3, జులై 2013, బుధవారం

జగమే మాయ...


జగమే మాయ.. బ్రతుకే మాయ.. అంటాడు మన దేవదాసు. ఊరికే అనడం కాదు. వేదాల్లోని  సారా  న్నంతా త్రాగేసి జీర్ణించుకోని చెబ్తున్నానంటాడు. ఈ పాట పాడుతున్నప్పుడు అతడు ఒక వీధి లాంతరు క్రీనీడలో చెత్త కుండీ ప్రక్కన మాసిపోయి చిరిగి పోయిన బట్టలేసుకుని ఉంటాడు.జమీందారు బిడ్డడు.  భోగ బాగ్యాలు అనుభవిస్తూ హంసతూలికా తల్పాలమీద పవ్వళించాల్సిన వాడు ఇలా వీధిలో మురుగు కాల్వ ప్రక్కన—తన ప్రక్కనున్నది  తన ప్రేయసి పార్వతో వీధి కుక్కో తెలియని స్థితిలో ఉన్నాడు. కడుపు లో చుక్క పడితే వేదాంతం తన్నుకొస్తుందేమో? మరి వేదాంతులకి హంస తూలికా తల్పాలూ, కుళ్ళు కాలువలూ ఒకటే కదా? వారి దృష్టి లో అంతా మాయే కదా ? ఇది త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన  ప్రేలాపన అని సరి పెట్టుకుందాము. కానీ మన అద్వైత పండితులేమన్నారు? ఈ చరాచర సృష్టి మొత్తం మాయే అనలేదా?  కనిపించనివి సరే. కళ్ళముందర కనిపిస్తూ స్పర్శకి  తగులుతూ ఉండేవి కూడా మాయే అంటారు కదా?అంత స్ఫష్టంగా కనిపిస్తున్నవి నిజం కాదని నమ్మడమెలా? ఎలాగంటే మనం కలకంటున్నంత సేపూ అన్నీ మనకు నిజమే. కలలో బాధలూ సుఖాలూ కూడా అనుభవిస్తాము.నవ్వులూ, ఏడుపులూ, కోపాలూ, ఒకటేమిటి  జాగ్రదవస్థలో ఉన్నవన్నీ కలలో కూడాఉంటాయి. కాని కల నిజం కాదుగా? మెలకువ వచ్చిన మరుక్షణం అది మన కలే అని మాయే అని తెలిసి పోతుంది. కాని స్వప్నావస్థలో ఉన్నంత సేపూ అది మనకు నిజమే కదా? అందు చేత కళ్ళకు కనపడేదంతా నిజమే  అనుకో నక్కరలేదు కదా? కలల సంగతి సరే, మనం జాగ్రదవస్తలో చూస్తున్నదంతా కూడా కల లాంటి మాయే అంటారే  అద్వైతులైన వేదాంతులు. కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే అని పాడుకుంటూ ఉండి పోవాలేమో? 
 అద్వైతుల ప్రస్తావన వచ్చింది కనుక ఈ పిట్టకథ చెబుతాను వినండి:
.
రాజులు రాజ్యాలేలే రోజుల్లో ఒక ఊళ్లో ఒక పండితుల వారు అందరికీ అద్వైతం బోధిస్తూ ఉండేవాడట.ఈ అద్వైతం తలకెక్కించుకున్న ఆ వూళ్లోని చాలా మంది ఏది శాశ్వతం లే అనుకుంటూ పనులు మానుకుని ఆయన చుట్టే తిరుగుతూ ఉండే వారట.  ఇలా గైతే తన రాజ్యం ఎందుకూ పనికి రాకుండా పోతుందనిపించిన ఆ ఊరి రాజుగారు  కోపం తో ఒక మదించిన ఏనుగుని వాళ్ళమీదికి ఉసిగొల్పాడట. అది రావడం అల్లంత దూరం లోనే చూసిన మన అద్వైతుల వారు అందరి కంటే ముందే పుంజాలు తెంపుకొని పరుగు లంకించు కున్నారట. ఆ తరువాత పరిస్థితిని చక్కదిద్దిన రాజుగారు పండితుల వారిని పిలిచి " ఏనుగు రావడం మాయే కదా, ఎందుకు భయపడ్డావయ్యా ? " అని అడిగితే అతడు చెప్పిన సమాధానం చూడండి :
నేను బోధించే అద్వైతం నిజమే. ఏనుగు రావడం మిధ్యే. అలాగే నేను పరుగెట్టి పారిపోయానన్నది కూడా మిధ్యేనన్నాడుట. దీనికి బదులేముందిదీనినే మనవాళ్లు గజం మిథ్య.. పలాయనం మిథ్య..అంటారు.

