27, జూన్ 2012, బుధవారం

నేను చదివిన ఒక మంచి పుస్తకం--ఒక పరిచయం

నేను చదివిన ఓ మంచి పుస్తకంఒక పరిచయం
సరిగ్గా ఒక సంవత్సరం క్రిందట మా చిన్న అల్లుడుగారు వారి మిత్రులైన పబ్లిషర్స్ ఇచ్చేరని చెప్పి నాకు రెండు పుస్తకాలు తెచ్చి ఇచ్చేరు. అవి నాకు చాలా ఇష్టమైనవే. ఆ పుస్తకాల ప్రచురణ కర్తలు శ్రీ రాజాచంద్ర ఫౌండేషన్ వారు. ఆ పుస్తకాలు చూస్తుంటే ఆ ప్రచురణ కర్తలదే మరో పుస్తకం కూడా ఉందని తెలిసింది.  దాని పేరు సురపురంమెడోస్ టైలర్ ఆత్మ కధ. ఇదేదో ఒక ఆంగ్లేయుని ఆత్మ కథ కదా? మనకేమి ఆసక్తిదాయకంగా ఉంటుందిలే అని అదికూడా తెచ్చి పెట్టమని మా అల్లుడుగారిని నేనడుగలేదు. ఈ మధ్య మా అమ్మాయి గారింట్లో ఈ పుస్తకం కూడా చూసి తెచ్చుకుని చదివేను. అవడానికి ఇది ఒక ఆంగ్లేయుని ఆత్మ కథే అయినా, దీనిలో మనకి ఆసక్తి కలిగించే విషయాలు చాలానే ఉన్నాయి. దానికి కారణం  ఈ రచయిత తన జీవితంలో సింహభాగం మనదేశంలోనే మరీ ముఖ్యంగా మన నిజాము రాష్ట్రంలో గడపడం అప్పటి ఇక్కడి మన ప్రాంత పరిస్థితులు ప్రజల జీవన విధానాన్ని గురించి వివరంగా వ్రాయడం. సుమారు రెండువందల సంవత్సరాలకి పూర్వం , మనకి నాలుగైదు తరాలముందు మన తాతల జీవిత స్థితిగతులు ఎలాఉండేవో తెలుసుకోవాలంటే ఇటువంటి పుస్తకాలు చదవడం తప్పని సరి. మనకి చరిత్ర పుస్తకాలు దొరుకుతాయి గాని నాటి సాంఘిక జీవనాన్ని తెలిపే పుస్తకాలు చాలా అరుదుగానే దొరుకుతాయనుకుంటాను. మనలో చాలామందికి ఆరోజులు బంగారు దినాలనీ మనకంటె మన పూర్వులు చాలా హాయిగా సుఖశాంతులతో బ్రతికే వారనీ ఒక అపోహ ఉంది. దీనికి కారణం అప్పటి సంఘం గురించి, రాజ్య వ్యవస్థ గురించి మనకి సరైన సమాచారం లేకపోవడమే. ఈ పుస్తకం మనకా కొరత కొంతైనా తీరుస్తుంది. అందుకే దీనిని పరిచయం చేయాలనుకుంటున్నాను.
