4, మే 2014, ఆదివారం

అయిదు మార్కుల తమాషా కథ




ఇదేమో నిజంగా జరిగిన కథ. నాకు చాలా తమాషాగా అనిపించింది. మీరూ వినండి. సరదాగా ఉంటుంది. కథంతా విన్నాక ఎక్కడ జరిగిందో చివర్లో చెబుతాను.
                                           *****
ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ ఇంట్లోకి ప్రవేశించడం వాళ్ళ నాన్న చూసేడు. ఆయనో పెద్ద మోతుబరి రైతు. 200 ఎకరాల ఆసామీ. చిన్నప్పుడు అమరము, బాల రామాయణము, పెద్ద బాలశిక్ష దాకా చదువుకున్నాడు. ఏడుస్తున్న కొడుకును కారణం అడిగితే తనకు  కేవలం అయిదు మార్కులు తక్కువ వచ్చినందున  పరీక్ష  ఫెయిల్  చేశారని  చెప్పాడు. వాడిని కాసేపు సముదాయించి, ఛర్నాకోల తీసుకుని తానే స్వయంగా గుర్రం బండి తోలుకుంటూ స్కూలు చేరుకుని ఎక్కడయ్యా హెడ్మాస్ట్రుఅంటూ ఒక గావుకేక పెట్టాడు. ప్యూను దారి చూపించగా హెడ్మాస్టరుగారి రూము చేరుకుని బయటే నిలబడి ఏవఁయా హెడ్మాస్ట్రూ..ఐదు మార్కులు..అనావస్యం ( అంటే After all అని అర్థంట) ఐదు మార్కులు తక్కువొస్తే మావాణ్ణి ఫెయిల్ చేశావట? అని గట్టిగానే అడిగాడు.( లేక అరిచాడు).
ఆ హెడ్మాస్టరు గొప్ప చాకచక్యము, సమయ స్ఫూర్తి కలవాడేమో, తన కుర్చీ లోంచి లేచి వచ్చిపెద్దయ్య గారు ఎండలో పడి వచ్చారు. ఈ కుర్చీలో కూర్చోండి తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ ప్యూనుని పిలిచి మన డ్రిల్లు మాస్టారి రూములో కొబ్బరి  బోండాలున్నాయి కదా ఒకటి తీసుకురా. అలాగే వస్తూ వస్తూ మన సైన్సు మాస్టార్ని కూడా వీళ్ళబ్బాయి కొశ్చను పేపరు ఆన్సరు పేపరు కూడా పట్టుకుని రమ్మను. అన్నారు.
మోతుబరి మాత్రం హెడ్మాస్టరు గారు తనకిచ్చిన గౌరవానికి పొంగి పోకుండా నేనిక్కడ కూర్చోడానికి రాలేదు. అనావస్యం అయిదు మార్కులు తక్కువొచ్చాయని మా వాడి గొంతు కోశావు కదా? అదేంది సంగతని అడగడానికొచ్చాను అన్నాడు.
హెడ్మాస్టరు గారేమీ కంగారు పడకుండా పెద్దయ్యగారు అలసి పోయున్నారు. కాస్తంత స్థిమిత పడండి. తర్వాత మాట్లాడుకుందాం అంటూ ప్యూను తెచ్చిచ్చిన కొబ్బరి బోండాన్ని ఆయన చేతికందించారు. ఆ మోతుబరి ఇంకా అసహనం గానే ఆ బోండాంలో ఉన్న స్ట్రాని అవతల విసిరేసి  కొబ్బరి బోండాన్ని ఎత్తి పట్టుకుని దాన్లోని నీళ్ళన్నీ ఒక్క గుక్కలో తాగేసి అక్కడ పడేసి ఛర్నాకోలని హెడ్మాస్టరు టేబిలు మీద పడేసి ఇప్పుడైనా  చెప్పవయ్యా సంగతేంటన్నట్లు హెడ్మాస్టరు వైపు చూసేడు.
