ్రీ రాముడు నాసిక్ ప్రాంతం లోని అగస్త్యముని ఆశ్రమం చేరుకున్నాడు.ఇక్కడి అగ్ని శాలలో తయారైన అనేకమైన శస్త్రాలను అగస్త్యుడు శ్రీరామునికి ఇచ్చాడని వాల్మీకి పేర్కొన్నాడు.
అగస్త్యాశ్రమం నుంచి బయల్దేరిన శ్రీ రాముడు నాసిక్ సమీపం లోని పంచవటి చేరుకున్నాడు.ఇక్కడ 5 పెద్ద వటవృక్షాలుండడం వల్ల  ప్రదేశానికా పేరు వచ్చింది.శూర్పణఖ వృత్తాతం, ఖరదూషణుల వధ జరిగిన ప్రాంతమిదే.(ఖరదూషణుల వధ క్రీ.పూ 5077 5077 అక్టోబరు 7 వ తేదీన జరిగిందని ఇంతకుముందే చెప్పుకున్నాం). ఈ ప్రాతంలో మారీచ వధ జరిగిన చోట మృగయాధీశ్వర్ వనేశ్వర్ అనే స్మృతి చిహ్నాలిప్పటికీ ఉన్నాయి. నాసిక్ పరిసరాల్లో రామాయణ గాథకు సంబంధించిన స్మృతి చిహ్నాలు—సీతాసరోవరం రామకుండం,త్రయంబకేశ్వరం, జనస్థాన్ మొదలైనవి అనేకం ఉన్నాయి.సీతాపహరణం జరిగినదీ ప్రదేశం లోనే.సీతాపహరణం తర్వాత దారిలో తననడ్డగించిన జటాయువు రెక్కలను రావణుడు తృంచిన ప్రాంతం నేడు సర్వతీర్థమని పిలువబడుతోంది.ఇది నాసిక్ పట్టణానికి 56 కి.మీ. దూరంలోని తకేడ్ గ్రామం వద్ద ఉంది.
సీతాపహరణం తరువాత ఆమెను వెతుక్కుంటూ బయల్దేరిన రామ లక్ష్మణులు దారిలో జటాయువు కబంధులను కలుసుకున్నాక దక్షిణంగా పయనిస్తూ ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నారు. ఈ దారిలోనే వారు శబరి ఆశ్రమానికి రావడం, ఆమె ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. ఆ ఆశ్రమమున్న పంపాసరోవర ప్రాంతం నేడు కర్ణాటక రాష్ట్రం లోని బెల్గాం దగ్గరున్న సురేబన్ గా గుర్తించబడింది.ఈ ప్రాంతంలో ఇప్పటికీ రేగు చెట్లు అధికంగా ఉండడం విశేషం.(భక్త శబరి శ్రీ రాముని చేత తను కొరికి రుచి చూసిన రేగు పళ్ళను తినిపించిందన్నది ఐతిహ్యం). ఇక్కడినుండి మంచి మంచి గంధపు చెట్ల వనాలనూ మంచి సరస్సులనూ దాటుకుంటూ  శ్రీ రామ లక్ష్మణులు ఋష్యమూకాన్ని చేరుకున్నారు. ఈ ఋష్యమూకం, కిష్కంధ ప్రస్తుత కర్నాటక బళ్ళారి జిల్లా లోని హంపీ ప్రాంతం.ఇక్కడే వారు హనుమాన్ సుగ్రీవులను కలుసుకోవడం  వారు సీతమ్మ వారి నగలను చూపడం జరిగింది.
ఇక్కడ వాలిని సంహరించిన పిదప శ్రీ రాముడు వానర సేనతో కలసి దక్షిణ దిశగా సముద్రం వైపు ప్రయాణించాడు.మలయ పర్వతాన్నీ గంధపు వృక్షాల వనాల్నీ సరస్సులనూ దాటుకుంటూ కావేరీ తీరం చేరాడు.ఆ తర్వాత తిరుచ్చిరాపల్లి తంజావూరు రామనాథపురాల గుండా రామేశ్వరం చేరుకున్నాడు.