ఈ మెడోస్ టైలర్ ఇంగ్లాండు దేశంలో లివర్ పూల్ నగరంలో 1808 సెప్టెంబరులో పుట్టేడు..కొద్దిపాటి స్కూల్ చదువు చదువుకున్నా అది సాగలేదు..చిన్నప్పుడే వాళ్లనాన్న అక్కడ ఇతడిని పనిలో పెట్టాడు. ఇతడికి 16వ యేడు నడుస్తుండగా 1824 లో ఇతడిని  వాళ్ల నాన్న బొంబాయి లో వ్యాపారం చేసే ఒక బ్రిటిష్ సంస్థలో ప్రవేశ పెట్టాడు. ఆ ఉద్యోగంలో చేరడానికి  ఓడలో నాలుగున్నర నెలలు  ప్రయాణించి  సెప్టెంబరు ఒకటి, 1824 సంవత్సరంలో బొంబాయిలో మన గడ్డపై అడుగు  పెట్టాడు. అయితే అతడు ఏ ఉద్యోగంలో చేరుదామని వచ్చాడో ఆ ఉద్యోగంలో చేరలేదు. అప్పట్లో బొంబాయి ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శి అయిన న్యూ హోం,   టైలర్ తల్లిగారికి పెత్తండ్రి కొడుకు. ఆయనని కలుసుకుని ఆయన సలహా మేరకు ఆయన సిఫారసుతో  హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెంటు క్రింద నిజామ్ సైన్యంలో చేరడానికి ఔరంగాబాదు  చేరుకున్నాడు. అక్కడ ఉద్యోగంలో సైన్యంలో లెఫ్టినెంటు హోదాలో  చేరి కవాతు నేర్చుకోవడమే కాకుండా ఒక మున్షీని పెట్టుకుని హిందూస్థానీ కూడా నేర్చుకున్నాడు..అప్పుడక్కడ సేనానిగా పని చేస్తున్న మేజర్ సేయర్ తో  స్నేహం వలన పుస్తకాలు చదవడం చిత్రాలు గీయడం బాగా అలవాటైంది. హిందూ స్థానీ కూడా తొందర గానే నేర్చుకోవడం వల్ల అక్కడ జరిగిన ఒక కోర్టుమార్షల్ లో  దుబాసీగా వ్యవహరించి పై వారి మెప్పుపొందుతాడు. ఆ విధంగా హైదరాబాదు రెసిడెంటు దృష్టిలో పడి హైదరాబాదులో బొలారం కంటోన్మెంటులో వ్యాపార సంస్ధలపై అజమాయిషీ చేసే  సూపరింటెండెంటు పదవిలో కుదురుకుంటాడు.. ఆతర్వాత కొన్నాళ్లకే సదాశివపేటలో అసిస్టెంటు పోలీసు సూపరింటెండెంటుగా ఉద్యోగంలో చేరుతాడు. పదిలక్షల జనాభా 22 వేల చదరపుమైళ్ల విస్తీర్ణంగల ప్రాంతంలో రెవిన్యూ పోలీసు విధులను నిర్వహించవలసి ఉంటుంది.  ఆప్పటి కతనికి పధ్ధెనిమిది సంవత్సరాలు నిండలేదు. ఇక్కడ విధి నిర్వహణలో ఉంటుండగానే ఒకసారి మోమినా బాద్ అనే ఊళ్ళో కల్తీ పిండి అమ్ముతున్న వ్యాపారులపై  జరిమానాలు విధించి కఠిన చర్యలు తీసుకుంటే  వారు హైదరాబాదులోని మంత్రి చందూలాల్ గారికి ఫిర్యాదు చేయడం దానిపై విచారణకుగాను మంత్రి పంపిన అధికారి వచ్చి జేబులు నింపుకుని వెళ్లిపోవడం జరుగుతాయి . తరువాత కొన్నాళ్ళకు హైదరాబాదు వెళ్లిన టైలర్ తో మంత్రి చందూలాల్ ఆ వ్యాపారస్థులను అలాగే పట్టి ఉంచేటట్టయితే నేనో లక్ష గుంజేవాడిని కదయ్యా? అన్నాడట. ఆ రోజుల్లో కూడా లంచగొండితనం  ఎంతగా వ్యాపించి ఉండేదో తెలిపే ఉదంతమిది.
ఆ తర్వాత ఒకసారి అతడు తుల్జాపూర్ లో కేంపులో గుడారంలో ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి అతని పుట్టిన తేదీ తెలుసుకుని చెయ్యిచూసి దీర్ఘాయుర్దాయమనీ త్వరలోనే పెళ్ళవుతుందనీ తక్కువమందే పిల్లలు కలుగుతారనీ అతడి చేతులలో లక్షల ధనం నడుస్తుందనీ అయితే  ధనవంతుడు కాకపోయినా పేదవాడు కాడనీ చెప్పి కొద్ది సేపట్లోనే అతడి జాతకం వేసి తీసుకు వచ్చి అతడు త్వరలోనే ఆప్రాంతాన్ని పరిపాలిస్తాడనీ చెప్పివెళ్తాడు.
