20, జూన్ 2012, బుధవారం

వేష భాషల్లో ఏ ముంది? సరదా ముచ్చట్లు


భాషా సంబంధిత వ్యాసాలు  బరువైనవి గానూ కొంచెం ఆలోచింప జేసేవి గానూ ఉంటాయి కనుక కొంత విరామమిచ్చి ఈ లోగా బ్లాగ్మిత్రులు సరదాగా చదువుకునే విషయం ఏదైనా వ్రాయాలనుకునే సరికి నా మదిలో మెరిసిన జంటపదం వేష-భాషలు అనేది. భాషతో పాటే దానికంటె ముందే దీన్ని జోడించి వేషభాషలని మన వాళ్లు ఎందుకన్నారని  ఆలోచిస్తే  నాకు తట్టిన దేమిటంటేమనం కొత్తవారినెవరినైనా తొలిసారి చూసినప్పుడు ముందుగా వారి వేషం తరువాత వారు మాటలాడే తీరు గమనించి వారి గురించి ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాము. వారి వేషం చూసి వారు పెద్దమనుషులనీ వారి మాటతీరుని చూసి సంస్కారవంతులనీ ఒక నిర్ణయానికి వస్తాము. ఈ విధంగా మనం వారిని గురించి చేసుకున్న అవగాహన సర్వే సర్వత్రా సరైనది కాకపోవచ్చు కాని సాధారణంగా నిజమే అవుతుంది. ఆవిధంగా మన వేషధారణ మనను గురించి ఇతరులు సరైన అంచనా వేసుకుందికి  తోడ్పడుతుంది. వేషమంటే మనం వేసుకునే బట్టలు మాత్రమే ననేది మనందరి సామాన్యమైన భావన. మన నిఘంటువులు మాత్రం మజ్జనానులేపన మాల్య వస్త్రాభరణముల చేతఇది ఐదు రకాలని పేర్కొంటుంది. అంటే స్నానం చేయడం, గంధము వంటి లేపనములు పూసుకోవడం, మాలలు  వస్త్రములు ఆభరణములు ధరించడమన్నమాట.. మాలలేమిటి మగ వారు ధరించడమేమిటి? అనుకోవద్దు. మన పూర్వులు ఆడవారి వలెనే పెద్ద కొప్పు ఉంచుకునే వారు.  దానిని దువ్వుకుని ముడి వేసుకునే వారు. ఆ కాలంలో మగ పిల్లలకు కూడా ఎంత కొప్పు పెరిగిందో చూసి అతడు పెళ్ళీడు కొచ్చాడని అనుకునే వారట. మనుచరిత్రం లో  ప్రవరాఖ్యునికి ఈ విధం గానే కొప్పు  కొలిచి సోమిదమ్మ నిచ్చి పెళ్లిచేసారని పెద్దన కూకటుల్ కొలిచి చేసిన సోమిదమ్మ అంటాడు. అదలా ఉంచితే వారు సిగలో పువ్వులు ధరించే వారో లేదో నాకు తెలీదు గాని మెడలో మాలలు మాత్రం ధరించే వారు. రసికులైన వారు చేతులకు కూడా చుట్టుకుని వాసన చూస్తూండే వారు. పుష్ప లావికలతో వారి సరస సంభాషణలు మన కావ్యాలలో కోకొల్లలు. ఇంక కర్ణాభరణాలూ కంఠాభరణాలూ చేతులకి గండపెండేరాలూ ఉండనే ఉన్నాయి. చెవులకి కుండలాలు ధరించడం పండిత లక్షణం. శ్రీనాథుడు తాను బాగా వెలిగిన రోజులలో కుళ్లాయుంచితి కోక కట్టితి మహా కూర్పాసముం దొడ్గితిన్అంటాడు. ( కుళ్లాయి అంటే ఎత్తుగా ఉండే టోపీ లేక తలపాగా, కోక అంటే పంచ, కూర్పాసమంటే  పొడుగ్గా ఉండే అంగరఖా లేక లాంగ్ కోట్ లాంటిదన్నమాట). ఎంతైనా కవి సార్వ భౌమునికి ఆపాటి వేషం ఉండొద్దా?  