చిత్రమైన విషయం ఏమిటంటే రామాయణంలో వాల్మీకి  వర్ణించిన ప్రాంతాలన్నీ  భౌగోళికం గా ఇప్పటికీ నిలిచి ఉన్న స్మృతి చిహ్నాలతో సరిగా సరి పోవడం. రామాయణంలో గంగా యమునల సంగమ ప్రాంతం గా చెప్పబడ్డ పరిసరాల్లో (కోల్డిహ్వా, ఝూసీ,హేటాపట్టి లలో) పురాతత్వ పరిశోధక శాఖ జరిపిన త్రవ్వకాల్లో ఈ ప్రాతం క్రీ.పూ. ఆరు ఏడు వేల సంవత్సరాలనుంచీ జనావాసాలుగా ఉండేవని గుర్తింపబడ్డాయి..త్రివేణీ సంగమ తీరంలో అలహాబాదులోని ఆనంద భవన్ (నెహ్రూ గారిఇల్లు)  కి ఎదురుగా ఉండే ప్రాంతమే నాటి భరద్వాజ ఆశ్రమం. ఇక్కడా శృంగవేరపురాల్లోనూ జిరిపిన త్రవ్వకాల్లో రామాయణ గాథకు సంబందించిన ముఖ్య మైన ఆధారాలు లభ్యమయాయి.
రామేశ్వరం నుంచి లంకకు చేరుకోవడానికి శ్రీ రాముడు సముద్రంపై సేతువు కట్టాడా? లేదా? కట్టి ఉంటే ఎలాగ కట్టేడు? వంటి ఆసక్తి కరమైన విషయాలన్నీ మరో పోస్టులో తెలుసు కుందాం
(శాస్త్రీయమైన పరిశోధనలు చేసి ఈ అమూల్యమైన విషయాలను మనకందించిన I-SERVE,Delhi Chapter  వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ—సెలవు.)
  


9, అక్టోబర్ 2012, మంగళవారం

రామాయణంలోని సంఘటనలు-వాటి కాల నిర్ణయం.



ఇంతకు ముందు పోస్టు శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు లో శ్రీ రామ జననం గురించి తెలుసు కున్నాం కదా? ఇప్పుడు రామాయణంలో మరికొన్ని సంఘటనలు ఎప్పుడు జరిగాయో తెలుసు కుందాం.
శ్రీ వాల్మీకి మహర్షి  రామాయణంలో అయోధ్య కాండలో చెప్పిన దాని ప్రకారం దశరధమహారాజు మీన లగ్నంలో రేవతీ నక్షత్రంలో జన్మించాడు. తన జన్మ నక్షత్రాన్ని రవి, కుజుడు,రాహువు చుట్టుముట్టి ప్రభావితం చేసినప్పుడు తనకు మరణం సంభవించడమో  లేక ఏదైనా కుట్రకు బలి కావడమో జరుగుతుందని భయపడే వాడట.అందు చేత అటువంటి సమయం సమీపించగానే తొందరపడి శ్రీరామునికి పట్టాబిషేకం తలపెట్టాడు.కాని విధినెవ్వరు తప్పించగలరు? పట్టాభిషేకం జరుగక పోగా.శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. పైన చెప్పిన నక్షత్ర, గ్రహరాశుల స్థితిగతులను Planetarium gold Soft ware ఉపయోగించి కంప్యుటర్ ద్వారా పరిశీలించి అది సరిగా 5th జనవరి క్రీ.పూ.5089 వతేదీ అని మన శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. శ్రీ రాముడు క్రీ. పూ.5114 జనవరి 10 వతేదీన పుట్టాడని ఇంతకుముందు తెలుసు కున్నాం కనుక శ్రీ రాముడు అరణ్య వాసానికి బయలుదేరేనాటికి ఆయన వయస్సు25  సంవత్సరాలని తేలింది.
రామాయణంలో వాల్మీకి ఆయా సమయాల్లో  వర్ణించిన గ్రహస్థితులను బట్టి రామాయణంలోని మరికొన్ని సంఘటనలు జరిగిన తేదీలను కూడా నిర్ధారించారు.అవి కూడా తెలుసు కుందాం.
