19, డిసెంబర్ 2012, బుధవారం

ఎవరీ బుడతకీచులు? వారితో మనకేఁవిటి సంబంధం?



బుడత కీచులనగానే ఉడతల్లాంటి ఏవో చిన్ని జంతువులై ఉంటాయనిపించవచ్చు. కాని కాదు. బుడతకీచులని తెలుగువారు ముద్దుగా పిలుచుకునే  వారు మనుష్యులే. వారితో మన సంబంధం తెలుసుకునే ముందు ఈ కథ వినండి.
                                                *****
యూరపు ఖండం నైరుతి దిశలో ఐబీరియా ద్వీప కల్పం పశ్చిమాన అట్లాంటిక్ మహా సముద్రాని కెదురుగా ముఫ్ఫై ఐదు వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఐదు వందల మైళ్ల సముద్ర తీరంతో విస్తరించిన ప్రాంతం ఈ నాడు మనం పోర్చుగల్  అని పిలుచుకునే దేశం. ఓ ఎనిమిది వందల ఏళ్లక్రితం  ఈ పేరుతో ఈ దేశం లేదు. ఐతిహాసిక యుగంలోఈ ప్రాంతానికి లూసితేనియా అని వాడుక. అక్కడ కెల్టు-బాస్కు భాషలు మాట్లాడే అనాగరిక తెగల వారు నివసించేవారు. క్రీ.పూ.3వ శతాబ్దం నాటికి  పరిసర ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతం కూడా రోమన్-లాటిన్ భాషలు మాట్లాడే వారి హస్తగతమైంది.ఆతరువాత క్రీ.శ 8వ శతాబ్దిలో ఇస్లాము మతస్థులైన అరబ్బులు గుంపులు గుంపులుగా వచ్చి ఈ ప్రాంతాన స్థిర నివాసమేర్పరచుకుని దాదాపు నాలుగు వందలేళ్ళ పాటు అధికారం చెలాయించారు. క్రీ.శ 11, 12 శతాబ్దులలో స్థానికులు హెన్రీ నాయకత్వంలో విజయవంతంగా తిరుగు బాటు చేసి 1143 లో పోర్చుగల్ రాజ్యాన్ని స్థాపించుకున్నారు.
వీరిని పోర్చుగీసు వారని, వీరి భాషను  పోర్చుగీసు భాష అని నేడు పిలుస్తున్నాము. పోర్చుగల్ కి పక్కనే ఉండే స్పెయిన్ దేశానికీ దీనికీ వాస్తవానికి సరియైన భౌగోళిక సరిహద్దులేమీ లేవు.అందు వల్లనూ, స్పానిష్ పోర్చుగీసు భాషలు రెండూ లాటిన్ భాషా శాఖా జన్యములు కావడం వల్లనూ ఈ రెండు భాషలూ మన తమిళ మలయాళ భాషలంత దగ్గర దగ్గర భాషలు. అలాగే ఫ్రెంచి ఇటాలియను భాషలు కూడాదీనికి సోదర భాషలే. పదమూడవ శతాబ్దము ఆరంభం లో పోర్చుగీసు రాజబాషగా అవతరించే వరకూ వరకూ, పోర్చుగల్ లో లాటిన్  భాషే రాజభాషగా చెలామణీ అయ్యేది.