మన ఆధునిక కవుల్లో కూడా భావకవులు కొంచెం విలక్షణంగా ఉండేవారట. సన్నని గ్లాస్కో పంచె , గ్లాస్కో జుబ్బా, మధ్య పాపిడి తీసి రెండు వేపులా దువ్విన పొడుగైన గిరజాల జుట్టూ, కళ్ళకి చలువ కళ్ళద్దాలూ వేసుకు తిరిగే వారట. ( చలువకళ్లజోళ్లు గిరజాల సరదాలు భావ కవికి లేని వేవి లేవు? ). కుండలాలు ధరించడం పండిత లక్షణం అని చెప్పాను కదా?. కుండలాలు ధరించి సాక్ష్యం చెప్పిన బ్రాహ్మల సాక్ష్యానికి విలువెక్కువ ఉండేదని కన్యాశుల్కం మనకు సాక్ష్యమిస్తుంది. ఆ విధంగా మనవారు ఎప్పుడూ ఆహార్యానికీ అలంకారాలకీ ప్రాముఖ్యతనిస్తూనే వచ్చారు.( ఇవన్నీ ఎందుకు బట్టలు కూడా కట్టనక్కర లేదంటాడు వేమన ..పుట్టినప్పుడు లేదు పోయేటప్పుడు లేదు..నడుమ బట్ట కట్ట నగుబాటు కాదయా? అని. అన్ని భోగాలూ అనుభవించి చివరకు యోగి అయిపోయిన తర్వాత ఆయన అన్న మాటలివి. అందువలన  మనమిప్పుడు పట్టించుకో నక్కర లేదు. మనం కూడా ముసలాళ్లమై పోయాక ఇలాంటి నీతులెన్నైనా చెప్పవచ్చు) .  వేషం అలంకారం విషయంలో ఎంతైనా ఆడవారికున్న శ్రధ్ధ మగవారికి లేదు. ఎక్కడికెళ్లాలన్నా ఏం కట్టుకోవాలనే ఆలోచన వారిని నిత్యం వేధిస్తుంది. ఏదైనా పెళ్లి వంటి శుభకార్యాలకి అయితే మరీను. అయిన వారికి సంబంధించిన వివాహాలయితే చెప్పనే అక్కర లేదు.కొత్తచీరలు కొనుక్కోవడం వాటికి మాచింగ్ జాకెట్లు కుట్టించుకోవడం వగైరా పనులతో తలమున్కలవుతారు.( వీరి మాచింగ్ పిచ్చి గురించి నేను చెప్పిన సరదా పద్యం ఇంతకు ముందు నా బ్లాగులో చదవకుండా మిస్సయిన వారికోసం:
మాచింగ్ చీరెలు లంగాల్మాచింగ్ జాకెట్లు జోళ్లు మాచింగ్ నగలున్మాచింగ్లన్నీ కుదిరెనుమాచింగ్ మగడే దొరకడు మహిళా మణికిన్ ) పెళ్ళిలో ఏ టయిమప్పుడు ఏ చీరకట్టుకోవాలో నెలల ముందే నిర్ణయమైపోతుంది. అక్కడికి వచ్చే వారు ఇంతకు ముందు చూసేసిఉంటారనుకున్నవి కాకుండా కొత్తవి కట్టుకోవాలని కోరుకుంటారు. తమ భర్తలు కూడా అందరిలో  గొప్పగా కనిపించాలని వారికున్నడ్రస్సులలో మంచివి ఏరి పెట్టె సర్దుతారు కాని ఆ మహాను భావుడు ఏ లుంగీ కట్టుకునో ఏ అరుగు మీదో పేకాటకి సిధ్ధమయి పోయి మరి కదలడు. పట్టుకెళ్ళిన బట్టలు అలాగే  ఇస్త్రీలు నలక్కుండా తిరిగి వచ్చేస్తాయి. (అందరూ అలాగే ఉంటారనుకుందికి లేదు. కొందరు  విలాసవంతులు ఆడవారికంటే ఎక్కువగా తయారవుతారు.)  