3, అక్టోబర్ 2012, బుధవారం

శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు?


శ్రీ రాముడు ఎప్పుడు పుట్టాడు?
ఈ ప్రశ్నకి కాన్వెంటులో చదువుకునే మా మనుమడు “ I think it is Navami…Sri Rama Navami is a holiday for us” అంటాడు తెలుగు తిథుల పేర్లన్నీ సరిగా తెలియక పోయినా, స్కూల్ డైరీలో ఉన్న holidays list  అంతా క్షుణ్ణంగా కంఠతా వచ్చుకనుక.
చైత్ర శుధ్ధ నవమి కదండీ..ఉగాది తర్వాత మనకొచ్చే తొలి పండుగ అదే కదా?” అంటుంది మా శ్రీమతి
ఏఏ పండుగలకు ఏఏ పిండివంటలు వండి వార్చాలో ఎరిగిన ఉత్తమాఇల్లాలు కనుక.
సరే. సినిమా తారలు తమ Birth days మాత్రం అందరికీ తెలియజేసి పుట్టిన సంవత్సరం మాత్రం గోప్యంగా ఉంచినట్లు,శ్రీ రాముని పుట్టిన రోజు మాత్రం అందరికీ తెలిసినా పుట్టిన సంవత్సరం మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండి పోయింది. మనందరికీ అయితే Date of birth certificate లో అవీ లేని వారికి వారి పెద్దలు నువ్వు ఫలానా సంవత్సరం పుట్టావురా అబ్బాయ్ అని పెద్దలు  చెప్పడం వల్లో పుట్టిన సంవత్సరం తెలిసే ఉంటుంది. మరి ఇవేమీ లేని శ్రీ రాముని సంగతేమిటి? ఎవరు చెప్తారు? చెబితే గిబితే ఆ వాల్మీకి మహర్షే చెప్పాలి కదా?ఎక్కడైనా చెప్పాడా? ఏమని చెప్పాడు?
చెప్పాడండీ. తన రామాయణ కావ్యంలోనే చెప్పాడు. అయితే అప్పటి కాలమానం లో ఇప్పటిలా  క్రీస్తుకు ముందో తర్వాతో అనో శక సంవత్సరాలో లేవు కనుక మనకు తెలిసే రీతి లో చెప్పలేదు.కాని చాలా నిర్దిష్టంగానూ,నిర్దుష్టంగానూ చెప్పాడు.అదెలాగంటే శ్రీ రాముని జనన కాలమందు ఏఏ రాశులు ఎక్కడున్నాయో,ఏ గ్రహాలు ఎక్కడున్నాయో జన్మరాశి ఏమిటో నక్షత్రమేమిటో తిథి ఏమిటో స్పష్టంగానే చెప్పాడు.అయితే వీటినుండి మనకు అర్థమయ్యేలాగున ఇంగ్లీషు తారీఖు కనుక్కోవడమెలాగ? ఈ సమస్యకి పరిష్కారం ఆధునిక విజ్ఞానం సాధించిన ప్రగతి రూపం లో ఆ శ్రీరామ చంద్రుడే మనకు ప్రసాదించేడు.
ముందుగా శ్రీ రామ చంద్రుడు పుట్టినప్పుడు ఉన్న గ్రహరాశుల గురించి వాల్మీకి ఏం చెప్పాడో చూద్దాం.
శ్రీ రామచంద్రుని జనన కాలమందు సూర్యుడు (Sun) మేష రాశి(Aries) లోనూ,గురుడు( Jupiter) కర్కాటక రాశి (Cancer)లోనూ కుజుడు(Mars) మకర రాశి (Capricorn)లోనూ శని (Saturn)తులారాశి (Libra) లోనూ,శుక్రుడు (Venus)మీన రాశి (Pisces)లోనూ ఉఛ్ఛ స్థితిలో కొలువై ఉన్నారు. ఇంతే కాదు ఆ రోజు చైత్ర శుధ్ధ నవమి అనీ కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రం లోనూ స్వామి జన్మించాడని వాల్మీకి తెలిపి ఉన్నాడు. ఆ సమయంలో పునర్వసు నక్షత్ర యుక్తమైన చంద్రుడు బృహస్పతితో కలసి  అప్పుడే క్షితిజ రేఖ మీద ఉదయిస్తున్నకర్కాటక రాశిలో వెలిగి పోతున్నాడనీ చెప్పాడు.ఇన్ని వివరాలు ఇచ్చాడు సరే,దీనిని బట్టి ఆ సమయం ఫలానా అని ఇతమిథ్థంగా తెలుసు కోవడమెలాగ? ఇదిగో ఇక్కడే మన ఆధునిక శాస్త్ర విజ్ఞానం అందించిన ఆకరాలు మనకు అక్కరకు వచ్చాయి. ఈ వివరాలనన్నిటినీ ఉపయోగించి Planetarium Gold  అనే Software సాయంతో కంప్యూటర్ ద్వారా ఆ సమయం సరిగ్గా క్రీస్తు పూర్వం 5114 సంవత్సరం జనవరి నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల పది నిమిషాలని కనిపెట్టారు.