15వ శతాబ్ది నాటికి పట్టుమని పది లక్షల జనాభా లేని అతి చిన్న దేశీయులైన ఈ పోర్చుగీసులు కొత్త కొత్త ప్రాంతాలను కనుక్కోవడంలో చూపించిన చొరవ సాహసాలు అత్యంత ఆశ్చర్యకరమైనవి.పోర్చుగీసు చక్ర వర్తులు ఓడల నిర్మాణానికి కావలసిన కలపని ప్రభుత్వ అడవులనుండి ఉచితంగా ఇచ్చి,ఎగుమతి దిగుమతి సుంకాలను సడలించి,ఆర్థిక సహాయము చేసి, ఉత్తమ బిరుదులిచ్చి అనేక విధాల నూతన రాజ్యాన్వేషణని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే పోర్చుగీసు వారు వాస్కోడ గామా నాయకత్వంలో1498 లో భారత దేశపు పశ్చిమ తీరమందున్న కోజికోడ్ లో అడుగుపెట్టారు.అక్కడ వారికి ఆగర్భ శత్రువులైన అరబ్బుల ప్రతి ఘటన ఎదురయ్యింది.అరబ్బులు అక్కడి రాజైన జామొరిన్ తో సఖ్యంగా  ఉంటూ పోర్చుగీసు వారిని కాలూనుకోకుండా చేయాలని ప్రయత్నించారు. వారిని జయించడానికి, పశ్చిమ తీరంలో స్థిరపడి వ్యాపారం కొనసాగించుకోవడానికీ, వారికి హిందూ మతావలంబులూ పశ్చిమ సముద్ర తీరం వరకూ విస్తరించిన సామ్రాజ్యాధి పతులూ అయిన విజయనగరాధీశుల సహాయం అవసరమైంది. పశ్చిమ తీర ప్రాంతమైన బత్కల్లులో గిడ్డంగిని కట్టుకోవడానికి  రాయల వారి అనుమతిని కోరితే అది అంత తొందరగా వారినుండి లభించ లేదు. ఈ లోగా 1509 లో పోర్చుగీసు నాయకుడైన అల్బూకర్కు, విజయనగరాధీశుని సామంతుడైన తిమ్మోజు అండదండలతో గోవా రేవును స్వాధీన పరచుకున్నాడు. ఆ సంవత్సరం ఒకటి రెండుసార్లు చేతులు మారినా అప్పటినుంచి దాదాపు నాలుగున్నర శతాబ్దాల పాటు(1961 లో భారత దేశంలో విలీనం అయ్యే వరకూ) గోవా ఈ పోర్చుగీసు వారి అధీనం లోనే ఉండింది.పశ్చిమ సముద్ర తీరంలో సహజమైన రేవు పట్టణం కావడంతో గోవాకి ఆ రోజుల్లో విశేషమైన ప్రాముఖ్యం ఉండేది.(మొదట్లో బిజాపుర సుల్తానుల ఏలుబడిలో ఉండిన ఈ పట్టణం ఇమ్మడి హరిహర రాయల కాలం (1375-1404)లో విజయనగర చక్రవర్తుల పాలన లోకి వచ్చింది.కానీ మళ్లా అది  విరూపాక్ష రాయల కాలంలో 1468 లో తిరిగి బహమనీ సుల్తానుల హస్తగతమై వారినుంచి 1509 లో పోర్చుగీసు వారి వశమైంది). దీనితో పాటుగా మెల్ల మెల్లగా పశ్చిమ తీర ప్రాంతంలో ఉండే కీలకమైన రేవు పట్టణాలన్నీ పోర్చుగీసువారు ఆక్రమించుకున్నారు.పాశ్చాత్య సీమలతో వ్యాపారం ఈ రేవు పట్టణాల ద్వారా ముఖ్యంగా గోవా ద్వారా జరుగుతూ ఉండడంతో మన దేశపు రాజకీయాలలో నాడు పోర్చుగీసువారి ప్రాముఖ్యత హెచ్చింది. ఆ రోజుల్లో రాజులు యుధ్ధాలలో పటిష్టమైన అశ్విక దళం ప్రాముఖ్యతను గుర్తించిన వారు కావడం వల్ల  వివిధ దేశాలనుంచి మేలురకం జాతి గుఱ్ఱాల దిగుమతి కొనుగోలు  గోవా రేవు ద్వారా జరుగుతూ ఉండేది. ఈ గోవా విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్న రోజుల్లో మూర్ లనే మహమ్మదీయ వర్తకులు అరబ్బీ పారశీక దేశాలనుంచి మేలుజాతి గుఱ్ఱాలను దిగుమతి చేసుకుని వాటిని మత పక్షపాతంతో బహమనీ సుల్తానులకు మాత్రమే విక్రయించేవారట.కొన్నాళ్లకు ఏరకం గుఱ్ఱాలనైనా విజయనగరం వారికి అమ్మడం మానివేశారట.తన రాజ్యంలో ఉండే రేవులో దిగుమతి చేసుకున్నగుఱ్ఱాలను తన శత్రురాజులకు అమ్ముతున్నారన్న కోపంతో విరూపాక్షరాయలు పది వేలమంది మూరులను చంపించాడట.ఈ ఘోరం జరిగాక బహమనీ సుల్తానులు కొంకణంపై దాడి చేసి గోవాను హస్తగతం చేసుకున్నారు. ఆతర్వాత మళ్లీ అది విజయనగరాధీశుల చేతికి రాలేదు. ఈ బహమనీ సుల్తానులనుంచే పోర్చుగీసు వారు గోవాను 1509 లో స్వాధీనం చేసుకున్నది. పోర్చుగీసువారు విజయనగరం రాజ్యాధీశులతో స్నేహ పూర్వకంగా మెసలుతూ తగిన ఒడంబడికలు చేసుకుని వ్యాపారాబివృధ్ధి చేసుకున్నారు. గోవా విజయనగరాల మధ్య రహదారులన్నీ వర్తకుల బిడారులతో తీర్థ ప్రజలాగా కిటకిటలాడేవట.