అక్కడ ఉన్నప్పుడే గోధుమపిండిలో ఇసుక కలిపి తూకంలో కూడా మోసం చేస్తున్న వ్యాపారస్తులను పిలిచి వారిని ఆ పిండి తినమని ఆజ్ఞాపిస్తే వారు జరిమానా కడతామనీ మళ్ళా ఎప్పుడూ అలాంటి అక్రమాలకు పాల్పడమనీ ఒట్టు వేసుకుని దానికి కట్టుబడి ఉండి వ్యాపారం చేసేవారట.
ఆ రోజుల్లో దొంగలు బందిపోట్లు తమ దొంగ సొమ్ములో జమీందార్లకు వాటాలు పెడుతూ చాలా ఘోరకృత్యాలకు పాల్పడేవారట. ఆ జమీందారులు కూడా హైదరాబాదులో పెద్దల అండదండలను చూసుకుని నిజాం ప్రభుత్వపు ఉత్తర్వులను బేఖాతరు చేసేవారట. రెవిన్యూ శాఖవారు సర్వే పేరు చెప్పి లంచాలు తిని అంతా మోసమే చేసేవారట.
ఒకసారి నారాయణరావనే దుర్మార్గుడు ముగ్గుర్ని చంపి వారి ధనాన్ని దోచుకుంటే టైలర్ ధైర్యంగా వాడి కోట లోకి వెళ్ళి వాడిని బంధించి తీసుకు వస్తాడు. అతడు తనని వదిలి పెడితే లక్ష రూపాయలవరకూ ఇస్తానని  చెబుతాడు. వాడిని శిక్షించడానికి హైద్రాబాదు తీసుకు వెళ్ళి అతడు తన కివ్వజూపిన లంచానికి సాక్ష్యంగా అతడు వ్రాసిన ఉత్తరాన్ని చూపిస్తే మంత్రి చందూలాల్ పగలబడి నవ్వుతూ ఆ లక్ష రూపాయలూ తీసుకోవలసింది. ఇప్పుడా ధనమంతా దాచేస్తారన్నాడట. అయ్యా ఇదీ ఆనాటి పరిస్థితి.
టైలర్ సదాశివ పేటలో ఉంటున్నప్పుడే చాలా ఘోరాలు జరిగేవట. మనుషుల్ని గొంతునులిమి చంపి రస్తాల ప్రక్కన పాతిపెట్టేవారట. ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఇళ్లనుండి కొన్నికొన్ని కాలాలలో మాయమైపోతూండేవారట. వీరు మైసూర్ ధార్వార్ బెల్గాం ప్రాంతాలలో సరకులమ్మి తిరిగి వచ్చేటప్పుడు దుస్తులు పాత్రలు వగైరాలు తెస్తూండేవారట. వీరినోకంట కనిపెట్టి ఉండమని టైలర్ తన అసిస్టెంటుని పురమాయిస్తాడు. అప్పట్లో వీరి సంగతి తేలకపోయినా తరవాత వీళ్లూ దారి దోపిడీగాళ్లేనని  తేలిందని టైలర్ వ్రాస్తాడు. బ్రిటిషు వారు తరువాతికాలంలో సరైన పోలీసు వ్యవస్థని నిర్మించక ముందు ఇలాంటి దారి దోపిడీ గాళ్లకు ఏ అడ్డూ ఆపూ ఉండేదికాదు. జమీందార్లతో మిలాఖతై జనాన్ని దోచుకునేవారు.  వీరే ధగ్గులు.
పిండారులు ధగ్గులు కట్టిరి కాలానికి కత్తుల వంతెనఅని శ్రీశ్రీ గారు చెప్పినది వీరిగురించే.
చాలా కాలం తరవాత ధగ్గులనందరనూ టైలర్ పట్టుకోవడం జరుగుతుంది. టైలర్ దగ్గర ఉండే సైనికుల్లో కొందరు కూడా పారిపోయారట. తర్వాత వారుకూడా ధగ్గులేనని తెలిసింది. ఈ అనుభవాలతోనే టైలర్ తరువాతికాలం లో
 “ The Confessions of a Thug” అనే పుస్తకాన్ని వ్రాయడమూ అది విశేష ప్రాచుర్యాన్ని పొందడమూ జరుగింది.
