19, ఏప్రిల్ 2012, గురువారం

నరశింవ్వ..నీ దివ్వె..నామ మంతరము సేత..


               నరసింవ్వ..నీ దివ్వె.. నామ మంతరము శేత...
కన్యాశుల్కం నాటకాన్ని ఇష్టంగా చదువుకున్న సాహితీ ప్రియులందరికీ  పై మాటలు నాటకం లోని పేకాట సీనులో పోలిశెట్టి పదే పదే వల్లించే మాటలని తెలిసే ఉంటుంది. పోలిశెట్టి యాసని తొలగిస్తే- అది నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత అనే సీస పద్య పాదమనీ ఇట్టే గుర్తు పట్టేస్తారు. అయితే ఈ పద్యం ఎక్కడిదో వ్రాసిన  కవి ఎవరో  చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు. నాకు కూడా ఈ మధ్యవరకూ   తెలియలేదు.  నరసింహ దేవుని మీద పద్యం కనుక సింహాద్రి నారసింహ శతకం లోనిది అయి ఉంటుందనుకున్నాను  కానీ కాదు. ఇది ఇప్పటి కరీంనగర్ జిల్లా లోని ధర్మపురి లోని నరసింహ స్వామి మీద ధర్మపురి శేషయ్య అనే కవి  వ్రాసిన శతకం లోనిది. ప్రక్కనే ఉన్న సింహాద్రి అప్పన్న ( నరసింహ స్వామి) ని కాకుండా  ఏడెనిమిది వందల మైళ్ళ దూరంలో ఉన్న ధర్మ పురి నారసింహుని పోలిశెట్టి ప్రార్ధించుకోవడం చిత్రంగానే కనిపిస్తుంది. దీనికి కారణం  ఆ శతకానికి  అప్పట్లో ఉన్న ప్రజాదరణే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.   ఆ శతకం గురించి ఆ కవిగారి గురించి తెలుసుకునే ముందు పై పద్యపాదం ఉన్న పద్యం పూర్తి గా చదవండి:
నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలము లన్ని ద్రోలవచ్చు
నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు
నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు
నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల దఱుమ వచ్చు
భళిర నేనీ మహా మంత్ర బలము చేత
దివ్య వైకుంఠ పదవి సాధింప వచ్చు
భూషణ వికాస శ్రీ దర్మ పుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూర

ఏ టీకా తాత్పర్యాలూ అక్కర లేకుండా అందరికీ సుబోధకమయ్యే సరళమైన రచన ఇది..ఈ కవి ఎప్పటి వాడో ఎక్కడివాడో  అని తరచి చూస్తే కరీంనగర్ జిల్లా ధర్మ పురి ప్రాంతం వాడేనని, పదిహేడవ శతాబ్దం ఉత్తరార్థంలోనో పధ్దెనిమిదో శతాబ్ధం పూర్వార్థం లోనో జీవించి ఉంటాడని తెలుస్తోంది. ఇతమిథ్థంగా ఇతని జీవితకాలం తెలియక పోయినా ఆరుద్ర గారు ఇతనిని తన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో కడపటి రాజుల యుగం (1670-1750) లో చేర్చడం  ఈ ఊహకి కారణం. ఆరుద్ర గారు ఈ కవిని గురించి వ్రాస్తూ  ఈ యుగంలోని శతకాలలో పది పన్నెండు చక్కని పద్యాలు కనబడితేనే ప్రాణం లేచి వస్తుంది. అంతకన్న ఎక్కువ పద్యాలే బాగున్న శతకం దొరికితే కడుపు నిండుతుందంటూ  ఈ శతకం లోని పద్యాల్లోని భావాలూ వాటితో పాటు భాషా కూడా చాలా హాయిగా ఉంటాయి. పద్యం ఎక్కడా కుంటదు.అని మెచ్చుకున్నారు. ( చూ. సమగ్ర ఆంధ్ర సాహిత్యం-సంపుటి 12- పేజీలు 316-17). ఈ కవి తాను పంచ కావ్యాలూ అమరం శాస్త్ర గ్రంధాలూ అవీ చదవ లేదని ఛెప్పుకున్నాడు. అందు చేతనే ఏమో పద్యాలన్నీ  దురవగాహం కాకుండా సరళమై సామాన్యుల ఆదరణకి సైతం నోచుకున్నాయి. సుదూర ప్రాంతాల జనం నోళ్లలో కూడా నానేయంటే వాటి ప్రాచుర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.  ఈయన చెప్పిన పద్యాల్లోని భావాలు కొత్తవి కాకపోయినా తనదైన శైలిలో చెప్పాడు. బురదలో తిరిగే పంది పన్నీరు మెచ్చునా? అని వేమన అడిగినట్లే ఈయన  అల్పజీవులూ దుర్జనులూ  నారసింహ నామ మహాత్మ్యమెరుగలేరని    గార్దభంబున కేల కస్తూరి తిలకంబు మర్కటంబున కేల మలయజంబుశార్దూలమున కేల శర్కరాపూపంబు సూకరంబున కేల చూత ఫలము .. మార్జాలమున కేల మల్లెపువ్వుల బంతి గుడ్లగూబ కేల కుండలములుమహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్ బకసంతతికినేల పంజరంబు...ద్రోహ చింతన జేసేడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేల.. భూషణ వికాస శ్రీ ధర్మ వుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర..” అంటాడు.  మరో మంచి పద్యం చూడండి:
మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు  మాన్యముల్ జెరుప సమర్థులంతఎండిన యూళ్ల గోడెరిగింపడెవ్వడు పండిన యూళ్ల ప్రభువులంత..అతడు పేదయటంచు నెరిగింపడెవ్వడు కలవారి సిరులెన్న గలరు చాల..తనయాలి చేష్టల తప్పెన్నడెవ్వడు పెరకాంత ఱంకెన్న పెద్దలంత..ఇట్టి దుష్టుల కధికారమిచ్చినట్టి ప్రభుని తప్పటంచును పలుక వలెను.. భూషణ వికాస శ్రీ ధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ”.
 ఇలాంటివే మరికొన్ని మంచి పద్యాలున్నాయి .కొన్ని పద్యాలు చదువుతుంటే దాశరథీ శతక కర్త కంచర్ల గోపన్నని గుర్తుకి తెస్తాయి వాటి ముచ్చట మరోసారి చెప్పుకుందాం. సెలవు.