వ్యాపారంతో పాటు రోమన్ కాథలిక్కు మత ప్రచారం కూడా చేస్తూ ఉండేవారు.   తూర్పు తీరం వరకూ వారి వ్యాపారాలు విస్తరించినా కొంతమంది మదరాసులోని శాంతోము , మైలా పూరుల్లోనూ నాగ పట్టణంలోనూ నివాసాలు ఏర్పరచుకున్నా, మన ప్రాతంలో వారు రాజ్యం స్థాపించుకున్న దాఖలాలు లేవు.గుంటూరు సీమ లోని  పెదగంజాము సమీపం లోని ఫరంగి దిబ్బ మాత్రం ఒకప్పుడు వీరి వాసస్థానం గా ఉండేదట.(మొదట్లో ఈ పోర్చుగీసు వారినే మనవారు పరంగీలని పిల్చుకున్నా తరువాతి కాలంలో అది ఇతర దేశస్థులందరికీ కూడా పర్యాయపదమై పోయింది).మన దేశంలో పోర్చుగీసు వారు ఏర్పరచుకున్న స్థావరాల వైశాల్యం 1500 చదరపు మైళ్లగానూ జనసంఖ్య తొమ్మిది లక్షలు గానూ ఉండేది. మన దేశం లోనే కాదు, అస్ట్రేలియా లోతప్ప ప్రపంచం నలుమూలలా విస్తరించిన పోర్చుగీసువారి వలసలలో ఆ భాష మాట్లాడే వారు ఏడెనిమిది కోట్లకు చేరింది. 12వ శతాబ్దం వరకూ తమకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం లేని పోర్చుగీసులు నౌకా వ్యాపారం చేసుకుంటూ ప్రపంచం నలుమూలలా విస్తరించి వలసలు ఏర్పాటు చేసుకోగలగడం అబ్బురపరచే విషయమేకదా?
                                       ****
ఏదో బుడకీచుల గురించి చెబుతానంటూ ప్రారంభించి ఎక్కడో ఉన్న పోర్చుగీసుల గురించి ఎందుకు చెబుతున్నావయ్యా అని మీరడగవచ్చు.అదే చెబుతున్నాను. ఈ పోర్చుగీసు వారినే  మనవారు పురతగీజులనీ పుడతకీజులనీ వ్యవహరిస్తూ ఆఖరుకు బుడతకీచులని పిలువనారంభించారు.అది సరే వీరితో మనకేమిటి సంబంధం అని కదూ మీ ప్రశ్న. అదీ చెబుతాను. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ బుడత కీచులు, వారు కాలు పెట్టిన చోట లభ్య మయ్యే కొత్త కొత్త వస్తువులను సేకరించి అవి లేని చోటికి తీసుకు పోయే వారు. ఆ రకంగానే వారు ఆఫ్రికా, పనామా, పెరూ, బ్రెజిల్, మలయా మెక్సికో,మొదలైన ప్రాంతాలనుండి రక రకములైన ఫలవృక్షాలనూ మన దేశానికి తీసుకు వచ్చారు. వీటిలో అనాస, జామి(గొయ్యా) కాబేజీ(గోబి) చిలగడదుంప, జీడి మామిడి,పొగాకు,బొప్పాయి, బంగాళాదుంప, మిరప, మొక్కజొన్న,టొమేటో,రామా ఫలం వంకాయ, వేరుసేనగ,సీతాఫలం మొదలైనవి ఉన్నాయి.బొప్పాయిని ఈ పరంగీలు తెచ్చిన గుర్తుగా కొన్ని చోట్ల దానిని  పరంగీ కాయ అని పిలవడం కూడా ఉంది. అలాగే అనాస, గోబి,గొయ్యా అనే పేర్లు బుడతకీచులనుంచి వచ్చినవే. మిగిలినవి  మనం మన భాషలో పెట్టుకున్న పేర్లు. వీటిలో చాలా మట్టుకు వారు దక్షిణ అమెరికా నుంచి తెచ్చినవే. వంకాయ వంటి కూరయు..అని మనం కవిత్వంలో కూడా పొగడుకునే  వంకాయ మనది కాదన్న మాట. తెలంగాణాలో ఆలుగడ్డ అనీ రాయల సీమలో ఉర్లగడ్డ అనీ పిలుచుకో బడుతున్న పొటాటోను మొదటగా బెంగాల్లో దిగుమతి చేసుకుని అక్కడ బాగా వేళ్లూనిన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరింపజేయడం వల్ల ఉత్తరాంధ్రలో దానిని బంగాళా దుంప అని పిల్చుకుంటున్నా అది కూడా బుడతకీచుల భిక్షే. పొగాకు, జీడిమామిడి, మిరప వేరుశెనగ వంటి వ్యాపార పంటలను మనకు తెచ్చి యిచ్చిన వారూ బుడతకీచులే. ఇవాళ మన వంటల్లో కారం కోసం విస్త్రృతంగా మిరపకాయలు వాడుతున్నా 15 వ శతాబ్దినాటికి మనకు అవేమిటో తెలియదు.అంతకుముందు వంటల్లో కారం కోసం మిరియాలనే వాడే వారం. అందుకే కొత్తగా వచ్చిన ఈ కారం కాయలను మిరియంపు కాయలనీ మిరపకాయలనీ పిలవడం మొదలు పెట్టాం.మామిడి పండ్లు మన దేశపు ఫలాలే అయినా  రకరకాల అంట్లు కట్టి కొత్త కొత్త రకాలను సృష్టించడం నేర్పించింది మాత్రం బుడతకీచులే.