మన  అందాల నటుడు నందమూరి తారక రామారావు గారికి  వేషాలంటే చాలా ఇష్టమనిపిస్తుంది. సినిమాల్లో తమ పాత్ర వేషమే కాకుండా అంతర్నాటకమో మరోటో అని పేరు చెప్పి కొన్ని ఎక్స్ట్ ట్రా వేషాలు కూడా వేరే రెమ్యూనరేషన్ తీసుకోకుండా వేసేవాడు. ఈ అలవాటుని చంపుకోలేక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా  వివేకానందుని గెటప్ లాంటివి వేస్తుండేవాడు. నందమూరిని గురించి మొదలు పెడితే ఇప్పుడు తెమలదు కాని అసలు విషయానికి వద్దాము. సంఘంలో మసలుతున్నప్పుడు సంఘ మర్యాదకు లోపం రాని విధంగా వేషం ధరించక పోతే వచ్చే చిక్కులను గురించి ముచ్చటగా మూడు ముచ్చటలు చెబుతాను.ముళ్లపూడి రమణ గారు పత్రికలో పని చేసేటప్పుడు ఆయనను కొన్నాళ్లు రాజకీయ విలేఖరి గాపని చేయమన్నారుట. ఆ పని మీద ఆయన ఉన్నప్పుడు నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి వంటి ప్రముఖులు రమణ గారిని వారి కారులోనే ఎక్కించుకుని తిప్పుకునే వారట. ఒక సారి అలానే వారితో కాస్మొపాలిటన్ క్లబ్బుకి తీసుకెళ్లారట. రమణ గారికి ఆకలేసి పక్కనున్న బుహారి హోటల్ లో టిఫిన్ తిని వస్తానన్నారుట. బ్రహ్మానంద రెడ్డిగారు ఠఠ్.. వీల్లేదు. ఇక్కడ భోజనం ఏ క్లాసుగా ఉంటుంది మా గెస్టుగా భోజనం చేసి రమ్మని డైనింగ్ హాల్లోకి పంపారట. రమణ గారు డైనింగ్ హాల్లో టేబిలు ముందు కూర్చుని బేరర్ని పిలిచి బోజనం వడ్డించమన్నారుట. రమణ గారి ఇస్త్రీ లేని నలిగి పోయిన షర్టు ఫేంటు చూసి ఆ బేరర్  డ్రయివర్లకీ అటెండర్లకీ భోజనం బయట షెడ్డులో పెడతారనీ అక్కడకు వెళ్లి తినమనీ అన్నాడుట. అంతలో ఆపద్బాంధవుడివా వచ్చిన రెడ్డిగారు గుడ్లురుముతూ రాస్కెల్.. ఈ.యన రిపోర్టరుగారు.. నా గెస్టు ,బోజనం ఇక్కడే వడ్డించుఅని చెప్పారుట. తర్వాత రమణ గారితో  రెడ్డిగారు మరియాదకరమైన డ్రస్సువేసుకోవలసిన అవసరం గురించి చెప్పారుట.ఇంకో సంగతి.:
నేను ఆడిట్ ఆపీసులో పని చేస్తున్నప్పుడు ఒక మిత్రుడు చెప్పిన సంఘటన ఇది. ఆయన ఒక సారి ఆడిట్ నిమిత్తం ఒక పల్లెటూళ్లో ఉండే పంచాయతీ సమితికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఉండడానికి వసతి ఉండదు కనుక పొరుగూర్లో లాడ్జిలో దిగి ఉదయం పదిగంటల లోపే సమితి ఆఫీసుకు చేరుకున్నాడట. అక్కడ ఆఫీసు తలుపుల తాళాలింకా తీసి ఉండక పోవడం చేత సిగరె ట్టు ముట్టించి  ఛుట్టూ చూస్తే దూరంగా నలిగి పోయిన బట్టలూ హవాయి చెప్పులూ వేసుకున్న ఒక ముసలాయన పచార్లు చేస్తూ కనిపించాడట. ఆయనను దగ్గరకు రమ్మని పిలిచి ఏ మయ్యా ఇక్కడ ఆఫీసు టైముకు తీసే అలవాటు లేదా?” అని అడిగాడట. దానికా ముసలాయన సమాధాన మిస్తూ అలాగే ఉందండి. ఇంతకూ తమరెవరండి?” అని అడిగాడట. దానికి మా మిత్రుడు తన హోదా తెలిస్తే తన మీద గౌరవం పెరుగుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ ఆఫీసు అక్కవుంట్లు తనిఖీ చేయడానికి హైద్రాబాదు నుంచి వచ్చిన ఆడిట్ పార్టీ సెక్షనాఫీసర్ని . అని గర్వంగా చెప్పుకున్నాడుట. దానికా ముసలాయన  తనను తాను పరిచయం చేసుకుంటూ   మీరూ టయిముకే వచ్చినందుకు చాలా సంతోషం. నేను మీ పనిని పర్యవేక్షించడానికి వచ్చిన ఆడిట్ ఆపీసర్ని అన్నాడుట. తెల్లబోవడం మా మిత్రుని పనయ్యిందిట. మా మిత్రుడీ సంగతి నాకు చెబుతూ  ఆ ఆఫీసరు గారి డ్రస్సే తనని పొరపడేట్టు చేసిందని చెప్పేడు.ముచ్చటగా మూడో ముచ్చట:
శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు ఒకప్పుడు విశాఖ పట్టణం లో ఉన్నప్పుడు ఉదయమే  ఒక కొల్లాయి గుడ్డ కట్టుకుని చెంబు తీసుకుని దగ్గర లో నున్న ఏడునూతుల వీధికి స్నానార్థమై బయల్దేరి వెళ్తున్నారట. అంతలో ఎవరో  చెప్పగా శ్రీ జయంతి రామయ్య పంతులు గారిల్లు ఆ దారి లోనే ఉందని తెలిసిందట. జయంతి రామయ్య పంతులు గారు ఆ రోజుల్లో గోదావరి జిల్లాల్లో బి.య్యే.మొదటి బ్యాచిలో ప్యాసయిన వారూ..శ్రీ పిఠాపురం రాజా వారికి సహాధ్యాయులో సతీర్థులో అయిన వారున్నూ.. ఆయన అప్పట్లో డిప్యూటీ కలెక్టరు  హోదాలో ఉన్న వారు. ఆయన స్వయంగా మంచి కవిన్నీ.. సాహిత్యాభిలాషిన్నీ. ఆయన తో చెళ్లపిళ్ల వారికి పూర్వ పరిచయం ఉంది. ఒకానొక సందర్భంలో రామయ్య పంతులు గారి మీసాల మీద పద్యం చెప్పి ఉన్నారు కూడాను. అందు చేత స్నానానికి పోతూ పోతూ పంతులు గారింటి  వీధి గుమ్మం దగ్గర నిల్చుని పంతులు గారున్నారా అంటూ కేకేసారుట. లోపల్నుంచి           ఈయనను చూసిన పంతులు గారి ఇల్లాలు యాయవారం బ్రాహ్మలకు పంతులుగారితో పనేమిటో?” అని ప్రశ్నించిందట. దానికి మారు చెప్పకుండా కవి గారు స్నానానికి పోయి ఆ మధ్యాహ్నం పంతులు గారిని సక్రమంగా దర్శించినప్పుడాయన మీరు తగినంత వేష భాషలు కలిగి ఉండాలి. నిరాడంబరంగా ఉండకూడ దని హితోపదేశం చేశారుట.
 డాబూ దర్పం కూడదు గాని, సందర్భానికి తగిన వేషం లేక పోతే వచ్చే చిక్కులు చూసేరా?
                                                         ***
( దీని లోని ముళ్ళపూడి వారి ముచ్చట. వారి కోతి కొమ్మచ్చి లోనిదయితే  చెళ్ళపిళ్ళవారి అనుభవం వారి కథలూ..గాధలూ లోనిది. వారిద్దరికీ నా కృతజ్ఞతాంజలులు)                                                    ***