అంటే శ్రీ రాముడు జన్మించి ఇప్పటికి 7126 సంవత్సరాలైందన్నమాట. అయితే ఇక్కడ ఎవరికైనా ఒక అనుమానం రావచ్చును. ఆయా నక్షత్రం గ్రహాలు రాశులు అవే స్థానాల్లో గతంలో వేరే రోజు కూడా ఉండి ఉండవచ్చుకదా అని.నిజమే, కాని ఇవన్నీ అచ్చంగా అవే స్థానాల్లో ఉండడమన్నది 25690 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే జరుగుతుందట. కాని నాలాటి వాడికి మరో సందేహం కూడా వస్తుంది.అదేమిటంటే గడచిన పాతిక వేల సంవత్సరాలలో కాకుండా అంకు ముందు ఎప్పుడైనా ఈ గ్రహస్థితులిలాగే ఉన్నప్పుడు శ్రీ రాముడు జన్మించి ఉండ వచ్చుకదా? అని. కాని మన భూమి మీద ఆఖరి హిమయుగం గడచి నాగరికత వర్థిల్లడం జరిగి నేటికి 12000 సంవత్సరాలు మాత్రమే అయిందని శాస్త్ర విజ్ఞానం చెబుతోంది.ఇక్కడ మరో విషయం కూడా గమనించాల్సి ఉంది.శ్రీ రాముడు ఐతిహాసిక పురుషుడు కాడు. చారిత్రక పురుషుడు.మానవ జన్మనెత్తి ఈ భరత ఖండంలో ఆ సేతు హిమాచలం నడయాడిన వాడు. మన దేశంలో శ్రీ రాముడు తిరుగాడిన ప్రదేశాలనీ సీతమ్మ వారు మెట్టిన స్థలాలనీ పూజలందుకుంటున్న తావులకు కొదువ లేదు. ఇవి మన దేశం లోనే కాదు శ్రీ లంకలో కూడా ఉన్నాయి. ఈ చిహ్నాలు మనం గుర్తించే విధంగా ఇంకా ఉన్నాయంటే ఇప్పుడు మనం గుర్తించిన 7126 సంవత్సరాలకంటే మరొక పాతిక వేల సంవత్సరాల పూర్వపువై ఉండే అవకాశం లేదు అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అందుచేత మన శాస్త్రజ్ఞులు పరిశోధించి నిక్కచ్చిగా చెప్పిన క్రీ. పూ.5114 సంవత్సరంలో జనవరి 10 తేదీనే మన శ్రీ రామచంద్రుని జన్మదినం గా అంగీకరించి ఆనందిద్దాం. ఆరోజు మన చాంద్రమానం ప్రకారం సరిగ్గా చైత్ర శుధ్ధ నవమే అయింది. మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలను జనన కాలంగా  శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మనం ప్రతియేటా శ్రీ రామనవమి నాడు ఇదే సమయంలో వేడుకలను జరుపుకుంటాము కదా?
శ్రీ రాముడు జన్మించిన తేదీయే కాదు,రామాయణంలో జరిగాయంటున్న మరికొన్ని సంఘటనలు కూడా అవి ఎప్పుడు జరిగాయో శ్రీ వాల్మీకి ఇచ్చిన వివరాల ఆధారంగా నిర్దిష్టంగా కనుక్కున్నారు. ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవన్నీ మరోసారి వివరిస్తాను.
బహుముఖీయమైన శాస్త్రీయ పరిశోధనల అనంతరం ఈ విషయాల్ని మనకు వెల్లడించినవారు Institute of Scientific Research on Vedas (I-SERVE) Delhi Chapter Director శ్రీమతి సరోజ్ బాల గారు.కీ.శే.శ్రీ పుష్కర్ భట్నాగర్ గారు USA నుంచి సంపాదించిన Planetarium Gold అనే సాఫ్ట్ వేర్ ద్వారా ఇది సాధ్యమయింది.ఈ శాస్త్రజ్ఞులబృందానికి అభినందనలు తెలుపు కుంటూ ఈ విషయాలను అందరితో పంచుకునే అవకాశాన్ని కలుగజేసిన I-SERVE-Delhi Chapter  వారికి కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను.ఈ పరిశోధనా కృషి అంతా వారిదే. నేను అరటి పండు ఒలిచి పెట్టానంతే. ఆస్వాదించండి.సెలవు.