తర్వాత కాలంలో టైలర్  బొలారంకు బదిలీ అయి హైదరాబాదు రావడం అక్కడ నిజాం తమ్ముడు ముబారిజుద్దౌలా అన్నగారితో గొడవ పడడం అతడిని గోలకొండలో బందీగా ఉంచడం తరువాత టైలర్ అతడికీ నిజాముకీ మధ్య సామరస్యపూర్వకమైన పరిష్కారం కుదర్చడం వంటివి జరిగాయి.
1832 ఆగష్టు 25న సికందరాబాదు చర్చిలో టైలర్ స్నేహితుడైన పామర్ కూతురు మేరీతో అతడికి వివాహమౌతుంది. తర్వాత మూడేళ్లలో ఇద్దరు బిడ్డలు కలిగి చనిపోతారు.
1837 లో అతడికి కెప్టెన్ గా ప్రమోషన్ లబిస్తుంది. టైలర్ అతడి భార్య ఆరోగ్యం బాగుండక ఊటీలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్  జనరల్ విలియం బెంటింగ్ నిజాం సైన్యంలో పని చేసే బ్రిటిష్  వారికి లండన్ వెళ్ళడానికి సెలవివ్వరని   టైలర్ ద్వారా తెలుసుకుని వారికి ఆ సదుపాయం కల్పిస్తూ కౌన్సిల్ ఆమోదాన్ని తెప్పిస్తాడు. ఆ విధంగా లండన్ వెళ్లడానికి వీలు కలిగిన టైలర్ 1838 లో లండన్ వెళ్లి 1841 ఫిబ్రవరిలో తిరిగి హైదరాబాదు చేరుకున్నాడు. 
ఇలా తిరిగి వచ్చాక టైలర్ జీవితంలో ఒక ప్రధాన ఘట్టం ప్రారంభమయ్యింది... అతడు  సురపురం సంస్థానంలో రాజకీయ ప్రతినిధిగా నియమింపబడ్డాడు. ఇక్కడ  ఉద్యోగంలో అతడు పదేళ్లు పనిచేసాడు. అతడా ఉద్యోగంలో చేరేసరికి అక్కడి పరిస్థితులేమీ బాగులేవు. రాజు కృష్ణప్పనాయక్ అకస్మాత్తుగా. చనిపోయాడు అతడికి అప్పటికి ఏడేళ్ల వయసుగల కుమారుడున్నాడు.  రాజుగారి తమ్ముడు పెద్దినాయక్. రాజకుమారునికి యుక్తవయసు వచ్చే వరకూ తాను రాజప్రతినిధిగా వ్యవహరించడానికి గవర్నర్ జనరల్ ఆమోదం పొందాడు.. కానీ  రాణి ఈశ్వరమ్మ ఈ ఏర్పాటును దౌర్జన్యంగా వ్యతిరేకించబూనుకుంటుంది. సైనిక చర్యతో ఆమెను దారికి తీసుకురావచ్చును కాని అప్పట్లో బ్రిటిషువారికున్న అనేక ఇబ్బందుల వల్ల టైలర్  ఈ సమస్యని సామరస్యంగానే పరిష్కరించవలసి వస్తుంది. రాణి ఈశ్వరమ్మ వ్యభిచారియై చినబసప్ప అనే అతడితో కులుకుతూ ఉంటుంది. అతడి ప్రోద్బలంతో టైలర్ అంతు చూడాలని కూడా ఆనుకుంటుంది. కానీ అవేమీ సాగవు. అయినా ఆమె చాలా కనికరం గలదనీ బీదలంటే ఎంతో ప్రేమ చూపించేదనీ టైలర్ అంటాడు. ఆమెకు తనకుమారుడు 24 ఏళ్ళునిండకుండానే చనిపోతాడని అతడి జాతకంలో వ్రాసి ఉందని భయం పట్టుకుంటుంది. అతడి తర్వాత
సంస్థానం  ఏమయిపోతుందోనని దిగులు పడుతుంటుంది.. రాజకుమారుని జాతకాన్ని నాసిక్, కాశీ పంపించామనీ అందరూ అదే మాట చెప్పారనీ ఎవరైనా వేరే మాట చెబుతారేమోనని లక్ష రూపాయలు ఖర్చు పెట్టాననీ రాణి చెబుతుంది. అక్కడి వారి పురోహితుడుకూడా టైలర్ తో అదేమాట చెబుతాడు.