వేదాంతులే కాదు సామాన్యులు కూడా అప్పుడప్పుడూ .. అంటే ఏ ప్రసూతి వైరాగ్యమో.. స్మశాన వైరాగ్యమో కలిగి నప్పుడు .. అన్నమైతే నేమిరా.. మరి సున్నమైతే నేమిరా అనుకుంటూనే.. కానీ అన్నమే తిందామురా..అని సెటిలైపోతారు. స్మశాన  వైరాగ్యమనగానే నాకు కాటి సీనులోని హరిశ్చంద్రుని ఈ క్రింది  
పద్యమే గుర్తుకొస్తుంది

" మాయామేయ జగంబె నిత్యమని సంభావించిమోహంబునన్
  నాయిల్లాలని నా కుమారుడని  ప్రాణంబుండునందాక ఎం
  తో అల్లాడిన ఈ శరీరమిపుడిందున్ కట్టెలన్ కాలుచో
  ఆ ఇల్లాలును రాదు, ఆ కుమారుడును రాడు తోడై..."  వాపోతాడు
.
 ఇక్కడే నాకు అర్థం కాని విషయం ఒకటుంది. మనకు కనిపించని ఆ పరమాత్మ ఒక్కడే సత్యమని, ఈ చరాచర ప్రకృతి యావత్తూ అసత్యమని నమ్మిన వాడైతే, ఒక్క అబధ్ధం ఆడితే తప్పేమిటట? పెళ్ళాన్నీ, పిల్లాడినీ అమ్ముకోవలసిన దుర్గతీ తప్పేది, తనకీ వారికీ ఈ కష్టాలూ తప్పేవి కదా? సృష్టే అసత్యమైతే మాట సత్యమెలా అవుతుంది ? అదీ కాక బొంకడం తప్పుకాదని చెప్పిన సందర్భాలు, బొంక రాని సమయాలకంటె  వెయ్యి రెట్లు ఎక్కువ కదా.( చూ. వారిజాక్షులందు...) .ఈ జగత్తంతా మాయ అని హరిశ్చంద్రునికి కాటి సీను లోనే గుర్తొచ్చిందనుకోవాలి)
                                                     ***

చుక్క ఎక్కువైన దేవదాసు అంతా మాయే అన్నా.. చుక్కేసుకుని కవిత్వం చెప్పే మన మహాకవి మాత్రం స్థిమితం కోల్పో లేదు.
 మాయంటావా.. అంతా మిథ్యంటావా.. నా ముద్దుల వేదాంతీ..  లోకం మాయంటావూ..జమీందారు రోల్సు కారు,, మహారాజు మనీ పర్సు.. మర ఫిరంగి.. విష వాయువు.. పాలి కాపు నుదుటి చెమట.. కూలి వాని గుండె చెరువు.. బిచ్చగాని కడుపు కరువు.. తుఫానులూ.. భూకంపం.. తిరుగు బాట్లు.. సంగ్రామం... ఇవన్నీ మాయేనా? ఏయ్ నా ముద్దుల వేదాంతీ ఏమంటావు? ” అని నిలదీసి గద్దించాడు. ఏమనగలం ?

ఇంతకీ నేను ఈ పోస్టు వ్రాయడం.. మీరు చదవడం.. కూడా  మాయేనా?

  ఏది సత్యం ?  ఏదసత్యం?  ఓ మహాత్మా !  ఓ మహర్షీ !