12 కామెంట్‌లు:

Tejaswi చెప్పారు...

మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి. పూర్తి హేతుబద్ధంగా ఉంది.

ఒక చిన్న సందేహం. చైత్రమాసం మార్చి, ఏప్రిల్ నెలల్లో వస్తుంటుంది కదా! దయచేసి దీనిని విమర్శగా అపార్థం చేసుకోవద్దు. తెలియక అడుగుతున్నాను.

durgeswara చెప్పారు...

mamchi prayatnamamdi dhanyavaadamulu

www.apuroopam.blogspot.com చెప్పారు...

తేజస్వి గారికీ దుర్గేశ్వర గారికీ ధన్యవాదాలు.తేజస్విగారు మంచి ప్రశ్నే వేసారు.దీనికి సరైన సమాధానం నాకూ తెలియదు. నా పోస్టులో"అరటిపండు ఒలిచి పెట్టానంతే" అన్నదీ ఇందుకే.ఆ శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం కంప్యుటర్లో సూర్యమానాన్ని చంద్రమానం లోనికి మారిస్తే జనవరి 10, క్రీ.పూ.5114 సంవత్సరం సరిగా చైత్ర శుక్ల నవమి అనే తేలిందట.నా ఊహ ప్రకారం మన అధిక మాసాలూ అవీ ఈ 7126 సంవత్సరాలలోఎన్నోసార్లు రావడం ఒక కారణం కావచ్చు.అదీ కాక మన కాలెండర్లు ఎన్నో మార్పులకి గురి అయ్యాయి.గ్రిగేరియన్ కాలెండర్లూ అంతే.అందువలన అప్పటి మన చైత్రమాసం జనవరిలోనే వచ్చేదనుకో వచ్చు. ఏమైనా ఈ సందేహాన్నినివృత్తి చేయగలవారు గణితజ్ఞులైన శాస్త్రజ్ఞులే.

Dantuluri Kishore Varma చెప్పారు...

చాలా బాగుందండి.

కమనీయం చెప్పారు...



మనపూర్వులు నక్షత్రగమనాన్ని బట్టి కాలనిర్ణయం చేసే వారు.పైగా చాంద్రమానాన్ని అనుసరించడంవల్ల పంచాంగాకర్తలకీ ఖగోళశాస్త్రజ్ఞులకే గాని సామాన్యులకు అర్థం కాదు.భారతం క్రీ.పూ.3000 ప్రాంతంలోను,రామాయణం క్రీ.పూ.5000 ప్రాంతంలోను జరిగిఉండడానికి ఆస్కారం ఉంది.సముద్రంలో బయటపడిన ద్వారక గురించి,రామసేతువు గురించి ఇంకా శాస్త్రీయ పరిశోధనలు జరగవలసి ఉంది.ఇతరదేశాల్లోకూడా ఇంతకుముందు అనుకున్నకన్నా ప్రాచీన నాగరకతా అవశేషాలు బయలు పడుతూనే ఉన్నవి.

