6, మే 2013, సోమవారం

చెప్పు దెబ్బలూ... పూల దండలూ...



మన ప్రవర్తనను బట్టే మనకు లోకంలో లభించే గౌరవాభిమానాలు ఉంటాయి. ఈ విషయాన్ని తేటతెల్లం చేసే ఉదంతాలు రెండు,, చాలా కాలం క్రిందటివే అయినా నాకు బాగా గుర్తుండి పోయాయి. అవేమిటో మీకు మనవి చేస్తాను.
                                                       ***    
 చాలా  కాలంక్రిందటి సంగతిది. ఎప్పుడో ఏవో మాటల్లో మా తమ్ముడు ఈ విషయం నాకు చెప్పాడు. అప్పట్లో వాడు సాలూరు జూనియర్ కళాశాల హైస్కూల్లో తెలుగు పండితునిగా పని చేస్తూ ఉండే వాడు. ఒక సారి ఏదో పని మీద దగ్గరలోని రామభద్ర పురం అనే ఊరు వెళ్లి అక్కడి డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వారి ఆఫీసులో ఆ ఇనస్పెక్టరు గారితో పరిచయం ఉండడం వల్ల వారితో పిచ్చాపాటీ మాటలాడుతూ ఉన్నాడట. అది మండు వేసవి కాలం. మధ్యాహ్నం రెండూ.. మూడు.. గంటల సమయం. ఎండ మండి పోతూ ఉందట. అదిగో అలాంటి మండుటెండలో ఒక ఆసామీ ఉస్సురుస్సురంటూ ఆ ఆఫీసుకి వచ్చి  గదిలో మా తమ్ముడూ ఇన్స్పెక్టరు గారూ మాటలాడుకుంటూ ఉండడం చూసి బయటి వరండాలోనే బెంచీ మీద కూర్చున్నాడట.ఆ వ్యక్తి రావడం గమనించినా ఎంత సేపటికీ ఆ ఇన్స్పెక్టరు ఎందుకు వచ్చారని అడగడం కాని పలకరించడం కాని చేయక పోవడంతో  కాసేపటికి మా తమ్ముడే కలుగ జేసుకుని ఎవరో మీ కోసం వచ్చి   ఉన్నట్లుంది అన్నాడట. ఆ సమయం చూసుకొని నమస్కారం బాబూ అంటూ ఆ వ్యక్తి లోపలకు ప్రవేశించాడట. అప్పటికి     తప్పని సరై ముఖానికి కాస్త సీరియస్ నెస్ పులుముకొని ఏమిటిలా వచ్చేరు అని ఆ వ్యక్తినడిగాడట ఆ ఇన్స్పెక్టరు గారు. ఆ వ్యక్తి అదేనండి నా కాగితం గురించి.. అంటూ వినయంగా నిలబడ్డాడట. అదాఅదింకా రాలేదయ్యా.  హైదరాబాదు నుంచి రావాలి కదా? వచ్చినప్పుడు వస్తాయి తాపీగా... అక్కడ అందరూ మనలాగా పని చేస్తారనుకున్నావా ఏమిటి ?” అన్నాడట. అది విని హతాశుడైన ఆ వ్యక్తి  ఎలాగో ఏమిటో వచ్చే నెలలో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను కూడాను..వస్తాను బాబూ.. అనుకుంటూ అక్కడినుండి వెళ్ళి పోయాడట. ఆయన అటు వెళ్లగానే, ఆ ఇనస్పెక్టరు మా తమ్ముడితో  “..... ఊళ్లో మేస్టరండీ ఆయన. తన ప్రావిడెంటు ఫండు అకౌంటు స్లిప్పు కోసం వచ్చాడు. ఇంతకు ముందు కూడా వచ్చాడు లెండి అన్నాడట. అప్పుడు మా తమ్ముడు ఆ స్లిప్పులు ఎప్పుడొస్తాయో ఏమో. పాపం అది జత చేస్తే గాని ప్రావిడెంటు ఫండు లోను తీసుకోవడానికి వీలు పడదు కదా?” అన్నాడట. అప్పుడా ఇనస్పెక్టరు వచ్చింది లెండి. ఇదిగో వచ్చి పది రోజులయ్యింది.  అంటూ తన  డ్రాయరు సొరుగు లోంచి  కాగితం తీసి చూపిస్తూ వస్తే మాత్రం రాగానే ఇచ్చేస్తామటండీ. తిరగనివ్వండి.ఒకటికి రెండు సార్లు తిరిగితే కాని వీళ్ళకి మన విలువ బోధ పడదు అన్నాడట నవ్వుతూ. మా తమ్ముడు తనకది దుమ్మరి గుండు నవ్వులా అనిపించిందనీ ఆ అమాయిక బడి పంతుల్ని బాధ పెట్టడంలో ఆ ఇనస్పెక్టరు కొచ్చిన పైశాచికానందం ఏమిటో తనకు బోధ పడలేదనీ, అయినా అది తనకు సంబంధించిన విషయం కాదు కనుకనూ అప్పటికే ఆ బడి పంతులు వెళ్ళి పోయాడు కనుక బాధ పడడం తప్పితే తానేమీ చేయలేక పోయానని  చెప్పాడు. ఇదిలా ఉంటే మరో ఉదంతం వినండి.