హెడ్మాస్టరు ఆ మోతుబరి  పక్కనే స్టూలు మీద కూర్చుంటూ సైన్సు మాస్టరు తెచ్చిచ్చిన ప్రశ్నా పత్రాన్ని ఆయనకు చూపిస్తూ ఇది మీవాడి కొశ్చన్ పేపరు. దీని మీద కుడివైపున ఏమి వ్రాసి ఉందో మీరో చూడండి అంటూ చూపించారు. చదవడం వచ్చిన మోతుబరి గారు మొత్తం 100 మార్కులు అంటూ చదివాడు ”. అప్పుడు హెడ్మాస్టరుగారు చూసేరు కదా 100 మార్కులకీ మీవాడికి ఎన్నొచ్చేయో మీరే చూడండి. అంటూ ఆ అబ్బాయి ఆన్సరుషీటుని ఆయనకు చూపిస్తూ  మీ వాడికి వచ్చినవి ఎన్ని? తొంభై తొమ్మిదా? తొంభై ఎనిమిదా? తొంభయ్యా?  పోనీ 80..70...60...50...40.. ఇవేవీ కావు కదా?  కేవలం 30 మార్కులు. మీరే చూసేరు కదా?  మీ వాడికి తక్కువొచ్చింది 100 లో 30 పోతే 70. డభ్భయి మార్కులు తక్కువ వొచ్చిన వాణ్ణి ఎలా  పాసు చెయ్యమంటారో మీరే చెప్పండి? అన్నాడు.
హెడ్మాస్టరు చెప్పింది విన్నాక మోతుబరి ముఖంలో కోపమంతా మాయమైంది. గుబురు మీసాల వెనుక చిరు నవ్వు కూడా మెరిసింది.  ఔను మరి ..రెండో మూడో మార్కులు తక్కువైతే నువ్వే ఎట్టాగో అట్టా నువ్వే సర్దేసి ఉండేటోడివి కదా?  ఏకంగా డభ్భై మార్కులు తక్కువొస్తే నువ్వు మాత్రం ఏం జేస్తావులే సామీ? అంటూ మళ్ళా కోపంగా  మరి మా దొంగ నాయాల అయిదే తక్కువైనాయని చెప్పేడే...డభ్భై మార్కులు తక్కువ తెచ్చుకునింది కాక నాతో అయిదే మార్కులు తక్కువొచ్చినయ్యని అబధ్ధాలు కూడా చెబుతాడా?  వాని వీపు  ఇప్పుడే సాపు జేస్తా.. అంటూ కుర్చీ లోంచి లేచి బయటకు నడిచాడు. హెడ్మాస్టరు గారు ఇదిగో ఇది మర్చిపోయారు అంటూ మోతుబరి తన టేబిలు మీద పెట్టిన ఛర్నా కోలను తీసి అందిస్తే తీసుకుంటూ మా బాగా గుర్తు చేశావు . ఇప్పుడు దీనితోనే గదా పని బడేది అంటూ తన బండి వైపునడిచాడు.
                                                            ****
ఆ తర్వాతేమయ్యిందో నాకు తెలీదు. ఎందు చేతనంటే ఈ ముచ్చటని తన చిన్నతనంలో తాను తొమ్మిదో తరగతి చదువుతుండగా జరిగిందనీ, ఆ అబ్బాయి తన క్లాసుమేటేననీ చెప్పిన ప్రముఖ రచయిత డా. కేశవరెడ్డిగారు ఆ తర్వాతేమయిందో చెప్పలేదు. (అయినా అది మన ఊహకందని విషయం కాదుకదా?)  ఆ హెడ్మాస్టరుగారి పేరు  తనకి స్పష్టంగా గుర్తుందనీ వారు శ్రీ బి. పద్మనాభ రెడ్డిగారనీ మాత్రం చెప్పారు.
                                                  ****
ఈ ముచ్చటని రికార్డు చేసిన డా. కేశవ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సరదా ముచ్చటనాకు నచ్చింది. మరి మీకు కూడా నచ్చితే సంతోషమే. సెలవు.
                                                  **** 
                                                            