శ్రీ రాముడు తన పధ్నాలుగేళ్ళ వనవాసంలో పదమూడవ యేడాది లో ఖరదూషణులనే రాక్షసులను సంహరించి నట్లు వాల్మీకి చెప్పాడు.ఆదినం అమావాస్య అనీ కుజుడు సరిగా గ్రహాల మధ్యస్థానంలో ఉన్నాడని  చెప్పాడు. మరో ముఖ్య విషయం ఆ రోజు సూర్య గ్రహణం కూడా ఉందనీ తెలిపాడు. ఈ వివరాలను బట్టి కంప్యుటర్ సాయంతో అది 7th జనవరి క్రీ.పూ. 5077 అని  మన శాస్త్రజ్ఞులు నిర్ధారించారు
కిష్కింద కాండలో వాలిని శ్రీరాముడు చంపినప్పుడు సూర్య గ్రహణం ఉందని  వాల్మీకి పేర్కొన్నాడు.3Rd ఏప్రియల్ క్రీ.పూ.5076 నాడు సూర్య గ్రహణం ఉందనీ ఆసంవత్సరం అదొక్కటే సూర్యగ్రహణమనీ అందు చేత రాముడు వాలిని చంపిన రోజు అదేననీ మన శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
మరొక విషయం. హనుమంతుడు లంకలో అశోక వాటికలో సీతమ్మ వారిని కనుగొన్నప్పుడు చంద్రగ్రహణం ఉందని వాల్మీకి చెప్పాడు. కంప్యుటర్ చెప్పిన దానిప్రకారం 12thసెప్టెంబరు క్రీ.పూ. 5076 నాడు సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో మొదలైన చంద్ర గ్రహణం సింహళ దేశం లో కనిపించేదిగా ఉందట.
ఇదే కాదు హనుమంతుడు తన తిరుగు ప్రయాణం చేసినప్పుడు ఉన్న గ్రహస్థితులను బట్టి ఆరోజు 14thసెప్టెంబరు క్రీ.పూ.5076 గా గుర్తించారు.
వాల్మీకి రామాయణంలో ఇచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే రావణ వధ క్రీ.పూ .5076 సంవత్సరం డిశంబరు 4వ తేదీ అని తేలుతోందట. శ్రీ రాముడు తన పధ్నాలుగేళ్ల వనవాసాన్ని క్రీ.పూ.5075 జనవరి 2వతేదీన పూర్తి చేసుకున్నాడనీ ఆరోజు కూడా చైత్రమాసంలో శుక్ల పక్ష నవమి అయిందనీ ఆ విధంగా శ్రీ రాముడు తిరిగి అయోధ్యా ప్రవేశం చేసే నాటికి ఆయనకు 39 ఏళ్ళనీ మన శాస్త్రజ్ఞులు తేల్చారు.  వాల్మీకి రామాయణం కూడా ఇదే చెబుతోంది.
శ్రీ రాముని జన్మదినంగా తాము పేర్కొన్న క్రీ.పూ.5114 జనవరి 10వ తేదీ లగాయతూ వరుసక్రమంలో రామాయణంలో జరిగాయని చెప్పబడుతున్నముఖ్యమైన సంఘటనల తేదీలూ,  రామాయణంలో వాల్మీకి చెప్పిన నక్షత్ర గ్రహరాశుల స్థానాలూ అన్నీ ఒకదానికకటి సరిపోవడాన్ని కేవలం యాదృఛ్చికమని భావించడానికి వీలులేదంటారు మన శాస్త్రజ్ఞులు.
శ్రీ రామకథ లోని సంఘటనలు ఏ ఏ తేదీలలో జరిగాయో తెలుసుకున్నాం. శ్రీ రాముడు తన పధ్నాలుగేళ్ల వనవాసంలో ఏఏ ప్రాంతాలలో తిరుగాడేడో ఏం చేసాడో మరో సారి చెప్పుకుందాం.
                                                                          ***
(ఇంతకు ముందే నేను చెప్పినట్లు ఈ  పరిశోధన చేసి ఫలితాలను ప్రకటించిన వారు Institute of Scientific research on Vedas వారు.వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం.)
                                                                                             ***

3, అక్టోబర్ 2012, బుధవారం

శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు?


శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు?
ఈ ప్రశ్నకి కాన్వెంటులో చదువుకునే మా మనుమడు “ I think it is Navami…Sri Rama Navami is a holiday for us” అంటాడు తెలుగు తిథుల పేర్లన్నీ సరిగా తెలియక పోయినా, స్కూల్ డైరీలో ఉన్న holidays list  అంతా క్షుణ్ణంగా కంఠతా వచ్చుకనుక.