తరువాత అక్కడ సంస్థానంలో జరిగిన ఎన్నో సంఘటనలను టైలర్ వివరిస్తాడు. 1844 లో టైలర్ కు భార్యా వియోగం సంభవిస్తుంది. 1854లో  జూన్ 30న  యుక్త వయసు వచ్చిన రాజకుమారుని సంస్థానానికి పట్టాబిషిక్తుడిని చేస్తాడు అంతకుముందు మే నెలలోనే రాణి ఈశ్వరమ్మ కూడా మరణిస్తుంది.
తరువాత 1857 లో సిపాయీల తిరుగుబాటు జరిగినప్పటి దేశపు అల్లకల్లోల పరిస్థితుల్ని టైలర్ చక్కగా వివరిస్తాడు. బ్రిటిషర్లందరూ భయభ్రాంతులై ఉంటారు. టైలర్ కి కూడా ప్రాణహాని ఉండేది కాని అక్కడి ప్రజలకు అతడిమీద ఉన్న ప్రేమతో  మహదేవ బాబా అని పిలుచుకుంటూ కాపాడుతుంటారు.. 1857లోనే  సురపురం రాజా చెడు సలహాలను విని  తిరుగు బాటు ప్రయత్నం చేసి ఫలించక బ్రిటిషువారి బందీగా హైదరాబాదు తీసుకు రాబడతాడు. అక్కడ అతడిని చూడడానికి వచ్చిన టైలర్ తో  అతడి  సలహాలను చెవిని బెట్టక పాడయిపోయినానని వాపోతూ తనకు శిక్ష తప్పదనీ అయితే  సాధారణ ప్రజల్లాగా ఉరితీయకుండా తనను పేల్చి వేసేటట్లు చూడమనీ కోరుకుంటాడు. సురపురం పాలనా వ్యవహారాలు చూడడానికి టైలర్ మళ్లా సురపురం వస్తాడు. అక్కడ ఉంటుండగా రాజుకు ఉరిశిక్ష వేసేరనీ దానిని రెసిడెంటు యావజ్జీవ శిక్షగా మార్చగా, గవర్నర్ జనరల్ దానిని నాలుగేళ్ళకు తగ్గించాడనీ తెలుస్తుంది. 24 వ యేట మరణిస్తాడనుకున్న రాజుకి ఉరిశిక్ష తప్పినందుకు టైలర్ సంతోషిస్తుండగా సురపురం పురోహితుడు మాత్రం జాతకం తప్పదనే నమ్మకంతో ఉంటాడు. వారిలా ఉండగా రాజు ని చెంగల్పట్టు తీసుకు వెళ్తున్నారనీ అక్కడ బందీగా ఉండే ఆయనతో పాటుగా రాణులూ ఆయన పరివారం కూడా ఉండవచ్చనీ నాలుగేళ్లు సరిగా వ్యవహరిస్తే అతడి రాజ్యాన్ని తిరిగి అతడికి ఇచ్చివేయవచ్చనీ తెలుస్తుంది .రాణులూ పరివారం రాజును చెంగల్పట్టు తీసుకు వెళ్లే దారిలో కర్నూలులో కలుసుకుందికి ఏర్పాట్లు జరుగుతాయి.
.రాజపురోహితుడు మాత్రం ఆపత్కాలం ఇంకా మించిపోలేదనీ భయపడుతూనే ఉంటాడు. ఇంతలో హైదరాబాదు రెసిడెంటునుంచి రాజకుమారుడు  ఉదయం తన ప్రయాణపు మొదటి మజిలీలో పిస్తోలుతో పేల్చుకు చనిపోయాడు అనే వర్తమానం అందుతుంది. రాజకుమారునికి 24వ ఏడు గడవనే లేదు.ఆ భయంకరమైన జోస్యం అలా ఫలించింది అంటాడు టైలర్. తాను విద్యా బుద్ధులు గరపి పెద్దవాణ్ణి చేసిన రాజకుమారుడు ఈ విధంగా మరణించడం పట్ల టైలర్ చాలా బాధ పడతాడు..