5, ఏప్రిల్ 2014, శనివారం

మా తెలుగు తల్లికీ మల్లె పూదండా...(దండ లోని దారం కథ..)




మనం తెలుగు నేల మీద ఉన్నా దేశాంతరాలలో ఉన్నా , ఏ తెలుగు సాంస్కృతిక కార్యక్రమమైనా మా తెలుగు తల్లికీ మల్లె పూదండా ..మా కన్న తల్లికీ మంగళారతులూ..  అంటూ తెలుగు తల్లికి జేజేలు పలుకుతూ ప్రారంభిస్తాము. తెలుగు తల్లి విగ్రహానికి వేసిన మల్లెల మాల ధవళకాంతులీనుతూ కనిపిస్తూనే ఉంటుంది. ఆ మల్లెల సౌరభాలు దశదిశలా వ్యాపిస్తూనే ఉంటాయి. కానీ తెలుగు తల్లి మెడని మల్లెలు అలంకరించి మనల్ని అలరించడానికి కారణమైన ఆ సూత్రం—అదే- ఆ దారం మాత్రం కన్పించదు. దాని గురించి ఎవరమూ ఏ వేళా ఆలోచించం కూడా. పాట విని రసడోలలో తేలిపోతూ ఎదురుగా నిల్చొని పాడుతున్న గాయకుణ్ణి మెచ్చుకుంటూ మురిసి పోతాం. కాని దండలో దారం లాగా కనిపించని ఆ కవిని మాత్రం పట్టించుకోం. ఎప్పుడో అర్థశతాబ్దికి పూర్వమే, మనకి స్వాతంత్ర్యం రాకపూర్వమే మన తెలుగు తల్లి మెడలో వాడని ఆ మల్లె పూదండ వేసిన కవిగారి గురించి కొంచెం తెలుసుకుందాం.
ఈ గీతాన్ని వ్రాసిన కవి శ్రీ శంకరంబాడి సుందరాచార్య గారు. వీరిని నేను 1960-70లలో ఒకసారి చూసేను. వీరి అన్న(లేక తమ్ముడు) గారైన కృష్ణమాచారిగారు అప్పట్లో నేను పనిచేసే ఆడిట్ ఆఫీసు (A.G’s Office, Hyderabad) లో అకవుంట్స్ ఆఫీసరుగా పనిచేస్తూ ఉండేవారు. ఒక సాయంత్రం ఆఫీసు పని ముగిసేక మా రంజని గ్రంథాలయంలో శ్రీ సుందరాచారి గారితో ఇష్టాగోష్టి ఏర్పాటు చేసేరు. రంజని గ్రంథాలయానికి కేటాయించబడ్డ ఆ మారుమూల పాతకాలపు హాలులో పట్టుమని పాతికమందిమి కూడా లేమనే నాకు గుర్తు. ఏమయితేనేం అలా ఆ కవిగారిని చూడడం వారితో ముచ్చటించగలగడం నాకింకా లీలగా గుర్తుంది. వారు పొడగరి కాదు. అర్భకంగా అయిదూ అయిదున్నర అంగుళాల ఆసామీ. మిగిలిన వివరాలేమీ నాకిప్పుడు గుర్తు రావడం లేదు. వారి అన్నతమ్ముడైన మా కొలీగ్ శ్రీ కృష్ణమాచారిగారు మాత్రం మన లోక్ సభ స్పీకర్ గా పని చేసిన శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగారి అల్లుడని మాత్రం తెలుసు. 1974లో నేనూ శ్రీ కృష్ణమాచారిగారూ  ఒక ఆడిట్ నిమిత్తం ఒంగోలు వెళ్ళి అక్కడ రహదారి బంగళాలో కలసి ఉండడం ఆయనతో చేసిన సాహితీ గోష్టి కొంచెం కొంచెంగా గుర్తుకొస్తున్నాయి. (ఈ విషయం ఎందుకు చెప్పానంటే సుందరంబాడి వారింట్లోనే సాహితీ వాసనలు గుబాళిస్తూ ఉండి ఉంటాయేమోననే ఊహ రావడం వల్లనే )
సుందరాచారి గారి గురించి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన స్వేఛ్చాలోలుడు. ఎవరినీ లెక్క జేసే మనిషి కాడట. అందువల్లనే ఏదో విషయంలో తన పై అధికారులతో విభేదించి తాను పని చేస్తున్న డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన రచనలమీదే ఆధారపడి జీవించాడట. మతి స్థిమితం లేని ఆయన భార్య కంచిలో ఎవరో బంధువుల ఆశ్రయంలో ఉండేదట. పుస్తకాలు రాసి వాటిని అచ్చేసుకుని ఊరూరా తిరిగి అమ్ముకుంటూ కాలం గడిపే వాడట. ఎన్ని కష్టాలు పడ్డాడో బ్రతుకెలా ఈడ్చుకొచ్చాడో?  ఏ దుర్భర జీవితం ఆయనను పురిగొల్పిందో కాని తాగుడు వ్యసనానికి  పూర్తిగా బానిసైపోయి పూర్తిగా స్పృహ లేని స్థితిలో తిరుపతి వీధుల్లో తనువు చాలించారట. గుణ లేశం ఎక్కడ కనిపించినా మెచ్చుకుంటూ, వెలిగే దివ్వెలకు నూనె పోస్తూ, గట్ల మథ్య