చైత్ర శుధ్ధ నవమి కదండీ..ఉగాది తర్వాత మనకొచ్చే తొలి పండుగ అదే కదా?” అంటుంది మా శ్రీమతి
ఏఏ పండుగలకు ఏఏ పిండివంటలు వండి వార్చాలో ఎరిగిన ఉత్తమాఇల్లాలు కనుక.
సరే. సినిమా తారలు తమ Birth days మాత్రం అందరికీ తెలియజేసి పుట్టిన సంవత్సరం మాత్రం గోప్యంగా ఉంచినట్లు,శ్రీ రాముని పుట్టిన రోజు మాత్రం అందరికీ తెలిసినా పుట్టిన సంవత్సరం మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండి పోయింది. మనందరికీ అయితే Date of birth certificate లో అవీ లేని వారికి వారి పెద్దలు నువ్వు ఫలానా సంవత్సరం పుట్టావురా అబ్బాయ్ అని పెద్దలు  చెప్పడం వల్లో పుట్టిన సంవత్సరం తెలిసే ఉంటుంది. మరి ఇవేమీ లేని శ్రీ రాముని సంగతేమిటి? ఎవరు చెప్తారు? చెబితే గిబితే ఆ వాల్మీకి మహర్షే చెప్పాలి కదా?ఎక్కడైనా చెప్పాడా? ఏమని చెప్పాడు?
చెప్పాడండీ. తన రామాయణ కావ్యంలోనే చెప్పాడు. అయితే అప్పటి కాలమానం లో ఇప్పటిలా  క్రీస్తుకు ముందో తర్వాతో అనో శక సంవత్సరాలో లేవు కనుక మనకు తెలిసే రీతి లో చెప్పలేదు.కాని చాలా నిర్దిష్టంగానూ,నిర్దుష్టంగానూ చెప్పాడు.అదెలాగంటే శ్రీ రాముని జనన కాలమందు ఏఏ రాశులు ఎక్కడున్నాయో,ఏ గ్రహాలు ఎక్కడున్నాయో జన్మరాశి ఏమిటో నక్షత్రమేమిటో తిథి ఏమిటో స్పష్టంగానే చెప్పాడు.అయితే వీటినుండి మనకు అర్థమయ్యేలాగున ఇంగ్లీషు తారీఖు కనుక్కోవడమెలాగ? ఈ సమస్యకి పరిష్కారం ఆధునిక విజ్ఞానం సాధించిన ప్రగతి రూపం లో ఆ శ్రీరామ చంద్రుడే మనకు ప్రసాదించేడు.
ముందుగా శ్రీ రామ చంద్రుడు పుట్టినప్పుడు ఉన్న గ్రహరాశుల గురించి వాల్మీకి ఏం చెప్పాడో చూద్దాం.
శ్రీ రామచంద్రుని జనన కాలమందు సూర్యుడు (Sun) మేష రాశి(Aries) లోనూ,గురుడు( Jupiter) కర్కాటక రాశి (Cancer)లోనూ కుజుడు(Mars) మకర రాశి (Capricorn)లోనూ శని (Saturn)తులారాశి (Libra) లోనూ,శుక్రుడు (Venus)మీన రాశి (Pisces)లోనూ ఉఛ్ఛ స్థితిలో కొలువై ఉన్నారు. ఇంతే కాదు ఆ రోజు చైత్ర శుధ్ధ నవమి అనీ కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం లోనూ స్వామి జన్మించాడని వాల్మీకి తెలిపి ఉన్నాడు. ఆ సమయంలో పునర్వసు నక్షత్ర యుక్తమైన చంద్రుడు బృహస్పతితో కలసి  అప్పుడే క్షితిజ రేఖ మీద ఉదయిస్తున్నకర్కాటక రాశిలో వెలిగి పోతున్నాడనీ చెప్పాడు.ఇన్ని వివరాలు ఇచ్చాడు సరే,దీనిని బట్టి ఆ సమయం ఫలానా అని ఇతమిథ్థంగా తెలుసు కోవడమెలాగ? ఇదిగో ఇక్కడే మన ఆధునిక శాస్త్ర విజ్ఞానం అందించిన ఆకరాలు మనకు అక్కరకు వచ్చాయి. ఈ వివరాలనన్నిటినీ ఉపయోగించి Planetarium Gold  అనే Software సాయంతో కంప్యూటర్ ద్వారా ఆ సమయం సరిగ్గా క్రీస్తు పూర్వం 5114 సంవత్సరం జనవరి నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలని కనిపెట్టారు.