                                                            ****
దాదాపు 40 ఏళ్ళ క్రిందట 1975 లో జరిగిందిది. సంవత్సరం సరిగా ఎలా చెప్పగలిగా నంటే అప్పట్లో నేను ఇల్లు కట్టించుకుంటూ ఉండే వాడిని. దానికోసం ఎక్కువగా సెలవులో ఉండేవాడిని.ఒక సారి మధ్యలో ఇంటి పని లేనప్పుడు సెలవు వృథా ఎందుకని ఆపీసులో చేరితే మళ్లా ఎలాగూ సెలవులో వెళ్తానని చెప్పి మా వాళ్లు నాకు రెగ్యులర్ పోస్టింగు ఇవ్వకుండా  ఒక స్పెషల్ సెల్ లో వేసారు.అదీ ప్రావిడెంటు ఫండుకు సంబంధించినదే. మామూలూగా రిటైర్ అయిన వారికి ఇబ్బంది లేకుండా వారి వారి ఖాతాలలో జమ ఉన్న మొత్తాన్ని వారికి చెల్లించడానికి ఆధరైజేషన్ వెంటనే ఇస్తారు.  తరువాత  వారికి సంబంధించిన సొమ్ము  వారి ఖాతాలలో జమ కాకుండా ఉండిపోయిన మొత్తాలు ఎక్కడెక్కడున్నాయో వెతికి  వాటిని వారి ఖాతాకు జమ చేసి తర్వాత విడుదల చేస్తారు.ఇదిగో ఇలాంటి పనే నాకు ఇద్దరు అసిస్టెంట్లనిచ్చి అప్పగించారు. అలా పని చేస్తున్నప్పుడు ఒక రోజు  సాయంత్రం నాలుగు గంటల సమయం లో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి తాను విద్యా శాఖలో పని చేస్తున్నానని పలానా జిల్లానుంచి వచ్చానని తన ప్రావిడెంటు ఫండు అకౌంటు స్లిప్పు తనకందలేదనీ ఎవరిని కలవాలో అంటూ అడిగాడు. ఆ రోజు నా వద్ద పని చేస్తున్న ఇద్దరు అసిస్టెంట్లు కూడా ఏదో కారణంతో సెలవులో ఉన్నారు. ఒక్కడినే అప్పటికి రెండు గంటలనుండీ కదలకుండా  తదేక దీక్షతో  పని చేసుకుంటున్నాను.అలా కదలకుండా ఒకే భంగిమ లో ఎక్కువ సేపు కూర్చుంటే వెన్ను నొప్పి లాంటివి వస్తాయని వైద్యులు అంటారు కనుక ఓ అయిదు నిమిషాలు విశ్రాంతి ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి చేస్తున్న పని ఆపి ఆయనను నాతో రమ్మని పక్క సెక్షనుకి వెళ్లాను.ఆ బ్రాంచిలో రెగ్యులర్ గా పని చేస్తున్న వాణ్ణి కాను కనుక  విద్యాశాఖలో ఆ జిల్లాలో  పని చేసేవారి అకౌంట్లు ఏ సెక్షనులో ఉంటాయో తెలుసుకున్నాను..అంత పెద్ద ఆఫీసులో ఆ సెక్షను ఎక్కడుందో తెలియదు కనుక వారినే అడిగి తెలుసుకుని ఆయనను అక్కడికి తీసుకు వెళ్లాను. ఆ సెక్షనాఫీసరు నన్ను గుర్తు పట్టి   “ఏమిటిలా వచ్చారు సార్అని అడిగాడు. నేను నాతో వచ్చినాయనను చూపించి ఆయనకు కావలసిన సాయం చేయమని చెప్పి తిరిగి నా సీటుకు వచ్చి పని చేసుకుంటున్నాను. ఓ పావుగంట తర్వాత ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి “Many many Thanks Sir, May God Bless you and your Family. ఆ ఏసు ప్రభువు మిమ్మల్ని కలకాలం రక్షించు గాక..God Bless you..God bless you.. అని రెండు చేతులూ ఎత్తి దీవించాడు. నేను ఆయనకు చేసిన సాయం చిటికెన వేలు గోరంతైనా లేకపోయినా ఆయన అలా అంటుంటే నాకు సిగ్గేసి అంతగా ఏముంది లెండి. నేను రాక పోయినా మీరు ఎలాగో వెళ్లి మీ పని చేసుకో గలిగేవారు కదా అన్నాను.. దానికాయన నా పని అవడం కాదు సార్. ఎదుటి వాడికి ఎంతో కొంత మనకు చేతనైనంత సాయం చేయాలనే మీ అభిలాషను అభినందిస్తున్నాను సార్ అని వెళ్లి పోయాడు. ఆ వ్యక్తి తిరిగి వెళ్లాక తనకు తెలిసిన వారికి     “ఏ జీ ఆఫీసులో అంతా మంచి వారేననీ , మర్యాదస్తులనీ, అందరికీ సాయం చేస్తారనీ  చెప్పి ఉంటాడనడంలో నాకు ఏ మాత్రం అపనమ్మకం లేదు.
                                                     ***  
మనం చేసే పనులు అవి ఎంత చిన్నవైనా మనకీ, మనం పని చేసే సంస్థకీ మంచి పేరో చెడ్డపేరో తెస్తాయి.ఈ విషయం గుర్తుంచుకుని మసలుకోవాలి.ఎవరికైనా మనం చేయగలిగిన సాయం చేయాలి. ఒకప్పుడు సాయం చేయలేక పోయినా  నవ్వుతూ మాట్లాడాలి. ఎందుచేత వారికి సాయం చేయలేక పోతున్నామో చెబితే వారు మనం సాయం చేసినంతగా పొంగి పోతారు. వారి పని మనం చేయలేదే అని బాధ పడరు. జీవితంలో ఇటువంటి దృక్పథం కలిగి ఉంటే మనం ఉన్న ప్రదేశమే నందన వనం అవుతుంది. మనకు లభించేవి చెప్పు దెబ్బలో పూల దండలో మన ప్రవర్తనే నిర్ణయిస్తుంది.
                                                                        ***