ఇమడలేని వరద వెల్లువలా జీవించిన ఆయన జీవితమనే గంభీర విషాదాంత నాటకానికి ఆవిధంగా తిరుపతి వీధుల్లో తెరపడిందంటారు ఆయన గురించి బాగా తెలిసిన  ప్రఖ్యాత కథకులు కీర్తి శేషులు శ్రీ మధురాంతకం రాజారాం గారు. శ్రీ సుందరాచారి గారికీ,  తన ఈ పై పాటకీ సంబంధించిన ఆసక్తిదాయకమైన ఓ ముచ్చట- శ్రీ రాజారాం గారు చెప్పినదే -అందరూ తెలుసుకోవలసినది ఒక్కటీ చెప్పి ముగిస్తాను.
1976లో ఆంధ్ర పదేశ్ ప్రభుత్వం  తొలి తెలుగు ప్రపంచ మహా సభలు హైదరాబాదులో ఘనంగా  నిర్వహించారు. ఆ సందర్భంగా మా తెలుగు తల్లికీ మల్లె పూదండా.. గీతాన్ని తెలుగు వారి జాతీయగీతంగా నిర్ణయించడంతో పాటు ఆ పాటని మొదటిసారి గ్రామఫోను రికార్డులో పాడిన విదుషీమణి శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారిని ప్రత్యేకంగా లండనునుంచి రప్పించి సభల ప్రారంభగీతంగా పాడించారట. అందుకోసం లండను నుంచి విమానంలో వచ్చిన సూర్యకుమారిగారు నేరుగా  ఫైవ్ స్టార్ హోటల్లో దిగి బస చేసి సభాప్రాంగణానికి కారులో వచ్చి పాట పాడేసి తిరిగి కారులో తెలుగు నేల మట్టైనా కాళ్ళకు అంటుకోకుండా వెళ్లిపోయారట. ఆ సభకు వచ్చిన సాహితీ పరులు కొందరు  మన ఈ రాష్ట్రీయగీతాన్ని రచించిన కవి గారి గురించి ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం గురించి చాలా విచారించారట. అలా విచారిస్తున్న రాజారాం గారికి ఆ రాత్రి పది గంటల సమయంలో  స్టేడియం సోపాన పంక్తుల మీంచి నడుచుకుంటూ ఒక్కడూ వెళ్ళి పోతున్న సుందరాచారిగారు కనిపించారట. రాజారాం గారు పలకరించగానే ఆయనతో   నన్నింత నిర్లక్ష్యం చేస్తారట్రా వీళ్లు? ఊరుకుంటానట్రా? మండలి వేంకట కృష్ణారావుకు కబురు పంపించాను.  రేపు ఉదయం ఆరుగంటలకు కలవమన్నారు అంటూ వెళ్లి జనంలో కలసి పోయారట. మరునాడు ఆయన మండలి కృష్ణా రావు గారిని కలవగానే ఆయన   కవి గారి చిరునామా తెలియకపోవడంతో అలా జరిగిందనీ దానికి చాలా చింతిస్తున్నామనీ చెప్పి మరునాడు మహా సభల్లో  ఆయనను తగురీతిని సత్కరించడంతో పాటు కవిగారికి జీవితాంతం వర్తించేలా జీవనభృతిని కూడా ఏర్పాటు చేసారట. నాటి విద్యాశాఖా మంత్రి   ప్రపంచ తెలుగు మహా సభల నిర్వాహకులు అయిన మండలి వారి సంస్కారం గొప్పది. అయితే ఆయన పెద్ద మనసుతో కవిగారికేర్పాటు చేసిన ఆ జీవన భృతి (ఆ రోజుల్లో నెలకు 250 రూపాయలు) కవి గారికి మంచి కంటే చెడే ఎక్కువ చేసిందనీ అంతకు ముందు చేతిలో పైకం లేక తక్కువగా తాగే కవిగారు చేతిలో సొమ్ము గలగల లాడటంతో విపరీతంగా తాగి  ఆరోగ్యం పాడుచేసుకున్నారంటారు శ్రీ మధురాంతకం రాజారాం గారు. కవిగారు ఎలా కాలం చేసినా కలకాలం మిగిలే పాట ఒకటి మనకి మిగిల్చి పోయారు.
వేద్దాము వేద్దాము మన తెలుగు తల్లికీ మల్లె పూదండలూ...
చేద్దాము చేద్దాము మన కవిగారికీ కోటి దండాలూ...
( కవిగారితో తనకు గల పరిచయాన్ని రికార్డు చేసిన శ్రీ రాజారాం గారికి  కృతజ్ఞతలతో- సెలవు.)  
         

