10, జనవరి 2013, గురువారం

ససేమిరా..ససేమిరా.. ఏమిటీ ససేమిరా కథ ?


ససేమిరా..కథ..ఏమిటీ ససేమిరా?
ఆ మధ్య వచ్చిన ఒక సినిమాకి టాగ్ లైన్ చిత్రంగా ఉంది. ఆ సినిమా పేరు సీతయ్య. టాగ్ లైన్ ఏమో..ఎవరి మాటా వినడు.. ఈ సినిమా వచ్చేక మా వాళ్ళలో ఎవరైనా మొండిగా ఎవరి మాటా వినని వాడిని వాడో సీతయ్య అనడం ప్రారంభించేము. మరి ఈ సినిమా రాకముందు ఆంధ్ర దేశంలో ఎవరైనా తన మాట తప్ప వేరొకరి మాట వినని వారిని ససేమిరా గాళ్లనే వారు. ఇంతకీ ఈ ససేమిరా ఏమిటి? దీనర్థం ఏమిటి?  ఇది ఎలా వాడుకలోకొచ్చింది? అంటే దీనికి చాలా పెద్ద కథుంది. అది చెబ్తాను. కొంచెం ఓపిగ్గా వినండి మరి.

పూర్వం విశాల అనే నగరాన్ని నందుడనే రాజు పాలిస్తూ ఉండేవాడట. అతని ఏకైక కుమారుని పేరు విజయపాలుడు.అతడు కడు దుర్మార్గుడు. అతడొక నాడు వేటకు పోయి కారడవి లో వేటపందిని తరుముతూ  అలసిపోయి ఒక చెరువు గట్టున  విశ్రమిస్తాడు.ఇంతలో అక్కడికి ఒక బెబ్బులి గాండ్రించుకుంటూ వస్తుంది. అతడి గుర్రం కట్టు తెంచుకుని పారిపోతుంది. అతడు పరుగెత్తి దగ్గర్లోని ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు.అంతకు ముందే ఆ చెట్టు మీద ఒక ఎలుగ్గొడ్డు ఎక్కి కూర్చుంది. కిందికి దిగి పారి పోదా మంటే పెద్దపులి అక్కడే మాటు వేసి కూర్చుంది. భయంతో వణుకుతున్న రాజకుమారుణ్ణి చూసి ఆ ఎలుగ్గొడ్డు ప్రాణ భయంతో తన వద్దకు వచ్చిన వానిని తాను చంపనని అభయమిస్తుంది. రాజకుమారుడు మనసు కుదుటపడిన వాడై, అలసిపోయి ఉన్నాడు కనుక అక్కడే చెట్టు కొమ్మమీదే నిద్ర కుపక్రమిస్తాడు.అతడు పడిపోకుండా ఎలుగ్గొడ్డు కాపలా కాస్తుంటుంది.
చెట్టు కింద నున్నపులి  రాజకుమారుడు నిద్ర పోవడం చూసి, ఎలుగ్గొడ్డుతో మనం మనుష్యులను నమ్మ వచ్చా అందులోనూ  ఈ మనిషి మహా మోసగాడులా ఉన్నాడు.ఎంతైనా మనం మనం ఒకటి. ఈ అడవిలో పుట్టి పెరిగిన వాళ్లం. కలసి బతకాల్సిన వాళ్లం. అతడ్ని కిందికి తోసేయి. చంపి చెరిసగం పంచుకు తిందాంఅన్నాది.ఎలుగ్గొడ్డు దానికి ఒప్పుకోక పోవడంతో పులి అలాగే చెట్టుకిందే తిష్ట వేసి కూర్చుంది.
కాసేపటికి రాజకుమారుడికి తెలివి వచ్చింది.ఎలుగ్గొడ్డుకి రాజకుమారుని మనసు పరీక్షించాలని బుధ్ధి పుడుతుంది. రాజకుమారుడితో ఇంతసేపు నేను నీకు కాపలా కాసేను. ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది.నీ తొడమీద కాసేపు విశ్రమిస్తాను అంటుంది.రాజకుమారుడు సరేనంటాడు.ఎలుగ్గొడ్డు అతడి ఒళ్లో తల పెట్టుకుని నిద్ర నటిస్తుంది. ఇది చూసిన పులి అతడితో ఎలుగ్గొడ్డుని ఎవరైనా నమ్ముతారా.. అది నేను వెళ్లి పోయిన తర్వాత నిన్ను చంపి తింటుంది.నా మాట వినిదానిని కిందకు తోసేయి. దానిని చంపి తినేసి నేను వెళ్లి పోతాను. ఆ తర్వాత నువ్వూ  హాయిగా వెళ్ళి పోవచ్చు అంది. దుర్మార్గుడైన  రాజకుమారుడు విశ్వాసం లేకుండా ఎలుగ్గొడ్డుని కిందకు తోయబోతాడు, కాని నిజంగా నిద్రపోని  ఆ ఎలుగు చెట్టు కొమ్మని పట్టుకుని ఉండడంవల్ల కింద పడకుండా ప్రాణాలు దక్కించుకుంటుంది.