 టైలర్ విషయంలో కూడా తుల్జాపూర్ బ్రాహ్మడు ఆ ప్రాంతాన్ని ఏలతావని చెప్పిన జోస్యం నిజమైంది కదా?
                                                     ***
1859 లో సెలవు మీద లండన్ వెళ్లిన టైలర్ అనారోగ్యం  కారణంగా అక్కడే ఉండిపోయి ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. అక్కడ రచనా వ్యాసంగంతో కాలం పుచ్చుతూ  మన ప్రాంతాలను చూడాలన్న కోర్కె చంపుకోలేక తిరిగి 1875 సెప్టెంబరు 12న బయల్దేరి తన కూతురు సాయంతో హైదరాబాదు వస్తాడు. హైదరాబాదులో ఉండగా ఎందరో వచ్చి ఆయనను కలుసుకుని పాదాభివందనం చేసి వెళ్లేవారని అతని కుమార్తె అంటుంది. సురవరం నుంచి వచ్చిన ఒక స్నేహితుడు అప్పటికీ (అంటే 1875 నాటికికూడా) సురపురంలో స్త్రీలు ధాన్యం దంచుకునే టప్పుడూ దీపం వెలిగించుకునే టప్పుడూ టైలర్ సాహెబుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారని తెలియజేస్తాడు. 1876 మార్చిలో తిరుగు ప్రయాణమై జెనీవా దగ్గర మెంటోన్ అనే వూళ్లో టైలర్ మరణిస్తే ఆయనను అక్కడే ఖననం చేశారట. ఈ విషయాలను పుస్తకం ఆఖరు అధ్యాయంలో అతని కుమార్తె చేర్చింది.
                                                     ***
టైలర్ మన దేశంలో ఉండగా తాను పని చేసిన ప్రాంతాల్లో చెరువులు బాగు చేయించి ఎంతో భూమిని సాగులోకి తీసుకు రావడం రోడ్లు వేయించడం వాటిప్రక్కన చెట్లు నాటించడం వంటి మంచి పనులు చేసాడు. తనకున్న అరకొర పరికరాల్తోనే భూమిని సర్వేచేసి భూముల హద్దులు నిర్ణయించి వాటిని కౌలుకిప్పించి సాగు చేయించడం చేసాడు. భూములమీద వ్యవసాయం చేసేవారికి అదికారం కల్పించి శిస్తు పెంచమనే అభయమిస్తే  వ్యవసాయదారులు కష్టించి  పనిచేస్తారని నమ్మిన టైలర్  ఆవిధంగా చేసి వ్యవసాయాభివృధ్దికి గణనీయంగా తోడ్పడ్డాడు. సురపురంలో తెలుగు మరాటీ పర్షియన్ ఇంగ్లీషు భాషలను బోధించే పాఠశాల నెలకొల్పాడు. బ్రిటిష్ ప్రభుత్వం పాలించే ప్రాంతాల లోని పాఠశాలలనుండి పుస్తకాలు తెప్పించి వారికి సరఫరా చేసేవాడు. సురపురం నుంచి లింగిసునూరు పోవడానిక రోడ్డు వేయించి దానికి రెండువైపులా మామిడి .చింత మొదలైన ఫల వృక్షాలను కొన్ని వేలు నాటించాడు. ఇలా ఎన్నో చోట్ల చేసాడు.   తాను పని చేసిన ప్రాంతంలోని ప్రజలందరికీ దగ్గరై వారి ప్రేమకు పాత్రుడయ్యాడు. సురపురం లో ఎక్కువ మంది బేడర్లు ఉండేవారు. వారు విచ్చు కత్తులు పట్టుకుని తిరుగుతూ ఎటువంటి అకృత్యానికైనా పాల్పడుతుండే వారు. అటువంటి వారిని కూడా టైలర్ తన మంచితనంతో ఘర్షణలు లేకుండా దారికి తీసుకు వచ్చాడు. అరాచకత్వానికి మంగళం పాడి శాంతి భద్రతలు నెలకొల్పాడు. టైలర్ ఇక్కడి ప్రజలకు ఇంత దగ్గర కావడానికి కారణాలేమిటో తెలుసుకోవాలంటే  అతడి అబిప్రాయాలేమిటోతెలుసుకోవాలి.. అతడి భావాలు కొన్ని చూడండి:

భాష నేర్చుకునే టప్పుడు కష్టమైనా దాని నుడికారం నేర్చుకోవాలి. ( ఈ విధంగానే హిందూస్థానీ మరాఠీ, తెలుగు నేర్చుకుని వాటి మీద అధికారం సంపాదించి ప్రజలకు చేరువయ్యాడు) 
భాగ్యవంతులు పన్నులు సరిగా చెల్లించరు. పేదలే నయం. ( దీనికి అనేక ఉదాహరణలు చూపిస్తాడు)
కులీనులలో నెలకొన్న అవినీతి ప్రజలలో కానరాదు. (ఇప్పటికీ అంతే కదా?)
