11, ఏప్రిల్ 2013, గురువారం

జారి పోయిన వింత అక్షరం కథ...






ఆ మధ్య డిశంబరు లో నేను వ్రాసిన ఎవరీ బుడతకీచులు అనే పోస్టులో పోర్చుగీసు వారు మన దేశంలో మొదటగా పశ్చిమ సముద్ర తీరం లోని కోజి కోడ్ లో మొదటగా కాలూనేరని వ్రాసేను. అది చదివిన మన అజ్ఞాత బ్లాగ్మిత్రుడొకరు దానిని కోజి కోడ్ అని కాదని కోళి కోడ్ అని వ్రాయాలని మళయాళీయులు అలాగే పలుకుతారని సూచించారు. దానికి నేను మళయాళీయులు దానిని ఉచ్చరించే విధంగా వ్రాయడానికి మన తెలుగు లిపి లో సరైన అక్షరం లేదనీ, ఇంగ్లీషులో దానిని KoZhikode అని వ్రాసినట్లే మన తెలుగు వారు కూడా కోజి కోడ్ అని వ్రాస్తున్నారని, కీ.శే. శ్రీ తూమాటి దొణప్ప గారు కూడా అలాగే వ్రాసేరని, నేను అదే అనుసరించాననీ వివరించాను. తమిళంలో కూడా ఇలాంటి ఉచ్చారణ కలిగిన శబ్దాన్ని మన వాళ్లు తెలుగులో జ అనే అక్షరంతోనే సూచిస్తున్నారు. నిజానికి తమిళ భాష లోని కజగం చెజియన్ అనే పదాలు వారు ఉచ్చరించే రీతిలో వ్రాయడానికి మనకి సరైన అక్షరం లేదు. అది ళ కాదు ఝ కాదు డ కాదు. ఆ ధ్వని వింత గా ఉంటుంది. అందు కనే కాబోలు సరదాగా మన ఆరుద్ర గారు

తమల పాకులు నములు
దవడతో మాట్లాళు
తానె వచ్చును తమిళు ఓ కూనలమ్మా అన్నారు.
నోటినిండా తాంబూలం వేసుకుని నములుతూ మాట్లాడితే మన తెలుగైనా తమిళం లాగే వినిపిస్తుంది మరి. సరే, వాళ్ల భాష వాళ్లకిష్టమొచ్చిన రీతిలో మాట్లాడుకుంటారు కాదనడానికి మనమెవరం? కానీ ఇక్కడే ఒక అనుమానం వస్తుంది. మన తెలుగున్నూ, సోదర భాషలైన తమిళం, మళయాళం, కన్నడం కూడా ఒకే కుదురులోని మూల ద్రావిడ భాష నుంచి పుట్టినప్పుడు, ఈ వింత ధ్వనిని సూచించే అక్షరం మళయాళ తమిళ భాషల్లో ఆ భాషలు పూర్తిగా వేరయిన తర్వాత వచ్చి చేరిందా? లేక మూల ద్రావిడ భాష నుంచే ఆ భాషల్లోకి వచ్చి చేరి నేటికీ నిలచి ఉందా? అలా వచ్చి ఉంటే మన తెలుగు లోకి రాకుండా ఉండి ఉంటుందా? వచ్చి ఉంటే ఇప్పుడదేమయ్యింది? వచ్చిందండీ వచ్చింది. మన తెలుగు లోకీ వచ్చింది. దాని కథే నేనిప్పుడు చెప్పబోయేది.
తమిళ మళయాళ భాషల్లో ఉన్న ఈ వింత ధ్వనిని సూచించే అక్షరం ఆ భాషల్లాగే మన తెలుగు లోకీ, మన సోదర భాష అయిన కన్నడం లోకీ కూడా వచ్చి చేరింది. ప్రాచీన కన్నడంలో ఉండి తరువాత ఆభాషలో మాయమైంది. అలాగే మన తెలుగులో కూడా దాదాపు నన్నయ గారి కాలం వరకూ ఉండి ఆ తర్వాత పూర్తిగా మాయమైంది. నన్నయకు పూర్వపు శిలా శాసనాల్లోనూ, నన్నయ తర్వాత కాలంలో కొన్ని శిలా శాసనాల్లోనూ ఇది మధ్య లో గీత లేని మన బండిరా “ ఱ ” రూపంలో కనిపిస్తోంది. ఇది ఏ విధంగా ఉచ్చరించే వారో తెలుసు కోవడానికి అప్పటి ఉచ్చారణ రికార్డు లేదు కానీ అది కనిపించిన పదాలను బట్టి వాటిని నేడు మనం ఉచ్చరిస్తున్న తీరును బట్టి ఊహించుకోవచ్చు.ఆ అక్షరం స్థానంలో నేడు వివిధ పదాల్లో డ,ద,ళ,ల,ర,ఱ లు వచ్చి చేరాయి కనుక ఈ శబ్దాల మధ్యలో ఏదో ధ్వనితో ఉచ్చరించే వారని ఊహించ వచ్చు.

డా. కాల్డ్వెల్ మహాశయుడు దీనిని ఇంగ్లీషులోని rzh అనే అక్షరాలు కలిపి పలికితే వచ్చే ధ్వనిగా ఉచ్చరించేవారని అన్నాడు. కన్నడ భాషలో ఇప్పుడు లేక పోయినా పాత కన్నడంలో ఉన్న ఈ అక్షరాన్ని వారు “రళ ” మని అంటారుట. తెలుగులో ఇది వెయ్యేళ్లకు పూర్వమే అంతరించి పోవడం వల్ల మన వైయాకరణులు దీనికే పేరూ పెట్టకుండా వింత అక్షరమని మాత్రం వ్యవహరిస్తూ వస్తున్నారు. పూర్వం ఈ అక్షరంతో ప్రారంభమయ్యే ఱెందులూరే నేటి మన దెందులూరు. కోఱి..అన్నదే కోడి గా మారింది. చోఱ అన్నది చోళగా మారింది. ఆ విధంగా ఆ వింత అక్షరం నన్నయనాటికే డ,ద,ళ,ల,ర,ఱ లలో ఏదో ఒక ధ్వనిగా మారి స్థిర పడుతూ వచ్చింది.నన్నయ తన భారతంలో ఈ అక్షరాన్ని ఉపయోగించక పోవడం వలన, ఆ తరువాత కొద్ది శిలా శాసనాల్లో మాత్రమే ఇది కనిపించడాన్నిబట్టి చూస్తే, ఇది కనీసం ఏ ఎనిమిది తొమ్మిది వందల సంవత్సరాల క్రిందటే మన వర్ణ మాల నుంచి జారి పోయిందని తెలుస్తోంది.అదీ ఈ వింత అక్షరం కథ. ఇలాగే కాలగమనంలో మన వర్ణమాలనుంచి జారి పోయిన, పోతున్న మరికొన్ని అక్షరాల గురించి మరోసారి ముచ్చటించుకుందాం.


బ్లాగ్మిత్రులందరికీ విజయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలతో —సెలవు. విజయ ఉగాది.11.4.13.