పైన ఉదాహరించిన పద్యాలకిఅవసరమైన వారు తెలుసుకుంటారనే ఉద్దేశంతో తాత్పర్యాలని ఇస్తున్నాను.
నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత అనే మొదటి పద్యానికి భావం:
శ్రీ నరసింహుని పేరే ఒక మహా మంత్రమనీ, దానిని ఉచ్చరించిన మాత్రాననే భక్తులు తమ పాపాలని తొలగ చేసుకోవచ్చనీ, రోగాలనుంచి కాపాడుకోవచ్చనీ, శత్రువులను సంహరించవచ్చుననీ, యముని బంట్లను కూడా తరిమి వేసి మోక్షమును కూడా సాధించవచ్చనీ కవి చెబుతున్నాడు. ( దండహస్తుడు=యముడు ).
రెండవ పద్యం- గార్దభంబునకేల..... భావం:
అల్పబుధ్ధులకీ దుష్టులకీ మధురమైన పవిత్రమైన నరసింహ నామం రుచించదు. అదెలాగంటే గాడిదకి కస్తూరి బొట్టూ, కోతికి గంధమూ, పులికి  తియ్యని అప్పాలూ, పందికి మామిడిపండూ, పిల్లికి మల్లె పూదండా, గుడ్లగూబకి చెవిపోగులూ, దున్నపోతుకు శుభ్రమైన వస్త్రాలూ, కొంగకి పంజరమూ ఇష్టముండవుకదా? (మలయజము= గంధము, శర్కరాపూపము=చక్కెరతో చేసిన తియ్యటి అప్పము, )
మూడవ పద్యం-మాన్యంబులీయ... భావం:
రాజుల దగ్గరుండే దుష్టులైన అధికార్లు పేదవారికి సహాయం చేయక పోగా అపకారంచేయడానికి  ఎప్పుడూ సిధ్ధమేనని కవిభావం. రాజు చేత భూదానం చేయించడానికి బదులు ఉన్న భూముల్ని లాక్కోవడాని తయారౌతారనీ, పంటలు పండక పోయినా శిస్తుల వసూలుకు తయారౌతారనీ, పేదల గోడుని పట్టించుకునే నాధుడే లేడనీ, ఇటువంటి దుష్టులైన వారికి అధికారమిచ్చిన ఆ రాజుదే తప్పంతా అనీ  కవి భావన.

                                                              ****





జు