అజ్ఞాత చెప్పారు...

మంచి విషయం పంచుకున్నారు. ఎక్కడో తేడా వుందండి. కలిప్రారంభమయి ౫౧౧౪ దగ్గర అంటున్నారు పంచాంగ కర్తలు. రాముడేమో ౫౧౧౪ సంవత్సరాల ముందు పుట్టేడంటున్నారు. యుగాలు కుదరటంలేదు. రాముడు అంతకు ముందే పుట్టి వుండాలి. ఆ ౧౨౦౦౦ సంవత్సరాల మంచు సమయం తప్పేమో.

www.apuroopam.blogspot.com చెప్పారు...

అజ్ఞాత గారూ,మీకొచ్చిన అనుమానమే నాకూ ఉండేదని పోస్టులోనే వ్రాసేను.అయితే ఇతిహాసాలూ, పురాణాలకీ చరిత్రకీ మధ్య ఉన్న తేడాని మనం గుర్తించాలి.మన పురాణాల ప్రకారం ఒకొక్క యుగం లక్షల సంవత్సరాలు.శ్రీ రాముడు పుట్టింది త్రేతాయుగంలోఅన్నారు కనుక మధ్యలో ద్వాపర యుగం పూర్తిగా ఉంది కనుక రాముడు కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం వాడై ఉండాలి.ఇదే నిజమైతే శ్రీ రాముని పట్టాభిషేక సమయంలో వాల్మీకి చెప్పాడంటున్న రామాయణ గాథ ఇన్ని లక్షల సంవత్సరాలుగా జనం నోళ్లలోఉండి ఉండడం ఏ మాత్రం నమ్మ శక్యంగా లేదు.ఆఖరి హిమయుగం గడచి క్రొత్త(ఇప్పటి)నాగరి కత (HOlocene) ప్రారంభమై 12000 సంవత్సరాలు మాత్రమే అయిందన్నది ప్రపంచశాస్రజ్ఞులందరూ నిర్ద్వందంగా అంగీకరించిన విషయం.శ్రీ రాముడు ఒక నాగరిక ప్రపంచానికి చెందిన చారిత్రక పురుషుడని నమ్మితే అతడు జన్మించి 7126 సంవత్సరాలే అయిందని విశ్వసించక తప్పదు.శ్రీ రాముని చరిత్రకు సంబంధించిన సంఘటనల ఆనవాళ్లు మన దేశం నిండా ఉన్నాయి కనుక అతడిని చారిత్రక పురుషునిగానే యెంచి ఆరాధించడం సమంజసంగా ఉంటుంది.అలా కాకుండా ఏ చారిత్రక ఆధారాలూ లేకుండా లక్షల సంవత్సరాలముందటి త్రేతాయుగం వాడే అని నమ్మదలచుకుంటే అది విశ్వాసానికి సంబంధించిన విషయం కనుక దానిని నమ్మే వారిని వారి విచక్షణకే వదిలి వేద్దాము.ఒక్క విషయం. ఏడు వేల సంవత్సరాల నాగరిక చరిత్ర మనకుందన్నదే గొప్ప విషయం కాదా?కాల్పనిక ప్రపంచం వేరు.చారిత్రక ప్రపంచం వేరు.ఎక్కడ విహరించాలన్నది మన యిష్టం.











































ొక్క విషయం.

Unknown చెప్పారు...

శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః
తమరు శ్రీరాముని జన్మదినమును అందించినందులకు తమకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు.విజ్ఞులైన తమవంటి వారికి తెలియనివిషయము కాదు. కాని నా మదిలో మెదిలినట్టి చిన్న సందేహం మన పూర్వులు చెప్పినట్లుగా మన కలియుగ ఆయఃప్రమాణం 4,32,000సంవత్సరములు దీనికి రెట్టింపు ద్వాపరము దీనికి(కలి) మూడింతలు కృతయుగని చిన్ననాడు నేను చదివితిని. దీనిని బట్టి ఒక్క ద్వాపరము 8,64,000సంవత్సరములు. ప్రస్తుత కలియుగము 5,000 సంవత్సరములు గడిచినది ఈ లెక్కన చూచుకొన్నను ద్వాపరము మరియు కలియుగములు కలిపి 8,69,000సంవత్సరములు. త్రేతాయుగమునందు శ్రీ రాముని ఆయుఃకాలము ఉన్నది దీనిని బట్టి జనాకీనాధుడైన ఆశ్రీరాముడు సుమారు 9,00,000 సంవత్సరములకు పూర్వీకుడని నా అభిప్రాయము. కృపతో నాసందేహమును నివృత్తి చేయ ప్రార్ధన . జై శ్రీరామ్ .

బొంగి శ్రీధర్(బుజ్జి) తండ్రి బొంగి రామోజీరావు, శ్రీకాకుళం జిల్లా 9491808016

www.apuroopam.blogspot.com చెప్పారు...

శ్రీ బొంగి శ్రీధర్ గారికి,భ్లాగు చదివి స్పందించినందుకు ధన్యవాదాలు.ఇంతకుముందే ఈ పోస్టు వ్యాఖ్యలలో ఈ విషయం వివరించి ఉన్నాను.శ్రీ రాముడు పుట్టి 7126 సంవత్సరాలు అయిందా 9 లక్షల సంవత్సరాలయిందా అనేది మనం పుక్కిటి పురాణాలను నమ్ముదామా లేక శాస్త్రీయ పరిశోధనల ఫలితాలను నమ్ముదామా అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.లక్షల సంవత్సరాల నుంచి జనశ్రుతిలో రామాయణగాథ ఉందన్నది నమ్మ శక్యంగా నాకు కనిపించడం లేదు. 7126 సంవత్సరాలు కూడా ఏమీ తక్కువ కాలం కాదు.ఇది నమ్మడం వల్ల మన రామాయణానికి కలిగే గౌరవభంగం ఏమీ లేదు. నాకయితే ఇదే నమ్మాలని ఉంది.ఎవరు ఏది నమ్మినా శ్రీ రామునికి నష్టం ఏమీ లేదు.మిగిలిన పోస్టులు కూడా చదివి మీ అబిప్రాయం తెలియజేయండి.

BONGI SRIDHAR చెప్పారు...

గౌరవ నీయులైన మీకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములండి ( బదులు చెప్పినందులకు)
బొంగి శ్రీధర్ తండ్రి రామోజీ రావు శ్రీకాకుళం జిల్లా
9491808016

www.apuroopam.blogspot.com చెప్పారు...

నేను నా పోస్టు లోనే చెప్పినట్లు ఇవి Institute of scientific research on vedas New Delhi వారు శాస్త్రీయమైన పరిశోధనలు జరిపి తెలిపిన సంగతులు. వాటిని నలుగురికీ తెలియజేయడమే నా లక్ష్యం.నమ్మడం నమ్మక పోవడం వ్యక్తుల ఇష్టం. ఇంతకంటె వివరించడానికి ఇది సరైన వేదికా కాదు, దానికి తగిన సమర్థతా ఓపికా రెండూ నాకు లేవు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

నేను నా పోస్టు లోనే చెప్పినట్లు ఇవి Institute of scientific research on vedas New Delhi వారు శాస్త్రీయమైన పరిశోధనలు జరిపి తెలిపిన సంగతులు. వాటిని నలుగురికీ తెలియజేయడమే నా లక్ష్యం.నమ్మడం నమ్మక పోవడం వ్యక్తుల ఇష్టం. ఇంతకంటె వివరించడానికి ఇది సరైన వేదికా కాదు, దానికి తగిన సమర్థతా ఓపికా రెండూ నాకు లేవు.