ఇంతలో తెల్లవారిపోవడంతో పులి నిరాశతో వెళ్లి పోతుంది. రాజకుమారుడింక తనకు చావుమూడిందనే అనుకుంటాడు, కాని  మంచిదైన ఆ ఎలుగ్గొడ్డు అతనితో నిన్ను చంపను, కానీ నీకు  తగిన శాస్తి జరగాలి. కనుక నీద్రోహ బుధ్ధి జనానికి తెలిసేంత వరకూ పిచ్చి వాడిలా ససేమిరా.. ససేమిరా..” అంటూ ఈ అడవిలో తిరుగుతూనే ఉండు. నీ ద్రోహ బుధ్ధి ఎవరైనా బట్టబయలు చేసి నప్పుడు నీకు శాప విముక్తి కలుగు తుంది.అంటూ శపించి అతనిని వదలి వెళ్లి పోతుంది. విజయపాలుడు ఆ అరణ్యంలోనే ససేమిరా.. ససేమిరా అంటూ పిచ్చి వాడిలా తిరుగుతూ ఉంటాడు.
రాజకుమారుడు వేటకై ఎక్కి వెళ్ళిన గుర్రం తిరిగి వచ్చినా రాజకుమారుడు రాక పోవడంతో కలవర పడ్డ రాజు గారు వానికోసం వెతికించి అడవిలో పిచ్చివానిగా తిరుగు తున్న తన కుమారుణ్ణి నగరానికి తీసుకు వస్తాడు.
ఎన్ని రకాల వైద్యాలు చేయించినా, ఎందరికి చూపించినా రాజకుమారుడు ససేమిరా అంటూ పిచ్చివాడిగానే మిగిలి పోతాడు. అప్పుడు ఆ దేశపు మంత్రిగారికి  ఈపిచ్చిని కుదర్చగల శక్తి వారి రాజగురువైన శారదా తనయునికి మాత్రమే ఉందని చెప్పి, వారిని బ్రతిమాలుతాడు. ఆ రాజగురువు తన దివ్యదృష్టితో అడవిలో జరిగిన దంతా గ్రహించిన వాడై, రాజ సభలో అందరి ముందరా,  ఆ అడవిలో జరిగిన సంఘటనను సూచించే పద్యాలు ఇలా  చదువుతాడు. మొదటి పద్యం-
సజ్జన భావము కల్గు సు
హృజ్జనులను మోసపుచ్చుటది నేరుపె నీ
పజ్జం దొడపై గూర్చిన
యజ్జంతువు జంప జూచుటది పౌరుషమే?
ఈ పద్యం వినగానే రాజకుమారుడు ససేమిరాలో వదిలేసి సేమిరాఅని మాత్రం అంటుంటాడు.
రాజగురువు చదివిన రెండవ పద్యం-
సేతువు దర్శింప మహా
పాతకములు బాసి పోవు, బ్రాణ సఖునకున్
ఘాతుకమతి నొనరించిన
పాతకమే తీర్థ సేవ బాయునె నరునిన్?
ఇది విన్నాక రాజకుమారుడు  సేమిరా లో సే వదిలేసి మిరా అని మాత్రం అంటుండేవాడు.
రాజగురువు చదివిన మూడవ పద్యం-
మిత్రద్రోహి, కృతఘ్నుడు,
ధాత్రీసుర , హేమ తస్కరుడు, సురా
పాత్రీ భూతుడు, నిందా పాత్రులు  వీరెల్ల నరక భవనా వాసుల్.
ఇదీ విన్నాక విజయ పాలుడు రా..రా ..”  అని మాత్రమే  అంటుండే వాడు.
రాజగురువు చదివిన చివరి పద్యం-
రాజేంద్ర  విజయపాలుని
రాజిత శుభ మూర్తి జేయ రతిగల దేనిన్
పూజార్హుల వీరెల్లర
బూజింపు మనూన దాన భోజన విధులన్.
స..సే..మి..రా.. అనే మొదటి అక్షరాలతో ప్రారంభమయ్యే ఈ నాలుగు పద్యాలూ వినగానే రాజకుమారునికి శాపం తొలగి పోయి తన పూర్వస్మృతి కలిగి అరణ్యం లో జరిగినది అందరికీ వివరిస్తాడు. ఈ కథ జక్కన వ్రాసిన విక్రమార్క చరిత్రం లోనిది. అంటే చాలా పాతదన్న మాట.
నేటి యువతరం కోసం, భాష లోని నుడికారం వల్ల కలిగే ప్రయోజనమేమిటో చెప్పి ముగిస్తాను.ఎవరైనా ఒక మొండి మనిషికి ఏదైనా విషయం వివరించి వానిని ఒప్పించి రమ్మని ఎవరినైనా పంపించామనుకోండి. అతడు తిరిగి వచ్చాక ఏం జవాబు చెప్పాడని  అడిగితే  ససేమిరా అంటున్నాడని అంటే,  జరిగిన దేమిటో  ఎన్నో మాటల్లో చెప్పనక్కర లేకుండా మనకి పూర్తి గా అర్థమై పోతుందికదా? భాషకి జీవమైనటువంటి ఇటువంటి నుడులు క్రమేపీ భాషలోంచి జారిపోతుండడం మన దురదృష్టం.
సెలవు.