మన ప్రాంతంలో వారు స్థావరాలు ఏర్పరచుకోకపోయినా తూర్పు కోస్తా వరకూ వారి వాణిజ్యం విస్తరించడంతోనూ, మత ప్రచారంకొసం వారి ఫాదిరీలు ఆంధ్ర పాంతమంతా తిరుగాడడం చర్చిలు నెలకొల్పుకోవడంతోనూ, వారి నుడులు కొన్ని మన భాషలో వచ్చి చేరాయి. అదే కాక సముద్ర ప్రయాణానికి అనువు గాని సమయాల్లో వారు పశ్చిమ తీరపు రేవుల్లో ఓడలమరమ్మత్తులు, కొత్త పడవలు  తెప్పలు కట్టుకోవడం ఇళ్లు కట్టుకోవడం వంటివి చేసేవారు.ఈ పనుల కోసం ఎందరో మనదేశస్థులు తెలుగువారు వారి వాడల్లో పనిచేయడం వల్ల కూడా వారి మాటలు కొన్ని మన తెలుగు లో వచ్చి చేరాయి. వాటిలో కొన్ని చూడండి.
ఏలము,కుంపిణీ, కోస్తా,గిడ్డంగి, గోదాము, బంకు , అల్పీ , పేనా పీపా, బాల్టీ, మేజా, సబ్బు ఇస్తిరీ , కబాయి, కమీజు, కాజా , తువ్వాలు,బొత్తాముకానా, గమేలా,(తాళం) చెవి పరంజా,బొరిగ, మేస్తిరీ, పటాలము మొదలైనవి. ఇవే కాదు ఒకనాటి పేకాటలో వ్యవహారంలో ఉండిన బేస్తు కుదేలు, తురుఫు కూడా వీరి భాషనుంచి వచ్చి చేరినవే.మా తాతగారు నా చిన్నప్పుడు తన చొక్కాని కమీజు అనే అనే వారు. కళింగ సీమ (ఉత్తరాంధ్ర) మాండలికంలో వంటయింటిని కుసిని అంటారు.ఇది మనకు బుడతకీచులనుంచి వచ్చినదే.(ఇంగ్లీషు భాషలో కూడా అన్ని రకాల వంటలూ దొరుకుతాయి అనే అర్థంలో- Multi cuisine- అని అంటారు.)
ఇదీ బుడతకీచుల కథ. వారు మన దేశం విడిచి పెట్టి వెళ్లిపోయి అర్థ శతాబ్దం గడచి పోయినా నేటికీ పశ్చిమ సముద్ర తీర ప్రాంతపు రేవు పట్టణాల్లో మరీ ముఖ్యంగా గోవా, దయ్యు, దమన్ వంటి ప్రదేశాల్లో వారి సంస్కృతీ  పరిమళాలు ఇంకా కొంచెమైనా గుబాళిస్తూ ఉన్నాయి.
                                                   *****  
(నా ఈ పోస్టుకి కీ.శే.శ్రీ తూమాటి దొణప్ప గారి వ్యాసం ప్రధానాధారం కాగా, కీ.శే. ఆరుద్ర గారి సమగ్ర ఆంధ్ర సాహిత్యంనుంచి కూడా కొంత సమాచారం సంగ్రహించాను. వారిరువురకూ నా కృతజ్ఞతలు.)
                                                 *****