26, ఫిబ్రవరి 2014, బుధవారం

నువ్వూ నేనూ ఒకటే..






నువ్వూ నేనూ ఒకటేనని నేనంటే
కాదంటావు నువ్వు, కసురుకుంటావు, పోపొమ్మంటావు.
నీకూ నాకూ సాపత్తెమేమిటంటావు.
అవున్నిజమే.
నువు సెప్పింది నిజమే దొరా.
మీదేమో మారాజు లాంటి పుట్టుక
మాకేమో మట్టి పిసుకుడే జీవిక
వడ్డించిన ఇస్తరి మీ జీవితం
మేం ఇస్తట్లో మెతుకు కోసం దేవులాడుతం.
అదికారం ఎప్పుడూ మీ అర చేతనే
అందుకనే అందరికీ మీరంటే భయం
అనాద బతుకులు మావి
అందుకే ఎవరన్నా మాకే భయం.
జీవితం మీ అందరికీ దేవుడిచ్చిన వరం
మాకివ్వలేదేమని మేమెన్నడూ బాధ పడం
కానీ,  అకారణంగా మమ్మల్ని చిన్న చూపు చూడకయ్యా
మూణ్ణాళ్ళ ముచ్చట చూసి మురిసి పోకయ్యా
నువ్వూ నేనూ ఒకటయ్యే రోజొకటొస్తది.
అప్పుడు-
నీదైనా నాదైనా ఆ ఆరడుగుల నేలే
నేనైనా నువ్వైనా ఆ పిడికెడు మట్టే  !!

( ఈ కవిత పొరపాటున తొలగించబడడం వలన మళ్ళా పొస్టు చేస్తున్నాను.)


24, జనవరి 2014, శుక్రవారం

కారుణ్యం ఒక కవిత.



కారుణ్యం ఒక కవిత.

కాగితాల కట్ట ముందేసుకుని కలం పట్టుక్కూర్చుంటే
కవిత్వం వచ్చి రాలి పడదు.
కలం లోంచి కవిత్వం ఉబికి రాదు.
మస్తిష్కాన్ని మథిస్తే మాటలు పుంఖాను పుఖంగా పుట్టించ వచ్చు.
వాటితో మాటల గారడీలూ చేయవచ్చు.
అయితే కవిత్వం మాత్రం వ్రాయ లేవు.
నిజమైన కవిత్వం కావాలంటే-
వేదనాగ్రస్తమైన లోకాన్ని పరికించి చూడు.
నీ చూపుల్లోంచి ధర్మాగ్రహం  నీ మనస్సును చేరి దాన్ని దహించి వేస్తే
కరిగిన నీ హృదయం కార్చే కన్నీటి ధారల్లో
తడిసిన పదాలు పాటల పల్లవులవుతాయి
పద్యాల పాదాలవుతాయి.
కరుణ రసప్లావితమైన కవిత-అప్రయత్నంగానే-
నీ పెదాలు దాటి దూకుతుంది.
పదిమందినీ చేరుతుంది.
పది కాలాల పాటు బ్రతుకుతుంది.