రక్షణ కోసం ప్రజల మీద ఆధార పడడం మంచిది. (ప్రజాభిమానం చూరగొన్న నాయకులకు వేరే రక్షణ అవసరం ఉండదు కదా)
ఇంతమంచి అభిప్రాయాలు కలిగి వాటిని ఆచరణలో చూపించ గలిగాడు కనుకనే అంతమంది ముష్కర మూకల మధ్య సంస్కరణలు చేస్తూ కూడా క్షేమంగా మనగలిగాడు. అతడి నినాదం భారత ప్రజలను ప్రేమించి పాలించండి అన్నది. ఇది నమ్మి ఆచరించాడు కనుకనే ఇక్కడి ప్రజలు అతడిని మహదేవ బాబా అని గౌరవంగా పిలుచుకునే వారు.
                                                               ***
టైలర్  పెద్దగా స్కూళ్లలో చదువుకోక పోయినా మంచి రచయితగా ఎదిగాడు. భారత దేశ చరిత్ర నేపధ్యంలో తార, రాల్ఫ్ డార్నెల్, సీత అనే నవలలు వ్రాసేడు. ఇక్కడ పని చేస్తుండగా ఇంగ్లాండులోని టైమ్స్ పత్రికకు విలేఖరిగా పుంఖాను పుంఖంగా వ్యాసాలు వ్రాసి పంపేవాడు. రెండు సంవత్సరాలు కష్టపడి Students manual of the History of India అనే గ్రంధం వ్రాసేడు. భారత దేశ ప్రజలను గురించి ఒక చారిత్రక వర్ణనాత్మక సచిత్ర గ్రంథం మరికొంతమంది సహకారం తో రూపొందించాడు. టైలర్ కేవలం రచయితే కాదు. మంచి చిత్రకారుడు కూడా. ఇక్కడ తాను నివసించిన ప్రదేశాల సౌందర్యాన్ని అప్పటి మనుషుల్నీ తన కుంచెతో పట్టుకుని  తన చిత్రాల్లో నిక్షిప్తం చేసాడు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞావంతుడు సహృదయుడు ఎక్కడో ఇంగ్లండులో పుట్టి ఇక్కడకు వచ్చి ఇక్కడ మనవార్ని తనవారుగా భావించి ప్రేమించి వారి అభ్యున్నతి కోసం తన ఆరోగ్యం సహకరించక పోయినా విశేషమైన కృషి చేసిన టైలర్ ఎంత అభినందనీయుడో కదా?
                                                           ***

ఆంగ్లంలో టైలర్ వ్రాసిన ఈ పుస్తకాన్ని ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణ గారు తెలుగులోకి అనువదించి 1986 లోనే ప్రచురించారట. వారి అనుమతితో రాజా చంద్ర ఫౌండేషన్ వారు తిరిగి జులై 2011 లో పునర్ముద్రించారు. ఇటువంటి మంచి పుస్తకాన్ని శ్రమకీ ఖర్చుకీ వెనుకాడకుండా ప్రజలకు అందించిన ప్రచురణకర్తలను అభినందిస్తున్నాను. 
                                                           ***
(ఈ వ్యాసాన్ని చదివిన వారిలో పదోవంతు మందికైనా అసలు గ్రంథాన్ని చదివే అవకాశం దొరుకుతుందో లేదోనన్న సంశయం వల్ల  వివరంగా వ్రాయడంతో నిడివి పెరిగింది. విసుగు కలిగించి ఉంటే క్షంతవ్యుణ్ణి. సెలవు.
                                                         ***