అంటే శ్రీ రాముడు జన్మించి ఇప్పటికి 7126 సంవత్సరాలైందన్నమాట. అయితే ఇక్కడ ఎవరికైనా ఒక అనుమానం రావచ్చును. ఆయా నక్షత్రం గ్రహాలు రాశులు అవే స్థానాల్లో గతంలో వేరే రోజు కూడా ఉండి ఉండవచ్చుకదా అని.నిజమే, కాని ఇవన్నీ అచ్చంగా అవే స్థానాల్లో ఉండడమన్నది 25690 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే జరుగుతుందట. కాని నాలాటి వాడికి మరో సందేహం కూడా వస్తుంది.అదేమిటంటే గడచిన పాతిక వేల సంవత్సరాలలో కాకుండా అంకు ముందు ఎప్పుడైనా ఈ గ్రహస్థితులిలాగే ఉన్నప్పుడు శ్రీ రాముడు జన్మించి ఉండ వచ్చుకదా? అని. కాని మన భూమి మీద ఆఖరి హిమయుగం గడచి నాగరికత వర్థిల్లడం జరిగి నేటికి 12000 సంవత్సరాలు మాత్రమే అయిందని శాస్త్ర విజ్ఞానం చెబుతోంది.ఇక్కడ మరో విషయం కూడా గమనించాల్సి ఉంది.శ్రీ రాముడు ఐతిహాసిక పురుషుడు కాడు. చారిత్రక పురుషుడు.మానవ జన్మనెత్తి ఈ భరత ఖండంలో ఆ సేతు హిమాచలం నడయాడిన వాడు. మన దేశంలో శ్రీ రాముడు తిరుగాడిన ప్రదేశాలనీ సీతమ్మ వారు మెట్టిన స్థలాలనీ పూజలందుకుంటున్న తావులకు కొదువ లేదు. ఇవి మన దేశం లోనే కాదు శ్రీ లంకలో కూడా ఉన్నాయి. ఈ చిహ్నాలు మనం గుర్తించే విధంగా ఇంకా ఉన్నాయంటే ఇప్పుడు మనం గుర్తించిన 7126 సంవత్సరాలకంటే మరొక పాతిక వేల సంవత్సరాల పూర్వపువై ఉండే అవకాశం లేదు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అందుచేత మన శాస్త్రజ్ఞులు పరిశోధించి నిక్కచ్చిగా చెప్పిన క్రీ. పూ.5114 సంవత్సరంలో జనవరి 10 తేదీనే మన శ్రీ రామచంద్రుని జన్మదినం గా అంగీకరించి ఆనందిద్దాం. ఆరోజు మన చాంద్రమానం ప్రకారం సరిగ్గా చైత్ర శుధ్ధ నవమే అయింది. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలను జనన కాలంగా  శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మనం ప్రతియేటా శ్రీ రామనవమి నాడు ఇదే సమయంలో వేడుకలను జరుపుకుంటాము కదా?
శ్రీ రాముడు జన్మించిన తేదీయే కాదు,రామాయణంలో జరిగాయంటున్న మరికొన్ని సంఘటనలు కూడా అవి ఎప్పుడు జరిగాయో శ్రీ వాల్మీకి ఇచ్చిన వివరాల ఆధారంగా నిర్దిష్టంగా కనుక్కున్నారు. ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవన్నీ మరోసారి వివరిస్తాను.
బహుముఖీయమైన శాస్త్రీయ పరిశోధనల అనంతరం ఈ విషయాల్ని మనకు వెల్లడించినవారు Institute of Scientific Research on Vedas (I-SERVE) Delhi Chapter Director శ్రీమతి సరోజ్ బాల గారు.కీ.శే.శ్రీ పుష్కర్ భట్నాగర్ గారు USA నుంచి సంపాదించిన Planetarium Gold అనే సాఫ్ట్ వేర్ ద్వారా ఇది సాధ్యమయింది.ఈ శాస్త్రజ్ఞులబృందానికి అభినందనలు తెలుపు కుంటూ ఈ విషయాలను అందరితో పంచుకునే అవకాశాన్ని కలుగజేసిన I-SERVE-Delhi Chapter  వారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.ఈ పరిశోధనా కృషి అంతా వారిదే. నేను అరటి పండు ఒలిచి పెట్టానంతే. ఆస్వాదించండి.సెలవు.